కల – నిజం

0
11

[శ్రీ నల్ల భూమయ్య రచించిన ‘కల – నిజం’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము.]

[dropcap]నా[/dropcap]కు ఓ రోజు రాత్రి నిద్రలో కల వచ్చింది. ఆ కలలో ‘రామన్న’ పట్నంలో మెయిన్ రోడ్డు పైన ఎడ్లబండిని తోలుకుంటూ పోతూంటే ఎదురుగా ఓ లారీ ఎడ్లబండి మీదకు వచ్చింది. దాంతో రామన్నకు ఏమీ కాలేదు గానీ, ఎడ్లకు మట్టుకు చిన్న చిన్న దెబ్బలు తాకాయి అంతే.

అప్పట్లో, అందరిలాగానే రామన్న కూడా నడకలు నేర్చిన నాటినుండే పనులకు వెళ్ళడం చేయాల్సి వచ్చేది. పిల్లలు చిన్న వయసుల్లో వున్ననాడే తండ్రి చనిపోయాడు. అంచేత పిల్లలకు చదువు సంధ్యలేం లేవు. పక్కనున్న టౌన్‍లో పెద్దపెద్ద కంపనీలు వున్నందున, ఏవైనా పనులు చేసుకు బ్రతుకవచ్చునని, ఆ పల్లెటూర్లో వున్న యింటిని, వున్న కాస్తంత భూమి, పొలం గట్రాను అమ్ముకుని, తల్లి, అన్నదమ్ములు, అక్కచెళ్ళెళ్ళతో కల్సి టౌనుకు వెళ్ళాడు రామన్న. అన్నదమ్ములందరికీ కంపనీల్లో పనులు దొరికాయి. అప్పుడు వాళ్ళ ముసలితల్లి బతుకు – పాండవులను కన్న కుంతీదేవిలాగ ఆనందంగా గడవసాగింది – సరిగముదిమి బ్రతుకు సంపదే సంపద అన్నట్లుగా.. తల్లి, యింటి దగ్గర్లోనే వున్న సినిమాహాల్లలో వచ్చిన సినిమాలనన్నింటిని విడువకుండా చూసి వచ్చేది. ఆ తెల్లవారు రోజున క్రిందటి రోజు చూసివచ్చిన సినిమాల కథల్ని ఆడవాళ్ళకు, పిల్లలకు పొల్లుపోకుండా చెప్తూండేది. ఆమెకు ఎన్నెన్నో కథలు కూడా వచ్చేవి. ఆమె కథలు చెప్తూంటే ఆడవాళ్ళు, పిల్లలు గంటలు, గంటలు, రోజులకు రోజులు వింటూండేవాళ్ళు.

రామన్నకు పిల్లనిచ్చిన మామ బ్రతుకుదెరువు, వృత్తిపని మగ్గం నేయడం. ఆ కాలానికి చేనేత మగ్గాలు మాత్రమే వుండేవి. ‘మరమగ్గాలు’ యింకా రాలేదు. చేనేత మగ్గాలు మట్టుకే నడవడం వల్ల వాళ్ళ బ్రతుకులు – పొద్దుంటే వూపుండదు, మాపుంటే రేపుండదు అన్నట్లుగానే.. రామన్న మామకు ఒంటిమీదకు ఒకే ఒక్క చొక్కా వుండేది – ఏవూరికైనా వెళ్తే వేసుకోడానికి! వూర్లో వున్నంతసేపూ, మోకాళ్ళుదాటని, ధోతి తప్పితే శరీరం మీద యింకేమీ వుండేదిగాదు. తలకు మట్టుకు ‘రుమాలు’ వుండేది – బోడి గుండు చుట్టూ. ఆయనకు కొంత వెర్రి వున్నట్లే లెఖ్ఖ. ఆయనకు యిప్పుడు వున్న పిల్లలంతా గూడ రెండో పెళ్ళాం పిల్లలే! మొదటి పెళ్ళాన్ని అకారణంగా అనుమానించేవాడు. భార్యను గుడిసెలో వదిలి, బయటినుండే తాళం వేసి వెళ్ళేవాడు! ఆమె ఈ అవమానాన్ని సహించలేక యితడ్ని వదిలేసి వెళ్ళి మరో పెళ్ళి చేసుకుంది. ఇతనికి పుట్టిన పిల్లలకు కూడా – కొంతమంది మగపిల్లలకు కాస్తంత పిచ్చి వుండింది. ఆడపిల్లలు మట్టుకు అదృష్టవంతులు. వాళ్ళకెవ్వరికీ తండ్రి గుణాలు రాలేదు.

రామన్నకు కంపనీలో ఉద్యోగం కాబట్టి కులవృత్తుల మీద బ్రతుకుతున్న వాళ్ళ కన్నా ఎక్కువ ఆదాయమే. డ్యూటీ తర్వాత సాయంత్రం రోజూ ‘సారాయి’ తాగి యింటికి వచ్చేవాడు. ఆ నిషాలో తన కొడుకు నెత్తుకుని చుట్టుపక్కల యిళ్ళముందుర నుండి పచార్లు చేస్తూ, అప్పుడప్పుడే మాటలు నేరుస్తున్న కొడుక్కి తను మాటలు నేర్పేవాడు. ఆ నేర్పే పలుకులేం మంచి పలుకులు కాదు. అన్నీ తిట్ల పలుకులే! బూతు మాటలే! ఆ పిల్లవాడు పెరుగుతూ తండ్రి నేర్పిన బూతుల్ని జ్ఞాపకం పెట్టుకున్నాడో, లేడో కానీ, చదువులు మట్టుకు అబ్బలేదు. రామన్న కాలంలో స్కూళ్ళు లేవు, చదివించే వాళ్ళు లేరు. కానీ వాళ్ళు కష్టించి పనిచేశారు, కష్టజీవులు. తరం మారింది. రామన్న కొడుకుల తరానికి స్కూళ్ళు వున్నాయి. చదివించే వాళ్ళూ వున్నారు. కానీ చదువబ్బలేదు. పోనీ కష్టపోతులా అంటే అదీ లేదు. తండ్రి మీద ఆధారపడి బ్రతుకుదామన్న బుద్దే..

రామన్న కూతుర్లు అందమైన అమ్మాయిలు. అంచేత పెద్ద అమ్మాయిని ఓ ధనవంతుడు తన కొడుక్కు చేసుకున్నాడు. మామూలు యింటి అమ్మాయి ధనవంతుల యింట్లో పడింది – అదృష్టవంతురాలు.

ఆ మధ్య బట్టల మిల్లులన్నీ మూతలు పడిన రోజుల్లో రామన్న పనిచేస్తూన్న మిల్లు కూడా మూతపడింది. కార్మికుల బ్రతుకులు కకలావికలాలైనాయి. బ్రతుకుదెరువు పోయి, బ్రతుకు భారమైన రామన్నను ధనవంతుడైన అల్లుడే ఆదుకున్నాడు. ఒక దుకాణాన్ని పెట్టించాడు – అల్లుడు. ఆ దుకాణం కారణంగానే రామన్న కుటుంబం బతుకునెల్ల దీస్తోంది.

నాకు ఆ రోజు రాత్రి కలలోకి వచ్చిన రామన్న వృత్తాంతం యిది.

‘ప్రసాద్’ విషయం కూడా చెప్పాల్సి వుంది. ప్రసాద్ కాలేజీ స్టూడెంట్. ఓ టౌనులో ఆయన పెద్దన్నయ్య పెద్ద పెద్ద కార్మిక సంఘాలకు పెద్ద నాయకుడు. జిల్లాకు ప్రథమ పౌరుడు. కార్మికుల సమాధుల మీద పెద్ద భవంతులకు పునాదులు వేసినవాడు. ప్రసాద్, తల్లిదండ్రులకు చాలా ఆలస్యంగా పుట్టాడు. అంచేత అతని పెద్దన్నయ్యే ప్రసాద్‍కు తండ్రి లాంటి వాడయ్యాడు. తండ్రి చేయాల్సిన పనులన్నీ పెద్దన్నయ్యే చేశాడు. పెద్దన్నయ్య వుండేది కర్మాగారాలున్న పెద్ద టౌనులో. స్కూల్ చదువుల వరకు ప్రసాద్ అక్కడే వున్నాడు. కాలేజీ చదువులు అక్కడ లేవు. అంచేత కాలేజీ చదువుల కొరకు పట్నంలో వున్న చిన్నన్నయ్య దగ్గరకు వచ్చాడు. చిన్నన్నయ్య పట్నంలో పెద్ద కంపెనీలో ఉద్యోగి. యితడ్ని ఈ ఉద్యోగంలో పెట్టించింది కూడా పెద్దన్నయ్యనే.

