కలగంటినే చెలీ-21

0
8

[box type=’note’ fontsize=’16’] శ్రీ సన్నిహిత్ వ్రాసిన ‘కలగంటినే చెలీ’ అనే నవలని ధారవాహికగా పాఠకులకు అందిస్తున్నాము. [/box]

[dropcap]సూ[/dropcap]ర్య దిగులుగా కూర్చుని ఆలోచిస్తున్నాడు….

ఆఫీసు నుండి వచ్చి ఇంట్లోకి అడుగు పెట్టగానే ఏదో వెలితి… ఒంటరితనం… సీత, చింటూ బాగా గుర్తుకు వస్తున్నారు. సీతతో మాట్లాడ్డానికి ఫోన్‌ చేద్దామనుకున్నాడు.. మళ్ళీ ఆగిపోయాడు. ఏదో అడ్డుపడుతోంది. సీత జాబ్‌లో జాయిన్‌ అయిందని తెలిసింది. కనీసం తనతో ఆ విషయం చెప్పాలని అనిపించలేదా? ఆ శేఖర్‌గాడు చెప్పేదాకా తనకు తెలియలేదు. అయినా ఆ శేఖర్‌ కలిసినప్పుడు కనీసం తనతో కలవాలని ఉందని చెప్పొచ్చు కదా! తన ప్రస్తావన రాగానే విసురుగా లేచి వెళ్ళిపోయిందట. ఆమెకే అంత ఈగో ఉంటే తనకెంత ఉండాలి?

అద్దంలో ముఖం చూసుకున్నాడు.. పెరిగిన గడ్డం.. లోపలికి పోయిన కళ్ళు. ఇదేనా జీవితం… ఎవరిది తప్పు… తనదా … సీతదా? లేక ఆడిస్తున్న విధిదా? ఏమో…

బాగా తలనొప్పిగా అనిపించింది. కిచెన్‌లోకి వెళ్ళి బ్లాక్‌ టీ పెట్టుకుని తెచ్చుకున్నాడు. నెమ్మదిగా సిప్‌ చేస్తూ ఆలోచిస్తున్నాడు.

చిన్నప్పటి నుండీ ఎంతో అల్లారు ముద్దుగా పెంచిన తల్లిదండ్రులు, తానో సంపాదనాపరుడు అవగానే బాధ్యతలని గుర్తుచేసారు. ఈ బాధ్యతలన్నీ తీరుస్తాననే బాగా చదివించారట. తాను సరిగ్గా చదవకపోయుంటే మానేసేవారేమో! విద్యార్థి దశలో ఉన్నప్పుడు తను ఎన్నో కలలు కన్నాడు. జీవితం సినిమాల్లో చూపించినట్టు కలర్‌ఫుల్‌గా, ఆనందభరితంగా ఉంటుందని ఊహించాడు. కానీ ప్రాక్టికల్‌గా అలా లేదు. పెళ్ళి తర్వాత భిన్న మనస్తత్వాలు తన జీవితంలోకి వచ్చాయి. కొత్త బాధ్యతలు.. కొత్త ఎక్స్‌పెక్టేషన్స్ వచ్చాయి. అవన్నీ తాను మీట్‌ అవ్వాలంటే తన దృక్పథాన్ని మార్చుకోవాలా.. కొత్తగా మారాలా..? భార్యా పిల్లల ఆనందమే తన ఆనందం అనుకోవాలా? అనుకోవాలేమో! అప్పుడే జీవితం సినిమాల్లో చూపినట్టు… నవలల్లో వ్రాసినట్టు ప్రేమమయంగా ఉంటుందేమో! అవును ఉంటుందేమో! మారాలి… తనే మారాలి..! సెల్‌ రింగయింది.

కాల్‌ లిఫ్ట్‌ చేసి “శేఖర్‌.. చెప్పు” అన్నాడు సూర్య

“సూర్యా.. నీకు చెప్పాను కదా.. ఈ రాత్రి నా బర్త్‌డే పార్టీ ఉందని ..”

