కలవల కబుర్లు-24

0
11

[ప్రసిద్ధ రచయిత్రి కలవల గిరిజారాణి గారు అందిస్తున్న ఫీచర్ ‘కలవల కబుర్లు’.]

[dropcap]ఎం[/dropcap]డాకాలం సెలవలు అయిపోయాయి. స్కూళ్ళు తెరిచేసారు. పిల్లలున్న ప్రతీ ఇంట్లోనూ ఇక హడావుడి మొదలవుతుంది.

కొత్త పుస్తకాలు కొనుక్కుని రావడం, తర్వాత వాటికి అట్టలు వేసుకోవడం కాదు కానీ, ఆ ఇంట్లో అమ్మా నాన్నలకీ, బామ్మా తాతలకీ అదో పెద్ద యజ్జమే.

ఇప్పటి పిల్లలకి తెలీదు కానీ, ఓ పాతిక ముప్పై ఏళ్ల వెనక్కి, ఇంకా బాగా వెనక్కి వెడితే.. ఈ స్కూళ్ళు తెరిచే రోజుల్లో అప్పటి పిల్లల సందడే సందడి. పుస్తకాలకి అట్టలు వేయడానికి, మందపాటి పేజీలున్న పత్రికలలోని పేజీలు చింపి వేసుకోవడమో లేకపోతే కేలండర్లు చింపి వేసుకోవడమో, లేకపోతే సినిమా పత్రికలో, న్యూస్ పేపర్లో వేసుకునేవారు. తర్వాత తర్వాత వచ్చాయి బ్రౌన్ కలర్ అట్టలు, వాటి మీద నేమ్ స్లిప్‌లు అంటించుకోవడం అందంగా పేర్లు రాసుకోవడం వుండేది. ఆ రోజుల్ని తలుచుకుంటూంటే ఎంత బావుంటుందో కదూ!

ఇప్పుడు, అట్టలు వేయడానికి మనకి ఓపికా, సమయం లేకపోతే పుస్తకాల షాపు వాడే వేస్తాడట. ఊరికే కాదులెండి, పుస్తకానికో పదిహేను రూపాయలు తీసుకుంటాడట.

బండెడు పుస్తకాలుంటున్నాయి.. ఏంటేంటో ఆ సబ్జెక్టులు పాత తరాలవారికి తెలీనుకూడా తెలీడం లేదు.

ఇక ఏ షాపులో చూసినా టిఫిను బాక్సులూ, మంచి నీళ్ళ సీసాలూ, బూట్లూ , పెన్నులూ, పెన్లిళ్ళూ..

ఇప్పుడు రకరకాల బ్రాండెడ్ స్కూల్ బేగ్‌లు.

వాటి మీద పిల్లలని ఆకర్షింపచేసే.. స్పైడర్ మేన్‌లూ.. అవెంజర్సూ.. బార్బీబొమ్మలూ.. షాపుల నిండా అవే..

ఎల్ కే జీ పిల్లాడి నుంచీ.. అవి వీపుల మీద పెద్ద గోతాల్లాగా వేలాడుతూ వుంటున్నాయి. బేక్ బేగ్ లట..

ఇవన్నీ ఇప్పటివి.. వెయ్యి రూపాయలకి తక్కువగా మంచివి దొరకడం లేదు. ఏడాదేడాదికీ మార్చడమే మళ్లీ..

వీటికి ముందు.. ఓ పక్క భుజానికి తగిలించుకునే పొడుగు బేగ్‌లు.. స్కూళ్ళకీ, కాలేజీలకీ వాడేవారు.

ఇంకా ముందు ప్లాస్టిక్ బుట్టలు.. హైస్కూల్ చదువుల వరకు వుండేవి. టైమ్ టేబిల్ ప్రకారం నీట్‌గా ఆ బుట్టలో పుస్తకాలు సర్దుకుని.. నోట్ బుక్స్ ఒకవరస, టెక్స్ట్ బుక్స్ ఒక వరస.. మధ్యలో సెపరేట్ చేస్తూ ఒక అట్టముక్క.. పెట్టుకునేవాళ్ళం. మగపిల్లలు అయితే.. భుజం మీద ఎన్ని పుస్తకాలైనా దొంతరలా పెట్టుకుని తెచ్చేవారు. కాలేజీ స్టేజీకి వస్తే.. పుస్తకాలు సంఖ్య తగ్గేది.. ఆడపిల్లలు.. చేత్తోనే పట్టుకుని తెచ్చుకునేవారు.

మరి ఈ పుస్తకాల పెట్టె గుర్తుందా.. ఈ పెట్టెలో పుస్తకాలు పట్టుకెళ్ళిన రోజులు గుర్తు వున్నాయా?

అల్యూమినియం పెట్టె.. ఎంచక్కా పుస్తకాలు ఇందులో సర్దుకుని పట్టుకెళ్ళే వాళ్ళం. నోట్స్ వ్రాసుకుందుకి వత్తుకి కూడా పనికొచ్చేది.

క్లాసులు పెరిగేకొద్దీ.. పెట్టె సైజు మారుతూ వుండేది. పట్టుకునీ.. పట్టుకునీ.. వేళ్లు కందిపోతూవుండేవి. ఉఫ్.. ఉఫ్.. ఊదుకుని రెండో చేతికీ మార్చుకునేవాళ్ళం.

ఏదైనా.. ఇప్పటి పుస్తకాల గోతాలతో పోల్చుకుంటే.. అప్పటి బరువులు తక్కువే.. పాపం ఇప్పటినుండే బరువు బాధ్యతలు.. పసి బాల్యానికి.

మరి ఈ స్కూళ్ళకి ఫీజుల సంగతి మరోసారి మాట్లాడుకుందాం. ఎందుకంటే ఈ రోజుల్లో చదువుకోవడం.. కొనడమే అయిపోతోంది కదా!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here