కలమే ఆయన ఆయుధం – ‘కలం యోధుడు శ్రీ కోటంరాజు రామారావు’ పుస్తక సమీక్ష

6
8

[డా. సి. భవానీదేవి రచించిన ‘కలం యోధుడు శ్రీ కోటంరాజు రామారావు’ అనే పుస్తకాన్ని సమీక్షిస్తున్నారు శ్రీమతి అల్లూరి గౌరీలక్ష్మి.]

[dropcap]ఇ[/dropcap]ది, భారత స్వాతంత్ర్యోద్యమ కాలంలో తన వ్యాసాలు, మరియు సంపాదకీయాల ద్వారా దేశ ప్రజలలో స్వాతంత్ర్య కాంక్షను రగిలించిన ప్రముఖ పాత్రికేయుడు మరియు స్వాతంత్ర్య సమరయోధుడు అయిన శ్రీ కోటంరాజు రామారావుగారి జీవిత చరిత్ర. ఈయన ముఖ్యంగా జవహర్‍లాల్ నెహ్రూ గారి కుటుంబం నడిపిన ‘నేషనల్ హెరాల్డ్’ అనే ఆంగ్లపత్రికకి ప్రధాన సంపాదకుడిగా, నిస్వార్థంగా పనిచేసిన ఉత్తమ పాత్రికేయుడు. అనేక ఆంగ్ల దినపత్రికలలో పనిచేసిన తెలుగువాడు. శ్రీమతి భవానీదేవి గారు కోటంరాజు వారి ఆడపడుచు. శ్రీ కోటంరాజు రామారావుగారు ఆమెకు పెదత్రండ్రి వరస. ఆమె తన తండ్రిగారి కోరికపై శ్రీ రామారావు గారి జీవిత చరిత్ర రాశారు.

పాత్రికేయుడిగా మనగలగాలంటే ఓర్పు కావాలనీ, ఎక్కువ శ్రమ పడాలనీ, వృత్తిని వీరోచిత కార్యంలా భావించాలనీ తలచేవారు శ్రీ రామారావుగారు. బ్రిటిష్ వారిని మన దేశం నుంచి తరిమికొట్టే యుద్ధంలో వారు జర్నలిజం వృత్తిని సాధనంగా ఎంచుకున్నారు. పలు సందర్భాల్లో మహాత్మాగాంధీ, సుభాష్ చంద్రబోస్, సర్దార్ పటేల్, ఇందిరాగాంధీ, బీ.ఆర్. అంబేద్కర్, డా. రాంమనోహర్ లోహియా రామారావుగారికి వార్తాపత్రికలపట్ల గల అంకితభావాన్నీ, నిబద్ధతనీ శ్లాఘించారు.

1897లో ప్రకాశం జిల్లా చీరాలలో జన్మించారు శ్రీ రామారావుగారు. తండ్రి శ్రీ నారాయణరావు పంతులుగారు తెలుగు, సంస్కృత పండితులు. తల్లి వెంకాయమ్మ గారు స్వాతంత్ర సమరంలో పాల్గొన్న మహిళ. అలా తల్లిదండ్రుల నుండి పాండిత్యం, త్యాగనిరతి వారసత్వంగా అందుకున్నారు. ఆ శక్తి వారి వ్యక్తిత్వాన్ని ఉదాత్త మరియు ఉత్తమ ప్రస్థానం వైపు నడిపించింది. వీరి అన్నగారు శ్రీ పున్నయ్య నడిపే ‘హ్యుమానిటీ’ అనే ఆంగ్ల పక్షపత్రికలో, అన్నగారికి సహాయంగా ఉంటూ విద్యార్థి దశ నుంచే పాత్రికేయ కృషిని ప్రారంభించారు. రామారావు గారు ఈ వృత్తిని ఒక పవిత్ర దీక్షగా స్వీకరించారు. జర్నలిస్టు వర్గానికి ఒక ప్రామాణికతను ఏర్పరిచారు.

‘నేషనల్ హెరాల్డ్’లో ప్రధానంగా పనిచేసినా, ఆయన మొత్తం పాత్రికేయ ప్రస్థానం 41 సంవత్సరాలు. ‘ది న్యూస్ టైం’, ‘ది లీడర్’, ‘ది పయోనీర్’ వంటి 25 ఇంగ్లీష్ పత్రికలలో వివిధ హోదాల్లో పని చేశారు. ఆయన ఎక్కడ పని చేసినా ఆయా పత్రికలలో తాజా వార్తల్ని, ఎన్నో వ్యయప్రయాసలకోర్చి సేకరించి అందించేవారు. రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో వారు రాసిన సంపాదకీయాలు ప్రభుత్వ వ్యతిరేక రచనలు అన్న అభియోగంతో వారిని బ్రిటిష్ ప్రభుత్వం, లక్నో జిల్లా జైలులో ఆరు నెలలు నిర్బంధించింది.

