కలవల కబుర్లు-13

0
10

[ప్రసిద్ధ రచయిత్రి కలవల గిరిజారాణి గారు అందిస్తున్న ఫీచర్ ‘కలవల కబుర్లు’.]

సిరిమల్లె పూవా!

[dropcap]ఎం[/dropcap]డాకాలం అంటే.. గుర్తు వచ్చేవాటిల్లో ముఖ్యమైనవి మరోటి ఏంటంటే.?

అవేనండీ! స్వచ్ఛతకు మారుపేరు. ధవళ రంగులో.. సువాసనలు విరజల్లుతూ.. మహిళల మదిని దోచే మల్లెపూవులు.

ఈ పూలకి ఉన్నంత డిమాండ్ వేరే పూలకి వుండదు. వీటిని ఇష్టపడని లలనామణులుండరు. కొప్పు చుట్టూ చుట్టినా, వాల్జడలలో బారుగా మూరలు తురిమినా.. వీటి అందం వీటిదే..

కొన్ని ప్రాంతాల్లో, ఈ మల్లెమొగ్గలని లెక్కపెట్టి అమ్ముతారు. మరికొన్ని చోట్ల తూకం వేసి, మరికొన్ని చోట్ల కొలతలతోనూ.. ఎలా అమ్మినా.. ఈ సీజన్ మొత్తం వీటిదే హవా. ఈ మరుమల్లెల మీద నుంచి వీచే హవా.. రేపే అలజడి అంతా ఇంతా కాదు.

ఆడపిల్లలు ఉన్న ప్రతి ఇంటా ప్రతిరోజూ ఈ మల్లెల పండగే. ఇప్పుడు తగ్గిపోయాయి కానీ, ఇదివరలో, ఆడపిల్లలు ఎండాకాలంలో ఈ మల్లెపూల జడలు వేసుకోవడం తప్పనిసరిగా వుండేవి. ఇప్పటి కాలం అమ్మాయిలకి జడలే ఉండడం లేదు.. ఇక పూలజడలెక్కడుంటాయి లెండి.

అప్పట్లో, ఈ మల్లెపూల సీజన్ మొత్తంలో కనీసం మూడు నాలుగు సార్లైనా మల్లెపూల జడలు వేసేవారు. చక్కగా సవరం పెట్టి చివరన జడకుప్పెలు పెట్టి.. ఆ జడకి ఈ మల్లెలు గుచ్చడం ఓ పెద్ద ప్రహసనం. అదో ఆర్ట్ కూడాను. అందరికీ వచ్చేది కాదు. అలా నేర్పుగా వేసే పక్కింటి అత్తయ్య గారినో, ఎదురింటి దొడ్డమ్మ గారినో, ముందురోజే వాళ్ళ అపాయింట్మెంట్ తీసేసుకుని, మర్నాడు మధ్యాహ్నం భోజనాలవగానే రెడీగా ఉండమని చెప్పుకునే వాళ్ళు.

వాడుకగా పూవులు తెచ్చే అబ్బాయికి కూడా ముందే చెప్పి పెడితే.. జడ మొగ్గలు, తెచ్చి పెట్టేవాడు. ఇక పూలజడ కోసం వచ్చిన పెద్దమొగ్గలని, తొడిమలు తీసేసి, రెడీగా వుంచేవారు. డైరక్ట్‌గా జడకి మల్లెమొగ్గలు గుచ్చడం ఒక పద్ధతి.. మరో పద్ధతి లో ఏదైనా గట్టి అట్టముక్క జడ సైజులో కట్ చేసుకుని.. దానిపై పూవులు గుచ్చి.. దాన్ని జడకి టాకాలు వేసి కుట్టేవారు. మల్లెల మధ్య కనకాంబరపూలు. మరువం.. లేకపోతే దవనం ఆకులు కలిపి కుట్టేవారు. కొందరు రంగురంగు ఊలుని కానీ.. రంగుల ముచ్చిరేకులు కానీ కూర్చేవారు.

అసలు ఇంత పెద్ద జడ వేసుకోవడం, తోటి పిల్లలో చూపించుకోవడానికి చాలా గొప్పగా ఉండేది.

కదలకుండా కనీసం ఓ మూడుగంటలైనా ఆ పిల్ల కూర్చోవలసి వచ్చేది. కదిలితే నెత్తిన ఓ మొట్టికాయ పడడమో, కుడుతున్న సూది గుచ్చుకోవడమో జరిగేది.

ఇదంతా అయ్యాక.. ముఖం సబ్బేసి రుద్ది, బొట్టు, కాటుక సింగారించి, పట్టుపరికిణి వేసుకున్నాక, నాన్న కాళ్ళకి దండం పెడితే పదిరూపాయల బహుమతి వచ్చేది. బామ్మ తాతయ్యలకి, ఇంటావిడ అమ్మమ్మ గారికి, చుట్టుపక్కల పెద్దవాళ్ళందరికీ, కాళ్ళకి నమస్కారం చేసి రావడం అలవాటుగా ఉండేది.

ఆ తర్వాత ఫోటో స్టూడియో కి తీసుకువెళ్ళి.. వెనకాల అద్దంలో ఈ అందమైన మల్లెపూల జడ పడేటట్టు ఫోటో తీయించి ఫ్రేమ్ కట్టించి గోడకెక్కించడం జరిగేది. ప్రతీ ఏడూ ఈ తంతు కొనసాగాల్సిందే.. రాత్రికి పడుకునేటపుడు.. పూలజడ నలిగిపోకుండా.. నెమ్మదిగా టాకాలు తీసేసి ఆ జడని తడిబట్టలో చుట్టబెట్టి వుంచి.. మళ్లీ మరునాడు మరోసారి జడకి కుట్టేవారు. ఒకవేళ అలా కుదరకపోతే.. జాగ్రత్తగా జడని పైకెత్తి.. పడుకోవడమే. స్నానం చేసేటపుడు తడిసిపోకుండా అమ్మ ఆ జడని పైకెత్తి పట్టుకునేది. పూల జడకి పైన గుండ్రంగా పూలని చుట్టి.. మధ్యలో రాళ్ల చందమామని గుచ్చేవారు.

అప్పట్లో ఆడపిల్లలున్న ప్రతీ ఇంట్లో ఈ అచ్చట్లు ముచ్చట్లు.. ప్రతీ మల్లెల కాలంలోనూ కొనసాగుతూవుండేవి.

మన సినిమాల్లో ఈ మల్లెల మీద వచ్చిన పాటలు కోకొల్లలు. అందమైన ఆడపిల్ల నవ్వు విరబూసిన సిరిమల్లె పూవుతో పోలుస్తూ వచ్చిన పాటలు కొన్ని అయితే.. ఇది మల్లెల మాసమని భ్రమించిన కోయిల ముందే కూసేసిందంటూ మరో పాట. చిరునవ్వు వెలని మరుమల్లె పూవుతో పోలుస్తూ మరో పాట, మల్లెపూలు పెట్టుకున్నది ఎవరి కోసమూ? అంటూ కవ్వించే ప్రియుని పాట.. అబ్బో! ఒకటా రెండా? మధురోహలలో మల్లెలని తలుచుకుంటూ చాలా పాటలే వున్నాయి మన సినిమాలలో.

ప్రస్తుతం రోజుల్లో ఆ మల్లెలు తెలతెల పోతున్నాయా అనిపిస్తుంది. ఎందుకంటే, వాటిని ఆస్వాదించడానికి, అనుభూతిని పొందడానికి, ఇప్పటి కాలం అమ్మాయిలలో.. ఆ కొప్పులూ లేవు. జడకుప్పెలూ లేవు.. జడలూ లేవు.. పూలజడలూ లేవు.. ఎక్కడ చూసినా విరబోసిన కురులే తప్ప.. విరులూ లేవు.. మరులొలకపోసే.. మరుమల్లెల ఘుమాయింపులూ లేవు.

పెళ్ళిళ్ళలో కూడా కృత్రిమ పూవులతో అలంకరించిన జడలే కనిపిస్తున్నాయి. సహజత్వం కోల్పోయి మరుమల్లెలు తెలతెలపోతున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here