కాలయంత్రం – కథల తంత్రం – ఒక విశ్లేషణ – 3

3
11

[dropcap]1[/dropcap]952 తరువాత ప్రచురితమయిన చారిత్రిక ఆధారిత కాల్పనిక రచనల జాబితాలో మరో రెండు రచనలు.. దాట్ల  దేవదానం రాజు గారి ఫేస్ బుక్ వాల్ వల్ల గోపరాజు నారాయణ రావు, పుస్తకం.నెట్‌లో అనిల్ డేనీ పుస్తక పరిచయం వల్ల నేతి సూర్యనారాయణ శర్మల రచనల గురించి తెలిసింది.

***

కాలయంత్రం, చరిత్ర  ఆధారిత కథల సంకలనంలో మొత్తం 15 కథలున్నాయి. పేరున్న కథకులు, యువ కథకులు, కొత్త కథకులు ఈ కథల సంకలనంలో చరిత్ర ఆధారిత కథలను రాశారు. ఈ సంకలనంలోని కథలు ఒకదాని తరువాత ఒకటి చదువుతూంటే కొన్ని విషయాలు కొట్టొచ్చినట్టు కనిపిస్తాయి. దాదాపుగా అన్ని కథలు, రచయితతో సంబంధం లేకుండా, అవి ప్రదర్శించే అంశంతో సంబంధం లేకుండా ఒకే రచయిత రాసినట్టు అనిపిస్తాయి. కథను నడిపే విధానంలో, పదాల వాడకంలో, వర్ణనలలో, పాత్రల చిత్రణ, సన్నివేశ సృష్టీకరణ వంటి విషయాలలో కూడా ఈ సామ్యం కనబడటం ఆశ్చర్యం కలిగించే విషయం. కథాంశాల ఎంపికలోనూ, ఎంచుకున్న ప్రధానాంశాన్ని సరయిన రీతిలో ప్రదర్శించటంలోనూ ఒక్క ఆకునూరి హసన్ రాసిన కథ తప్ప మిగతా రచయితల కథలన్నీ (కొందరు అనుభవజ్ఞులయిన కథకుల కథలు కూడా) కథారచనపట్ల ఏమాత్రం అవగాహనలేని నూతన రచయితల కథల్లా అనిపించటం ఆశ్చర్యం కలిగించే విషయం. అంతేకాదు తాము ప్రదర్శించే అంశాన్ని ఎంచుకోవటం విషయంలో కూడా దాదాపుగా ఒకే రకమైన ఆలోచన కనిపించటం, ఏ ఒక్క కథకుడు కూడా చరిత్ర ఆధారిత కాల్పనిక రచన పట్ల అవగాహనను ప్రదర్శించకపోవటం అత్యంత  ఆశ్చర్యం కలిగించే విషయం. తెలుగు పుస్తక ప్రచురణలో సంపాదకుడి వ్యవస్థ లేకపోవటం ఒక పెద్ద లోపంగా పరిగణించేవారు.  ఈ పుస్తకానికి సంపాదకుడు ఉన్నా మామూలుగా రచయితలు తమ కథలను తామే ఎలాంటి సంపాదకత్వం లేకుండా ప్రచురించే పుస్తకాల కన్నా స్థాయి విషయంలో నిరాశను మిగల్చటం ఆలోచనలు రేకెత్తించే విషయం.

