కలగంటినే చెలీ-15

0
6

[box type=’note’ fontsize=’16’] శ్రీ సన్నిహిత్ వ్రాసిన ‘కలగంటినే చెలీ’ అనే నవలని ధారవాహికగా పాఠకులకు అందిస్తున్నాము. [/box]

[dropcap]ఒ[/dropcap]క రోజు ఆఫీసు నుండి రాగానే డల్‌గా ఉంది సీత. అనసూయమ్మ ఇది గమనించింది.

కాఫీ కప్పు ఇస్తూ “ఏమైందమ్మా …అలా ఉన్నావు” అని సీతను అడిగింది.

విపరీతమైన తలనొప్పితో బాధపడుతున్న సీత “ఏం లేదమ్మా …కంపెనీ వాళ్ళు ఎబ్రాడ్‌ వెళ్ళి వర్క్‌ చెయ్యడానికి తొందరగా డేట్స్‌ చెప్పమంటున్నారు. ప్రోజెక్ట్‌ వర్క్‌ పీక్‌లో ఉంది ..ఏం చెప్పాలో అర్థం కావడం లేదు” అంది.

“ఓస్.. ఇంతదానికే కంగారు పడతావేం.. ఇప్పుడు ఆ ఫారెన్ వెళ్లకపోతే నష్టమేంటి?” అంది అనసూయమ్మ.

“అదేంటమ్మా ..అలా అంటావు.. నన్ను నమ్మి పనంతా నా చేతిలో పెట్టారు.. ఇప్పుడు నేను వెళ్ళను అనడం కరెక్ట్‌కాదమ్మా..” భయంగా అంది.

అనసూయమ్మ ఆలోచనలో పడింది.

నిజానికి సీతను చిన్నప్పటి నుండీ కొంచెం తక్కువగానే చూసిందామె. ఆడపిల్లకు చదువు, ఉద్యోగం లాంటివి అనవసరం అని, కేవలం పెళ్ళి చేసి పంపించేస్తే చాలని ఆమె గట్టి నమ్మకం. కానీ సీత చిన్నప్పటి నుండీ చదువులో చాలా చురుకు. ఆమె బ్రైట్‌నెస్‌ చూసి ఎంకరేజ్‌ చేసారు. సీత ఇంజనీరింగ్‌ పూర్తి చేసాక సాఫ్ట్‌వేర్‌ జాబ్‌ సాధించింది. అక్కడితో ఆగకుండా విదేశాలు వెళ్ళి సెటిల్‌ అవ్వాలని ఆలోచిస్తుంది. అయితే బోలెడంత జీవితాన్ని చూసిన అనసూయమ్మ ఇంకో విధంగా ఆలోచించసాగింది. ఇప్పుడు సీతకు పెళ్ళి సెటిల్‌ అయి ఎంగేజ్‌మెంట్‌ కూడా అయిపోయింది. అసలు సీత ఇప్పుడు ఉద్యోగం చెయ్యాల్సిన అవసరం ఏంటి? పైగా ఆమె సంపాదన కూడా పెళ్ళి తర్వాత తమకు రాదు. కానీ ఆ విషయం సీతకు డైరెక్ట్‌గా చెబితే అర్థం చేసుకోదు ..పైగా తనని తప్పు పట్టొచ్చు.. అందుకే తెలివిగా చెప్పాలని అనుకుంది.

“చూడమ్మా ..సీతా.. అదృష్టం కొద్దీ నీకు మంచి సంబంధం దొరికింది. ఎంగేజ్‌మెంట్‌ కూడా అయిపోయింది. త్వరలోనే పెళ్ళి ముహూర్తాలు కూడా పెట్టుకుంటాం. ఈ పరిస్థితిలో ఇలాంటి తలనొప్పులన్నీ ఎందుకు? ఇప్పుడు ఎబ్రాడ్‌ వెళ్లి వర్క్‌ చెయ్యడం కుదరని మీ ఆఫీసులో చెప్పెయ్‌.. నా మాట విను” అని మృదువుగా చెప్పింది. ఆలోచనలో పడింది సీత. చిన్నప్పటి నుండీ తల్లి మాట మీద ఎంతో గురి ఉన్న ఆమెకు తల్లి చెప్పినదాంట్లో తప్పేమీ కనపడలేదు. “సరే …అలాగే చేద్దాం” అని ఒక నిర్ణయానికొచ్చాక రిలీఫ్‌గా ఫీల్‌ అయింది. తర్వాత రోజు ఆఫీసుకు వెళ్ళగానే …తను ఇప్పుడు ఎబ్రాడ్‌ ఎసైన్‌మెంట్‌ తీసుకోలేనని… తనకు పెళ్ళి ఫిక్స్‌ అయిందని బాస్‌తో చెప్పింది సీత. చాలా ప్రశాంతంగా ఇదంతా విన్నాడు అతను.

