కలల అలలపై

0
14

[భానుశ్రీ తిరుమల గారు రచించిన ‘కలల అలలపై’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము.]

[dropcap]నే[/dropcap]నది ముందెప్పుడు చూడని ప్రదేశంలా ఉంది. ఆ ప్రాంగణం చాలా విశాలంగా ఉంది. చుట్టూ ఆకాశాన్నంటుతున్నట్టున్న ఆశోక చెట్లు, ఇంకా ఎన్నో జాతుల చెట్లతో ఆ పరిసరాలన్నీ పచ్చదనం పరుచుకున్నట్టుంది. అంతా నిర్మానుష్యంగా ఉంది, కానీ అక్కడక్కడ నాకు పరిచయమే లేని మొహాలేవో చిరునవ్వుతో పలకరిస్తూ నా పక్కనుంచి పోతున్నాయి. అది ఉదయమా, మధ్యాహ్నమా అనేది నేను తేల్చుకోలేక తికమక పడుతూ ముందుకు నడుస్తున్నాను. కొంచెం దూరంలో ఓ గుడి ప్రవేశ ద్యారం ఎత్తుగా కనిపిస్తోంది. ఇదేదే గుడిలా ఉందే అనుకుంటూ లోపలికి వెళ్లాను. దూరం తరుగుతున్నట్టు లేదు. కొంచెం దూరంలో ఆకాశం లోకి దూసుకు పోతున్నట్టున్న శిఖరం. అమ్మ వారి గుడిలా అనిపించింది.

నేను అమ్మ చేయ పట్టుకొని ముందుకు నడుస్తూ ఉన్నాను. గుడి దూరంగా వెనక్కి పోతున్నట్టనిపిస్తుంది. ‘అయ్యో !ఎలా ఇప్పుడు నేనక్కడికి చేరేలోపు గుడి మూసేస్తారేమో!’ నాలో నేను మదన పడుతున్నాను.

“వేగంగా పదమ్మ, గుడి మూసేస్తారు” అని అమ్మ అదిలింపు. ఇంకొంచెం వేగంగా నడిచి చివరికి గుడికి చేరుకున్నాం. ఎంత వేగంగా అక్కడికి చేరిన బాగా ఆలస్యమైనట్టుంది. మధ్యాహ్నమైనట్టు అనిపిస్తుంది. అయ్యో! అప్పుడే గుడి మూసేసినట్టున్నారు. నేనూ, అమ్మ చాలా నిరుత్సాహపడిపోయాం. చివరి ప్రయత్నంగా ఆ గుడి పూజారిని దగ్గరకు పోయి చాలా బ్రతిమాలాం, చాలా దూరం నుండి వచ్చామని, ఒక్కసారి అమ్మవారి దర్మనం ఇప్పించమని, కానీ పూజారి గారు గుడి ఇక సాయంకాలం వరకు తెరవకూడదని చెప్పి, ఏదో పని ఉన్నట్టు బయటకి విసురుగా వెళ్లిపోయాడు.

ఈ లోపల ఎక్కడినుండి వచ్చాడో నా వయసు ఉన్న ఓ చిన్న అబ్బాయి.. మమ్మల్ని చూసి పలకరింపుగా ఓ చిరునవ్వు నవ్వి, రండిటు అన్నట్టు సైగ చేసినట్టనిపించి, ఆ అబ్బాయి అనుసరిస్తూ వెళ్లాం. ఆ అబ్బాయి గుట్టు చప్పుడు కాకుండా గుడి తలుపులు తెరిచి మాకు అమ్మ వారి దర్శనం చేయించాడు. తీర్థ ప్రసాదాలు ఇచ్చాడు.