ఒక మామూలు సాంఘిక కథా రచనకూ , చరిత్ర ఆథారిత కాల్పనిక   రచనకూ తేడా ఉంటుంది. పాఠకుడు చరిత్ర కథలను చదివే దృష్టి కూడా వేరే ఉంటుంది. సాంఘిక కథల్లో ఆశించేదానికి భిన్నమయిన ఆశలతో చరిత్ర ఆధారిత కథలను చదువుతాడు పాఠకుడు. చరిత్ర ఆధారిత కథల ద్వారా చరిత్ర తెలుసుకోవాలనుకుంటాడు. అప్పటి పరిస్థితులగురించి కొత్త విషయాలు తెలుసుకోవాలనుకుంటాడు. ఉత్తమ వ్యక్తిత్వాలు, ఎత్తుకు పైఎత్తులు, అద్భుతాలు, ఆశ్చర్యాలకోసం ఎదురుచూస్తాడు. మామూలుగా చదివే కథలకన్నా భిన్నమయిన కథకోసం ఎదురుచూస్తాడు. చరిత్ర ఆధారిత కాల్పనిక కథలు రచించే రచయిత ఇది గ్రహించాలి. చరిత్ర ఆధారిత కాల్పనిక కథలు పలురకాలయినా అధికంగా చరిత్ర కథలు రాసేవారు రెండు పద్ధతులను అనుసరిస్తారు. (చరిత్ర ఆధారిత కథలలో రకాలు, ఇతర వివరాలు ఈ విమర్శ తరువాత ప్రచురితమయ్యే వ్యాసంలో వివరంగా వుంటాయి). ఒక పద్ధతిలో, చరిత్రలోని సంఘటనను ఉన్నదిఉన్నట్టు అనుసరిస్తూ, చరిత్రలో నిరూపితమయిన సంఘటనల ద్వారా పాత్రల వ్యక్తిత్వాలను చిత్రిస్తూ, సంఘటనలలో నాటకీయత చొప్పిస్తూ, అత్యవసరమయినప్పుడే కాల్పనిక పాత్రలను ప్రవేశపెడుతూ రచన సాగుతుంది. ఇందులో చరిత్రాంశాలేకాదు, పాత్రలూ దాదాపుగా చారిత్రికమే అయివుంటాయి. రెండో పద్ధతిలో, చరిత్ర నేపథ్యంలో వుంటుంది. కథంతా కల్పిత పాత్రలతో సాగుతుంది. కథ కల్పితం. చరిత్ర నిరూపితం. ఈ పద్ధతిలోనే విభిన్నమైన ప్రక్రియ చరిత్ర ఒక అధ్యాయం, దానితో సంబంధంవున్న కాల్పనిక కథ మరో అధ్యాయం ఒకదానితరువాత ఒకటివస్తాయి.. చివరికి రెండూ కలసిపోతాయి. అంటే నిరూపితం, కల్పితం కలసిపోయి, ఏది చరిత్రనో, ఏది నిరూపితమో వేరుచేసి చెప్పలేని అయోమయంలో పడిపోతాడు పాఠకుడు. చరిత్ర కథ రాసే కథకుడు తాను ఏ ప్రక్రియలో కథ రాయాలో నిర్ణయించుకునేకన్నా ముందు తన కథలో ఏ అంశాన్ని కేంద్రంగా చేసుకుని కథ రచించాలో నిర్ణయించుకోవాలి. ఇది అత్యంత ప్రాధాన్యమయిన విషయం. ఎంతో ఆలోచన, అవగాహన, లోతయిన అధ్యయనం అవసరం, కథలో ప్రదర్శించాల్సిన కేంద్ర బిందువును ఎంచుకోవటంకోసం. ఇక్కడే రచయిత అనుభవం, పరిణతి తెలిసిపోయేది.  కాబట్టి రచయితలు  కథలో ప్రదర్శించేందుకు ఎంచుకునే అంశం పట్ల ఎంతో శ్రద్ధను చూపించాల్సి ఉంటుంది. ఒకవేళ చరిత్రను నేపథ్యంలో ఉంచి, ప్రధానంగా కాల్పనిక కథను రాయాలనుకుంటే ఆ సృజించే పాత్రలు, కాల్పనిక కథ పాఠకులను మెప్పించాలి. అవి చరిత్రలో పాత్రలే అన్న భ్రమను కలిగించాలి.

Evaluating Historical Fiction అన్న పుస్తకంలో ఎడ్గార్ హాస్‌మాన్ నాణ్యమైన చరిత్ర ఆధారిత కాల్పనిక రచనలను నాసిరకం  చరిత్ర ఆధారిత కాల్పనిక రచనల నుంచి వేరుచేసి చూసే  ప్రధాన  అంశాలను పేర్కొన్నాడు.

