కలవల కబుర్లు-41

0
11

[ప్రసిద్ధ రచయిత్రి కలవల గిరిజారాణి గారు అందిస్తున్న ఫీచర్ ‘కలవల కబుర్లు’.]

కాకిలా కలకాలం బతికేకంటే అంటారు కానీ.. ఆ కాకిని ఎన్ని రకాలుగా తలుచుకుంటూ వుంటామో కదా! అలా కాకులని తలుచుకుంటూ ఈ రోజు కాకి కబుర్లే చెప్పుకుందామా?

ఎవరూ లేకపోతే ఏకాకి జీవితం అంటారు కదూ!

తోడు వుండదు. కనీసం నీడ కూడా వుండదు.

ఒంటరిగా.. అన్నీ పోగొట్టుకున్నట్లు వుంటే

ఏకాకి.. పదానికి సరైన అర్థంగా అనిపిస్తుంది.

అలాగే.. పదిమంది కలసి గోల గోలగా మాట్లాడితే.. అదేమో కాకిగోల. అయ్యబాబోయ్! భరించలేము.

కాకితో కబురుపెట్టండి.. ఘడియలో మీ ముందుంటా అంటారు. అంటే ఆ కబురు ఇట్టే చేరుతుందని కాబోలు.

దట్టమైన కీకారణ్యం వర్ణించాలంటే అది కాకులు దూరని కారడవి అయిపోతుంది.

చూడముచ్చటగా లేని జంటని పాపం కాకి ముక్కుకి దొండపండు. ఏమో కాకి అంటే అంత తక్కువ చూపు.

అసలు ఒక కాకి చనిపోతే మీరు చూసే వుంటారు.. కావ్ కావ్ మని అరుస్తూ ఎక్కడ నుంచి వస్తాయో కానీ.. గుంపులు గుంపులుగా వాలిపోతాయి. అది చూసే అంటారు ఈ ఐకమత్యం మనుషులలో మాత్రం లేదని. మనుషులైతే పక్కవారికి ఎక్కడ సహాయం చేయాల్సివస్తుందో అని తప్పించుకుని తిరుగుతారు. అసలు ఎక్కడో వున్నవాటికి కూడా వాటి అరుపులతో వార్తని అందించి పిలవడం ఎంత వింత కదా!

లోకుల మాటల గురించి చెప్పాలంటే.. వారిని పలుకాకులు అనడం కద్దు. ఔను మరి వారి నాలికకి హద్గు వుండదు. ఏదైనా మాట్లాడగలరు.

కాస్త రంగు తక్కువగా వుంటే చాలు.. కాకి నలుపే అనేస్తారు.. తప్పు కదా అలా అనడం.. మనసు స్వచ్ఛంగా వుండాలి కానీ.. పైపై రంగులు ఎలా వుంటే ఏంటో..

చిన్నప్పుడు నేర్చుకున్న పాట గుర్తుంగా? ‘కాకి ఒకటి నీళ్ళకి ..కావు కావు మన్నది.’ ..అంటూ ఒక అడుగంటిన కుండలో నీళ్లను గులకరాళ్ళతో పైకి తెప్పించి తాగిందని పాడుకునే వాళ్ళం. కాకి తెలివితేటలకి మెచ్చుకోవాలి.

చిన్నతనంలో, మనం స్నేహితులతో జాంకాయని పంచుకుని తినేది కాకి ఎంగిలితోనే.. డైరెక్ట్‌గా కొరికి ఇస్తే ఎంగిలి అయిపోతుందని.. చొక్కా కిందపెట్టి కొరికి సగం సగం పంచుకునే వాళ్ళం. అదయితే కాకెంగిలి ఫర్వాలేదన్నమాట. ఈ జ్ఞాపకాలన్నీ తియ్యని బాల్యంలో మనం దాచుకున్న నెమలీకలే.

పసి పిల్లలని ఏమార్చడానికి.. వాళ్ళు ఏదైనా అడుగుతూంటే లేదని దాచిపెడుతూ.. ‘హూష్.. కాకీ.. కాకెత్తుకుపోయిందిలే’ అనేసరికి పాపం పిల్లలు నమ్మేసేవాళ్లు. నేరం అంతా కాకి మీద తోసేసేవాళ్ళం.

అన్నిటికన్నా ముఖ్యంగా.. కాకితో మనకి వున్న బంధం.. గతించిన మన పెద్దలకి పెట్టే వాయస పిండం.. ప్రతి కుటుంబం లోనూ ఇదొక మరువలేని సన్నివేశం. ఆ కాకి వచ్చి పిండం తింటే.. మన పెద్దలు వచ్చి తిన్నట్టే మనం సంతోషిస్తాము. ఆ తర్వాతే మనం భుజిస్తాము. ఒకవేళ కాకి వచ్చి తినకపోతే..

