కలగంటినే చెలీ-16

0
8

[box type=’note’ fontsize=’16’] శ్రీ సన్నిహిత్ వ్రాసిన ‘కలగంటినే చెలీ’ అనే నవలని ధారవాహికగా పాఠకులకు అందిస్తున్నాము. [/box]

[dropcap]సూ[/dropcap]ర్య “సీతా..హౌ వజ్‌ ద డే..” అన్నాడు.

“ఆ ఏముంది.. అంట్లూ.. బట్టలూ.. ఇల్లు ఊడ్వడం.. ఒళ్ళు పులుసైపోయింది..” అంది సీత.

“అయ్యో.. సారీ సీతా.. మనం పనమ్మాయిని పెట్టుకుందాం.. సరేనా…”

“అబ్బో.. ఆ సలహా మా మమ్మీ ఎప్పుడో చెప్పింది.. మీరు ఒప్పుకోక పోయినా సరే పనమ్మాయిని పెట్టుకోమని..”

చురుక్కుమంది సూర్యకు. “ఆహా..ఇంకేం చెప్పింది..”

“మన ఇల్లు మరీ చిన్నగా ఉందట. పైగా మమ్మీ వాళ్ళు ఇల్లు ఇక్కడికి దూరం. అందుకే వాళ్ళ కాలనీ లోనే ఒక ఇల్లు అద్దెకు చూసి పెడతామన్నారు.. మనం అక్కడకు మారిపోదాం..” అంది.

సూర్యకు పరిస్థితి నెమ్మదిగా అర్థమవుతోంది. కానీ కాదనలేకపోయాడు. ఎందుకంటే అత్తగారికి దగ్గరగా ఉంటే తమకు సహాయంగా ఉంటుందని అతని ఆలోచన. ఆ అలోచనే అతని కొంప ముంచుతుందని ఊహించలేకపోయాడు. త్వరలోనే.. అత్తగారి ఇంటికి దగ్గరగా ఒక పెద్ద ఇల్లు అద్దెకు తీసుకుని షిఫ్ట్‌ అయ్యారు. గృహ ప్రవేశం కూడా చేసుకున్నారు. పని మనిషిని కూడా మాట్లాడుకున్నారు. తల్లిదండ్రులకు దగ్గరగా వచ్చినందుకో ఏమో సీత చాలా సంతోషంగా కనిపించింది ఆ రోజు.

ఆ రాత్రి… ఏదో మైకంలో సూర్యను దగ్గరకు రానిచ్చింది. తమకంగా అల్లుకుపోయాడు సూర్య. వయసు వేడి.. కోరిక.. భర్త తన మాట వింటున్నాడన్న ఇష్టంతో పూర్తిగా తనను అర్పించుకుంది సీత.

ఆవేశం చల్లారాక సంతృప్తిగా నిద్రపోయాడు సూర్య. తొలి కలయిక లోని మధురిమ అతన్ని పరవశుడ్ని చేసింది. ఆ తర్వాత ఎన్నో మధురమైన రాత్రులు అలాంటివే. ఒక రోజు మంచి మూడ్‌లో ఉన్నప్పుడు సూర్య అడిగాడు “సీతా.. నువ్వు కూడా జాబ్‌ చేస్తే బాగుంటుంది కదా… మన ఇద్దరి శాలరీస్‌తో హాయిగా ఉండొచ్చు” అన్నాడు.

“మా మమ్మీ ఇప్పుడు జాబ్‌ చెయ్యొద్దంటుందండీ..” అంది సీత.

“ఆమెకెందుకు… మన జీవితం మన ఇష్టం..” అన్నాడు

“అంటే ఏంటి మీ ఉద్దేశం.. ఇంటి పని, వంట పని చేస్తూ.. మీకు సేవలు చేస్తూ.. ఇంకో పక్క ఉద్యోగం చేసి మీకు సంపాదించి పెట్టాలా..” అని అరిచింది.

“బాగానే మాటలు నేర్చావు.. ఇవి నీ సొంత తెలివితేటలా లేక ఎవరైనా నేర్పించారా..” అక్కసుగా అన్నాడు.