నాణ్యమైన రచనలో చరిత్ర కథలో అంతర్భాగం అవుతుంది. పనిగట్టుకుని చొప్పించినట్టుండదు. నేపథ్యం, పాత్రలు, సమాజం అప్పటి కాలాన్ని కళ్ళకు కట్టునట్టుంటాయి. చరిత్ర సంబంధిత అంశాలలో పొరపాటు ఉండకూడదు. చిన్న పొరపాటు కూడా రచన పట్ల విముఖత కలిగిస్తుంది పాత్రలు, వాటి ప్రవర్తన నమ్మదగినదిగా తన చుట్టూ ఉన్న మనుషులను గుర్తుచేసేదిగా ఉండాలి. కాల్పనిక కథలో కీలకమైన సన్నివేశాలలో చరిత్రలో బాగా నలిగిన పేర్లను వారి కాలాన్ని ప్రస్తావించాలి. వీటి ద్వారా పాఠకుడికి కథ ఏ కాలంలో జరుగుతోందన్నది తెలిసిపోవాలి. పాత్రల వ్యక్తిత్వాలు సంఘర్షణలు బోధపడాలి. పాఠకులు కథ చదువుతూ ఆ కాలంలో నివసిస్తున్న భావనను అనుభవించాలి. అక్షరాలు వారి మనస్సు తెరలపై ఆ కథను దృశ్య రూపంలో ప్రదర్శించాలి. ఇవన్నీ నాణ్యమైన చరిత్ర ఆథారిత కాల్పనిక  కథ లక్షణాలు (ఈ అంశం గురించి విపులంగా ఉదాహరణలతో ఈ సమీక్ష తరువాత ప్రచురితమయ్యే వ్యాసంలో ఉంటుంది).

ఈ ప్రామాణికాల ఆధారంగా విశ్లేషిస్తే కాలయంత్రంలోని ఏ ఒక్క కథను కూడా చరిత్ర రచనగా పరిగణించటం కష్టం అనిపిస్తుంది. కథలో కన్నా కథను పరిచయం చేస్తూ రాసిన సంపాదకుడి మాటల్లోనే చరిత్ర అధికంగా గోచరిస్తుంది.  సంపాదకుడి పరిచయం లేకపోతే పలు కథల స్థల కాలాలను గుర్తించటం కష్టం. ఒక రెండు మూడు పేరాలు తీసేస్తే అవి చరిత్ర కథలుగా కాక మామూలు కథలుగా మిగిలిపోతాయి. నిజానికి అక్కడ కూడా చరిత్ర కథ అని గుర్తుచేస్తే వాక్యాలు, పేర్లు లేకపోతే వీటిని చరిత్ర ఆధారిత కథలుగా గుర్తించటం కష్టం. ఈ సంకలనంలోని కథలు చదువుతూంటే రచయితలు చరిత్రకథలుగా రాసేసారు. వాటికి చారిత్రక నేపథ్యం జోడించారు తప్ప, చరిత్రను అధ్యయనం చేసి, అవగాహన చేసుకుని, ఒక దృక్కోణంతో చరిత్రను దర్శించి కథను సృజించినట్టు అనిపించదు. ఈ విమర్శను వ్యక్తిగతంగానో, రచయితలను నిరాశపరుస్తున్నట్టుగానో భావించకూడదు. సరయిన మార్గదర్శకత్వం లేకపోతే, తమ కన్నా ముందువారు ఎలా రాశారో తెలుసుకోకపోతే, ముఖ్యంగా చరిత్ర కథ రాయాలన్న ఉత్సాహం తప్ప అవగాహన లేకపోతే ఇలాంటి కథలు వస్తాయి. ఇందులో దోషం రచయితలది కాదు. పరుగు అలవాటులేనివాడికి శిక్షణ ఇవ్వకుండా పరుగెత్తమంటే దోషం పరుగెత్తినవాడిది కాదు.

