కలవల కబుర్లు-16

0
11

[ప్రసిద్ధ రచయిత్రి కలవల గిరిజారాణి గారు అందిస్తున్న ఫీచర్ ‘కలవల కబుర్లు’.]

[dropcap]కొం[/dropcap]త మంది ఉంటారు చూసారూ!

వీళ్ళు ఎవరినైనా కలుసుకుని మాట్లాడుకునేటపుడు.. ఆ ఎదుటివారు, మాటల్లో తను ‘ఈ మధ్య నడుము నొప్పితో బాధ పడుతున్నాను’ అని అన్నారనుకోండి.. ఇక ఈ ఇవతలవారికి.. ఎప్పుడో ఏళ్ల కిందట వుండే తన నడుం నొప్పి గుర్తుకి వచ్చేస్తుంది. ఇహ.. మొదలెడతారు చూడండీ..

“అబ్బే ఇదేమంత నొప్పనీ? అసలు నడుం నొప్పి అంటే ఆ మధ్యన నాకు వచ్చిందే.. అదన్నమాట. నరకం చూసాననుకోండి. అటు తిరగలేక, ఇటు తిరగలేక.. వాడని మందు లేదు. అలోపతీ, హోమియోపతీ, ఆయుర్వేదం ఇలా రకరకాల మందులు వాడాను. అయినా లాభం లేదనుకోండి. అప్పుడు చెప్పింది మా మేనత్త కూతురు.. ఏదో ఎక్సర్‌సైజులు చేస్తే తగ్గతుందని. అవి రోజూ చేసేదాన్ని. అంతే పదిరోజుల్లో.. చేత్తో తీసేసినట్టే పోయిందమ్మా ఆ మాయదారి నొప్పి.”

“ఔనా! ఏవేం చేసారో చెప్పండి.. నేనూ చేస్తాను” అని ఇవతలవారు అన్నారనుకోండి.. వెంటనే..

“ఇప్పటిమాట కాదిది.. పదేళ్ల క్రితం జరిగిన సంగతి. ఏం ఎక్సర్‌సైజులో గుర్తే లేదు.” అంటారు.

అంతదానికి ఇంత చెప్పడమెందుకు? అనిపిస్తుంది కదూ!

ఇలా ఎవరైనా తమ బాధలో, ఇబ్బందులో చెప్పారనుకోండి.. వెంటనే వీళ్ళ ఈతిబాధలు అన్నీ ఏకరువు పెట్టేస్తారు. ఎదుటివారివి విందామనికానీ, ఓదారుద్దామనీ కాదు.. ఎంత సేపూ తమ గోలే!

ఎవరికైనా ఆరోగ్యం బావుండక తెలిసి, వీళ్ళు పొరపాటున పరామర్శకి వెళ్ళారనుకోండి.. ఇక ఇంతే సంగతులు.. కోలుకునేవారు కూడా, తిరిగి అడ్డం పడతారు. పైగా దడుసుకుంటారు కూడా.

“మా మేనమామకి కూడా సరిగ్గా మీలాగే బైపాస్ సర్జరీ జరిగింది. చేసాక ఒకరోజు బానే వున్నాడు. అంతలోనే ఏమయిందో, ఏంటో.. సడన్‌గా బీపీ పెరిగిందట.. మధ్యాహ్నానికల్లా పోనేపోయాడు. మొత్తం బిల్లు నాలుగు లక్షలు బూడిదలో పోసిన పన్నీరే..” అని అనేసరికి.. ఈ ఆపరేషన్ చేయించుకున్నాయనకి.. అప్పటిదాకా బానే వున్నా.. ఈ మాటలు విన్నాక మాత్రం బీపీ పెరగడం ఖాయం.

పైగా చెప్పిందంతా చెప్పేసి, “మీ బిపీ చెక్ చేయిస్తూనే వున్నారా? ఔనూ! హెల్త్ ఇన్సూరెన్స్ చేయించుకున్నారా? లేదా? అదుంటే అంత బెంగ వుండదు. నేనైతే మా భార్యాభర్తలు ఇద్దరికీ చెరో ఆరులక్షలకీ చేయించేసాను. ఏదైనా అయిందంటే మొత్తం వాళ్ళే చూసుకుంటారు. కొన్ని ఇన్సూరెన్స్‌లు అయితే, మనకేదైనా అయి ఒకవేళ పోయామనుకోండి..వెంటనే డబ్బు వచ్చే ఏర్పాటు కూడా చేస్తారట.” ఇలాంటి మాటలు.. ఏదైనా ఆపరేషన్ చేయించుకున్న మనిషి దగ్గరకి వచ్చి చెపితే.. ఆ పేషెంట్ పై ప్రాణాలు పైపైకి పోవు మరీ?