“ఎవరో నేర్పించడం ఎందుకు.. నాకు ఆ మాత్రం తెలీదా” అంది తల ఎగరేస్తూ…

సూర్యకు అర్థమైంది. సీత బుర్ర పూర్తిగా అత్తగారి చేత హిప్నటైజ్‌ చెయ్యబడుతోందని. పెళ్ళికి ముందు ఆమె జాబ్‌ చేస్తుందని చెప్పారు.. మాటలన్నీ అయి ఎంగేజ్‌మెంట్‌ అయ్యాక ఆమెతో జాబ్‌ మానిపించారు. భవిష్యత్తుని బాగా తీర్చిదిద్దుకోవాలన్న తన ఆశలన్నీ కూల్చేసారు. ఇప్పుడు సీత తను ఏం చెప్పినా వినే స్టేజ్‌లో లేదు. కానీ ఏమీ చెయ్యలేని అశక్తత!

సీత నెల తప్పింది. చాలా హేపీగా ఫీల్‌ అయ్యాడు సూర్య. తన తల్లిదండ్రులకి ఫోన్‌చేసి చెప్పాడు. “అబ్బ.. ఎంత మంచి న్యూస్‌ చెప్పావురా.. మేము హైదరాబాద్‌ వస్తాం..” అని చెప్పారు వాళ్ళు. తండ్రి కాబోతున్నాను అన్న ఫీలింగ్‌ చాలా బాగా అనిపించింది సూర్యకు.

ఆ రాత్రి.. “సీతా.. నువ్వు నెల తప్పిన విషయం మా అమ్మా నాన్నకు చెప్పాను.. నిన్ను చూడటానికి వస్తామన్నారు..” అన్నాడు సూర్య.

ఆలోచనలో పడింది సీత. అత్తగారితో మాట్లాడటం ఆమెకు ఇష్టం లేదు. ఆమె పెత్తనం అసలు ఇష్టం లేదు. కానీ ఎలా ఎవాయిడ్‌ చెయ్యడం? ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయింది.

తర్వాత రోజు సూర్య ఆఫీసుకు వెళ్ళగానే తల్లికి ఫోన్‌చేసి రమ్మంది.

గంట తర్వాత –

“చెప్పమ్మా..” అంది అనసూయమ్మ సీతతో.

“అమ్మా.. సూర్యా వాళ్ళ అమ్మా నాన్నలను రమ్మన్నాడు.. వాళ్ళు రావడం నాకు ఇష్టం లేదు” అంది.

“ఆహా.. అలాగా.. నీకు ఇష్టం లేదని చెప్పు “

“అలా అని సూర్యతో ఎలా చెప్పాలమ్మా..” బేలగా అడిగింది.

అనసూయమ్మ ఆలోచించి ఒక అయిడియా చెప్పింది. తర్వాత కూతురుకి కొంచెం లోకజ్ఞానం బోధించి వెళ్ళిపోయింది. ఆ రాత్రి డిన్నర్‌ అయ్యాక టీవీ చూస్తున్నాడు సూర్య. సీత అతని పక్కనే కూర్చుంటూ “ఏమండీ…మీకో విషయం చెప్పాలి” అంది.

“చెప్పు…” అన్నాడు ప్రేమగా

“నాకు.. నాకు… అప్పుడే పిల్లల్ని కనడం ఇష్టం లేదండీ.. అబార్షన్‌ చెయ్యించుకుంటాను” అంది. హతాశుడయ్యాడు సూర్య

“అదేంటి.. ఇంకెప్పుడు కంటాం..”

“మనకి ఇప్పుడేగా పెళ్ళి అయింది. కొన్ని రోజుల పాటు ఎంజాయ్‌ చేసి అప్పుడు ప్లాన్‌ చేద్దామండీ…”

“ఇప్పుడు మన ఎంజాయ్‌మెంట్‌‌కి ఏం తక్కువయింది?” అన్నాడు.

“ఏమో నాకు తెలీదు.. మా మమ్మీ కూడా ఒప్పుకుంది..”

బీపీ రెయిజ్‌ అయ్యింది సూర్యకు. కంట్రోల్‌ చేసుకున్నాడు.

