కలవల కబుర్లు-14

0
17

[ప్రసిద్ధ రచయిత్రి కలవల గిరిజారాణి గారు అందిస్తున్న ఫీచర్ ‘కలవల కబుర్లు’.]

[dropcap]ఈ[/dropcap]మధ్య కొందరు టీవీ యాంకర్లో, చిన్న చిన్న నటీమతల్లులో, లేదా యూట్యూబ్ లలో పేరుతెచ్చుకునే ఔత్సాహికులో ఎవరైతేనేంటి లెండి..

వాళ్ళ వాళ్ళ యూట్యూబ్ ఛానళ్ళలలో “మా ఇల్లు చూపిస్తా, రండి! రండి!” అంటూ హోమ్ టూర్ పేరిట వీడియోలు చేయడం చూసాను. వాటి మీద ఈరోజు సరదాగా చెప్పుకుందాం.

ముందుగా బయట గేటు దగ్గర నుంచి మొదలెడతారు.

“హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ? నేనైతే సూపర్ సూపర్ ఉన్నాను. ఈ మధ్య మళ్లీ కొత్త వీడియోలు అప్లోడ్ చేయడం లేదని అందరూ తెగ మెసేజ్ చేస్తోంటే ఈరోజు తీరిక చేసుకుని మా ఇల్లు హోమ్ టూర్ చేద్దామని డిసైడ్ అయ్యాను ఫ్రెండ్స్!

ఫ్రెండ్స్! ఇంతకుముందు వీడియోలో మా కిచెన్ చూపించాను కదా ఫ్రెండ్స్! ఆ వీడియో చూసి నాకూ చాలా మంది మెసేజ్ చేసారు. నేను ఉప్పు, కారం వేసిన డబ్బాలు చాలా బావున్నాయి, ఎక్కడ కొన్నారు? అని అడిగారు. ఫ్రెండ్స్ అవి నేను యూఎస్ వెళ్ళినపుడు తీసుకున్నాను ఫ్రెండ్స్. మీకు బాగా నచ్చాయనుకుంటాను. అంతేకాదు.. నేను వంటిల్లు ఆర్గనైజ్ చేసిన తీరు కూడా బాగా నచ్చిందనీ.. మేమూ అలాగే ఆర్గనైజ్ చేసుకుంటున్నారని చాలా మంది కామెంట్ బాక్స్‌లో చెప్పారు. చాలా చాలా థాంక్స్ ఫ్రెండ్స్! మీరిలా ఎంకరేజ్ చేస్తోంటే నేను మరిన్ని వీడియోలు మా హోమ్ టూర్‌తో పాటు మా అక్క, వదిన, వాళ్ళ హోమ్ టూర్స్ కూడా చేసి చూపిస్తాను. సరేనా ఫ్రెండ్స్!

మరి ఆలస్యం చేయకుండా, మా ఇంటి వీడియో చూసేయండి ఫ్రెండ్స్!

ఫ్రెండ్స్! మీరు నా వీడియో చూడడం ఇదే మొదటిసారి అయితే కనుక పక్కనే వున్న గంట సింబల్ కొట్టి, సబ్‌స్క్రైబ్ చేసి షేర్ చేయండి. ఏం లేదు ఫ్రెండ్స్.. ఇలా చేస్తే నేను తర్వాత చేయబోయే వీడియోలు నోటిఫికేషన్‌లు అన్నీ మీకు వస్తాయి, దాంతో మీరు చూడడానికి ఫాలో అవడానికి వీలవుతుంది ఫ్రెండ్స్.. సరేనా!

మరి ఇప్పుడు కమాన్, నాతో వచ్చేయండి.. మేడ మీద మా రూములు నేను ఎలా సర్దుకున్నానో, ఏ వస్తువులు ఎక్కడెక్కడనుంచి తెప్పించాను అన్నీ వివరంగా చూపిస్తాను.