“ఆ.. మర్చిపోయాను శేఖర్‌… మూడ్‌ కూడా లేదు..”

“అలా అనకు సూర్యా.. మూడ్‌ చేంజ్‌ కోసం రా.. నీకో సర్‌ప్రైజ్‌ కూడా ఉంటుంది…” అన్నాడు శేఖర్‌.

“చూస్తా..” అని ఫోన్‌ కట్‌ చేసాడు.. ఆలోచనలో పడ్డాడు. వెళ్తే మంచిదేమో… కొంచెం రిలీఫ్‌గా ఉంటుంది అనుకున్నాడు. లేచి ఫ్రెషప్‌ అయి డ్రెస్‌ వేసుకున్నాడు. బైక్‌ తీసి శేఖర్‌ రూముకి బయలుదేరాడు. అలా వెళ్ళటం అతని జీవితంలో చేసిన పెద్ద తప్పు అని.. అది అతన్ని మరిన్ని సమస్యల్లోకి నెట్టేస్తుందని ఆ క్షణంలో ఊహించలేకపోయాడు సూర్య!!

***

రోహిణి… అందమైన, పొందికైన అమ్మాయి. కాలేజీలో ఉన్నప్పుడే ఎంతో మంది ప్రేమలేఖలు వ్రాసి విసిగించేవారు. ఆమెను ప్రేమలో దింపడానికి రకరకాలుగా ప్రయత్నించేవారు. కానీ ఎప్పుడూ దారి తప్పలేదామె. చదువు మీద దృష్టి పెట్టి మంచి జాబ్‌లోకి వచ్చింది. ప్రోగ్రామింగ్‌ బాగా చేస్తుందని పేరు. కంప్యూటర్‌ ముందు కూర్చుంటే కదలదు. ఆఫీసులో ఎంత లేటైనా ఉండి పని పూర్తయ్యాకే తన రూముకి వెళ్తుంది. అంత డెడికేషన్‌ ఉన్న అమ్మాయి. కానీ ఎంత కాదనుకున్నా ఆమెకీ చిన్న చిన్న బలహీనతలు ఉన్నాయి. ఆమెకున్న బలహీనత ‘ఐడెంటిటీ క్రైసిస్‌’.

ఆమె అందాన్ని, తెలివితేటలనీ పదిమంది గుర్తించాలని అంతర్లీనంగా ఆరాటపడుతుంది.

సూర్యని తొలిసారి రెస్టారెంట్‌లో చూసింది. తనని తినేసేలా చూస్తున్న అతని కళ్ళల్లోని కోరికను గ్రహించింది. అప్పుడు పక్కనే ఉన్న అన్నయ్యకు చెప్పి తన ఈగోని సంతృప్తిపరుచుకుంది.

ఆ తర్వాత చిత్రంగా సూర్య ఆమెని కంపెనీలో కలిసాడు. నెమ్మదిగా వారి మధ్య పరిచయం పెరిగింది.. అతన్ని ఇష్టపడింది కానీ ఏనాడూ హద్దులు దాటలేదు.

ప్రస్తుతం ఆమె మనసు ఎటూ తేల్చుకోలేని స్థితిలో ఉంది. ఆమె ముందున్న ఇష్యూ… శేఖర్‌!!