“పిల్లల్ని కనేది నువ్వా.. నీ అమ్మా..” అన్నాడు

అక్కడి నుండి లేచి బెడ్రూముకు వెళ్ళిపోయింది సీత. సూర్య ఆలోచించసాగాడు. నిజానికి సీత చాలా మంచిది. కానీ తల్లి అంటే ఉన్న విపరీతమైన ప్రేమతో ఆమె ఏది చెబితే అది చేస్తోంది. సీతలో ఈ బలహీనత ఎడ్వాంటేజ్‌గా తీసుకుని అనసూయమ్మ తనని ఆడిస్తోంది. కానీ బయటపడటం ఎలా?

బెడ్రూము లోకి వెళ్ళాడు. “సీతా.. నిజం చెప్పు.. నీకు ఇప్పుడు పిల్లలు ఇష్టం లేదా” అని అడిగాడు.

“ఇష్టమే.. కానీ.. కానీ.. మీ అమ్మా.. నాన్నా..” అంటూ ఆగిపోయింది. విషయం అర్థమైంది సూర్యకు.

“సరే.. నేను వాళ్ళని రావద్దని చెబుతాను.. ఇంకెలాంటి పిచ్చి ఆలోచనలు చెయ్యకు” అని పక్కకు తిరిగి పడుకున్నాడు. ఒక కన్నీటి చుక్క అతని చెక్కిలి పై నుండి జారి బెడ్‌మీద పడింది.

***

ఒక రోజు.. ఆఫీసులో బిజీగా ఉన్నాడు సూర్య. సీత ఫోన్ చేసింది.

“చెప్పు సీతా..” అన్నాడు

“నాకు స్టమక్‌లో బాగా పెయిన్‌గా ఉంది.. మీరు అర్జంటుగా రండి…” అంది

“సీత.. చాలా బిజీగా ఉన్నాను.. అత్తయ్య గారిని పిలు… అవసరమైతే మీరిద్దరూ హాస్పిటల్‌కి వెళ్ళండి” అన్నాడు.

కోపంగా ఫోన్ పెట్టేసింది సీత. టెన్షన్‌గా ఫీల్ అయ్యాడు సూర్య. బాస్‌ని పర్మిషన్ అడుగుదామనుకున్నాడు. కానీ ఇప్పటికే వర్క్ పెండింగ్ ఉండటంతో పొద్దున్నే క్లాసు పీకిన అతన్ని అడగడం బాగోదని ఆగిపోయాడు. చెప్పకుండా ఇంటికి వెళ్లిపోదామా అనుకున్నాడు. మళ్ళీ.. ఒకవేళ అంత అర్జెంట్ అయితే సీత అత్తయ్యగారితో హాస్పిటల్‌కి వెళ్తుందిలే అనుకుని సరిపెట్టుకున్నాడు.

కాసేపయ్యాక సీతకు ఫోన్ చేసాడు. ఆమె ఎత్తలేదు. నరకం అనుభవించసాగాడు సూర్య. మనసు గట్టి చేసుకుని ఆఫీసు పని మీద దృష్టి పెట్టాడు. సాయంకాలం ఆఫీసు అవగానే ఆదరా బాదరాగా ఇంటికి వెళ్ళాడు.

వెళ్ళేటప్పటికి సీత ప్రశాంతంగా టీవీ చూస్తోంది. “ఇప్పుడెలా వుంది?” అని అడిగాడు.

“నేను చస్తే ఏం బ్రతికితే ఏం… మీకు ఆఫీసు ముఖ్యం కదా” అని విసురుగా లోనికి వెళ్ళిపోయింది.

“మీ అమ్మగారిని పిలవమని చెప్పాను కదా..” అన్నాడు వెనకే వెళ్తూ

“పిలిచాను.. వాళ్ళు రానన్నారు…” అంది.

“ఏం… ఎందుకని..” ప్రశ్నించాడు.

“ఎందుకు రావాలి.. మీకు లేని శ్రద్ధ వాళ్ళకెందుకు?”

“అదేంటి… ఇలాంటి విషయాల్లో తోడుగా ఉంటారనే కదా మనం దగ్గర ఇల్లు తీసుకుంది” లాజిక్ మాట్లాడాడు.

“అవన్నీ మాకు తెలీవు.. ఇలాంటివి తప్పించుకోడానికి మీ అమ్మా నాన్నా దూరంగా ఉన్నారా..”

