కలవల కబుర్లు-32

0
15

[ప్రసిద్ధ రచయిత్రి కలవల గిరిజారాణి గారు అందిస్తున్న ఫీచర్ ‘కలవల కబుర్లు’.]

[dropcap]ఈ [/dropcap]మధ్య ఏ ఫంక్షన్‌కి వెళ్ళినా.. మనం చదివించేది వేరే విషయం అనుకోండి..

మనకి వచ్చే మామూళ్ళ సంగతి గురించి చెప్పుకుందాం. అదే రిటర్న్ గిఫ్ట్.

చిన్న పిల్లాడి పుట్టినరోజు ఫంక్షన్ నుండీ.. పెళ్ళిళ్ళు, పేరంటాలు, గృహప్రవేశాలు, ఓణీలు, పంచెలు, ఒకటి కాదు.. రకరకాల ఫంక్షన్లు.

పిల్లాడు అమెరికా వెడుతోంటే ఫంక్షన్, డిగ్రీ సంపాదిస్తే ఫంక్షన్, ఏం తోచకపోతే ఫంక్షన్..

పిలవడం ఓ రిటర్న్ గిఫ్ట్ చేతిలో పెట్టడం మామూలైపోయింది.

ఇహ అవి వాళ్ళ వాళ్ళ తాహతులని బట్టీ, తాహతులు గొప్పలు చూపించుకునేదాని బట్టీ వుంటాయనుకోండి.

బంగారు నగలూ, వెండి వస్తువులూ ఇచ్చే అపర కుబేరులూ, ప్లాస్టిక్ డబ్బాలూ, ప్లేట్లూ ఇచ్చేవారూ ఎవరైనా సరే.. రిటర్న్ గిఫ్ట్ ఇవ్వకపోతే.. పరువు పోతుందేమో అనుకుంటూ.. ఒకోసారి తమ బడ్జెట్ దాటి పోతూంటారు.

ఈ రోజుల్లో ఫంక్షన్ భోజనాల ఖర్చు కూడా మామూలుగా లేదు. ఆ ఫంక్షన్ చేసే వ్యక్తికి, భోజనాల ఖర్చు, హాలు అద్దె, ఇతర ఖర్చులతో పాటు ఇది కూడా ఒకటయిపోయింది. సరే తప్పడం లేదనుకోండి.

కానీ.. వాళ్ళు ఇచ్చే రిటర్న్ గిఫ్ట్ తీసుకున్నవారికి ఉపయోగపడేలా వుండేది ఆలోచించి ఇస్తే బావుంటుంది. అప్పటికే వాళ్ళింట్లో వాడకుండా మూలన మూలుగుతూండే వస్తువులే తిరిగి తిరిగి వస్తోంటే, ఈ రిటర్న్ గిఫ్ట్‌లు అంటేనే విరక్తి పుడుతుంది.

ఇవి కూడా సీజనల్ గా వుంటాయేమో.

ఒకప్పుడు స్టీలు సామాను.. టిఫిన్ బాక్సులు, బేసెన్లు, ప్లేట్లు వరస పెట్టి వుండేవి. ఆ తర్వాత ప్లాస్టిక్ సామాన్లు, వాళ్ళ పేర్లు ప్రింట్ చేసిన గోడ గడియారాలు, బేగ్‌లూ ఇలా ఇంటి నిండా అవే పేరుకుపోతూ వుంటాయి. ఇటు వాడుకోలేము.. అటు ఎవరికీ ఇవ్వలేము.

ఈ ప్లాస్టిక్కు, స్టీలు బొచ్చెల బదులు ఎంచక్కా ఏ పూలమొక్కో ఇస్తే ఎంత బావుంటుందో కదూ! అక్కడక్కడా అవి ఇప్పుడు ఇస్తున్నారు లెండి.

ఏంటో.. అన్నీ నేనే అనేస్తున్నాను..

ఇకపోతే.. కొన్ని చోట్ల చీరలు, ఫేంటు షర్టులు పెడుతూంటారు. వాటి సంగతికొస్తే..

పెళ్ళిళ్ళకీ, ఫంక్షన్‌లకీ వెళ్ళినపుడు పెళ్ళివారు పెట్టే పెట్టుబడి బట్టలు.. ఏవి ఎవరికి ఇవ్వాలన్నదీ.. ముందుగా సెలక్ట్ చేసుకుని ఆ కవర్ల మీద.. ఫలానావారి పేరు రాసిపెడుతూ వుంటాము. ఒకొక్కరికీ ఒకొక్క రకం చీర.. వారి వయసులని బట్టీ.. వారి తాహతులని బట్టీ విడవిడిగా వుంటూంటాయి.