ఈ లోగా బయటకు వెళ్లిన పూజారి గారు తిరిగి వస్తున్నారు. నా గుండెల్లో రాయి పడింది, పాపం! ఆ అబ్బాయికి నా వలన చీవాట్లు పడతాయేమో!, ఇప్పుడెలా అని వాపోతూ ఉండగా.. పూజారిని వెనుక నుండి ఎవరో పిలిచారు,

మళ్లీ ఆయన వెనక్కి వెళ్లిన ఆ సమయంలో, నేను ఆ అబ్బాయికి తాళం వేసేయి అన్నట్టు సైగ చేసాను. అదే అదనుగా ఆ అబ్బాయి గర్భగుడి తలుపులను మూసి తాళం వేసేసి, తాళాలు ఉంచాల్సిన చోటులో ఉంచి బుద్ధిగా పోయి ఓ స్తంభం దగ్గర కూచున్నాడు. పూజారి గారు తిరిగి వచ్చి మమ్మల్ని చూసి “ఇంకా మీరు వెళ్లలేదా.. సరే ఇక్కడే ఉండండి.. సాయంత్రం దర్శనం చేసుకుందురు” అని చెప్పి మరికొంత ప్రసాదం ఇచ్చి వెళ్లి పోయాడు. ఆ చిన్నబ్బాయి పూజారి గారి మనవడనుకుంటాను.. “ఓరేయి! రారా ఇంటికి పోదాం” అనే ఆయన పిలుపుతో, మా వైపు చూసి వీడ్కోలు గా చేయి ఊపుతూ బుద్దిగా పూజారి వారిని అనుసరించాడు. “ఇంకొంచెం సేపు ఇక్కడే ఉందాం అమ్మా!” అమ్మని నేను అడుగుతున్నాను.

అప్పుడే “పాపా! లేచావా లేదా? కాలేజీకి టైమవుతుంది” అన్న అమ్మ కేకతో నాకు మెలకువ వచ్చింది. అయ్యో ఇదంతా కలా, అబ్బా! ఎంత మంచి కలో కదా అనుకుని, ఆ కలని మరిచిపోతానేమోనని నోటు పుస్తకంలో రాసి పెట్టుకున్నాను. ఆ నోటు పుస్తకం ఇప్పటికీ నా దగ్గర ఉంది.

***

“అమ్ములూ! తొందరగా రెడీ అవ్వు, పెళ్లి చూపులకొస్తున్న వాళ్లు ఇంకో గంటలో ఇక్కడ ఉంటారట” అన్న అమ్మ పిలపుతో నేను స్నానాల గది వైపు నడిచాను.

నా పేరు చెప్పలేదు కదూ, నా పేరు సుజిత. ముద్దు పేరు అమ్ములూ. అమ్మ సుమిత్ర, నాన్న పేరు రాఘవ. వారికి నేనొక్కతినే కూతుర్ని. పాతికేళ్ల క్రితం పుట్టాను. నాన్న గంటూరులో ఓ ప్రైవేట్ కంపెనీలో ఎకౌంటెంట్‌గా గత ముప్పై ఏళ్లుగా ఉద్యోగం చేస్తున్నారు. అమ్మ గృహకర్త. కర్మ, క్రియ కూడా. నేను బి.ఎడ్ చేసి స్తానిక గవర్నమెంట్ స్కూల్లో టీచర్‌గా పనిచేస్తున్నాను. నాకని కొన్ని పెళ్లి సంబంధాలు చూసారు కానీ, వివిధ కారణాల వల్ల అవి కార్యరూపం దాల్చలేదు. ఎక్కడ రాసిపెట్టుందో? అయినా ఇప్పటికే పుట్టి ఉంటాడుగా, చూద్దాం అనుకొని సరిపెట్టుకునే దాన్ని.

అయితే ఈసారి చూడ్డానికి వస్తామన్న వారు, నాన్నకి దూరపు బంధువులట.

ఆదివారం రానే వచ్చింది. వాళ్లు వచ్చారు, పెళ్లికొడుకు అందంగా, బుద్దిమంతుడిలా కనిపించాడు. పేరు భువన్ అట. అయితే ఈసారి ఈ తంతు ఇరువైపుల పెద్దవారు ముందుగా మాట్లాడి ఓ ఒప్పందం కుదిరిన తరువాతే జరుగుతోంది.

పెళ్లికొడుకు భువన్ నాతో ఓసారి మాట్లాడడానికి పెద్దలకు అనుమతి అడిగాడు. మా పెద్దలు కూడా అనుమతించారు.

మేమిద్దరం అందరికీ కొంచెం దూరంగా పెరడులోకి పోయి కూచున్నాం. భువన్ అక్కడి గోడకి వేళ్లాడుతున్న ఓ ఫోటోని తదేకంగా చూస్తున్నాడు. అది మా ఫ్యామిలీ ఫోటో.