“అదేంటి అలా మాట్లాడుతున్నావు.. “

“ఇంకెలా మాట్లాడాలి.. తలనొప్పులన్నీ నా తల్లిదండ్రులకేనా.. పిల్లకు పెళ్లి చేసి పంపించాక కూడా వాళ్ళు బాధలన్నీ పడాలా?” సూటిగా అడిగింది.

సూర్య దగ్గర సమాధానం లేదు. ఆమెకు నేర్పబడిన తెలివి ముందు జీవితానుభవం లేని సూర్య ఓడిపోయాడు. నిశ్శబ్దంగా బాధపడుతూ ఉండిపోయాడు.

***

ఈ విధంగా కాలం గడుస్తోంది. సూర్య కంపెనీ వాళ్ళు ఒక డిన్నర్ పార్టీ ఎరేంజ్ చేశారు. ఒక రకంగా సక్సెస్ మీట్ లాంటిది అది. సీతను తీసుకుని ఆ పార్టీకి వెళ్ళాడు సూర్య. స్టార్ హోటల్లో పార్టీ. బ్రహ్మాండంగా ఉన్నాయి ఎరేంజ్మెంట్స్. ఫార్మల్‌గా స్పీచ్‌లు అయ్యాక డ్రింక్స్ మొదలయ్యాయి.

సూర్య ఒక గ్లాసు తీసుకుని సిప్ చేయ్యసాగాడు. సీత మాత్రం సాఫ్ట్ డ్రింక్ తీసుకుని అందరినీ పరిశీలించసాగింది. నెమ్మదిగా పార్టీ జోరందుకుంది. నవ్వులు, తుళ్ళింతలు.. కేకలు. సూర్య సెకండ్ రౌండ్‌లో ఉన్నాడు. కొద్దిగా మత్తు తలకెక్కుతోంది. ఇన్‌హిబిషన్స్ పోతున్నాయి.

రోహిణి వీళ్ళ దగ్గరికి వచ్చింది. “హాయ్.. సూర్య.. మీ వైఫ్‌ని ఇంట్రడ్యూస్‌ చెయ్యవా..” అంది మత్తుగా.

చురుగ్గా చూసింది సీత. “యా.. మీట్ మై వైఫ్ సీత..” అని సీత వైపు తిరిగి “…తను రోహిణి అని నా కొలీగ్” అన్నాడు.

“హాయ్ అండీ..” అంది సీత. “హాయ్‌..” అని బదులిచ్చి, సూర్య చేతిని పట్టి లాక్కుంటూ వెళ్ళింది రోహిణి. వేరే గ్రూప్ దగ్గరికి తీసుకెళ్లి జోక్స్ కట్ చేస్తోంది.

ఒళ్ళు మండిపోయింది సీతకు. సూర్య అంటే సీతకు చాలా పొసెసివ్ ఫీలింగ్. తన దాన్ని ఇంకొకరు సరదాకి కూడా టచ్ చెయ్యకూడదు అని భావిస్తుంది. రోహిణి ఈ విధంగా చనువు తీసుకోవడంతో ఆమె మనసు కుత కుతా ఉడకసాగింది. మత్తు మందులో ఉన్న సూర్య ఇవన్నీ గమనించలేదు. భోంచేసాక, అందరికీ బాయ్ చెప్పి ఇంటికి వచ్చేసారు.

ఇంట్లోకి అడుగు పెట్టగానే సీత ఒంటి మీద చీర తీసి విసిరి కొట్టింది. బెడ్‌మీద అడ్డంగా పడి వెక్కి వెక్కి ఏడుస్తోంది. ఏమీ అర్థం కాక సూర్య షాక్‌ అయ్యాడు. తాగిన మత్తు దిగిపోయింది.

“ఏమయింది సీతా.. ఎందుకేడుస్తున్నావు.. నా వల్ల పొరపాటు ఏమైనా జరిగిందా..” అడిగాడు.

“అదెవరు అసలు?”అరిచింది.

“అది అంటే ఎవరు..”

“ఆ రోహిణి..”

“ఓహ్‌.. ఆ అమ్మాయా.. నా కొలీగ్‌..” సింపుల్‌గా అన్నాడు.

“కొలీగా.. నిన్ను ఎందుకు టచ్‌ చేస్తోంది.. కొలీగ్‌ అయితే అలా చేస్తారా?” కోపంగా అంది.

