కలవల కబుర్లు-3

0
7

[ప్రసిద్ధ రచయిత్రి కలవల గిరిజారాణి గారు అందిస్తున్న ఫీచర్ ‘కలవల కబుర్లు’.]

చల్లని తల్లి ఆత్మకథ

[dropcap]ఎం[/dropcap]డాకాలం.. మండేకాలం.. మన పాలిటి చల్లని దేవత ఫ్రిజ్ మాత..

ఔనౌను కదూ! నూటికి నూరు పాళ్లు నిజమే కదూ! అనుకుంటున్న నన్ను చూసి, మా ఫ్రిజ్.. నావేపు వెర్రి చూపులు చూస్తూ..

“మీ పాలిట దేవతనని చెపుతూ ప్రతి రోజూ నాకు చేసే పూజలూ, అభిషేకాలూ, అర్చనలతోనూ, మీరు సమర్పించే వస్తు సముదాయాలతోనూ నన్ను ఎంత ప్రేమగా ముంచెత్తేస్తున్నారో! ఏ ఇంట చూసినా నా ఇక్కట్లు ఇవే కదా! ప్లీజ్, ప్లీజ్ నా గురించి నాలుగు మాటలు చెప్పవా? నా ఈతి బాధలు వివరించవా?” అంది దీనాతి దీనంగా.

అంతే ఇక నాకు తెగ జాలి పుట్టేసింది. అది అంత బేలగా అడిగేసరికి.. “సరే, సరే, చెపుతాను. చెపుతాను” అని దానిని ఊరడిస్తూ, దాని వీపు నిమిరాను.

ఇప్పుడు దాని గురించి చెప్పాలంటే, ఎక్కడ నుంచి మొదలెట్టాలా అని ఆలోచనలో పడ్డాను.

“ఎక్కడ నుంచేంటీ? నేను వచ్చినప్పటినుండీ చెప్పు” అంది.

“సరే, అయితే మొదలెడుతున్నా! విను. అనగనగా మేము అల్లప్పుడు కాపురం పెట్టిన కొత్తలో, మా ఇంటికి మంచం, బీరువా, ఇలా ఒకొక్కటీ వస్తున్న వరసలోనే.. ఓ బుల్లి ఫ్రిజ్ గృహప్రవేశం చేసింది. చూడ్డానికి చిన్నదైనా, పెద్ద మనసుతోనే మమ్మల్ని చల్లబరిచేది.

ఆ తర్వాత క్రమంగా ఇంట్లో మెంబర్లూ పెరిగారు. సామాన్లూ పెరిగాయి. అప్పుడు ఆ బుల్లి ఫ్రిజ్ ఇరుకైపోయింది. అయినా ఎలాగోలా సహకరిస్తూనే వచ్చింది. ఇంతలోనే అనుకోని సంఘటన జరిగింది. ప్రపంచ యుద్ధ సమయంలో హిరోషిమా నాగసాకీల మీద బాంబులు వేసినట్లే, మా ఇంట్లో పక్కింటివారు బాంబులు వేసారు. వాళ్ళు ఓ పేద్ద రెండు తలుపుల ఫ్రిజ్ తెచ్చుకోవడంతో మా ఇంట మూడో ప్రపంచ యుద్ధం జరిగింది.

అప్పుడే పాడుకున్నాను ఇలా..

“ఎవరో జ్వాలని వెలిగించారూ! వేరెవరో దానికి బలి అయినారూ!”

ఇక చేసేదేముంది? పాపం ఆ పాత బుల్లి ఫ్రిజ్‌కి తిలోదకాలు ఇచ్చేసి.. ఇన్‌స్టాల్‌మెంట్‌తో.. ఆ అతి పెద్ద డబుల్ డోర్ ప్రిజ్‌కి, అదే నీకే.. ఎర్రనీళ్ళు దిష్టి తీసి.. హారతి ఇచ్చి.. స్వాగతం పలికాము.. మేమిద్దరమూ.. వాస్తు ప్రకారం బరువు వుండాల్సిన చోటన మేము, నీకు ప్రాణప్రతిష్ఠ చేసి మురిసిపోయాము. క్రమం తప్పకుండా ప్రతిరోజూ కోలిన్ వేసి నీకు ఫేషియల్ చేసేవాళ్ళం.. మిలమిలా మెరిసే నిన్ను చూసి తాను మురిసిపోయేది. ఇక రోజూ మా ఇంట, మమ్మల్ని ఐస్క్రీమ్ లతో మమ్మల్ని ఐస్ చేసేసి.. మిల్క్ షేక్ లతో రాక్ చేసేసావు కదూ! ఫోన్ చేసి ఫ్రెండ్స్‌ని పిలవడం.. కొత్త ఫ్రిజ్‌లో నుండి చల్లని మజాలతో మజా చేయడం.. నిద్రలో కూడా రెండు తలుపుల నీ యొక్క తలపులే.. కొత్త ఫ్రిజ్‌ని చూసిన కళ్ళతో మొగుడ్ని చూస్తే మొట్టబుద్ధయిందట.. వేళకి మాకు వేడిగా ఏనాడూ తిండి వుండేది కాదు.. ఎప్పుడూ నీ లోంచి బయటకి లాగేవే.. తర్వాత తర్వాత.. రోజులు గడిచే కొద్దీ.. నీ మీద మోజు తగ్గడం మొదలయింది.. అలా అని నిన్ను నిర్లక్ష్యం మాత్రం కాదు. ఎప్పుడూ నీలోపల పెట్టడాలే కానీ.. వాటిని బయటకి తీయడం అరుదుగా వుండేది. నువ్వెంత విశాలహృదయురాలివి కదా అనిపించేది.. ఏది పెట్టినా కాదనవు.. సర్దుకుని పోతావు. వారం కిందటి కొబ్బరి పచ్చడైనా.. పది రోజుల కిందటి ఇడ్లీ పిండైనా కంపు కొట్టినా, ఇంపుగా దాచుకునేదానివి.

