కలవల కబుర్లు-35

0
11

[ప్రసిద్ధ రచయిత్రి కలవల గిరిజారాణి గారు అందిస్తున్న ఫీచర్ ‘కలవల కబుర్లు’.]

“ఇది హిమాలయాల్లో మంచులో కూర్చుని, తపస్సు చేసుకునే ఆంజనేయస్వామి ఫోటో. ఇంట్లో ఉంచుకుంటే మంచిదట. నేనోటి కొనుక్కుంటూ నీ కోసం ఒకటి తీసుకువచ్చాను వదినా!”

“ఆల్రెడీ హనుమంతులవారు మా ఇంట్లో ఉన్నారు.. వదినా!”

“నేను చెప్పేది మా అన్నయ్య గురించి కాదొదినా!”

“అయ్యో! నే చెప్పేది మీ అన్న హనుమంతులు కాదు. ఆంజనేయస్వామి ఫోటోనే వుందంటున్నాను.”

“కానీ, ఇది ప్రత్యేకమెన ఫోటో అట. వదినా! తప్పకుండా ఉంచాలట.”

“సరే.. అయితే..”

“ఏవోయ్.. మా ఆఫీసులో పనిచేసే తిరుపతి రావు.. తిరుపతి వెళ్ళాడు కదా.. ఆఫీసులో అందరికీ ఈ వెంకటేశ్వరస్వామి పాదాలు ఉండే ఫోటోలు పంచాడు.. తూర్పు గోడకి తప్పనిసరిగా పెట్టుకోవాలట..”

“సరే.. అయితే..”

“అమ్మాయ్.. ఇంట్లో చదువుకునే పిల్లలు ఉంటే.. దక్షిణామూర్తి ఫోటో తప్పనిసరిగా పెట్టుకోవాలట.. నీకోటీ.. అక్కకీ.. అన్నయ్యకీ తీసుకున్నా.. అందరూ పెట్టుకోండి..”

“సరే, అయితే.. అయినా ఇది వరలో వదిన ఇచ్చింది. పిల్లల చదువు కోసం అంటున్నావుగా,. రెండు పెట్టుకుంటే ఇంకా బాగా చదువుతారేమో”

“శివ పార్వతుల ఫామిలీ ఫోటో.. ఈశాన్యంలో పెడితే.. ఆ కుటుంబం హేపీగా ఉంటుందట.”

“సరే.. అయితే..”

ఇంకా ఇలా అన్నవరం.. అయ్యప్ప.. సింహాచలం.. కన్నప్ప.. తిరుపతమ్మ.. చెంగాళమ్మ.. జొన్నవాడ.. బెజవాడ.. ఇలా ఇలా.. వెళ్ళొచ్చిన యాత్రికులందరూ.. తెచ్చిన.. ఇచ్చిన.. ఫోటోలతో గోడలు నిండిపోయాయి..

ఇలా ఇంటి నిండా గోడలకీ, అలమారలకీ, దేవుడి మందిరంలోనూ కిక్కిరిసిపోయే ఫోటోలూ, విగ్రహాలూ, కేలండర్లూ కోకొల్లలయిపోతూ వుంటాయి.

వద్దనడానికి సెంటిమెంట్లూ, భయాలూ, భక్తీ అడ్డొస్తాయి. అలా అని ఇంటి నిండా పేర్చుకోలేము. పేర్చుకోక తప్పదు.

ఇంత వరకూ ఫర్వాలేదు. ఏమో! పెద్దలు, అనుభవజ్ఞులు చెపుతున్నారు. కాదనడం ఎందుకూ? ఏ పుట్టలో ఏ పాముందో?

కానీ ఇవే ఇంకో కరంగా.. ఫేస్‌బుక్ గోడెక్కితే.. ఈ సాయిబాబా ఫోటో చూడగానే పదకొండుమందికి షేరు చేయండి.. మీకు మంచి కలుగుతుంది.. లేకపోతే.. అమ్మో.. ఏ చెడువార్త వినాల్సి వస్తుందో.. చేసేస్తే పోలా..

ఇలాంటివి.. ఒక గోడ మీద నుంచి మరో గోడకి దూకుతూ పాకుతూంటాయి. ఇదో రకం..

ఇది ఇప్పుడు కొత్తగా వచ్చిన ప్రచారం కాదు. ఇదివరలో కూడా మన ఇంటి ఎడ్రస్ ఎలా కనుక్కుంటారో కానీ, పరిచయం లేని వారు కూడా పోస్ట్ కార్డ్ మీద ఏదో మంత్రం రాసేసి.. ఇది నూటా పదకొండు మందికి కార్డులు మీద రాసి పంపాలి. అలా చేయకపోతే మీరు చాలా ఇబ్బందుల్లో పడతారు అని వుండేది. నమ్మినవారు మాత్రం వెంటనే ఈ ప్రాజెక్టు మొదలెట్టేవారు. పంపకపోతే ఏమవుతుందో అని భయం.

మనషి బలహీనతలతోనూ, భయాలతోనూ ఆడుకునే శాడిస్టులు బోలెడు మందున్నారు.

టివీ ఆన్ చేస్తే చాలు “అద్భుతమైన పేకేజీ! నాలుగు వేలు ఖరీదు చేసే లక్ష్మీ యంత్రం. మీకు కేవలం రెండువేలకే! ఇది మీ పూజా మందిరంలో కానీ, ఆఫీసులో కానీ, బీరువాలో కానీ పెట్టుకోండి. ధనప్రాప్తి పొందండి”

తీరా తెప్పించుకుంటే, వంద రూపాయలు కూడా విలువచేయని రాగిరేకు, ఓ కుంకం పొట్లం వుంటుంది అంతే.

“ఆర్ధిక ఇబ్బందులలో ఉన్నారా? మీ అమ్మాయికి పెళ్ళి కుదరలేదా? మీ అబ్బాయికి ఉద్యోగం లేదా? మీ సకల సమస్యలకి ఏకైక పరిష్కారం. వెంటనే శ్రీ శ్రీ శ్రీ మహరాజ్ అవధూత గారిని సంప్రదించండి. ఈ పదో తేది.. కావేరి లాడ్జిలో ఉంటారు. కలిసి మీ సమస్య చెప్పండి. సమాధానం పొందండి. వెయ్యి రూపాయలు కట్టి అపాయింట్మెంట్ తీసుకోండి.”..

చూడబోతే కారాకిళ్ళీ నములుతూ, ఏం చెపుతాడో ఆయనకే అర్థం కాని దొంగ అవధూత బాబా!

ఇలాంటి నకిలీ బాబాల ప్రభంజనంలో.. నిజాన్ని నమ్మలేని రోజులు వచ్చాయి.

నమ్మకాలు, విశ్వాసాలు కోకొల్లలు. ఎవరి నమ్మకం వారిది. కానీ, మోసాలు, ఇలా నమ్మించి మోసాలు చేయడాలు భరించలేము. అమాయకుల నమ్మకాలతో ఆడుకుంటూ, ఇదో వ్యాపారం అయిపోయింది చాలామందికి. డబ్బు సంపాదనకి ఇలాంటి మోసాలు ఓ మార్గం అయింది. ఇదే ఉపాధి కూడా కొందరికి. జనాలు కూడా.. ఇలాంటి వేలంవెర్రికే మొగ్గు చూపుతారు.

దేవుడు ఉన్నాడు అనేది మనం ఒక నమ్మకం తోనూ, విశ్వాసం తోనూ, సంకల్పం తోనూ వుంటే మనకి మంచే జరుగుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here