“ఓహ్‌.. కమాన్‌.. ఇట్‌ ఈజ్‌ కామన్‌ యార్‌…”

“ఏంటి కామన్‌.. మీద మీద పడిపోవడం కామనా.. అయినా నాకిలాంటివి ఇష్టం లేదు..” ఫర్మ్‌గా చెప్పింది.

సీతకు తనంటే చాలా పొసెసివ్‌నెస్‌ అని సూర్యకు అర్థం అయింది. కానీ సీత మనసులో చాలా కాలం కిందట పడిన అనుమానం బీజం ఇప్పుడు పెరిగి పెద్ద మహావృక్షం అయిందని తెలుసుకోలేకపోయాడు.

సీతకు నెలలు నిండి సీమంతం చేసే టైము వచ్చింది. సూర్య తల్లిదండ్రులు ఆ కార్యక్రమం జరిపించడానికి ఊరి నుండి వచ్చారు. సీతకు, అనసూయమ్మకు వాళ్ళు రావడం ఇష్టం లేకపోయినా.. తప్పదు కాబట్టి ఊరుకున్నారు.

పార్వతమ్మకు, శంకరం గారికి ఏనుగెక్కినంత సంబరంగా అనిపించింది. ఊళ్ళో తమ కొడుకు గురించి గొప్ప గొప్ప మాటలు చెప్పి హైదరాబాద్ వచ్చారు.

సీత తరపు బంధువులు కూడా వచ్చారు. సీమంతం వైభవంగా జరిగింది. సీత మనసు ఆనందంతో పులకించింది.

ఇదంతా గమనిస్తున్న అనసూయమ్మ మనసు ఉడికిపోయింది. ఇలా వదిలేస్తే సీత తన అత్తామామలకు దగ్గరయి తనని కేర్ చెయ్యదేమో అని వర్రీ అవసాగింది. ఎలాగైనా గొడవ సృష్టించాలని అనుకుంది. స్త్రీ సహజమైన అసూయ ఆమెకు నిలకడ లేకుండా చేస్తోంది.

కార్యక్రమం అంతా పూర్తయింది. వచ్చిన చుట్టాలందరూ ఏవో ముచ్చట్లు చెప్పుకుంటూ టైం పాస్‌ చేస్తున్నారు.

సీత తరపు బంధువులు నెమ్మదిగా అనసూయమ్మ చుట్టూ చేరారు. అప్పటిదాకా మామూలుగా మాట్లాడిన అనసూయమ్మ నెమ్మదిగా ఏడవడం ప్రారంభించింది. ఆ హడావుడికి సీత గబ గబా తల్లి దగ్గరకు వెళ్లింది. “ఏమయిందమ్మా.. ఎందుకేడుస్తున్నావు..” ఆదుర్దాగా అడిగింది.

ముక్కు చీదుతూ అనసూయమ్మ “ఎందుకులేమ్మా.. అవన్నీ ఇప్పుడు” అంది.

“లేదమ్మా… చెప్పు.. నిన్ను ఎవరైనా ఏమైనా అన్నారా?” అంది సీత.

“ఏం చెప్పమంటావమ్మా.. నీ అత్త… ఆ పల్లెటూరు బైతు… మన వాళ్ళందరితో, నువ్వు పైసా కట్నం ఇవ్వలేదని.. ఉద్యోగం చేస్తానని చెప్పి, పెళ్ళి సెటిల్‌ అవగానే మానేసావని చెబుతుందమ్మా…” అంటూ ముక్కుని కొంగుతో తుడుచుకోసాగింది. ఒళ్ళు మండిపోయింది సీతకు. సూర్య దగ్గరకు గబ గబా వెళ్ళింది. తన తల్లిదండ్రులతో మాట్లాడుతున్న అతన్ని “సూర్యా.. ఇలా రా” అని పిలిచింది. “ఏమైంది సీతా..” అంటూ హడావిడిగా వచ్చాడు

“చూడు సూర్యా.. నీ పేరెంట్స్‌ని కొంచెం నోరు కంట్రోల్‌ చేసుకోమని చెప్పు.. మా గురించి ఏదేదో వాగుతున్నారట..” కోపంగా అంది. “కొంచెం మర్యాదగా మాట్లాడు.. వాళ్ళు ఎందుకు నీకు వ్యతిరేకంగా మాట్లాడతారు…నువ్వేమైనా బయటదానివా..” అన్నాడు.