చరిత్ర ఆధారిత కాల్పనిక రచనలు చేసే రచయితలు తాము ప్రదర్శించదలచిన రూపాన్ని ఎంచుకోవటంలో ఎంతో విచక్షణని చూపించాల్సి ఉంటుంది. కథా రచనలో సగం విజయం సరైన అంశాన్ని ఎంచుకోవటంపై ఆధారపడి ఉంటుంది. అంశాన్ని ఎంచుకున్న తరువాత ఆ అంశాన్ని క్షుణ్ణంగా పరిశోధించి కథకు ఉపయోగపడే విషయాలను కథలో చూపిస్తున్నట్టు కాకుండా అంతర్భాగం అయ్యే రీతిలో ప్రదర్శించాల్సి ఉంటుంది. ఇక్కడే రచయిత విచక్షణ, ప్రతిభ తెలుస్తుంది. తన దగ్గర సమాచారం ఉంది కదా అని సమాచారాన్ని కథలో గుప్పిస్తే కథ వ్యాసం అవుతుంది. పాఠకుడు కథ చదివేందుకు కష్టపడతాడు. కథలో చెప్పదలచుకున్న అంశాన్ని వదలి వాతావరణ సృజన కోసం అప్రస్తుత విషయాలను ప్రదర్శిస్తూపోతే అసలు కథ మరుగునపడుతుంది. పాఠకుడు విసిగి కథను చదవటం మానేసినా ఆశ్చర్యం లేదు. లేదా ఎంత చదివినా కథ అర్థం కాదు. ముఖ్యంగా ఒక అంశాన్ని ఎంచుకుని, ఆ కథ చెప్పటానికి ఒక లక్ష్యం వుండాలి. లక్ష్యంలేని కథలు పాఠకుడు మెచ్చినా మరచిపోతాడు త్వరగా. లక్ష్యం వున్న రచనలను గుర్తుంచుకుంటాడు. చర్చిస్తాడు. విశ్లేషిస్తాడు. అవి ప్రామాణిక చరిత్ర రచనలుగా నిలుస్తాయి.

కాలయంత్రం సంకలనంలోని కథలకు ఎడ్వార్డ్ హౌస్‌మాన్ ప్రామాణికాలు అన్వయించి పరిశీలిస్తే చరిత్ర ఆధారిత కాల్పనిక కథలను ఎలా రాయకూడదో సులభంగా తెలుస్తుంది. అలాగని సంకలనంలో చక్కని కథలు లేవని కాదు కానీ కథలన్నీ చరిత్ర కథలలో ఉండకూడని లోపాలతో ఉండటంతో వాటిని చక్కని కథలుగా పరిగణించటం కుదరదు.

ఆకునూరి హాసన్ రాసిన ‘వసంత మాలిక’ చక్కని కథ. ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా సులభంగా చదివే వీలుంటుంది. ‘చోళ సామ్రాజ్యం ఆంధ్రతీరం యావత్తూ విస్తరించి ఉన్న రోజులు’ అంటూ కథ ఆరంభమవుతుంది అంతే తప్ప చోళుల గురించి కథలో ఏమీలేదు. చోళులెవరు? వారు ఆంధ్రతీరానికి ఏ కాలంలో విస్తరించారు? కథ ఏకాలానికి చెందినది? అప్పటి పరిస్థితులేమిటి? వంటి విషయాలేవీ కథలో తెలియవు. పాశ్చాత్య దేశాల్లో హిస్టారికల్ ఫిక్షన్ కథల విశ్లేషణ నేర్పేప్పుడు కథను గ్రాఫ్ రూపంలో ప్రతిబింబించమంటారు. ఈ కథేకాదు, ఈ సంకలనంలోని ఏ కథకు గ్రాఫ్ గీసినా, అది ఫ్లాట్‌గా మరణించిన మనిషి హృదయ స్పందన  గ్రాఫ్‌లా  వుంటుంది.