ఇంకా ఏ కోరికలు ఉన్నాయో.. కాకి ముట్టనేలేదు.. పాపం అంటాం. మొన్న ఈ మధ్య వచ్చిన బలగం సినిమా ఇదే నేపథ్యంలో తీసారు. ఆ సన్నివేశానికి చూసిన ప్రతి ఒక్కరూ కంటతడి పెట్టి.. వెళ్లి పోయిన తమవారిని జ్ఞప్తికి తెచ్చుకున్నారు.

ఇకపోతే..గిల్టు నగలన్నీ.. కాకి బంగారమే కదూ..

ఇలా మనకి ఈ కాకి.. మన జీవనపయనంలో ఏదో ఒకచోట తనదైన పాత్ర వహిస్తుంది.

మర్చిపోయానండోయ్.. మరో విషయం.. కాకి అరిస్తే చుట్టాలు వస్తారు అనే నానుడి బాగా ప్రాచుర్యంలో వుంది కదూ!

దీని మీద బోలెడు జోకులు కూడా వచ్చాయి.

ఇదివరకు బావిగట్టున పెట్టిన సుబ్బు బిళ్లలు.. తోమడానికి బయటవేసిన నూనెగిన్నెలు, నేతిగిన్నెలు, స్పూన్లు.. చటుక్కున ముక్కున కరుచుకుని ఎత్తుకుని పోయేవీ ఇవేగా.. మనమేమో పనిమనిషి ఎత్తుకుపోయిందేమో అనుకుని ముందు.. తనని అష్టోత్తరం చదివేసేవాళ్ళం.. ఏ బావిలోంచో గేలంతో అవి బయటపడితే, ‘ఓలమ్మో ఓలమ్మో! నానెత్తుకుపోయానని, నన్ను అరిసేసారు కాదేటీ!’ అంటూ చేతిలు తిప్పుకుంటూ ఆ పనిమనిషి దండకం మొదలెట్టేది. మరి కొన్ని ఏ పక్కవాళ్ళ ఇళ్ళలోనో పడేయడం, వాళ్ళు హస్తగతం చేసుకోవడం.. తర్వాత వీటి కోసం మాటా మాటా అనుకోవడం.. అంతా కాకుల మూలానే కదూ!

వడియాలు పెట్టుకోవాలన్నా, పప్పులు గట్రా ఎండబోసుకుందామన్నా బతకనీయవు బాబోయ్.. ఎక్కడ నుంచి వస్తాయో కానీ వెంటనే వచ్చేస్తాయి. అవి దగ్గరకి రాకుండా మా ఇంట్లో ఏదైనా నల్లటి వస్త్రం కానీ, సవరం కానీ అక్కడ పెట్టేవారు. వాటికీ, కాకులు భయపడడానికీ సంబంధం ఏంటో మరి తెలీదు.

చిన్నప్పుడు చెప్పుకున్న కథ గుర్తుందా? కాకి – నక్క కథ.. నోట్లో రొట్టెముక్క పెట్టుకుని చెట్టు కొమ్మన కూర్చుంటే.. నక్కబావ తనని పొగడి పాట పాడమనేసరికి పొంగిపోయి.. కాకి స్వరంతో కూనిరాగాలు అందుకునేలోగా.. నోట్లో వున్న రొట్టె ముక్క జారిపడడం.. అది కాస్త నక్క చేజిక్కించుకుని పారిపోవడం జరిగిపోయింది.

ఉదయమే మా వంటింటి కిటికీ బయట కూర్చుని ఏం పెడతామా అని ఎదురు చూస్తూ వుంటాయి రెండు మూడు కాకులు. ప్రతిరోజూ నిద్ర లేవగానే కాసిని బియ్యం గింజలో.. అన్నమో.. లేదా బ్రెడ్ ముక్కలో ఇలా ఏవుంటే అవి .. కిటికీ గట్టు మీద వాటికి పెట్టడం, ఓ డబ్బాలో నీళ్ళు పోసి పెట్టడం ఇదే నా మొదటి పని. ఏమో ఏ కాకి రూపంలో ఎవరు వచ్చి తింటున్నారో.. వారికి కడుపు నింపుతున్నాను అనిపిస్తుంది.

రాబోయే రోజుల్లో ఈ బహుళ అంతస్తుల నిర్మాణం, చెట్లు కొట్టేయడం, రేడియేషన్‌ని విడదల చేసే టవర్లు పెరగడం ఇంకా ఇటువంటి పలు కారణాలతో కాకులే కాదు.. పలు పక్షి జాతులు అంతరించిపోయే ప్రమాదం ఎక్కువగా వుంటుందట. అలా అవకుండా వుండాలంటే మన వంతు కృషి మనం చేయాలి.

ఇవండీ..ఈరోజుకి ఇలా కాకి కబుర్లు అయిపోయాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here