బహుశా ఆల్టర్నేట్‌ మార్గం గురించి ఆలోచిస్తున్నట్టున్నాడు. “సరే ..యు కెన్‌గో” అని చెప్పి ఆమె వెళ్ళాక హెచ్‌.ఆర్‌. మేనేజర్‌‌ని రమ్మన్నాడు. అతను వచ్చాక చెయ్యాల్సిన వర్క్‌ చెప్పి పంపించాడు.

సాయంత్రానికల్లా …సీతకు మెయిల్‌ వచ్చింది.. నెల జీతం తీసుకున్నాక ..ఆమె ఆఫీసుకు రావక్కర్లేదని, టెర్మినేట్‌ చెయ్యబడిందని! నెత్తి మీద పిడుగుపడినట్టు ఫీల్‌ అయింది. అన్యమస్కంగా ఇంటికి చేరింది.

ఈ వార్త వినగానే అనసూయమ్మ లోలోన సంతోషపడింది. అంతా తాను అనుకున్నట్టే అయిందని పొంగిపోయింది. కానీ బయటపడకుండా.. “అయ్యో ..అదేంటమ్మా..” అని బాధ నటించింది.

సీత మాత్రం “ఇప్పుడెలాగమ్మా …ఆయనకు ఏం చెప్పాలి” అని ఏడ్వసాగింది.

“అబ్బాయికి నేను చెబుతాలేమ్మా ..నువ్వు అవేమీ మాటాడకు” అని నచ్చజెప్పింది. దిగులుగా బెడ్‌మీద వాలిపోయింది సీత.

ఒక సాయంత్రం సూర్యను టీకి ఆహ్వానించారు అనసూయమ్మ గారు. సీతను చూడొచ్చనే ఆనందంతో ఎగేసుకుంటూ వాళ్ళ ఇంటికి వెళ్ళాడు సూర్య.

టీ తాగడం పూర్తయ్యాక సూర్య “సీత ఇంకా ఆఫీసు నుండి రాలేదా అండీ…” అని అడిగాడు. అనసూయమ్మ విచారంగా మొహం పెట్టి “ఏం చెప్పమంటావు బాబూ …రోజూ లేట్‌ అవుతోంది… పైగా ఇక్కడి నుండి ఆఫీసు చాలా దూరం. రోజూ వెళ్ళి వచ్చేటప్పటికి అలసిపోతోంది…” అంది.

సూర్య “అయ్యయ్యో ..నిజమా ” అంటూ బాధపడిపోయాడు.

అనసూయమ్మ “..పైగా ఇప్పుడు ఆ కంపెనీ వాళ్ళు ఫారెన్‌ వెళ్ళాలని …ఒక సంవత్సరం దాకా అక్కడ పని చెయ్యాలి అని వత్తిడి చేస్తున్నారట …త్వరలోనే పెళ్ళి పెట్టుకున్నాం.. ఇవన్నీ చూసి సీత తట్టుకోలేక ఆ జాబ్‌ మానేస్తానని అంటోంది.. అయినా ఇప్పుడు ఆ జాబ్‌ మానేస్తే మనకు నష్టం ఏంటి బాబూ.. పెళ్ళి అయి మీరిద్దరూ కొంచెం సర్దుకున్నాక కావాలంటే సీత మళ్ళీ ఇంకో జాబ్‌చూసుకోవచ్చు… క్వాలిఫికేషన్ ఎక్స్‌పీరియన్స్ ఉన్నాయి కదా” అంది. ఆలోచనలో పడ్డాడు సూర్య. అనసూయమ్మగారు చెప్పేది నిజమే అనిపించింది.

“సరే అండీ ..సీతకు ఇవన్నీ తెలుసు కదా ..తననే ఆలోచించి ఒక నిర్ణయం తీసుకోమనండి” అని చెప్పి వచ్చేసాడు. ఎందుకో అతని మనసు చేదుగా అయిపోయింది.