చాలా కాలంగా ప్రేమించానని వెంటపడుతున్నాడు. నో చెప్పడానికి పెద్ద కారణాలు కనబడ్డం లేదు. ఎందుకంటే మన చుట్టూ ఉన్న తెలిసిన వాళ్ళలో ‘ది బెస్ట్‌’ అనుకున్న వాళ్ళని పెళ్ళి చేసుకుంటే ‘రిస్క్‌’ తక్కువ కదా.. ఆ కాలిక్యులేషన్‌తో ఆలోచించి కొంచెం చనువు ఇచ్చింది శేఖర్‌కి. అతని గురించి అప్పుడు చెవులకు చేరుతున్న వార్తల గురించి పెద్దగా పట్టించుకునేది కాదు. బేచిలర్‌ స్టేజ్‌లో అవన్నీ మామూలే అని కొట్టి పడేసేది. ఈ మధ్య చాలా సార్లు తన రూముకి రమ్మని శేఖర్‌ బలవంతం చేస్తున్నాడు. కానీ ఆమె ఒప్పుకోవడం లేదు. బాగా అలిగాడు . ‘నా మీద అంత నమ్మకం లేదా?’ అని తీవ్రంగా ఆమెని ప్రశ్నిస్తున్నాడు. క్లోజ్‌గా ఉన్నప్పుడు చెప్పిన కొన్ని విషయాలని ప్రస్తావిస్తూ బ్లాక్‌మెయిల్‌ చేస్తున్నాడు. ముఖ్యంగా… సూర్య గురించి. ఆమెకు, సూర్యకూ మధ్య ఏదో ఉంది అని అప్పుడప్పుడు అనుమానించేవాడు. కానీ రోహిణి గట్టిగా దబాయిస్తే వెనక్కి తగ్గేవాడు.

అయితే ఈ సారి బర్త్‌డే పార్టీకి రూముకి రమ్మని ఆమెను అడిగాడు. ‘రాకపోతే… మనిద్దరికీ ఇదే ఆఖరు’ అని అంటున్నాడు.

అతని రూముకి.. బర్త్‌డే పార్టీకి.. వెళ్ళాలా.. వద్దా.. అన్న డైలమాలో పడింది రోహిణి. ఆలోచించి చివరికి… ఒక నిర్ణయం తీసుకుంది.

ఆ నిర్ణయమే తన పీకల మీదకి వస్తుందని ఊహించలేకపోయిందామె!!!

***

పార్వతమ్మ దిగాలుగా కూర్చుని ఉంది. ఆమె మనసు బాగా గాయపడి ఉంది.

ఊళ్ళో అమ్మలక్కలు ఒకటే సూటిపోటి మాటలు పదే పదే ఆమె చెవుల్లో మార్మోగుతున్నాయి

“ఏమ్మా.. నీ కొడుకు నిన్నెప్పుడో మర్సిపోనాడు ..” అని,

“అదన్నావు.. ఇదన్నావు.. ఐదరాబాద్‌ఎల్లి ఎంటనే వచ్చీసినావు…” అని,

“నీ కోడలు… మనవడు … ఒక్కసారైనా ఈ ఊరు ముఖం సూసినారా..” అని,

ఇలా రకరకాలుగా. ఊరి వాళ్ళకేముంది మాటలతో ఎదుటి వాళ్ళాని గుచ్చి గుచ్చి ఆనందించడమే కదా పని. కళ్ళల్లో నీళ్ళు తిరుగుతుండగా వంటింట్లో కూలబడింది. శంకరం గారు రచ్చబండ దగ్గరికి వెళ్ళి ఇంకా రాలేదు.

పెళ్ళిళ్ళు చేసుకున్న కూతుళ్ళు కాపురానికి వెళ్ళిపోయారు. అప్పుడప్పుడు భర్తలతో వచ్చి తల్లిదండ్రులను చూసి, ఒక పూట ఉండి వెళతారు. అప్పుడు కొంచెం ఇల్లు సందడిగా ఉంటుంది. వాళ్ళు వెళ్ళిపోయాక మళ్ళీ మామూలే! ఒంటరితనం!