కథ ఆ కాలం నాటి దేవదాసీ వ్యవస్థకు సంబంధించినదైతే దేవదాసీ వ్యవస్థ గురించి లోతైన అవగాహన లేదీ కథలో. అసలు దేవదాసీ వ్యవస్థ గురించి ఏమీ లేదు. కనీసం దేవదాసి వ్యవస్థలో చిక్కుకుని ప్రియుడికి దూరమయ్యే ప్రేయసి మనో సంఘర్షణ లేదు. అలాగే ప్రియుడి పాత్ర, వ్యక్తిత్వం పాఠకులను అలరించదు అంటే, కథలో పాత్ర కానీ, నేపథ్యం కానీ, సంఘటనలు కానీ ఏదీ కూడా అలరించటం, మనసుకు పట్టటం వంటివి జరగవు. దాంతో కథను చదవటం పట్ల ఆసక్తి నశిస్తుంది. కథ చదివిన తరువాత కొత్తగా ఏం తెలిసిందంటే, ఏమిలేదు. కథలో ఉద్విగ్నత లేదు, ఉత్తేజం లేదు, కనీసం ప్రేమికుల విషాద ప్రేమ కథ కూడా అలరించదు. ఎందుకంటే పాత్రల నడుమ పరస్పర ప్రేమ ఉన్నట్టు కానీ వారి ప్రేమ తీవ్రతను తెలిపే సంఘటనలు కానీ లేవు. ప్రేయసికి దూరమైన ప్రియుడి ప్రవర్తన కూడా మనసుకు పట్టదు. మొత్తానికి ఒక అనుభవజ్ఞుడైన కథకుడు రాసిన మామూలు స్థాయికన్నా తక్కువ స్థాయి కథ ఇది. చరిత్ర అని సంపాదకుడు చెప్తే తప్ప, చారిత్ర నేపథ్యం కూడా లేని  కథ ఇది. ఈ కథలో ప్రదర్శించిన ఆచారాలు ఏ కాలానివయినా కావచ్చు.  ఇది చరిత్ర ఆధారిత కాల్పనిక కథ కాదు. కాల్పనిక కథ మాత్రమే. సంపాదకుడి ఉపోద్ఘాతం లేకుండా కథ చదివితే ఈ విషయం స్పష్టం అవుతుంది. ఈ లోపం ఈ సంకలనంలోని అధికశాతం కథలలో కనిపిస్తుంది. సంపాదకుడి పరిచయంలో ఉన్నంత చరిత్ర కథల్లో కనబడదు.

బొడ్డేడ బలరామస్వామి కథ ‘గజకేసరి’  నిజానికి ఈ సంకలనంలో ఉన్న కథలన్నిటిలోకి అధికంగా చరిత్రపై ఆధారపడ్డ కథ అయినప్పటికీ ఆకునూరి హాసన్ కథలోని లోపాలను ప్రదర్శిస్తుంది. కథ పేరు ‘గజకేసరి’. గజకేసరి యోగం వల్ల రాజు ప్రౌఢరాయలు ఎన్నో హత్యా ప్రయత్నాల నుంచి తప్పించుకున్నాడని కథలో పలుమార్లు అనటం ఉంది. ఇంతకీ గజకేసరి యోగం అంటే ఏమిటో, అది ఎలాంటి యోగమో, ఏ గ్రహం ఎక్కడ ఉంటే అది గజకేసరి యోగమో కథ చదివినా తెలియదు. కథలో ఎక్కడా ఆ ప్రస్తావన కూడా లేదు. ఎలాగయితే తెరపై తుపాకీ కనిపిస్తే అది పేలాలో, అలాగే కథలో కథ పేరులో వున్న అంశానికి వివరణ, ముఖ్యంగా అది అందరికీ తెలియని విషయమైతే వుండాలి. లేదా కథలో ఆ విషయమై క్లారిఫికేషన్ అయినా వుండాలి.  ఇంతకీ ప్రౌఢరాయలుకు గజకేసరి యోగం ఉన్నట్టు చరిత్రలో ఎక్కడైనా నమోదైందా అన్నదీ తెలియదు. ఈ కథ అబ్దుల్ రజాక్ భారత ప్రయాణానికి సంబంధించి రాసిన అనుభవాల ఆధారంగా సృజించినది. నిజానికి జాగ్రత్తగా రాస్తే అద్భుతమైన కథ అయ్యే అంశం ఇది. కథలో సస్పెన్స్ ఉంది. కుట్రలు ఉన్నాయి, కుతంత్రాలు ఉన్నాయి. ప్రధాన పాత్రపై సానుభూతి కలిగించే వీలుంది. గొప్పతనం ప్రదర్శించే వీలుంది. కానీ కథ చదివితే ఈ భావనలు కలగవు. ఇందుకు ప్రధాన కారణం ఇతర కథలలోలాగే కథ చెప్పిన విధానం. అనుభవం కల కథకుడు రాస్తే వేరేగా ఉండేది కథ. పైగా, రచయితకు దృక్కోణం లేకపోవటం, కథలో ఏ అంశంపై ఫోకస్ చేయాలో అన్న విషయంపై అవగాహన లేకపోవటం ఈ చరిత్రపై ఆధారపడిన కథను దెబ్బ తీసిన అంశం.

