కలవల కబుర్లు-12

0
11

[ప్రసిద్ధ రచయిత్రి కలవల గిరిజారాణి గారు అందిస్తున్న ఫీచర్ ‘కలవల కబుర్లు’.]

[dropcap]యూ[/dropcap]ట్యూబ్‌లో చెత్త..  చెదారం.

తస్మాత్ జాగ్రత్త.. జాగ్రత.

పదకొండు లవంగాలతో ఇలా చేస్తే ఎటువంటివారైనా మీ వశం అవుతారు.

ఆదివారం నాడు ఏడు లవంగాలని ఈ దిక్కుకి విసిరితే మీరు పట్టిందల్లా బంగారమే.

తొమ్మిది మిరియాలతో ఇలా చేయండి నవగ్రహాలూ మీ వశమవుతాయి.

పదహారు ధనియాలు పక్కింటి వేపు చూపండి. ఆ ఇల్లు కూడా మీ స్వంతమవుతుంది.

ఐదు యాలకులు పర్సులో పెట్టుకోండి. పర్సు డబ్బులతో నిండిపోతోంది.

ఫలానా రంగు చీర కట్టుకుని దేవుని ముందు దీపం వెలిగించి.. తర్వాత చూడండి మీ ఇల్లు లక్ష్మీ నిలయమే అవుతుంది.

నేను చెప్పినట్లు ఇలా చేసారంటే బిచ్చగాడు కూడా కోటీశ్వరుడు అవడం ఖాయం.

శుక్రవారం గల్లు ఉప్పు కొనండి, మీ ఇంట లక్ష్మీ దేవి ఘల్లు ఘల్లున తాండవమాడుతుంది.

బీరువా కింద ఈ వేరు పెట్టండి, ఆ తర్వాత చూడండి

బీరువా తలుపు తీస్తే చాలు కట్టల కట్టలు నోట్ల కట్టలు రాలుతూ ఉంటాయి.

బీరువా కింద ఈ ఒక్క వస్తువు పెట్టండి

మీ ఆర్థిక సమస్యలు తీరుతాయి.

మొండిబాకీలు వసూలవుతాయి.

ఇళ్లు, స్ధలం అమ్ముడుపోవడం లేదా?

చింతించకండి.. గుప్పెడు ఆవాలు ఆ స్ధలం నాలుగు దిక్కుల కప్పెట్టి వెనక్కి చూడకుండా రండి. మీరు ఇంటికి చేరే సమయానికి  మీరు నమ్మశక్యం కాని బేరం రెడీగా ఉంటుంది.

ఇంకా విచిత్రం.. భార్యాభర్తల మధ్య అనుకూలత లేకపోతే కనుక.. ఇద్దరి ఫోటోలనీ తేనె సీసాలో కుక్కి, బెడ్ రూంలో ఈశాన్యం ప్రాంతంలో పెడితే.. ఇక చూసుకోండి.. వాళ్ళిద్దరికీ సయోధ్య ఎంచక్కా పెరిగిపోతుందని ఒకరి ఉవాచ.

మొగుడ్ని గుప్పెట్లో పెట్టుకోవడం ఎలా?

అత్తగారిని అణగతొక్కడమెలాగో మీకు తెలుసా?

ఇవి కాకుండా..

ఇక ఆధ్యాత్మిక గురువులు.. తమకి తోచిందే వేదమని వల్లె వేస్తూంటారు. ఫలానా గుడిలో అమ్మవారికి ఎర్రచీర ఎందుకు కడతారో తెలుసా?

తెలుసుకుందామని మొత్తం చూస్తామా! ఆ విషయం తప్ప.. వాళ్ళ సుత్తి మొత్తం వుంటుంది.

ఇలా చెప్పుకుంటూ పోతే.. ఒకటి కాదు, రెండు కాదు వేలకి వేలు.. సలహాలు, చిట్కాలు, ఉపదేశాలూ వగైరా వగైరాలు. ఉప్పులూ, పప్పులు.. మొత్తం వంట సామాగ్రి లిస్ట్ ఇక్కడ వస్తుంది.

ఇలాంటి వారు పెట్టిన యూట్యూబ్ వీడియోలలో కామెంట్స్ చదువుతూంటే.. జనాలు ఇంతగా నమ్ముతున్నారా? అనిపిస్తోంది. తమ అమాయకత్వమే వారిపాలిట అదృష్టం అవుతోంది అనేది ఈ జనాలు తెలుసుకోలేకపోతున్నారు.

ఇదివరకు మాత్రం ఇలా లేవా? అని అడిగేవారికి సమాధానంగా, కొన్ని మన అమ్మమ్మల, బామ్మల కాలం నుంచి కొన్ని ఉన్నాయి.. దిష్టి తీయడానికి ఉప్పుని తిప్పడం, నిమ్మకాయలను దిగదుడిచి బయట పారేయడం ఇలాంటివి ఉన్నాయి. వాటిని కాదనలేము. కానీ మనిషి కి ఉన్న కొన్ని నమ్మకాలని.. మూఢ నమ్మకాలతో ముడికట్టి, సొమ్ము చేసుకునే దురాశపరులు ఎక్కువ అయిపోయారు.

పోపులడబ్బాలో సామాగ్రి కేవలం వంటలకీ, ఆరోగ్య సమస్యలకే కాకుండా ఇలా కూడా అంటే.. ఇక బస్తాలు బస్తాలు యాలకులు, లవంగాలు, మిరియాలు, ధనియాలు, ఇలా అన్నీ కొనాలేమో.

చెప్పేవాడికి వినేవాడు లోకువ..

అందుకే నోటికి వచ్చింది చెపుతూ ఉంటారు. నమ్మకం పెంచుకుంటారు. నమ్మిస్తారు. నమ్మిన వారిని ముంచుతారు. యూట్యూబ్‌లో ఇదో ప్రహసనం అయిపోయింది. వేలకి వేలు ఉన్నాయి ఇటువంటివి.

ఇవన్నీ నిజాలో అబద్ధాలో తెలియదు  కానీ.. ఇలా చెపుతూ బోలెడు మంది ఫాలోయర్స్‌ని పెంచుకుంటూ.. వీళ్ళు చేసే ఈ వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగిపోతోంది.

ఎక్కడో, ఎప్పుడో వీళ్ల జాతకం కూడా తిరగబడితే, అప్పుడు కానీ అసలు రహస్యం తెలీడం లేదు జనాలకి. అయినా కూడా నమ్మకం సడలించుకోరు.. ఈ బాబా కాకపోతే మరో బూబా! ఎవరో ఒకరు.. ఎవరు ఏది చెపితే అది గుడ్డిగా నమ్మేయడమే.

యూట్యూబ్ సాధువులారా!

జనాలకి లేనిపోని ఆశలు కల్పించకండి.

మీరు దురాశపరులు కాకండి.

మీకు చేతనైతే మంచి మాటలు నాలుగు చెప్పండి.

మంచి మార్గం చూపించండి.

మార్గదర్శకులు అవండి.

అదన్నమాట సంగతి..

కబుర్లు చెపుతున్నది.. కలవల గిరిజా రాణి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here