తప్పు తప్పు.. పారేయకూడదంటూ.. చుట్టుపక్కల వాళ్లు ఇచ్చిన తిరపతి, అన్నవరం, శబరిమల.. ఇత్యాది దేవుడి ప్రసాదాలన్నీ కళ్ళకద్దుకుని కవర్ పళంగా ఇరికించుకుంటావు. ఏ కంపు.. ఏ గిన్నెలోదో తెలీక ఇంపుగా సతమతమవడం అలవాటైపోయింది. ఏదో సినిమాలో, ఆ బాబూ మోహన్.. ఎందుకు? ఏమిటి? ఎలా? అని అడిగినట్టే, నీ విషయంలో, మేము చెప్పేవి మూడే ముక్కలు..

తెలీదు, గుర్తు లేదు, మర్చిపోయా..

ఇంతే.. ఈ డైలాగ్‌లు మాత్రమే మా స్క్రిప్టులో వున్నట్టున్నాయి.. ఏదడిగినా అవే వల్లె వేసేవారము..

నీలో ఏది పెట్టినా.. పెట్టడం వరకే తన బాధ్యత అనుకుని.. ఆ తర్వాత ఇక వాటి సంగతి గాలికి వదిలేస్తుంది. ఎప్పుడైనా సరే వాటి గురించి అడిగితే వచ్చే మొదటి సమాధానం.. ‘తెలీదు’.

చేసేదిలేక నేనే.. నీలో అంతా వెతికితే.. నేను అడిగిన ఏ పచ్చడో.. నెలల వారీగా పెట్టినవి కంట పడతాయి.. నేను అనుకుంటూ వుంటా… వీటిపై.. డేట్ ఆఫ్ మేన్యుఫాక్చరింగ్.. ఎక్స్పైరీ డేట్ రాసుకుంటే మంచిదని.

“ఉన్నాయి కదా! ఇవిగో అంటే!’ తర్వాత వచ్చే సమాధానం.. ‘అయ్యో.. ఉందా.. గుర్తు లేదు.. పెట్టిన సంగతి’

ఇంకో ఆఖరి సమాధానం ఇదిగో ఈ ప్రశ్నకు.

“ఈ టమాటాలు ఎప్పటివే? మరీ ఇంతలా కుళ్ళి పోయాయి’ అని అడిగితే..

“కిందటి నెలలో రైతుబజారువి అనుకుంటాను.. కూరల టబ్లో మరీ లోపలకి పోయేసరికి.. మర్చిపోయా!”

ఇంతే.. ఇలాగ నిన్ను.. నీతో పాటు నన్ను చిత్రహింసలకి గురి చేస్తోంది. ఎన్ని రకాలుగా వాడవచ్చో అన్ని రకాలుగా నిన్ను వాడేసుకున్నాము. నాకంటే కూడా అమాయక ప్రాణివి నువ్వు.. మర్చిపోయా.. నువ్వు ప్రాణివి కాదు కదూ!

పుష్పకవిమానానివే నువ్వు.. ఎన్ని రకాల డబ్బాలనీ.. గిన్నెలనీ, కవర్లనీ, తాజా వాటినైనా.. బూజు పట్టినవాటినైనా.. కుల మత జాతి వివక్షత అనేదే లేకుండా సర్దుకుపోతావు.. నీలో సర్దించుకుంటావు. నీ అంతటి సహనశీలి.. మరోటి వుండదేమో.. ఆ పవిత్ర గంగానదిలో కాలుష్యం ఎంత కలిపినా.. గంభీరంగా ఎలా సాగిపోతుందో.. నువ్వూ అంతే. నీలో చెత్తాచెదారం ఎంత తోసేసినా కిమ్మనవు. అయినా నీకూ ఒక రోజు వస్తుంది.

“అలుగుటయే యెరుంగని మహామహితాత్ముడు అజాత శత్రుడే అలిగిన నాడు” ఏదో ఒకరోజు నీకు ఆవేశం, ఆక్రోశం రాకపోదు.

అంటూ పొగిడేసరికి,. నా ఇంటి చల్లని తల్లి.. రెండు తలుపుల ఫ్రిజ్ కాస్త, చల్లబడిందనిపించింది. తన గురించి పొగిడేసరికి శాంతించిందనిపించింది.

ఇంచుమించు అందరిళ్ళలోనూ.. ఈ చల్లని తల్లి.. హృదయాంతరంగాల భావన ఒకలాగే వుండి వుంటుంది కదూ! ఎంత బరువుని మోస్తోందో.. ఎంత భారంగా భరిస్తోందో.. పైకి చెప్పదు పాపం.. ఫ్రిజ్జో రక్షతి రక్షిత.. ఆ తల్లిని చక్కగా చూసుకోగలిగితే.. ఆవిడ మనల్ని సదా చల్లగా చూస్తుంది. ఏమంటారు?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here