ఇదిగో ఈ వాల్ పెయింట్ చూసారా ఫ్రెండ్స్? ఇది నాకు ఎంతో ఇష్టమయినది. సింగపూర్‌లో కొన్నాను. ఇంటికి రాగానే ఈ పెయిటింగ్ కాసేపు కళ్ళార్పకుండా చూస్తాను ఫ్రెండ్స్.. దాంతో నాకున్న స్ట్రెస్ అంతా పోతుంది.

ఇదిగో ఈ వార్డ్ రోబ్‌లో నా బట్టలు చీరలు ఉంటాయి. పక్కదాంట్లో మా వారివి ఉంటాయి. ఈ బీరువా గురించి మీకు స్పెషల్‌గా చెప్పాలి ఫ్రెండ్స్.. ఎవరికీ తెలీని సీక్రెట్ అర దీని లోపల ఇక్కడ ఉంటుంది. పైకి చూస్తే అక్కడ అలాంటి అర ఉందనే ఎవరికీ తెలీదు. నేను స్పెషల్‌గా ఆర్డర్ ఇచ్చి చేయించాను ఫ్రెండ్స్ .. మీకు ఇలాంటిది కావాలంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్‌లో వివరాలు ఇస్తాను ఫ్రైండ్స్ చూడండి.

ఇలా ఈ మెట్ల మీద నుంచి పైకి వెడితే టెర్రస్ ఉంటుంది. ఇక్కడ ఒక టెర్రస్ గార్డెన్ చేసాను ఫ్రెండ్స్! ఇదిగో ఈ మొక్కల మధ్య బుద్ధుడి బొమ్మ పెట్టుకున్నాను. ఇక్కడ కూర్చుంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది.

రోజు సాయంత్రం అక్కడే కూర్చుని టీ తాగడం మాకు అలవాటు.”

ఇలా అన్నిరూములూ తిప్పి తిప్పి గోడలు, కిటికీలు, తలుపులు, మెట్లు, చెట్లు, మొక్కలు.. చూపించి చూపించి.. చివరాఖరుగా బైబై చెపుతుంది.

కొసమెరుపుగా..

ఆవిడ గారిదే రెండు రోజుల్లో మరో వీడియో అప్లోడ్ అవుతుంది.

అందులో..

“ఫ్రెండ్స్! ఈసారి ఈ వీడియో ఇంతకుముందు మీకు చూపించినవాటికన్నా మరింత ప్రత్యేకమెనది. ఎక్కడా స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి. సరేనా?

ఇందులో విశేషం ఏమిటంటే.. మొన్నటి వీడియోలో టెర్రస్ మీద నుంచి మెట్లు దిగి బెడ్ రూమ్ లోకి ఎలా రావాలనేదీ, మా బీరువాలో ఉన్న ప్రత్యేక అర గురించి చెప్పాను కదా! నా ఫాలోయర్ అయి ఉంటాడు. ఎవరో పేరు తెలీదు.. అతను ఆ వీడియో చూసి మొన్న రాత్రి మా ఇంట్లో దొంగతనం చేసి.. మా సీక్రెట్ లాకర్‌లో ఉండే నా డైమండ్ సెట్ దొంగతనం చేసాడు.

ఆ డైమండ్ సెట్ మీకు ఇంతకుముందు వీడియోలో చూపించాను కదా ఫ్రెండ్స్.. దుబాయ్‌లో కనుక్కున్నాను అని నా దుబాయ్ టూర్ వీడియోలో మీకు చెప్పాను. ఇప్పుడు అదే దొంగతనం జరిగింది. అతను ఎలా చేసింది.. పైన డోర్ ఎలా పగలకొట్టినదీ, తర్వాత మేము రిపోర్టు చేసిన తర్వాత పోలీసులు వచ్చి ఇక్కడ ఎలాంటి చర్యలు చేపట్టినదీ, ఈరోజు వీడియోలో మీకు చూపిస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే బెల్ సింబల్ కొట్టడం, సబ్‌స్క్రైబ్ చేయడం,షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్.. సరేనా?”

అలా ఉంటాయండీ యూట్యూబ్ ముచ్చట్లు.

అదన్నమాట సంగతి

కబుర్లు చెపుతున్నది

కలవల గిరిజా రాణి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here