సూర్యం మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నారు ఆ దంపతులు. అతడు బాగా చదువుతుంటే… మంచి ఉద్యోగం, అదీ తమ ఊరికి దగ్గరర్లో ఉన్న సిటీ లోనే తెచ్చుకుని, తమకు దగ్గరగా సెటిల్‌ అవుతాడని కలలు గన్నారు. తమ ప్రాంతపు అమ్మాయిని పెళ్ళిచేసి కాపురం పెట్టిద్దాం అని ఆశ పడ్డారు. అయితే చదువు అనేది సూర్యను హైదరాబాద్‌ దాకా తీసుకెళ్ళింది. అతను కూడా హైదరాబాద్‌కే చెందిన సీతను పెళ్ళి చేసుకున్నాడు. మొదట ఈ విషయాన్ని జీర్ణించుకోలేకపోయారు. కానీ సూర్య ఇష్టానికి విలువిచ్చి, అతని ఆనందమే తమకు ముఖ్యం అని అంగీకరించారు. అంతవరకు బాగానే ఉంది. ఆ తర్వాతే సీన్‌ మారిపోయింది. సీత తల్లిదండ్రులు కూడా ఆటోమేటిగ్గా పిక్చర్‌లోకి వచ్చారు కాబట్టి పరిస్థితులు మారిపోయాయి.

సూర్య అత్తమామలకు దగ్గరగా ఉన్నాడు కాబట్టి సహజంగా వాళ్ళ కంట్రోల్‌లోకి వెళ్ళిపోయాడు. ఇది పార్వతమ్మకు, శంకరం గారికి రుచించలేదు. ‘తాము పెంచి పెద్ద చేసిన ఒక మొక్క వృక్షంగా మారి ఇంకొకరికి నీడ ఇవ్వడం’ వాళ్ళకి అశనిపాతం అయింది. క్రమంగా ఆశలన్నీ వదిలేసుకున్నారు. సూర్య కూడా తన పరిస్థితుల బట్టి వాళ్ళను పెద్దగా పట్టించుకునేవాడు కాదు. దాంతో మరింత ముభావంగా అయిపోయారు ఆ వృద్ధ దంపతులు. ఆ రకంగా సూర్యకు, వాళ్ళకు మధ్య దూరం పెరిగిపోయింది. పైగా సీత కూడా పెద్దగా వాళ్ళని పట్టించుకోకపోవడంతో ఆ అగాధం లోతు మరింత పెరిగింది. ఏం చేస్తాం.. జరిగిన తప్పులని మళ్ళీ సరి చేయలేము… కరిగిన కాలాన్ని మళ్ళీ వెనక్కి తేలేము కదా! అప్పుడే బయటనుండి వచ్చిన శంకరం, భార్య దిగులుగా కూర్చుని ఉండటం చూసి బాగా కళవళ పడిపోయారు

“ఎందుకు పార్వతీ… అలా ఉన్నావు?” ప్రేమగా అడిగారు. కళ్ళల్లోంచి నీరు కారుతుండగా “ఏమీ లేదండీ.. బాబు గుర్తొచ్చాడు.. అందుకని” అంది. వుక్కు మనిపించింది శంకరానికి. “పోనీలే.. క్కడ వాడు హాయిగానే ఉన్నాడు కదా..” ఓదార్చారు. “…అయినా ఇక్కడ మనకేం తక్కువ.. చుట్టూ అంతా మన శ్రేయోభిలాషులు.. అప్పుడప్పుడు మన అమ్మాయిలు వస్తున్నారు..” అన్నారు.

“అది బాగానే ఉందండీ.. మనం బాగానే ఉన్నాం… కానీ ఈ చుట్టుపక్కల వాళ్ళు నన్ను మాటలతో చంపేస్తున్నారు…”

“బాధపడే వాళ్ళుంటే బాధించే వాళ్ళు ఎప్పుడూ ఉంటారు.. వాళ్ళనెప్పుడూ పట్టించుకోకు.. మనం వాళ్ళ ఇంటి విషయాల్లో తలదూర్చడం లేదు కదా… ఆ సంస్కారం వాళ్ళకుండాలి” అన్నారు ఆవేదనగా. పార్వతమ్మ గారికి అర్థమైంది… తను బాధపడటమే కాకుండా.. భర్త మనసు కూడా పాడు చేస్తున్నానని.