“ఏమిటి! ఆ ఫోటో వైపు అంత తదేకంగా చూస్తున్నారు” అన్న నా మాటకు ఈ లోకంలోకి వచ్చాడు భువన్.

“ఏం లేదండీ.. అయినా మీ ఊళ్లో ఫోటో చూడటం కూడా తప్పేనా ఏంటీ?” కొంటెగా అడిగాడు భువన్.

“హహహ, అది కాదు మిమ్మల్ని అంతగా కట్టిపడేసిన అంశం ఆ ఫోటోలో ఏమిటా అని” నవ్వుతూ అడిగాను నేను.

“ఓ అదా, ఆ క్రింద కూచున్న రెండు జడల అమ్మాయిని నేను ఎక్కడో చూసినట్టుంటేను” అన్నాడు భువన్.

“తనని మీరు ఇంతకు ముందు ఎక్కడా చూసే అవకాశమే లేదని నేను రాసివ్వగలను, ఎందుకంటే తాను ఇప్పుడే ఈ రోజే మీకు కనిపించింది” అన్నాను.

“ఓ! అది మీరేనా, ఎక్కడ చూసానో ఇప్పుడు గుర్తుకు వచ్చిందిలెండి. సమయం వచ్చినప్పుడు చెబుతాను.”

అయితే భువన్ ముఖం మీద ఓ కొత్త ఆనందమేదో మెరిసినట్టనిపించింది నాకు.

ఇక వెళ్దామా అన్నట్టు లేచి నిల్చున్నాడు భువన్. నేను భువన్‌ని ఆశ్చర్యంగా చూస్తూ, ‘అసలితను నాతో ఏం మాట్లాదామని వచ్చాడు? ఓ పాత ఫోటో గురించి వివరాలడిగి పోతున్నాడు’ అనుకుంటూ అతని అడుగులో అడుగులేసుకుంటూ అనుసరించాను.

మా పెళ్లి చూపుల సినిమా మధ్యలో వివిధ కారణాల వలన కొంత విశ్రాంతి తీసుకున్నా తరువాత ఊపందుకొని అధ్బుతమైన సన్నివేశాలతో సాగి పెళ్లి అనే పతాక సన్నివేశంతో సుఖాంతమైంది.

కొత్త పెళ్లికూతురుగా నేను అత్తవారింటిలో అడుగు పెట్టిన తొలినాడే, నాకూ చిత్రంగా ఓ పాత ఫోటో ఆశ్చర్యానికి గురి చేసి ఆకట్టుకుంది. అప్పుడే ఆ ఫోటో గురించి అడిగితే బాగుండదని మిన్నకుండి పోయాను.

మా అత్తవారి ఊరి ఆచారం ప్రకారం కొత్త జంటలెవరైనా సరే ఊరి అమ్మవారిని మొదటిగా దర్శించి పూజలు చేసుకోవాలి.

ఆ రోజు సాయంకాలం మేమిద్దరం గుడికి బయలుదేరాం. నేను గుడి ప్రాంగణలోకి అడుగు పెట్టిన వెంటనే, ఆ పరిసరాలు, గుడి చిరపరిచితంగా అనిపించాయి. నేను బుద్ధెరిగిననుండి ఎప్పుడూ ఆ ఊరికి గాని, గుడికి వచ్చినట్టు గుర్తులేదు.

అమ్మవారి దర్శనం, పూజ అయ్యింది. ఇద్దరం ఏకాంతంగా దూరంగా ఉన్న మండపం లోకి పోయి కూచున్నాం. దేశ దిమ్మరి సూర్యునికి ఇంకా తనివి తీరినట్టులేదు, గ్రుంకనా వద్దా అన్నట్టు మబ్బుల మధ్య వెలిగి నలుగుతున్నాడు. బంగారు రంగు వెలుగు మమ్మల్ని ఆశీర్వదిస్తున్నట్టు మాపై తారాడుతోంది. చల్లని గాలి ఆహ్లదకరంగా వీస్తోంది.

కొండపైన ఉన్న వేంకటేశ్వర స్వామి గుడి నుండి ‘కలగంటి, కలగంటి ఇప్పుడిటు కలగంటి’ అన్న అన్నమయ్య కీర్తన మంద్రంగా వినిపిస్తోంది. అన్నీ కలగలిపి ఆ వాతావరణం చాలా ఆహ్లదకరంగా అనిపించింది. మా ఇద్దరి మధ్య మౌనం రాజ్యమేలుతోంది, ఆ మౌనాన్ని భంగపరుస్తూ నేను భువన్‌తో “భువన్ మీరు ఆటపట్టించనంటే ఓ మాట చెబుతాను” అన్నాను.