ఆ విధంగా సీత జాబ్‌ మానేసింది ..లేదా.. అనసూయమ్మ గారి ఆలోచన ఫలించింది.

ఆ తర్వాత ఒక శుభ ముహూర్తాన సీతకు, సూర్యకు అంగరంగ వైభోగంగా పెళ్ళి అయింది.

పల్లెటూళ్ళో ఉన్న అత్తగారింట్లో మొదటి సారిగా అడుగు పెట్టింది సీత. అందరూ ప్రేమగా మాట్లాడుతున్నారు. అది నిజమో.. నటనో అర్థం కాలేదామెకి. ఎవరెవరో వచ్చి ఏవేవో అడుగుతున్నారు. అందరికీ ఓపిగ్గా సమాధానాలు చెబుతోంది. ఆమె చదువు గురించి, చేసిన జాబ్ గురించి ఇలా.. అన్నీ. అది అభిమానమో లేక విషయ సేకరణో తెలీక ఆమె కన్ఫ్యూజ్ అయింది.

పార్వతమ్మకు కొత్తగా వచ్చిన అత్త గారి హోదా ఏనుగెక్కినంత సంబరం కలిగిస్తోంది. పైగా బాగా చదువుకున్న పట్నం కోడలు.

ఇక్కడ కొంచెం విశ్లేషణ చెయ్యాలి. శంకరం, పార్వతమ్మ దంపతులు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పుడు చాలా సాధారణంగా ఉన్నారు. కానీ పరిస్థితులు మారి, సూర్య ఉద్యోగస్తుడై కొద్దిగా తేరుకున్నాక వారిలో మానవ సహజమైన అహం వచ్చి చేరింది. పైగా ఇప్పుడు కొడుకు పెళ్లి కూడా అవడంతో ఏదో పెద్ద ఘనకార్యం సాధించినట్టు ఫీల్ అవుతున్నారు. పార్వతమ్మ గారికైతే పెళ్ళికొడుకు తల్లి అన్న దర్పం బాగా నెత్తికెక్కేసింది.

ఎవరో వచ్చి పార్వతమ్మ ను అడుగుతున్నారు “ఏమ్మా…ఎంత కట్నం తెచ్చింది మీ కోడలు” అని.

“ఆ.. కట్నమా ..పాడా .. ఏమీ ఇవ్వలేదమ్మా ..ఏదో మా అబ్బాయి ఇష్టపడ్డాడని ఒప్పుకున్నాము..” చెప్పింది.

సీతకు ఆ మాటలు ముల్లులా గుచ్చుకున్నాయి. పైకి ఇంత బాగా నటిస్తున్న వీళ్ళ మనసుల్లో ఉన్న నిజం ఇదా అని బాధపడింది. అత్తగారి మీద ఉన్న గౌరవం పూర్తిగా పోయింది. ఈ విషయం తల్లి అనసూయమ్మకు చెప్పింది. అగ్నికి ఆజ్యం పోసినట్టు అనసూయమ్మ “ఛీ.. ఛీ.. పల్లెటూరు వెధవలమ్మా.. సభ్యత సంస్కారం ఉండవమ్మా వీళ్ళకి. నీ అత్తతో అసలు నువ్వు మాట్లాడకు ..నీ మొగుడితోనే మాట్లాడుకో చాలు” అని నూరిపోసింది. సీతకు చాలా ఓదార్పుగా అనిపించాయి ఆ మాటలు. వేడి మీదున్న ఇనుమును సాగదీయడానికి సమ్మెటతో కొడుతుంటారు. అలాగే … అప్పటికే బాగా విరిగిపోయి ఉన్న సీత మనసుని ఇంకా విరగదీయడానికి అన్నట్టు చిన్న సంఘటన జరిగింది.

“ఏమ్మా …బాగున్నావా ..” అంటూ వచ్చిందో అపరచిత స్త్రీ.

“బాగున్నానండీ..” అంటూ తలూపింది సీత

“మా సూర్యం నీకు ఎలా పరిచయమమ్మా ..ముందే తెలుసా ..” అడిగింది.

“లేదండీ …”

“అహా.. ఏమీ లేదూ ..కొంపదీసి నిన్ను కూడా ప్రేమించాడేమో అని”

“అదేంటి నన్ను కూడా అంటే …ఆయన పెల్లికి ముందు ఎవరినైనా ప్రేమించారా..”