వంట గది లోకి వెళ్ళి ప్లేట్లో అన్నం తీసుకొచ్చి శంకరం గారికి వడ్డించింది .

ఆయన భోంచేస్తూ “చూడు పార్వతీ.. మనం గతంలో ఒక సారి అబ్బాయి ఇంటికి వెళ్ళాం. అప్పుడు జరిగిన సంఘటనలు నీకు గుర్తు ఉండే ఉంటాయి. ఆనాడు మనం కొంచెం కంట్రోల్‌ చేసుకుని ఉంటే పరిస్థితులు వేరుగా ఉండేవేమో. నీకు కోడలికి మధ్య సయోధ్య కుదిరేదేమో. కానీ అప్రయత్నంగా ఆవేశానికి లోనయ్యాము. గొడవపడి వచ్చేసాము. ఆ రోజుతో ఏర్పడిన అగాధాన్ని ఈనాటి దాకా పూడ్చలేకపోయాం. ఇక ఆ విషయాన్ని దేవుడికే వదిలేద్దాం. కాలమే ఈ సమస్యకి పరిష్కారం చూపిస్తుంది. నచ్చితే వాళ్ళే మన దగ్గరికి వస్తారు. లేదూ వాళ్ళు రమ్మంటే మనమే వెళ్దాం. అప్పటిదాకా.. మనం ఇవన్నీ పక్కన పెట్టి శేష జీవితాన్ని హాయిగా గడిపేద్దాం. సరేనా.. ఇంకెప్పుడూ బాధపడకు. మన సూర్య, వాడి కుటుంబం హాయిగా ఎక్కడో ఒక దగ్గర ఉంటే చాలదా…” అని అన్నారు. భర్త మాటలతో పార్వతమ్మ పూర్తిగా బాధ నుండి తేరుకుంది. కొత్త ఆలోచనలు ఇచ్చిన రిలీఫ్‌తో సంతృప్తిగా నవ్వింది. భోజనం ప్లేటు తీసేస్తూ “సరేనండీ ..అలాగే” అని వంటగదిలోకి వెళ్ళిపోయింది.

“హమ్మయ్య…” అనుకుని మంచం మీద నడుం వాల్చారు శంకరం మాష్టారు.

***

సూర్య బైక్‌ తీసి స్టార్ట్‌ చేసాడు. శేఖర్‌ కొంచెం లేటుగా రమ్మన్నాడు. అందుకని నిదానంగా బయలుదేరాడు. రాత్రి పది దాటడంతో రోడ్లన్నీ కొంచెం ఖాళీగా ఉన్నాయి. దాదాపు అరగంట డ్రైవ్‌ చేసాక శేఖర్‌ అద్దెకు ఉంటున్న ఇంటికి చేరుకున్నాడు. అతని ఇల్లు సిటీకి కొంచెం దూరంగా ఉంది. అద్దె తక్కువని ఇక్కడ ఉంటాడు. పైగా అతని అసాంఘిక కార్యక్రమాలకి ఇక్కడైతే పెద్ద అడ్డు ఉండదు కదా..!

బైక్‌ బయట పార్క్‌చేసి ఇంట్లోకి వెళ్ళాడు సూర్య. చిత్రంగా… చాలా నిశ్శబ్దంగా ఉంది అక్కడ!

సూర్య ఆ ఇంట్లోకి అడుగు పెట్టగానే డోర్‌ లాక్‌ అయింది. ఎవరో వెళిపోతున్న చప్పుడు. డౌట్‌ వచ్చి శేఖర్‌ సెల్‌కి కాల్‌ చేసాడు. రింగ్‌ అవుతుంది కానీ వాడు లిఫ్ట్‌ చెయ్యడం లేదు. చుట్టూ పరిసరాలని గమనించాడు. హాల్లో వస్తువలన్నీ చిందరవందరగా పడి ఉన్నాయి. అప్పటికే డ్రింక్‌ చేసినట్టుగా టీపాయ్‌ మీద ఖాళీ గ్లాసులు.. స్టఫ్‌ ఉన్నాయి. అలాగే చూసుకుంటూ బెడ్‌రూము వైపు వెళ్ళాడు. అంతే… గుండెలు అవిసిపోయాయి సూర్యకు.