కథలో హత్యా ప్రయత్నాలున్నాయి. హత్యా ప్రయత్నాల పట్ల పాఠకులలో ఉత్కంఠ కలగాలంటే, ఎవరిపై హత్య ప్రయత్నాలు జరుగుతున్నాయో, ఆ పాత్ర పాఠకుల మెప్పు పొంది ఉండాలి. హత్యా ప్రయత్నాల నేపథ్యం తెలియాలి. ఓ గుడ్డి అమ్మాయి మంచిది. ఓ గదిలో ఉంది. ఆమెను చంపాలని హంతకుడు వస్తున్నాడు. అప్పుడు ఉత్కంఠ కలుగుతుంది. అంతకుముందు ఆ అమ్మాయి పట్ల సానుభూతి కలిగితేనే హంతకుడు వస్తున్నాడంటే ఉత్కంఠ కలుగుతుంది. రాజు వ్యక్తిత్వం తెలియదు. రాజు గొప్పతనం తెలియదు. కనీసం దుష్టపాత్ర దృక్కోణం తెలియదు. అప్పటి రాజకీయ పరిస్థితులు తెలియవు. కథలో జరుగుతున్న వాటితో పాఠకుడు తాదాత్మ్యం చెందడు. కథ ఎటు సాగుతుందో తెలియకుండా సాగుతుంది. చివరికి రాజును చాకుతో పొడిచినా ఎలాంటి భావన కలగదు.

‘గజకేసరి’ కథను, కథాంశాన్ని ఎంచుకోవటంలో రచయితకు విచక్షణ అవసరం అన్న విషయానికి చక్కటి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. కథా రచనలో అనుభవం లేని రచయిత ఎలాంటి పొరపాట్లు చేస్తాడో తెలుసుకునేందుకు  చక్కని ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఇలాంటి కథలలో పలు సంఘటనలను నిర్లిప్తంగా చెప్పటం కన్నా ఒక ప్రధాన సంఘటనను తీసుకుని నేపథ్యం చెప్తూ, పాత్రల ప్రాధాన్యం వివరిస్తూ, వాటి వ్యక్తిత్వాన్ని ప్రదర్శిస్తూ సాగితే కథ వేరే విధంగా ఉంటుంది. అయితే, అబ్దుల్ రజాక్ రాసిన దాని ఆధారంగా ఎంచుకున్న కథలో రచయిత ఎందుకనో అసలు విషయాన్ని వదిలేసి కథను అసంపూర్ణంగా, హఠాత్తుగా ముగించేశారు. విజయనగరానికి బహమనీ సుల్తానులకు నడుమ ఉన్న శత్రుత్వం జగద్విదితం. విజయనగర రాజు బలహీనుడైతే కబళించాలని బహమనీ సుల్తానులు ఎదురుచూస్తుంటారు. కుట్రకు గురై విజయనగర రాజు ప్రాణాలు ప్రమాదంలో పడ్డాయని తెలియగానే బహమనీ సుల్తాను విజయనగరంపై దాడి చేస్తాడు. గాయపడిన స్థితిలో కూడా విజయనగర రాజు బహమనీ సుల్తానును ఎదుర్కొని తరిమికొడతాడు. ప్రౌఢరాయలు వాలిపోగానే రాజు వైద్యులు చుట్టుముట్టారు. ‘గజకేసరి యోగం మరోసారి రక్షించింది’ అంటూ కథను ముగించటంతో ఈ సంకలనంలోని ఇతర కథలలాగానే ఈ కథ కూడా Focus అన్నది లేకుండా ఏదో రాయాలని రాసిన కథలా అనిపిస్తుంది తప్ప రచయిత హృదయ స్పందనలా అనిపించదు. పైగా బహమనీ సుల్తానులు విజయనగరరాజుల యుద్ధం అనగానే పాఠకుడు సులభంగా అర్థం చేసుకుంటాడు. ఒకవేళ కేవలం హత్య ప్రయత్నమే ప్రధానాంశంగా తీసుకుంటే అప్పుడు కథను చెప్పేందుకు వేరే పద్ధతులున్నాయి.  గజకేసరి యోగం కేంద్ర బిందువు అనుకుంటే దానిగురించి ఎలాంటి సమాచారమూ లేదు.  చక్కటి కథను వ్యర్థం చేసిన భావన కలుగుతుంది.