“పోనీలేవమ్మా ..అవన్నీ ఇప్పుడెందుకు..” అంది.

“లేదు …చెప్పండి” ఫోర్స్‌ చేసింది సీత.

“ఈ ఊళ్లోనే ఉంటుంది ..రాణి అని ఒక అమ్మాయి …సూర్యం ఆ అమ్మాయినే లవ్‌ చేసాడు.. పెళ్ళి చేసుకుంటాడనుకున్నాం.. మరేమైందో నున్ను చేసుకున్నాడు.. ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకున్నంత పని చేసింది” అగ్గి పుల్ల వెలిగించింది. సీతకు క్రితం రోజు ఎవరి అమ్మాయితో సూర్య మాట్లాడుతున్న దృశ్యం కళ్ళ ముందు కదిలింది. మళ్ళీ ఆమే అంది “అయినా ఈ రాణిని చేసుకుంటే ఏమొస్తుందమ్మా.. అదే నువ్వైతే నెలతిరిగేసరికి జీతం తీసుకొచ్చి చేతిలో పోస్తావు …ఇక ఆ రాణిని సూర్యం ఎప్పుడో సొంతం చేసేసుకున్నాడుగా.. అయినా నాకెందుకులే ఇవన్నీ ..వస్తానమ్మా” అంటూ వెళ్ళిపోయింది.

సీత మనసు పూర్తిగా …అంటే మళ్ళీ రిపేర్‌ చెయ్యలేనంతగా విరిగిపోయింది. సూర్యం తనవాడు అన్న ఫీలింగ్‌ చచ్చిపోయింది. ఇక అతను ఒంటి మీద చెయ్యేస్తే భరించగలదా?

ఆ స్త్రీ వచ్చి వెళ్ళడం పార్వతమ్మ అప్పుడే చూసింది. “ఓరి నాయనో ఈ దరిద్రపు నాగమ్మ ఎందుకొచ్చిందో… ఏం విషం కక్కి వెళ్ళిందో” అనుకుంటూ మనసులోనే బాధపడింది.

***

తొలిరాత్రి !!

సూర్య చాలా ఎక్సయిటింగ్‌గా ఉన్నాడు. సీత ఈ రాత్రితో పూర్తిగా తన సొంతం కాబోతుందన్న ఊహే అతన్ని నేల మీద నిలవనీయడం లేదు.

అప్పటికే నీలి చిత్రాలు అవీ బాగా చూసి ఉండటంతో థియరీ బాగా తెలుసు. ఇప్పుడు చెయ్యబోతున్న ప్రాక్టికల్స్ ఎలా ఉంటాయో అన్న ఆదుర్దా అతనిలో.

రాత్రి.. పాల గ్లాసుతో బెడ్ రూములోకి వచ్చింది సీత. ఎన్నో సినిమాల్లో చూపించినట్టుగా ఆమెను దగ్గరకు తీసుకున్నాడు తాను కొంచెం పాలు తాగి మిగిలినవి ఆమెకు ఇచ్చాడు. ఆమె తాగింది. తర్వాత నెమ్మదిగా ముగ్గులోకి దించడానికి చేతులు వేసాడు. మృదువుగా ఆ చేతుల్ని దూరంగా తోసేసింది. ఆశ్చర్యపోయాడు.

“అదేంటి సీతా..” అన్నాడు

“ఇప్పుడొద్దు..” అంది సీత

“ఏం ..ఎందుకని”

“నా ఒంట్లో బాగాలేదండీ..”

“బాగానే ఉన్నావుగా…” అన్నాడు

“అర్థం చేసుకోండి…” అని అటు తిరిగి పడుకుంది.

పాల పొంగు మీద నీళ్లు చల్లినట్టు ..తుస్సు మనిపోయాడు సూర్య. ఆవేశం అంతా చల్లారిపోయింది. సీత చిన్నగా గురక పెట్టసాగింది.

ఆలోచనలో పడ్డాడు. తనంటే సీతకు ఇష్టం లేదా? ఎందుకిలా బిహేవ్ చేస్తోంది? పెళ్ళికి ముందు బాగానే ఉంది కదా? ఇలా ఎన్నో సందేహాలు అతని మదిలో!

ఆలోచిస్తూ అలాగే బెడ్ మీద వాలాడు.

తెల్లారింది. సీత మామూలుగానే ఉంది. రాత్రి అంతా సవ్యంగా జరిగినట్టు ప్రవర్తిస్తోంది. .. తర్వాత రెండు రాత్రులు కూడా అలాగే చేసింది.

