కళాతపస్వికి హృదయకమల సమర్పణ

0
7

[dropcap]ఆ[/dropcap]యన సినిమాలు భారతీయ కళల ఉనికిని తెలియజేస్తాయి. నటరాజ సిరిమువ్వల సవ్వడులు మన గుండెల్లో మారుమ్రోగుతాయి. శంకరుని మెడలోని ఆభరణం కూడా ‘శంకరా నాద శరీర’ అంటూ మనల్ని ‘ఫణి’ముగ్దుల్ని చేస్తుంది.

నటకుడి జీవన గతుల సంగతుల సాగర సంగమ ఘోష మనల్ని అవ్యక్తమైన అనుభూతికి లోనుచేస్తుంది. పాత్రలు మలిచిన తీరు తెలుగుదనపు మధ్యతరగతి ఆశలను, కళలను ఆవిష్కృతం చేస్తుంది.

మురళీ రవాలు ‘విశ్వనాధుని’ తలపులో జనిస్తే ఆ సిరివెన్నెలను మనందరిపై కురిపించి, మనోనేత్రంతో ప్రకృతిని ఎలా అనుభవించవచ్చో దర్శింపచేసిన విశ్వదార్శనికుని ప్రతిభకు అప్రతిభులై ఆనందానుభూతికి లోనవుతాము.

ఆదిదంపతులను ‘శృతిలయలు’గా భావించి చిరు మందహాసుడైన కుమారుడు దైవ దత్తమైన కళల ద్వారా తల్లిదండ్రులను కలపడం, వారినుండి నేర్చుకున్న నడవడికను చూసిన ప్రేక్షకుడు నాకిలాంటి పుత్రుడుంటే బావుండును అనుకుని పిల్లలకు సంగీత నాట్యాలవైపు మళ్ళించే ప్రయత్నం చేసారు.

శివుని జటాజూటములోకి చేరకుంటే సురగంగకు విలువలేనట్లే తనకు కలిగిన ఆనందాన్ని పదిమందికి పంచకపోతే కళకు సార్థకత లేదని, దాని ద్వారా పొందే ఆ ఆనంద స్వర్ణకమలాలు పరమశివునికి అర్పించి దాని ఫలాన్ని మనకి అందచేసారు.

‘ఆలోచనామృతము సహిత హితసత్యము, శారదా స్తన్యము’ అనే భావానికి తగ్గట్టుగా అమ్మ దయ ఉంటే శిశువు కూడా సంగీతపుటంచులు దాటగలడని ప్రతిభకు చిన్నపెద్దా తేడా లేదంటూ కొత్తనీటి ప్రవాహానికి పాతనీరు తొలగవలసిందేనని, అసూయను జయించినవాడు దైవదత్తమైన కళకు అర్హుడని, `స్వాతికిరణా`లలోమరో కొత్త ఉదయంతో జీవితం పండించుకోమని చెప్పినప్పుడు మనమందరిలో కలిగే ఆలోచనతో అరిషడ్వర్గాలను జయించడానికి ప్రయత్నించాము.

ఇలా ఈ మహానుభావుని ఏ చిత్రం చూసినా ఒక తాత్వికత! ఒక తాద్యాత్మత! ఒక తర్కం!. కళాతపస్వి తపస్సు చేసి ఆ ఫలాన్ని మాకందించాలనే తపన కాబోలు హృదయాన్ని కదిలించేoత శక్తివంతంగా మన ముందు నిలిచాయి.

గొప్ప తాత్వికతను కథలకు జోడించి ప్రపంచ స్థాయిలో మన తెలుగు చిత్రరాజాలని నిలబెట్టిన ఈ ‘రాజర్షికి’ ఏమిచ్చి ఋణం తీర్చుకోగలను? నా హృదయ కమలాలని ఆయన పాదపద్మాలకు సమర్పించుకుంటున్నాను.

కళాతపస్వి! విశ్వనాథ!

ఈ విశ్వం ఉన్నంతవరకు మీ కీర్తి అజరామరంగా ఉండాలని కోరుకుంటూ..

అశ్రుతప్త నయనాలతో..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here