ఆ మధ్య ఓ సినిమాలో.. ఇలాంటి సన్నివేశంలో.. హీరో అంటాడు.. “పెళ్ళికి వచ్చినవారందరూ వధూవరులని ఒకే విధంగా ఆశీర్వదిస్తారు కదా! మరి వారికి పెట్టే బట్టల విషయంలో తేడాలెందుకు?” అంటాడు. నిజమే కదా! అనిపించింది. నిజానికి దగ్గర బంధువులైతే ఎప్పుడూ వస్తూనే వుంటారు. వారికి బట్టలు ఎప్పుడూ పెడుతూనే వుంటాము. దూరపు బంధువులే ఇలా ఏదో పెళ్ళి సందర్భాలలోనే కలుస్తూ వుంటారు.. బోలెడు డబ్బులు పోసి టిక్కెట్లు కొనుక్కుని వస్తారు. దూరపు బంధువులు కదా అని ఏదో తక్కువలో తీసుకోవడం చాలా చోట్ల చూసాను. ఎందుకలా? అసలు పెడితే మంచివి.. వాళ్ళు కట్టుకునేటట్లున్నవి పెట్టాలి.. లేకపోతే మానేయ్యాలి. మడత విప్పి చూస్తే.. ముతక రకాలూ, కుచ్చిళ్ళు వస్తే కొంగు సరిపోదు.. కొంగు తీస్తే కుచ్చిళ్ళకి రాదు.. ఇలాంటివి పెడుతూవుంటారు. పనిమనిషి కూడా కట్టుకోదు ఇలాంటి చీరలు. షాపులో.. పెట్టుడు చీరలకి అని ఓ కౌంటర్ కూడా వుంటుంది. ఏదో పెట్టామన్న పేరుకి పెట్టడం.. ఎందుకా పేరు? తీసుకున్న వాళ్ళు తర్వాత ఎలాగూ వీరికి పేరు పెడతారు.. ముష్టి చీర పెట్టారు అని.. దాని బదులు పెట్టకపోవడమే నయం.. ఏదైనా గిఫ్ట్ ఇచ్చేస్తే సరిపోతుంది పెట్టుబడుల కింద. ఇప్పుడు చాలా మంది అదే చేస్తున్నారు. మళ్లీ అందులో కూడా కాపీనమే..

ఇంటికి వచ్చినవారికి.. పసుపు, కుంకుమతో పాటు పండు తాంబూలం.. జాకెట్టు గుడ్డ పెట్టడం మన సాంప్రదాయం. కొందరిళ్ళలో పెట్టే జాకెట్టు బట్ట ఎవరైనా ఉపయోగించుకునేట్టు వుంటుందా అసలు? నాసిరకంవి.. తెప్పించి వుంచుతారు కొందరు. ఆ షాపుల్లో వాడు.. పెట్టుబడులకీ అంటే చాలు.. వేరే రకం చూపిస్తాడు.. ఇప్పుడు చిన్న చిన్న కవర్లలో చిన్న మడతతో పట్టుబట్టలాంటి జాకెట్టు బట్టలు ఇస్తున్నారు. అవీ డౌటే కుట్టించుకోవడానికి. మొన్న దసరా సందర్భంగా ఒకరు నాకు పండు తాంబూలంతో పాటు పెట్టిన జాకెట్టు బట్ట.. ఎంత బావుందో.. చక్కగా తానులో కట్ చేయించినట్టున్నారు.. హకోబా క్రీమ్ కలర్లో.. వుంది.. వెంటనే కుట్టించేసుకున్నాను.. చాలా బాగుంది అని చెప్పాను వారితో.. ఇవ్వడం సాంప్రదాయమే కానీ.. అది తీసుకున్నవారికి ఉపయోగపడేలా వుంటే బావుంటుంది. అదే మనకి ఎవరైనా ఇస్తే ఎన్ని అనుకుంటామో కదా! మర్యాద ఇచ్చి పుచ్చుకుందాం.

ఇక వేదికలెక్కి ప్రసంగాలు చేసేవారికీ, కవులకీ, రచయితలకీ, ఉద్యోగస్తులు రిటైర్ అయినప్పుడూ దుశ్శాలువలు కప్పి సన్మానం చేస్తూంటారు కదా! నా చిన్నప్పుడు వీటిని శాలువా అనడం తెలీక.. తివాచీ కప్పారు అనేదాన్ని. ఇప్పుడు ఆ మాట తలుచుకుంటే నవ్వొస్తుంది. ఆ మాట సరే కానీ.. ఈ శాలువాలు అన్నేసి వస్తోంటే, వాళ్ళందరూ వాటిని ఏం చేసుకుంటారబ్బా?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here