అక్కడ.. బెడ్‌ మీద.. అడ్డంగా…. నిర్జీవంగా పడి ఉన్నాడు బాస్‌ రాజీవ్‌. అతని గుండెల్లో దిగి ఉన్న కత్తి!! చిందిన రక్తం చారికలు.. వెంటనే పారిపోదామని మెయిన్‌ డోర్‌ వైపు పరుగెత్తాడు. కానీ లాక్‌ ఓపెన్‌ కాలేదు. పేనిక్‌ అయిపోయాడు. తననెవరో ఇరికించారని అర్థమై చెమట్లు పట్టాయి సూర్యకు. గుండె దడ హెచ్చింది. …..

ఓపిక లేక అక్కడే కుర్చీలో కూలబడిపోయాడు. కాసేపటికి డోర్‌ తెరుచుకుని పోలీసులు లోనికి వచ్చారు… వాళ్ళతో పాటే శేఖర్‌!

“రేయ్‌ ఎక్కడకు వెళ్ళావురా నువ్వు …?” అంటూ విరుచుకు పడ్డాడు వాడి మీద. శేఖర్‌ అదేమీ పట్టనట్టు “ఎస్సై గారూ …శవం బెడ్రూములో ఉంది” అని చెప్పాడు.

ఎస్సై “మిస్టర్‌ సూర్యా.. మిమ్మల్ని అరెస్ట్‌చేస్తున్నాము..” అని పక్కనే ఉన్న కానిస్టేబుల్స్‌కి కళ్ళతోనే ఆర్డర్స్‌ ఇచ్చాడు. వాళ్ళు సూర్యను అదుపులోకి తీసుకున్నారు. తర్వాత జరగాల్సిన ఫార్మాలిటీస్‌ అన్నీ పోలీసులు చేసుకోసాగారు. రాజీవ్‌ శవం దగ్గర ఆధారాలు అవీ సేకరించుకుని, బెడ్రూం సీజ్‌ చేసారు. సూర్యను స్టేషన్‌కి షిఫ్ట్‌ చేసారు కానిస్టేబుల్స్‌. ఎస్సై “శేఖర్‌గారూ.. హత్య జరగ్గానే మాకు ఇన్‌ఫార్మ్ చేసినందుకు థాంక్స్‌. మీరు స్టేషన్‌కి వచ్చి జరిగినది మొత్తం కంప్లెయింట్‌ వ్రాసి ఇవ్వాల్సి ఉంటుంది” అని చెప్పి వెళ్ళిపోయాడు. శేఖర్‌ వాళ్ళతో పాటే స్టేషన్‌కి వెళ్ళాడు.

ఒక పేపర్‌ మీద ‘తాను బర్త్‌డే పార్టీకి రాజీవ్‌ని, సూర్యను పిలిచానని… వాళ్ళని రూములో ఉంచి తను కేక్‌ తీసుకురావడానికి బయటకు వెళ్ళానని…. తిరిగి వచ్చేటప్పటికి రాజీవ్‌ని సూర్య చంపేసాడ’ని కంప్లెయింట్‌ వ్రాసి ఇచ్చాడు శేఖర్‌.

ఎఫ్‌.ఐ.ఆర్‌. ప్రిపేర్‌ చేసుకుని “సరే …అవసరమైతే పిలుస్తాం.. వెంటనే రావాలి” అని చెప్పి శేఖర్‌ని పంపించేసాడు ఎస్సై.

‘హమ్మయ్య.. తను ప్లాన్‌ చేసినట్టే సూర్య ఇరుక్కున్నాడు’ అని వక్రంగా నవ్వుకుంటూ అక్కడి నుండి బయటపడ్డాడు శేఖర్‌!!!

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here