ఇదే రకమైన Focus లేకపోవటం దాట్ల దేవదానం రాజు రాసిన ‘కోరంగీలు’ లోనూ కనిపిస్తుంది. మొదటి ఆరేడు పేజీలు అయిన తరువాత అసలు కథ ఆరంభమవుతుంది. మరో నాలుగైదు పేజీల్లో కథ అయిపోతుంది. కోరంగీలు అన్నది కథ పేరు కావటంతో కథ ఫోకస్ కోరంగీపై అని అర్థమవుతుంది. ఎడిటర్ పరిచయంలో “ప్రలోభాలకు మభ్యపడి మారీషస్, రీయూనియన్ వంటి ఫ్రెంచ్ కాలనీలలో కూలి పనులకు తరలిపోయిన కోరంగీల కథ ….” అన్నారు. కానీ 12 పేజీల కథలో, వలస వెళ్ళిన కోరంగీ కథ 7వ పేజీ మధ్యనుంచి ఆరంభమయి 9వ పేజీ మధ్యవరకే వుంది. అదీ గుండెలు కరగించేట్టేమీ లేదు. ఈ అసలు కథకు ముందూ వెనుక వున్నదంతా అనవసరం. కథ ఫోకస్ ప్రధాన పాత్ర అయిన వీరయ్యపైనే వుండి, కథను ఆయన దృక్కోణమ్నుంచి చెప్పివుంటే కనీసం పాఠకుడు ఆ పాత్రను అర్థం చేసుకునే వీలు చిక్కేది. కథను ఫ్లాష్‌బాక్‌లో చెప్పటం కోసం ముందంతా అనవసరమయినది చెప్పటంతో అసలు కథ దేనిగురించో అయోమయం కలుగుతుంది. ఒక్క పాత్ర కూడా ఎస్టాబ్లిష్ కాకపోవటంతో  ఏదయితే షాకింగ్ ఎండింగ్ అనుకున్నారో అది పేలవంగా తేలిపోతుంది. ఎందుకంటే కథ ఒక విషయంపై ఫోకస్ కాకుండా వుండటం.  అసలు కథ ఉన్నది సరిగ్గా మూడు పేజీలు. నిజానికి కథకు సంపాదకుడు చేసిన పరిచయంలోని విషయాలు కథలో రావాల్సింది. కానీ ఆనాటి దుర్భర పరిస్థితులు కానీ, పని కోసం వెళ్ళేవారి దుర్భర జీవితం కానీ సరిగ్గా ప్రదర్శితమవలేదు. ఇతర కథలలోలాగే ఈ కథలోనూ మనసును పట్టే పాత్రకానీ, సంఘటన కానీ లేదు. పైగా ‘వరదయ్య’ అసలు కథ రెండు పేజీలే ఉంటుంది. అంటే ