కలగంటినే చెలీ-11

0
7

[box type=’note’ fontsize=’16’] శ్రీ సన్నిహిత్ వ్రాసిన ‘కలగంటినే చెలీ’ అనే నవలని ధారవాహికగా పాఠకులకు అందిస్తున్నాము. [/box]

[dropcap]నో[/dropcap]టీస్‌ బోర్డ్‌ దగ్గర అందరూ గుమిగూడి చూస్తున్నారు. సూర్య అక్కడకు వెళ్ళి చూసాడు.

‘విజయవాడ సిద్ధార్థ కాలేజీలో ఇంటర్‌కాలేజ్‌ కాంపిటీషన్స్‌ ఉన్నాయి… ఆసక్తి ఉన్న విద్యార్థులు తమ పేర్లు ఇవ్వాల’ని నోటీస్‌ ఉంది.

సూర్యకు భలే సరదాగా అనిపించింది. తను తప్పకుండా వెళ్ళాలి అని మెంటల్‌గా ఫిక్స్‌అయ్యాడు. తన పేరు కోర్డినేటర్‌కి ఇచ్చాడు.

ఒక రోజు కాలేజ్‌ లెవెల్‌లో స్క్రీనింగ్‌ పెట్టారు. అద్భుతమైన పాట పాడాడు సూర్య. సొలో సింగింగ్‌కి సెలెక్ట్‌ అయ్యాడు. మిగతా కుర్రాళ్ళు కూడా చాలా ఈవెంట్స్‌కి పోటీ పడి సెలెక్ట్‌ అయ్యారు.

ఇలా సెలెక్ట్‌ అయిన వివిధ బ్రాంచ్‌ల విద్యార్థులు ఒక టీంలా ఫార్మ్ అయ్యారు. అందులో అమ్మాయిలు , అబ్బాయిలు. అందులో హాసిని కూడా ఉంది. అంత్యాక్షరి ఈవెంట్‌ కోసం ఆమె సెలెక్ట్‌ అయింది. ఆ టీంకి లీడర్‌ శ్రీకాంత్‌.

టీం మొత్తం ట్రైన్‌లో ప్రయాణం చేసి విజయవాడ చేరుకున్నారు. ప్రయాణంలో ఉన్నప్పుడు సూర్యతో మాట్లాడాలని హాసిని చాలా ట్రై చేసింది. కానీ సూర్య ఆమెను స్మూత్‌గా ఎవాయిడ్‌ చేసాడు.

అందరికీ హాస్టల్స్‌లో అకామిడేషన్‌ ఇచ్చారు. కేంపస్‌ చాలా అద్భుతంగా ఉంది. హుషారుగా తిరుగుతున్న అమ్మాయిలు, అబ్బాయిలు. అంతా సందడిగా పండగ వాతావరణం కనిపిస్తోంది.

తమ కాలేజీ తరపున.. ఆ కాలేజీకి పోటీల్లో పాల్గొనడానికి రావడం తన అదృష్టంగా భావించాడు సూర్య. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలనుకున్నాడు. పాటల పోటీలో బాగా పాడాలనుకుని నిశ్చయించుకున్నాడు.

ఆడిటోరియం కిక్కిరిసిపోయి ఉంది. స్టేజ్‌ పైన సిద్ధార్థ కాలేజీ కుర్రాళ్ళే జడ్జెస్‌గా ఉన్నారు. ఈవెంట్‌ మేనేజెర్‌ ఒక్కొక్క పేరు పిలుస్తుంటే , కేండిడేట్స్‌ వెళ్ళి పాడుతున్నారు. సూర్య… తన పేరు ఎనౌన్స్ చెయ్యగానే స్టేజీ పైకి వెళ్ళాడు. కొంచెం సర్దుకున్నాక… గొంతు సవరించుకుని ‘నా పాట పంచామృతం…’ అన్న సినిమా పాటను ఆలపించడం ప్రారంభించాడు. శ్రోతలంతా మంత్రముగ్ధులై విన్నారు. పాట పూర్తవగానే చప్పట్లు మారు మ్రోగాయి. ఆనందంగా స్టేజ్‌ దిగాడు సూర్య.

సఫకేటింగ్‌గా ఫీలయి ఆడిటోరియం బయటకు వచ్చాడు. హాసిని కనబడింది. ఇద్దరూ నడవసాగారు “చాలా బాగా పాడావు సూర్యా.. ” అని మెచ్చుకుంది. “థాంక్యూ…” అన్నాడు.

“మీ అంత్యాక్షరి అయిపోయిందా”

“లేదు… రేపు షెడ్యూల్‌ చేసారు…”

“పోనీలే మన కాలేజీకి కొన్ని ప్రైజ్‌లు వచ్చినా పర్వాలేదు… మరీ ఒక్క ప్రైజ్‌ కూడా రాకపోతే సిగ్గుచేటు” అన్నాడు

“ఎందుకు రావు… వస్తాయి… నీలాంటి వాళ్ళున్నారుగా…” అంది.

మాటలలో పడి కాఫీ షాప్‌ దాకా వచ్చారు. “సూర్యా కాఫీ తాగుదాం…”

“అలాగే..” అని కాఫీకి ఆర్డరిచ్చాడు. బయట చెట్టు నీడలో వేసిన కుర్చీల్లో కూర్చున్నారు.

కాఫీ వచ్చింది. సిప్‌చేస్తూ నెమ్మదిగా అడిగింది హాసిని “నాతో మాట్లాడటం ఎందుకు మానేసావు?”

కాసేపు మౌనంగా ఉన్నాడు సూర్య. “ఏమీ లేదు.. స్టడీస్‌తో పాటూ వేరే ఏక్టవిటీస్‌తో బిజీ అవడం వల్ల హాస్టల్‌కి రాలేకపోయాను” అన్నాడు.

“అబద్ధాలు చెప్పకు… అంత బిజీనా..” అంది.

“లేదు నిజమే చెబుతున్నాను…” నసుగుతూ అన్నాడు.

“నాకు నిజం తెలుసు… నువ్వు చెప్పకపోయినా వేరే వాళ్ళు చెప్పరా..”

“మరి నీకు తెలిసీ ఎందుకు అడుగుతున్నావు?”

“నువ్వేం చెబుతావా అని”

“ఏం చెప్పమంటావు…. చాలా సామాన్యమైన కుటుంబం నాది. ఇలాంటివన్నీ అవసరమా…”

“అబ్బ.. కళ్ళు తెరిపించావ్‌…” అంటూ నవ్వేసింది హాసిని. “నువ్వంటే చాలా ఇష్టం సూర్యా.. దయచేసి నన్ను దూరం పెట్టకు”

“నీకు దగ్గరైతే.. నేను కొంతమందికి శత్రువుని అవుతాను..”

హాసినికి అర్థమైంది. ఇది రూపేంద్ర పని అని. “నేను తన గాళ్‌ఫ్రెండ్‌ అని అందరికీ చెప్పుకుని తిరుగుతున్నాడు ఆ రూపేంద్ర.. వాడినెందుకు పట్టించుకుంటావు” అంది.

“అందరూ చెబుతున్నారు కదా… ఇక అతడు చెప్పేదేంటి?”

“ఏదో అప్పుడప్పుడు అతనితో మాట్లాడుతాను.. అంత మాత్రానికే గాళ్‌ ఫ్రెండ్‌ అయిపోతానా..”

“ఏమో.. నాకు ఇప్పుడు అవన్నీ అవసరమా… మనిద్దరి మధ్య ఈ మాత్రం స్నేహం చాలు… పద” అంటూ లేచాడు. తర్వాత ఇద్దరూ తమ హాస్టల్స్‌ వైపు విడిపోయారు.

***

ఆ రాత్రి.. డిన్నర్‌ తర్వాత .. కేంపస్‌లో వాక్‌ చేస్తున్నాడు సూర్య. ఎప్పుడొచ్చిందో పక్కన నడవసాగింది హాసిని.

“ఏయ్‌… నువ్విలా వచ్చావేంటి?” ఆశ్చర్యపోయాడు సూర్య.

“నీతో పదే పదే మాట్లాడాలని అనిపిస్తుంది సూర్యా.. అందుకే నీ కోసం వెయిట్‌చేసాను” అంది.

విశాలమైన కేంపస్‌ కావడంతో దూర దూరంగా బిల్డింగ్స్‌ విసిరేసినట్టు ఉన్నాయి. వాటిని కలుపుతూ సన్నటి తార్రోడ్డులు. రోడ్డు పక్కన లైట్లు చక్కటి వెలుగుని పంచుతున్నాయి. చాలా ఆహ్లాదంగా ఉంది రాత్రి. పైగా పక్కన అమ్మాయి ఉండటంతో మరింత థ్రిల్‌గా ఫీల్‌ అవుతున్నాడు సూర్య. చీకటి, వెలుగు రొమేన్స్ చేస్తున్నట్టుగా ఉంది వాతావరణం. …ఇద్దరూ మాట్లాడుకుంటూ అలా.. అలా.. చాలా దూరం వెళ్ళిపోయారు. కేంపస్‌లో జనసంచారం లేని ఏరియా అది.

“సూర్యా..” అంటూ మరింత దగ్గరగా వచ్చింది హాసిని. కాదనలేకపోయాడు. నెమ్మదిగా ఆమె నడుం మీద చెయ్యి వేసాడు. ఆమె మరింత దగ్గరగా వచ్చింది అతనికి. మెత్తని ఆమె గుండెలు అతనికి హత్తుకున్నాయి. మన్మథుడు వేసిన బాణం ఎప్పుడో తగిలింది. వెచ్చటి ఆమె ఊపిరి అతని నాసికకు తగులుతోంది. ఆమె శ్వాస అతని శ్వాసలో కలిసింది. అప్రయత్నంగా తన పెదాలతో అతని పెదాలని కలిపింది హాసిని. చాలా సేపు ఆ మధురిమను ఆస్వాదించాడు సూర్య. ..దూరంగా ఏదో పక్షి అరవడంతో స్పృహలోకొచ్చి విడివడ్డారు ఇద్దరూ. నిశ్శబ్దంగా వెనుతిరిగి హాస్టల్స్‌‌కి వచ్చేసారు. ఈ టూర్‌ ఇలా తన జీవితంలో మధురానుభూతిని నింపుతుందని ఊహించలేకపోయాడు సూర్య.

***

విజయవాడ సిద్ధార్థ కాలేజీకి వెళ్ళిన టీం బోలెడన్ని ప్రైజ్‌లు గెల్చుకుని తిరిగి కాలేజీకి వచ్చేసారు. తమ పరువు కాపాడినందుకు ప్రిన్సిపాల్ గారు అందరినీ అభినందించారు. ఫస్ట్‌ ప్రైజ్‌ తెచ్చుకున్న సూర్యను అందరూ బాగా మెచ్చుకున్నారు. తను గాయకుడిగా ఎదగొచ్చు అన్న కాన్ఫిడెన్స్ కలిగింది సూర్యకు. అయినా ముందు బాగా చదువుకోవాలి… ఆ తర్వాత గాయకుడిగా ప్రయత్నించాలి అని మనసులో గట్టిగా అనుకున్నాడు.

ఒక రోజు శ్రీకాంత్‌ సూర్యను పిలిచాడు. మ్యూజిక్‌రూంలో శ్రీకాంత్‌ని కలిసాడు సూర్య.

శ్రీకాంత్‌ అన్నాడు “సూర్యా.. ఈటీవీలో బాలు గారు పాడుతా తీయగా ప్రోగ్రాం నిర్వహిస్తున్నారు కదా… నువ్వు ఎందుకు పార్టిసిపేట్‌ చెయ్యకూడదు. వాళ్ళు ప్రకటన ఇస్తున్నారు కదా.. ఒక మంచి పాట పాడి పంపిద్దాం. పిలిస్తే ఆడిషన్స్‌కి వెళ్దాం”

చాలా ఎక్సైటింగ్‌గా అనిపించింది సూర్యకి. తన అభిమాన గాయకుడు శ్రీ బాలు గారు. ఆయనను చూడ్డానికైనా ఆ ప్రోగ్రాంలో పాడితే బాగుంటుంది అనుకున్నాడు. “అలాగే అన్నా… తప్పకుండా” అని అన్నాడు. తర్వాత శ్రీకాంత్‌ కీబోర్డ్‌ ప్లే చేయగా, సూర్య ఒక మంచి పాట పాడి రికార్డ్‌ చేసారు. ఆ టేప్‌ని ఈటీవీ వాళ్ళకి మెయిల్‌ మరియు వాట్సప్‌ చేసారు. కొన్ని రోజుల నిరీక్షణ తర్వాత ఈటీవీ వాళ్ళ నుండి సూర్యకు పిలుపు వచ్చింది ఆడిషన్స్‌కి  హైదరాబాద్‌ రమ్మని. కొండెక్కినంత సంబరపడ్డాడు సూర్య. శ్రీకాంత్‌ని గట్టిగా కౌగలించుకున్నాడు. బాలు గారిని కలిసినట్టు …ఆయనతో మాట్లాడుతున్నట్టు ఎన్నో కలలు అప్పుడే కనేయడం మొదలుపెట్టాడు.

బాగా చదువుకుంటూ.. …పాటలు ప్రాక్టీసు చేస్తూ .. హాయిగా గడిపేస్తున్నాడు సూర్య.

కానీ కాలం ఎప్పుడూ మనిషిని హాయిగా బ్రతకనివ్వదు. ఏదో ఒక సమస్యను సృష్టిస్తుంది. సూర్యకి ఫోన్‌ వచ్చింది. ‘అతని తండ్రి ఆరోగ్య పరిస్థితి ఏ మాత్రం బాగోలేదని, వెంటనే ఇంటికి రమ్మని’ ఆ ఫోన్‌ సారాంశం. ఆ వార్త వినగానే కన్నీరు మున్నీరు అయ్యాడు.

వెంటనే బస్‌కి టికెట్‌ బుక్‌ చెయ్యించుకుని హుటాహుటిన బయలుదేరాడు. ఊరు చేరేటప్పటికి సాయంత్రమయింది. ఇంటికి వెళ్ళగానే అతన్ని చూసి తల్లీ, చెల్లెళ్ళు బావురుమని ఏడుపు లంకించుకున్నారు. అతని తండ్రి శంకరం మాత్రం పిచ్చి పిచ్చి చూపులు చూస్తూ ఏదేదో మాట్లాడుతున్నాడు. సూర్యకి పరిస్థితి అర్థం కాలేదు. పార్వతమ్మ అతన్ని పక్కకు తీసుకెళ్ళి “బాబూ.. మీ నాన్నకి మతి చలించింది.. మన ఊళ్ళో ఉన్న డాక్టర్‌కి చూపించాను. ఏవో మందులు ఇచ్చాడు కానీ, పట్నం తీసుకెళ్ళి పెద్ద డాక్టర్‌కి చూపించమని చెప్పాడు. మాకు ఏం చెయ్యాలో తెలీక నీకు చెప్పాము” అంది. సడన్‌గా ఈ సమస్య ఏంటో అర్థం కాలేదు అతనికి. అంత వయసు కూడా అతనికి లేదు కదా. హాయిగా సాగుతున్న నావ సడన్‌గా తుఫాన్‌లో చిక్కుకున్నట్టు …అన్నీ బాగానే ఉన్నాయి అనుకుంటున్న ఈ దశలో ఈ విపత్కరమేంటో అని బాధపడ్డాడు. ఎలాగైనా ఈ సమస్యను పరిష్కరించాలి అనుకున్నాడు. “సరేనమ్మా.. మీరేమీ భయపడకండి… అన్నీ చూద్దాం” అని ధైర్యం చెప్పాడు

తండ్రి దగ్గరకు వెళ్ళి “నేనొచ్చాను కద నాన్నా..నీకేం కాదు” అని చేతిని పట్టుకున్నాడు. ఆయన బిత్తర చూపులు చూస్తూ వింతగా నవ్వుతున్నాడు. ఏడుపు తన్నుకొచ్చింది సూర్యకి. అయినా పైకి కనపడనీయకుండా కంట్రోల్‌ చేసుకున్నాడు. “పడుకో నాన్న.. పడుకో” అని చెప్పి ఆయన్ని నెమ్మదిగా జోకొట్టాడు. విధి అనేది ఎంత బలీయమైనదో … అది మనుషుల్ని ఎలా ఆడిస్తుందో అన్న దానికి ఇంతకంటే ఉదాహరణ అక్కర్లేదు కదా !

***

సిటీ హాస్పిటల్ లో శంకరాన్ని పరీక్షించిన డాక్టర్‌, సూర్యని పిలిచి –

“చూడు బాబూ… మీ నాన్న గారికి డిప్రెషన్‌ వల్ల మెంటల్‌ డిజార్డర్‌వచ్చింది. చెప్పడానికి ఇది చిన్న సమస్యే కానీ పేషెంట్‌ని కొంచెం అబ్జర్వేషన్‌‌లో ఉంచాలి. ఆయన్ని వెంటనే ఎడ్మిట్‌ చెయ్యండి. మెడిసిన్స్ ఇస్తూ కొన్ని రోజులు అబ్జర్వ్‌చేద్దాం. సరేనా..” అని చెప్పాడు.

“అలాగే సార్‌… కొంచెం మా నాన్నగారిని తొందరగా బాగు చెయ్యండి సార్‌” అని వేడుకున్నాడు.

“ఓకే…” అని చెప్పి ఒక స్లిప్‌ మీద ‘ఎడ్మిషన్‌ రికమెండెడ్‌’ అని వ్రాసి ఇచ్చాడు. ఆ స్లిప్‌ తీసుకుని బిల్లింగ్‌ సెక్షన్‌కి వెళ్ళి డబ్బులు కట్టి ఫైల్‌ ఓపెన్‌ చెయ్యించాడు. తర్వాత వాళ్ళు ఎలాట్‌ చేసిన రూముకి శంకరాన్ని షిఫ్ట్‌చేసారు. ఖరీదైన కార్పొరేట్‌ హాస్పిటల్‌ అది. పార్వతమ్మ బంగారం తాకట్టు పెట్టి డబ్బులు తెచ్చింది. డబ్బు చేతిలో ఉంటే ఫెసిలిటీస్‌కి కొదవేముంది. శంకరం ఆ వాతావరణం చూసి “నాకేమైంది ..నాకేమైంది.. ఇక్కడకు ఎందుకొచ్చాం..” అని తనలో తానే గొణుక్కోసాగాడు.

సూర్య “నీకేం కాలేదు నాన్నా.. చిన్న అనారోగ్యం.. తగ్గిపోతుంది” అని నచ్చజెప్పాడు. పార్వతమ్మ నోట్లో కొంగు కుక్కుకుని ఏడ్వసాగింది. అతని చెల్లెలిద్దరూ బేలగా చూడసాగారు.

సూర్యానికి ఇది ఛాలెంజింగ్‌ ఫేజ్‌. ఎలాగైనా తన తండ్రిని మామూలు మనిషిని చెయ్యాలి …ఈ కష్టకాలాన్ని దాటాలి అని బలంగా అనుకున్నాడు. హాస్పిటల్‌లో కేంటీన్‌ ఉంది కాబట్టి తిండికి పెద్దగా ఇబ్బంది లేదు. శంకరం ఉన్న రూములో ఒక ఎటెండెంట్‌కి మాత్రమే అనుమతి ఇచ్చారు. పార్వతమ్మ శంకరం గారితో పాటూ రూములో పడుకుంటే, సూర్య, అతని చెల్లెళ్ళు రాత్రి పూట బయట కారిడార్‌‌లో నేల మీద పడుకునేవారు. మెడిసిన్స్ టైముకి వాడుతూ ఉండటం వల్ల శంకరం గారికి గుణం కనిపించింది. కొంచెం కోలుకున్నారు. చూస్తుండగానే నెల రోజులు గడిచిపోయాయి.

శంకరం గారు పూర్తిగా కోలుకున్నారు. బేలెన్స్ డబ్బులు కూడా కట్టేసి ‘డిస్చార్జ్‌ సమ్మరీ’, రిపోర్ట్స్‌ తీసుకుని ఊరికి బస్సులో బయలు దేరారు.శంకరం గారికి ఇది పునర్జన్మలా ఉంది.

సాయంకాలానికి ఊరికి వెళ్ళగానే అందరూ చుట్టుముట్టేసారు. ‘ఎలా ఉంది… ఎలా ఉంది …తగ్గిందా.. మామూలు మనిషయ్యారా’  అని ప్రశ్నల మీద ప్రశ్నలు అడుగుతున్నారు. అందరికీ సమాధానం చెబుతున్నాడు సూర్య. ఆ హడావుడి అంతా సద్దుమణిగాక …ఇల్లంతా సర్దుకుని వంట కార్యక్రమం మొదలు పెట్టారు. భోజన కార్యక్రమాలు అయ్యాక శంకరం గారు మందులు వేసుకుని నిద్రపోయారు. చెల్లెల్లిద్దరూ ఏవో కబుర్లు చెప్పుకుంటున్నారు. పార్వతమ్మను అడిగాడు సూర్య. “అమ్మా.. అసలేం జరిగింది? నాన్న ఎందుకిలా అయిపోయారు..”