ఎప్పుడెలాంటి మాటలు, ఎవరితో ఎలాంటి మాటలు మాట్లాడాలో తెలియని మనుషులు ఇలాగే వుంటారు.

ఆ మధ్య ఇంకొకరిని చూసాను. ఎవరో పోయినప్పుడు.. వాళ్ళ కుటుంబీకులని పరామర్శించడానికి వెళ్ళారు. అక్కడ ముందుగా ఆ పోయినాయనకి వచ్చిన అనారోగ్యం, చేయించిన వైద్యం తెలుసుకుంటారు. ఆ తర్వాత ఇక మొదలెడతారు. “అయ్యో! మీరు పొరపాటు చేసారండీ! ఈయన గారికి బావులేదని, నాకొక్క ఫోను కొట్టి వుంటే.. నాకు తెలిసిన ఫలానా డాక్టర్ గారున్నారు. ఆయన నెంబర్ ఇచ్చుండేవాడిని. ఆయన వైద్యానికి తిరుగే లేదు. ఆయన దగ్గరకి వెళ్లి వుంటే.. మీకు ఇలా అయుండేది కాదు. ప్చ్.. నాకు తెలీనే తెలీలేదు.” అనుకుంటూ తెగ బాధ పడిపోతారు.

ఆ కుటుంబీకులు తాము నిజంగా చాలా పెద్ద అపరాధం చేసినట్టు ఫీలయిపోతారు.

“ఆ.. అయినా.. ఆయనకి దేవుడు ఇంతవరకే రాసిపెట్టి వుంచినపుడు.. మీరు మాత్రం ఏం చేయగలరు? సమయానికి నా పేరు మీకు గుర్తు చేయకుండా ఆ దేవుడే ఆపి వుంటాడు. పోన్లెండి.. ఇప్పుడు అనుకుని ప్రయోజనం లేదు” అని తిరిగి సమాధాన పరిచేసరికి, ఆ కుటుంబీకులు, ‘ఔనౌను.. అదీ నిజమే లెండి. ఆయనకి భూమ్మీద ఇంత వరకే నూకలు వున్నపుడు.. ఏ డాక్టర్ దగ్గరకు వెళ్ళినా ఇంతేగా!’ అనుకుని ఊరట పడతారు.

ఇలా పరామర్శకి వచ్చినవారో, మరొకరో.. వీళ్ళు చెప్పిన డాక్టర్ నెంబరు, తమకి అవసరమయి అడిగారే అనుకోండి.. ఫోనులో నెంబర్ వెతికి, “అయ్యో! ఈ మధ్య ఫోన్ మార్చాను.. పాత నెంబర్లు అన్నీ డిలీట్ అయిపోయాయి కాబోలు. ఆ డాక్టర్ నెంబర్ కనుక్కుని చెపుతాను.” అంటారు.. ఇక అంతే సంగతులు.

చనిపోయిన వ్యక్తి గురించి ఆరాలు, కంటి తుడుపులూ, ఓదార్పులూ.. అయాక.. ఇక పక్కవారితో, మాటలలో పడతారు. “మీ అబ్బాయికి ఏదైనా సంబంధం కుదిరిందా? లేకపోతే చెప్పండి. మా వాళ్ళమ్మాయి వుంది. చక్కని చుక్క.” అనగానే..

ముదిరిపోయిన ఆ బెండకాయ తాలూకు తల్లో, తండ్రో.. ఈ మాటలకి ఆకర్షితులై.. అక్కడిక్కడే.. తమ తమ గోత్రాలూ, పిల్లల జాతకాలూ, ఉద్యోగ జీతాల వివరాలూ, సెల్ ఫోన్లలో అబ్బాయి, అమ్మాయిల ఫోటోలూ ఒకరికొకరికి ట్రాన్స్‌ఫర్ చేసుకుంటారు.

అసలు వీళ్ళు ఒక చావింటికి పరామర్శకి వచ్చామన్న విషయం కూడా మర్చిపోయి వ్యవహరిస్తూ వుంటారు.

ఏంటో కొందరి మనుషుల రీతి ఇలా వుంటుంది. వీళ్ళు మారరండీ! మారరు.

ఈ రోజుకి ఇవండీ కలవల కబుర్లు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here