ప్రసాద్ చిన్నన్నయ్య భార్య పెద్ద ధనవంతుడి కూతురు. ప్రసాద్ వాళ్ళ దగ్గర వుండడం ఆమెకు అసలే యిష్టం లేదు. అంచేత చిన్నన్నయ్యకు కూడ ప్రసాద్ మీద ఏం పట్టింపులేదు. పెద్దన్నయ్య భయం కారణంగానే అతడు ప్రసాద్‍ను తమ వద్ద పట్టీ పట్టనట్లు వుంచుకున్నాడు.

ప్రసాద్ బ్రతుకు చిన్నన్నయ్య యింట్లో ఈ విధంగా ఉంది. ఇక చదువు సంధ్యలు కూడా పెద్దగా ఏం పట్టుబడలేదు.. సినిమాలు, షికార్లు – గర్ల్ ఫ్రెండ్ కూడా! చదువుల్లో ఫెయిల్, ఫెయిల్.. దీంతో ఆ అన్నా వదినలకు పెద్ద నెపం, ఆయుధం దొరికింది. యిటువంటి వాడిపైన తాము యింతింత ఖర్చులు చేస్తే, అంతా బూడిదల పోసిన పన్నీరేగదా! ఇలాంటి పనికిరాని వాడిమీద, చదువుల్లో ఫెయిల్ అయ్యేవాడిమీద, అమ్మాయిల షోకులు వున్న వాడిమీద చేసే ఖర్చులు వ్యర్థమే గదా! తమ డబ్బుల్ని వ్యర్థం ఎందుకు చేసుకోవాలి? అంచేత ప్రసాద్‍ను తమ దగ్గర వుండవద్దన్నారు. పెద్దన్నయ్య దగ్గరకు ఆ వూరికే వెళ్ళిపొమ్మన్నారు. కానీ, యిక్కడి అలవాట్లకు మరిగిన ప్రసాద్ యిక్కడే వుండసాగాడు – బలవంతంగా. దాంతో అన్నాతమ్ముల మధ్య మాటా మాటా పెరగడమే కాదు, చేతులు చేసుకోవడం వరకు వెళ్ళింది వ్యవహారం. తమ పెద్దన్నయ్యే చిన్నన్నయ్యకు అంతా చేశాడు కాబట్టి, చిన్నన్నయ్యకూడా తనకు కొంతైనా చేయవల్సిందే. అది అతడి బాధ్యత, తన హక్కు! అన్నట్టుగా ప్రవర్తించాడు ప్రసాద్. దాంతో చిన్నన్నయ్య “నీలాగా మేము చదువుల్లో ఫెయిల్ కాలేదు, అమ్మాయిలతో తిరగలేదు, అన్ని మజాలు ఉడాయించలేదు” అన్నాడు.

అది మొదలు ప్రసాద్ వాళ్ళ దగ్గర వుండడం లేదు. కానీ, ఆ యింటి ఎదురుగానే స్నేహితులతో కల్సి అద్దెకు వుండసాగాడు. కావాల్సిన డబ్బును పెద్దన్నయ్యను పంపుమనేవాడు!..

ఆ రోజు ప్రొద్దున ప్రసాద్ సైకిల్‍పై అదే మెయిన్ రోడ్డు పైన వెళ్తున్నాడు, నాకు ఓ రోజు కలలో వచ్చిన రోడ్డుమీద. సైకిలు మీద వెళ్తూన్న ప్రసాద్‍ను వెనుకనుండి ఓ లారీ వచ్చి తాకింది. దాంతో ప్రసాద్ కిందపడిపోయాడు. ఆక్సిడెంట్ జరిగిన రోడ్డుకు ఆ యిళ్ళు దగ్గర్లోనే వుండడం వల్ల వార్త తెల్సింది. వెంటనే ప్రసాద్‍ను హాస్పిటల్‍లో చేర్చాం.