ఈ గొడవకి పార్వతమ్మ అక్కడికి వచ్చింది. సీతను చూస్తూ “ఏంటమ్మా…అంటున్నావు.. నీ గురించి ఎందుకు అలా అంటామమ్మా.. అలా అనేవాళ్లమే అయితే ఇప్పుడు ఊరి నుండి ఎందుకొస్తాం?” అంది.

సీత “వేషాలు వెయ్యొద్దు.. నీ సంగతి నాకు బాగా తెలుసు.. నా వెనక ఎన్ని చెబుతున్నావో తెలీదనుకున్నావా..” అంది. చుట్టాలందరి ముందూ తల తీసినట్టయిపోయింది పార్వతమ్మకు. శంకరం గారు నోట మాట రాక అలా మ్రాన్పడిపోయారు.

పార్వతమ్మ బేసిక్‌గా పల్లెటూరి స్త్రీ. సున్నితంగా మాట్లాడటం ఆమెకు రాదు. ఇన్నాళ్ళూ కొడుకు మొహం చూసి ఊరుకుంది. కానీ ఇప్పుడు కంట్రోల్‌ చేసుకోవడం ఆమె వల్ల కాలేదు. ఒక్కసారిగా బరస్ట్‌ అయిపోయింది.

సూర్య వైపు చూస్తూ “ఏంట్రా.. నీ పెళ్ళాం మాటాడేది.. కొజ్జా వెధవ.. పెళ్ళాం కొంగు పట్టుకుని మమ్మల్ని వదిలేసావు. ఇందుకేనా నిన్ను పెంచి పెద్ద చేసింది. చదువు చెప్పించింది. పెళ్ళయింది మొదలు మా మొహం చూడ్డం మానేసావు. పోనీలే అని ఊరుకున్నాము. నీ ఇంటికి రావద్దన్నావు… అయినా ఊరుకున్నాము.. ఇప్పుడు తప్పదని.. ఈ కార్యక్రమం చెయ్యాలని వస్తే ఉన్నవి లేనివి కల్పించి మా మీద నిందలు వేస్తారా… మాకు గతి లేక నీ ఇంటికొచ్చామనుకున్నావా…. నీ కోట్ల ఆస్తి దొబ్బెయ్యడానికి వచ్చామనుకున్నావా…. దొంగ వెధవ.. నీ వెనక చెల్లెల్లు ఉన్నారు.. వాళ్ళ బాధ్యత ఎలా అన్న ఆలోచన నీకెప్పుడైనా ఉందా.. నీ సంగతి తెలీక మా ఆశలన్నీ నీ మీద పెట్టుకున్నాము.. ఛీ..ఛీ.. నీ ఇంటికి రావడం మాదే తప్పు..” అని ఆవేశంగా భర్త దగ్గరైకి వెళ్ళి “పదండి…మన ఊరికి పోదాం.. వీడిని నమ్మి రావడం మనదే తప్పు” అని శంకరం గారి చెయ్యి పట్టుకుని, ఉన్న ఒక్క బేగూ తీసుకుని ఇంటి బయటకు వెళ్ళి రోడ్దెక్కింది. ఆమె వెనకే శంకరం గారు. వచ్చిన చుట్టాలంతా అలాగే చూస్తూ ఉండిపోయారు. తల పట్టుకున్నాడు సూర్య. వాళ్ళ వెనకగా వెళ్ళి “..అమ్మా.. ఉండండమ్మా.. నాన్న.. నువ్వైనా చెప్పు..” అంటూ ఏడుస్తూ బ్రతిమాలుకున్నాడు. వాళ్ళు తిరిగి చూడకుండా, అటుగా వస్తున్న ఆటో ఎక్కి రైల్వే స్టేషన్‌కి వెళ్ళిపోయారు. అలాగే కూలబడిపోయాడు సూర్య…

అనసూయమ్మ సీతతో అంది “…చూసావా అమ్మా.. నేను చెప్పలేదూ.. పల్లెటూరి బైతులు.. ఛీ..ఛీ.. పోనీ వెధవ సంత..”

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here