వారి ఉద్యోగపర్వంలో పాఠకులకు అద్భుతం అనిపించే అనేక సాహసాలు చేసిన సందర్భాలు ఈ జీవిత చరిత్రలో ఉన్నాయి. అవి చదివేవారి మనసుల్లో దేశం పట్ల ప్రతి పౌరుని యొక్క బాధ్యతను గుర్తుచేస్తాయి. స్వాతంత్ర్యోద్యమ సమయంలో పాత్రికేయ పాత్రలో ఒక వీర సైనికుడిలా తన కలంతో బాధ్యత నిర్వహించిన పోరాట యోధుడు రామారావుగారు. వీరు స్వాతంత్ర్య సమర చరిత్రను, తన పాత్రికేయ ప్రస్థానాన్ని కలిపి ‘ది పెన్ యాజ్ మై స్వోర్డ్’ అనే రచన చేశారు. 1961లో రామారావు గారి మరణానంతరం ప్రచురించబడిన ఈ రచనకు జవహర్‍లాల్ నెహ్రూ గారు ముందుమాట రాసి వారిని గౌరవించారు. వీరు రాజ్యసభ సభ్యుడిగా దాదాపు మూడు సంవత్సరాలు పని చేశారు.

పాత్రికేయ వృత్తికి గౌరవ ప్రతిష్ఠలు తెచ్చి నాటినుండి నేటి వరకు జర్నలిస్టులకు మార్గదర్శకుడిగా నిలబడిన మహోన్నతుడు శ్రీ కోటంరాజు రామారావుగారు. తాను నమ్మిన ఆదర్శం కోసం మొక్కవోని దీక్షతో ముందుకు సాగిన రామారావుగారు ధన్యజీవి. దేశం పట్ల వారి సేవానిరతి అనుపమానమైనది. ఈ లఘు గ్రంధాన్ని వయోధిక పాత్రికేయ సంఘం వారి ఆధ్వర్యంలో, అనుభవజ్ఞులైన సీనియర్ పాత్రికేయ ప్రముఖులు శ్రీ కె.రామచంద్రమూర్తి, శ్రీ దాసు కేశవరావు, శ్రీ వల్లీశ్వర్, శ్రీ ఉడయవర్లు వంటి ఉద్ధండులైన వారి చేత ఆవిష్కరింప చేయడం ఎంతో సముచితంగా ఉంది. విశిష్ట అతిధిగా శ్రీ మామిడి హరికృష్ణ, సంచాలకులు, తె.రా.ప్ర భాషా సాంస్కృతిక శాఖ పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ప్రేక్షకుల సమక్షంలో రవీంద్రభారతిలో 2023, సెప్టెంబర్ నెల,15వ తేదీన జరిగింది.

శ్రీ రామారావుగారి జీవన ప్రస్థానాన్ని గురించి శ్రమపడి విషయ సేకరణ చేసి క్లుప్తమైన, పఠనీయమైన జీవితచరిత్రగా మలచిన విదుషీమణి, బహు గ్రంథకర్త, ప్రముఖ కవయిత్రి డాక్టర్ సి భవానీదేవి గారు అభినందనీయులు.

వార్తాపత్రికలు వివిధ పార్టీల యాజమాన్యాల చేతుల్లో ఆయాపార్టీల కరపత్రాలుగా ఉండడం సర్వసాధారణం అయిన రోజులివి. ఉత్తమ విలువలు కలిగిన పాత్రికేయ వృత్తిని ఎన్నుకొని, ఆ వృత్తికే వన్నె తెచ్చిన శ్రీ కోటంరాజు రామారావుగారి జీవిత చరిత్ర జర్నలిస్టులందరికీ గీతోపదేశం లాంటిది. వారంతా రామారావు గారిని స్ఫూర్తిగా తీసుకొని, వీలయినంతవరకూ తమ వృత్తికి న్యాయం చేకూర్చడానికి ప్రయత్నించడం దేశభక్తి కాగలదు.

నేడు తమ తమ దృక్కోణాలతో, వివిధ దినపత్రికలు ప్రజలను అయోమయంలో పడేస్తున్నాయి. ఏది యథార్ధమో, ఏది అసత్యమో తెలీక దిక్కుతోచని దీనావస్థలో ఉన్న మనవంటి సామాన్య పాఠకులకి, ఈ పుస్తకం చదివడం మనసుకు గొప్ప ఊరటనిస్తుంది అనడం అతిశయోక్తి కాదు. ప్రతి ఒక్కరూ చదవవలసిన పుస్తకం ఇది.

***

కలం యోధుడు శ్రీ కోటంరాజు రామారావు
రచన: డా. సి. భవానీదేవి
పేజీలు: 125
వెల: ₹ 100/-
ప్రచురణ: ఎమెస్కో బుక్స్
ప్రతులకు:
ఎమెస్కో బుక్స్ ప్రై.లి.
33-22-2, చంద్రం బిల్డింగ్స్, సి.ఆర్.రోడ్, చుట్టుగుంట
విజయవాడ – 520 004.
ఫోన్: 0866-2436643
emescovja@gmail.com
sahithi.vja@gmail.com
ఆన్‍లైన్‌లో
https://logilitelugubooks.com/book/kalam-yodudu-sri-kotamraju-rama-rao-dr-c-bhavani-devi

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here