“పిల్లవాడి అదృష్టం బాగుంది. అపాయం తప్పింది. అదృష్టవశాత్తు ‘అట్లాస్’కు ఏమీ కాలేదు. అదిగానీ విరిగి వుంటే కాళ్ళు చేతులు పడిపోయేవి, మెదడు పని చేసేది గాదు.. సంతోషం” అన్నారు డాక్టర్లు.

ప్రసాద్‍కు అంత పెద్ద ఆక్సిడెంటు జరిగాక, వారాలకు వారాలు హాస్పిటల్‍లో అడ్మిట్ అయి వుంటే పెద్దన్నయ్య, మిగిలిన అన్నదమ్ములు, అక్కా చెల్లెళ్ళు, బంధుమిత్రులు వూర్ల నుండి వచ్చారు. బాగోగులు చూడటానికి, పరామర్శించడానికి. కానీ, యిక్కడే వున్న చిన్నన్నయ్య, చిన్నవదిన ఏమాత్రం పట్టించుకోలేదు. లోకభీతికి అన్నట్లు ఎప్పుడో ఓసారి చిన్నన్నయ్య వెళ్ళి చూసి వచ్చాడుగానీ, చిన్న వదిన మాత్రం కనీసం చూడడానికి కూడా వెళ్ళలేదు!

ప్రసాద్‍ను హాస్పిటల్‍ నుండి డిశ్చార్జ్ చేశాక పెద్దన్నయ్య అన్నాడు

“యిక పట్నంలో వున్న మట్టుకు చాలు, వృద్ధి అయినంత మట్టుకు చాలు! వూరికే పోదాం పద. ఏదైనా ఉద్యోగం చూయిస్తా – నేను అధికారంలో వున్నకాలంలోనే. తర్వాత తర్వాత రాముడెవడో రాకాసిఎవడో” అన్నాడు.

ప్రసాద్ అట్లాగే జేశాడు..

నాకు ఓ రోజు రాత్రి కల రావడం, ఆ తెల్లవారు రోజే ఆ కల నిజం కావడం జరిగాయి.. కలలో జరిగిన సంఘటనకూ, నిజంగా జరిగిన సంఘటనల్లో వున్న సంబంధ సామ్యాలు – కలలోని సంఘటనలో ఒక మనిషి, నిజంలోని సంఘటనలో వేరొక మనిషి – అతడూ నా బంధువే యితడూ నా బంధువే! కలలోని మనిషి ఎడ్లబండిని తోలుతున్నాడు, నిజంలోని మనిషి సైకిల్‍ను నడుపుతున్నాడు. కలలో, నిజంలో కూడా అదే రోడ్డు, ఆక్సిడెంటు జరిగింది కూడా అదే చోటు. కానీ భేదమల్లా ఎడ్లబండి ఆ వేపునుండి ఈ వేపుకు వస్తున్నది, సైకిలు, ఈ వేపునుండి ఆ వేపుకు వెళ్తున్నది. దిశల్లో వ్యతిరేకం. కలలో ఎడ్లబండికి, ఎడ్లబండిని తోలుతున్న అతనికి ఏమీ జరుగలేదు – ఎడ్లు మాత్రం చిన్నగా గాయపడ్డాయి. నిజంలో సైకిలుకు ఏ నష్టం జరగలేదు. కానీ సైకిలు నడుపుతున్న మనిషికి అపాయం జరిగింది. దెబ్బలు తగిలాయి. కలలోనూ, నిజంలోనూ ప్రాణహాని జరుగలేదు.

నాకు ‘ఫ్రాయిడ్’ స్ఫురణకు వచ్చాడు. కలలు పూర్తిగా అబద్ధమూ కావు, పూర్తిగా నిజమూ కావు. సత్యా సత్యాల కలయిక మాత్రమే. నిజమూ వుంటుంది, అబద్ధమూ వుంటుంది. నిజమూ లేకపోలేదు, అబద్ధమూ లేకపోలేదు. సంబంధాలు వున్నాయి – నిజం, సామ్యాలూ – వున్నాయి – అబద్ధం!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here