చిన్నగా నిట్టూర్చి చెప్పసాగింది. “ఏం చెప్పమంటావు నాయనా… మీ నాన్న గారికి భవిష్యత్తు పట్ల భయం పట్టుకుంది. ఆయన మనస్తత్వం నీకు తెలిసిందే కదా… లేని సమస్యను ఊహించుకుని భయపడిపోతూ ఉంటారు. నువ్వు చూస్తే ఇంజనీరింగ్‌ మూడో సంవత్సరంలో ఉన్నావు. మీ నాన్నగారు త్వరలో రిటైర్‌ అయిపోతారు. మనకు చూస్తే వెనక ఆస్తులు ఏమీ లేవు. నీ చెల్లెల్లిద్దరూ త్వరలో పెళ్ళీడుకొస్తారు. ఉన్న డబ్బులన్నీ నీ చదువు కోసమే ఖర్చు పెడుతున్నారు. రిటైర్‌ అయిపోయాక వచ్చే పెన్షన్‌తో మన ఇల్లు నడిచిపోద్ది. సరే .. మరి మిగతా కార్యక్రమాల సంగతేంటి? ఆయన ఈ మధ్య నీ గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారు. నువ్వు తొందరగా చదువు పూర్తి చేసి ఏదో ఒక ఉద్యోగం సంపాదిస్తావని ఆశ పడుతున్నారు …కానీ ఆయన రిటైర్‌ అయ్యే టైముకి నీకు జాబ్‌ రాకపోతే పరిస్థితి ఏంటి? అని విపరీతంగా బాధపడిపోయేవారు. అలా…ఆలోచించి ..ఆలోచించి …ఇంత దాకా తెచ్చుకున్నారు” అంది.

గాఢంగా నిశ్వసించాడు సూర్య. తానొకటి తలిస్తే దైవమొకటి తలచిందని …మంచి గాయకుడిగా ఎదుగుదామని తను కలగంటుంటే ..తానొక జాబ్‌హోల్డర్‌ కావాలని తండ్రి ఆలోచిస్తున్నాడు. అఫ్‌కోర్స్‌ అందులో తప్పు కూడా ఏమీ లేదు. కానీ ఎలా..?

కొన్ని రోజుల తర్వాత తండ్రి దగ్గరకు వెళ్ళి “నాన్నా.. ఇక నేను కాలేజీకి వెళ్ళాలి. చాలా రోజులు అయింది కదా మానేసి” అన్నాడు.

“అలాగే.. మరి డిగ్రీ అవగానే ఏం చేస్తావు?” అడిగారు శంకరం.

“హైదరాబాద్‌ వెళ్ళి సింగర్‌గా ట్రై చేదామనుకుంటున్నాను” అని చెబుదామనుకున్నాడు. అలా చెపితే తండి ఆరోగ్యం మళ్ళీ పాడవుతుందని ఆలోచించి ” ..కాంపిటీటివ్‌ ఎగ్జామ్స్‌‌కి ప్రిపేర్‌ అయి మంచి జాబ్‌ సంపాదిస్తాను నాన్నా.. మన కుటుంబాన్ని ఆదుకుంటాను” అని చెప్పాడు. శంకరం మొహంలో విపరీతమైన ఆనందం. “అలాగే బాబూ.. మంచిది” అని సంబరపడిపోయారు.

తల్లికి, చెల్లెళ్లకు జాగ్రత్తలు చెప్పి కాలేజీకి చేరుకోవడానికి బస్‌ ఎక్కాడు.

బస్‌ ముందుకు సాగిపోతోంది. ‘తొందరగా జాబ్‌సంపాదించడం ఎలా..’ అన్న ఆలోచనల్లోకి వెళ్ళిపోయాడు సూర్య. చిన్నప్పటి నుండీ ఆడుతూ పాడుతూ, తనకు నచ్చినట్టు పెరిగిన సూర్య జీవితంలో మొదటిసారి ఇంకొకరి కోసం రాజీపడటం మొదలుపెట్టాడు. గాయకుడిగా ఎదగాలనుకున్న తన లక్ష్యాన్ని పూర్తిగా మర్చిపోవాలని నిశ్చయించుకున్నాడు.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here