కలవల కబుర్లు-6

0
8

[ప్రసిద్ధ రచయిత్రి కలవల గిరిజారాణి గారు అందిస్తున్న ఫీచర్ ‘కలవల కబుర్లు’.]

[dropcap]మ[/dropcap]న దేశం వసుధైక కుటుంబం.. మన  భారతీయ వ్యవస్థలో.. పటిష్టమైనదీ.. వేరే దేశాలలో కనపడనిదీ.. ‘కుటుంబ వ్యవస్థ’.

ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలే ఎక్కువగా ఉండేవి. తాతలు, వారి అన్నదమ్ముల భార్యాపిల్లలు.. ఇలా కొన్ని తరాలరందరూ ఒకటే ఇంట్లో కలిసి మెలసి ఉండేవారు. ఇంటి పెద్ద పర్యవేక్షణలో ఇంటిల్లపాది తలో పనీ చేసుకోవడం.. సంపాదన, ఖర్చులు సమానంగా చూసుకోవడం, అందరూ ఒకే మాటగా ఉండడం ఉండేది.

కాలక్రమేణ వచ్చిన మార్పులు.. చదువులతోనూ, ఉద్యోగాలతోనూ వేరు కాపురాలూ.. ఈర్ష్య, అసూయలూ.. మాట పట్టింపులూ, ఒకే చూరు కింద పొసగక పోవడాలు.. ఇలాంటి కారణాలతో.. ఉమ్మడి కుటుంబాలు విచ్ఛిన్నమైపోయాయి.

‘చిన్న కుటుంబమే చింతలు లేని కుటుంబం’ అయిపోయింది.  వీటితో లాభాలు ఉన్నాయి అనుకుంటే.. అంతే సరిసమానంగా నష్టాలూ ఉన్నాయి. అప్పటి ఉమ్మడి కుటుంబాలలో తాతలు, బామ్మలు, పెదనాన్నలు ఇలా పెద్దవారు ఉండడంతో.. ఆ కుటుంబానికి ఎటువంటి కష్టసుఖాలకైనా ఒక పెద్ద గొడుగు పట్టినట్లే ఉండేవారు. వారి అనుభవాలతో.. మనకి మార్గదర్శకంగా ఉండేవారు. ముఖ్యంగా పిల్లలు క్రమశిక్షణతో మెలగడానికి, నీతివంతమైన భవిష్యత్తు రూపుదిద్దడానికి వారి తోడ్పాటు ఎంతగానో ఉండేది. అలాంటి ఇళ్ళలో ప్రేమానురాగాలు వెల్లివిరిసేవి.. పంచుకోవడం అలవాటయేది. కుటుంబ బంధాలు పటిష్టమయేవి. ఇప్పుడు ఇంట్లో మంచీ చెడూ చెప్పే పెద్దలుండకపోవడంతో.. బయట కౌన్సెలింగ్ చెప్పేవారు ఎక్కువ అయ్యారు. అరాకొరా ఇంట్లో తల్లిదండ్రులు, పెద్దలు ఏదైనా చెప్పబోయినా.. ఈ రోజుల్లో పరిస్థితులు మీకేం తెలుసు? మీరు చెప్పేవి ఇప్పుడు చెల్లవు. మీవన్నీ పాత చింతకాయ మాటలు.. అని కొట్టి పారేస్తున్నారు.

ఇప్పుడు ఎవరికి వారే యమునాతీరే అన్నట్టుగా ఉండే.. చిన్న చిన్న కుటుంబాల పరిస్థితి మనం ప్రత్యక్షంగా చూస్తున్నాము. అదుపులో పెట్టేవారు లేక, ఒకవేళ  అక్కడక్కడా కుటుంబ పెద్దలు మంచి చెప్పినా.. నిర్లక్ష్య ధోరణితో పెడచెవిన పెట్టడమే అవుతోంది.

ఇంట్లో మంచి చెడ్డలు చెప్పే పెద్దలు లేక.. ఫేమిలీ కౌన్సిలర్లు దగ్గర చెప్పించుకోవలసి వస్తోంది. భార్యభర్తల మధ్య వచ్చే తగవులు.. ఇంటి గడప దాటకుండా ఆ ఇంటి పెద్దలు పరిష్కరించి.. ఆ జంట మధ్య సామరస్యం చేసేవారు అప్పటి ఉమ్మడి కుటుంబాలలో.. మరి ఇప్పుడు చిన్న తగాదాలకే విడాకుల దాకా పోతున్నారు.

రేపటి తరం ఇటువంటి గొప్ప  కుటుంబ వ్యవస్థని కోల్పోకుండా మన తరం వారిమే.. తిరిగి పటిష్టంగా పునాదులు వేయాలి. కుటుంబ ప్రాముఖ్యత రేపటివారికి తెలియచేయాలి. ఉద్యోగరీత్యా దూరాలనున్నా.. ఏడాదికి ఒకసారైనా, ఏదైనా పండుగకో, పబ్బానికో.. కుటుంబ సభ్యులందరూ కలుసుకోవాలి.. బంధాలూ, అనుబంధాలు పెంపొందింపచేసుకోవాలి. పెద్దవారి అనుభవాలూ, జ్జాపకాలు మనం తెలుసుకోవాలి. అవి మనకి మంచి బాటలు చూపిస్తాయి.

మొన్నటి కరోనా కాలం గడ్డుకాలంలో, ఇంట్లోనే బందీలైపోయినప్పుడు.. ఈ కుటుంబ విలువలు అందరూ తెలుసుకున్నారు. ఎక్కడెక్కడో, ఎప్పుడెప్పుడో విడిపోయిన చుట్టాలని పక్కాలని కలుపుకుని వాట్సప్ గ్రూపులు ఏర్పాటు చేసుకోవడం పలకరించడం బాగానే సాగింది. ఆ బంధాలు అలాగే చిరకాలం కొనసాగించాలి. మీ మీ కుటుంబ సభ్యులతో, బంధువులతో మాట్లాడండి. మనసు విప్పి కబుర్లు చెప్పండి. పెద్దల తరం కనుమరుగై పోయాక మనం చింతించినా లాభం వుండదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here