“ఏమిటో ఆ మాట సెలవియ్యండి! ఆటపట్టించాలో లేదో అప్పుడు చెబుతాను” చమత్కరించాడు భువన్.

“నేను ఈ గుడిని, మిమ్మల్ని చాలా ఏళ్లక్రితం కలలో చూసాను” అన్నాను

“ఔనా! నన్ను, గుడిని కలలోనా! ఇంట్రెస్టింగ్, ఇంకా..” ఆత్రంగా అడిగాడు భువన్.

“ఓపికగా వినాలి సుమా! ఓ అందమైన కథలాంటి సుదీర్ఘమైన కల మరి, చెప్పమంటరా” ఊరిస్తున్నట్టు అడిగాను నేను.

“ఔనా! ఇంకెందుకు ఆలస్యం చెప్పేయండి ప్లీజ్” భువన్ అభ్యర్థిస్తున్నట్టు మొహం పెట్టాడు.

అప్పుడు నాకు కాలేజీ రోజుల్లో వచ్చిన సుధీర్ఘమైన ఆ కలని వివరించాను. నోటు బుక్‌లో వ్రాసుకున్న విషయం కూడా చెప్పి ఇంటికి వెళ్లిన వెంటనే చూపిస్తానని మాటిచ్చాను.

ఇద్దరం ఇంటికి చేరుకున్నాము. మా అత్తయ్య వాళ్లు వంటపనుల్లో బిజీగా ఉన్నారు. ఫ్రైష్ అయ్యి కాఫీ తాగుతు ఇద్దరం కూచున్నాం, ఇప్పుడే వస్తాను అని లోపలికి వెళ్లి ఓ పాత నోటు బుక్ పట్టుకు వచ్చాడు. ఓ పేజీ తెరిచి నా ముందు చదవమని ఉంచాడు.

“ఏమిటండీ ఇది” ఆశ్చర్యంగా అడిగాను.

“నీవొకసారి చదువు, నీకు అర్థం కాకపోతే చెబుతాను” అని చెప్పి పక్కన కూచున్నాడు భువన్.

నేను చదవటం మొదలు పెట్టాను.

“ఆ రోజు ఉదయం నేను తాతయ్యతో కలిసి గుడికి వెళ్లాను. మధ్యాహ్నం అవుతుండడం వలన తాతయ్య గుడి తలుపులు మూసేసారు. అప్పుడే నా వయసున్న ఓ అమ్మాయి వాళ్లమ్మనుకుంటాను, ఆమె చేయి పట్టుకుని తొందర, తొందరగా గుడిలోపలికి వస్తోంది. రెండు జడలతో పట్టు పరికిణీలో చూడ ముచ్చటగా, చారడేసి కళ్లతో మంచి కళగా ముద్దుగా ఉంది. తాతయ్య గుడి తలుపులు మూసేయడం వలన, వాళ్ళొచ్చి తాతయ్యకు అడుగుతున్నారు, ఓసారి గుడి తలుపులు తెరిస్తే దర్శనం చేసుకుంటాం అని.

తాతయ్య కుదరదని చెప్పి బయటకు వెళ్లిపోయారు. నాకు పాపం అనిపించి తాతయ్య అటు వెళ్లగానే, అక్కడే ఉన్న తాళాలు తీసి గర్భగుడి తలుపులు తీసి వాళ్లకి దర్శనం చేయించి ప్రసాదం కూడా ఇచ్చాను. ఈలోపు తాతయ్య వస్తున్న అలికిడికి ఆ అమ్మాయి కంగారు పడటం చూసాను. బహుశా నన్ను తాతయ్య తిడతారనేమో. ఇటుగా వస్తున్న తాతయ్యని వెనుక నుండి ఎవరో పిలవటంతో తాతయ్య మళ్లీ వెనక్కి వెళ్లారు. అప్పుడు ఆ అమ్మాయి తాళం వేసేయి అన్నట్టు ఆత్రుతతో నాకు సైగ చేసింది. నేను తాళం వేసేసి ఆ తాళాలు యథా స్థానంలో పెట్టేసాను. అక్కడికి వచ్చిన తాతయ్య వాళ్లతో ఏదో మాట్లాడి నన్ను తన వెంట తీసుకు పోయారు. నేను వాళ్లకి వీడ్కోలు చెబుతూ బయటకి నడస్తున్నాను.