ఇక ఆగలేక సీతను అడిగాడు. “సీతా ..ఎందుకిలా నన్ను దూరం పెడుతున్నావు” అని.

సీత నెమ్మదిగా “మనం ఫిజికల్‌గా కలవాలంటే ..ముందు మానసికంగా బాగా దగ్గరవ్వాలి కదండీ …కొన్ని రోజులు ఆగండి..మన మధ్య ఇంటిమసీ పెరిగాక మిమ్మల్ని ఆపేదెవ్వరు” అంది.

అంత కన్విన్సింగ్ గా అనిపించలేదు సూర్యకు. అయినా “అలాగే ..” అంటూ తలూపాడు.

పెళ్ళి తర్వాత హైదరాబాద్‌కి వచ్చేసి కాపురం ప్రారంభించారు. ఇన్నాళ్ళూ ఇంటికి దూరంగా ఒంటరిగా సూర్య, తల్లిదండ్రుల చాటున సీత ఉన్నారు. ఇప్పుడు..ఇద్దరూ కలిసి తమకంటూ ఒక కొత్త జీవితాన్ని మొదలు పెట్టారు. భిన్న నేపథ్యాల నుండి వచ్చిన వ్యక్తులు ఇద్దరూ. కానీ ఇక మీదట అన్ని విషయాలు తామే చూసుకోవాలి. అంటే వాళ్ళిద్దరూ తమకు తెలియని ఒక కొత్త ఫేజ్‌లోకి ప్రవేశించారు అన్న మాట!

పగలంతా ఇంటి విషయాల్లో అన్నీ బాధ్యతగా చేస్తోంది సీత. రాత్రిళ్ళు మాత్రం సూర్యాన్ని దూరం పెడుతోంది. సీత మనసు అప్పటికే విషపూరితం చెయ్యబడిందని …ఆమె ఎడమొహం పెడమొహం ప్రవర్తనకు అదే కారణం అని ఊహించలేకపోయాడు సూర్య. సర్దుకుంటుందిలే అని ఓపిక పడుతున్నాడు.

సూర్య ఆఫీసుకు వెళ్ళగానే కొలీగ్స్‌ అందరూ చుట్టు ముట్టేసారు. పెళ్ళి గురించి ప్రశ్నల వర్షం కురిపించి ఉక్కిరి బిక్కిరి చేసేసారు. అందరికీ ఓపిగ్గా సమాధానాలు చెప్పాడు. కాఫీ బ్రేక్‌లో రోహిణి అడిగింది “శోభనం ఎలా అయింది?” అని .

సిగ్గుపడిపోయాడు సూర్య. బుగ్గలు ఎరుపెక్కాయి. “అబ్బ ఇదంతా సిగ్గే..” అంటూ కిల కిలా నవ్వింది.

“ఇద్దరూ హేపీగా ఉండండి అని చెప్పింది. సూర్య తన బాధని ఆమెకు చెబుదామనుకున్నాడు, కానీ ఇప్పుడే చెప్పేస్తే , ఆమె దృష్టిలో సీత చులకన అయిపోతుందని ఆగిపోయాడు.

శేఖర్‌.. రవి.. విడి విడిగా వచ్చి అభినందించారు. బాస్‌ తన కేబిన్‌కి పిలిచి విషెస్‌ చెప్పాడు.

“నీ మిసెస్‌ కూడా వర్కింగే అని విన్నాము.. లక్కీ రా నువ్వు. డబుల్‌ ఇన్‌కం గ్రూప్‌లో చేరిపోయావు.. ఇంకేం… నో ప్రోబ్లెం” అని అందరూ పొగిడేసారు.

సూర్య మనసు చివుక్కుమంది. కానీ బయటపడకుండా “అవును.. అవును..” అంటూ నవ్వేసాడు. ఆఫీసు అవగానే బైక్‌పై వస్తూ అదే ఆలోచించసాగాడు సూర్య. సీత ఎందుకు జాబ్‌మానేసింది ? తనకు తానుగా మానిందా లేక ఎవరైనా సలహా ఇచ్చారా? …ఇల్లు రావడంతో ఆలోచనలకి ఫుల్‌స్టాప్‌ పెట్టాడు.

ఫ్రెష్ అయి కూర్చున్నాక టీ తీసుకొచ్చింది సీత.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here