ఇంతలో “బారెడు పొద్దెక్కింది ఏమిటిరా ఆ మొద్దు నిద్ర, కాలేజికీ పోవా, లేవు” అన్న అమ్మ అరుపుతో ఈ లోకానికి వచ్చాను. భువన్”

కథ లాంటి ఆ కల చదివిన తరువాత నేను ఆశ్చర్యానికి లోనయ్యాను. ఇద్దరికి ఒకే లాంటి కల. ఎలా సాధ్యం? అనుకుంటున్న నన్ను భువన్ తట్టి

“ఆ రోజు మీ ఇంట్లో ఉన్న మీ ఫ్యామిలీ ఫోటోని నేను తదేకంగా చూస్తుంటే అడిగావు కదా ఏం చూస్తున్నారని, ఆ ఫోటోలో ఉన్న రెండు జళ్ల అమ్మాయినే, అంటే నిన్నే ఆ రోజు కలలో చూసాను. అప్పుడే చెబితే థ్రిల్ మిస్ అవుతావని పెళ్లి తరువాత చెబుదామని ఊరుకున్నాను” ఆనందంతో తబ్బిబవుతూ చెబుతున్నాడు భువన్.

నేను భువన్‌ని ఆరాధనా పూర్వకంగా చూస్తూ, చిరునవ్వుతో “అంటే ఇక నా నోట్ బుక్ మీకు చూపించాల్సిన అవసరమే లేదనుకుంటాను” అన్నాను.

“అదెలా కుదురుతుంది? నేనంటే ఏదో సింపుల్‌గా నా కలని రాసుకున్నాను కానీ, కవయిత్రివైన నీవు కన్న కల, తప్పక నా కల కన్నా అందంగా, విపులంగా ఉండి ఉంటుంది, తప్పక చదవాల్సిందే” అని, వెంటనే నా లగేజీ లోని ఆ నోటు బుక్ ని తీసి ప్రేమ కధలాంటి కలని చదివాడు భువన్.

“చెప్పానా! నీ కల నా కలకన్నా అందంగా ఉంటుందని” కితాబిచ్చాడు భువన్.

“అది సరే నన్ను కలలో చూసాననన్నావు, ఎలా ఇప్పటిలానే అప్పుడూ ఉన్నానా?” అమాయకంగా అడిగాడు భువన్.

“లేదు మహాశయా! మీరు మా ఇంటిలోని పోటోనుండి నన్ను కనుగొన్నట్టే, నేను మీ ఇంటిలో ఉన్న పాత ఫోటో బట్టే మిమ్మల్ని కనిపెట్టాను” నేను చిలిపిగా బదులిచ్చాను.

అటు ఇటు చూసి ఎవరూ లేరని నిర్థారించుకున్న భువన్ నేను తేరుకునే లోపు ముచ్చటగా నా నుదిటిపైన మొదటి ముద్దు పెట్టేసాడు. నేను రెండింతలుగా బదులు తీర్చుకుందామని అనుకుంటుండగా అటుగా ఎవరో వస్తున్న అలకిడై ఏమీ జరగలేదన్నట్టు భువన్‌కి దూరంగా పోయి నిలుచున్నాను.

ఏం చేస్తాం! నా ముద్దు మురిపాలను భువన్‌కి కానుకగా ఇవ్వడానికి సూరీడు నిద్రపోయిన కొన్ని గంటలకి కానీ కుదరలేదు.

కథలాంటి మా కలలు సాకారమైనందుకు మేము ఆనందపడని క్షణాలు లేవు. ఆ కలల అలలపై మా జీవన నావ పయనిస్తూ చాలా దూరాన్ని సునాయాసంగా దాటింది. మాకిప్పుడు ఇద్దరు పిల్లలు. ఇప్పటికీ ఆ నోట్ బుక్‌లను, కలలను భద్రంగా దాచిపెట్టుకున్నాం అల్మారాలోనూ, గుండె గదుల్లోనూ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here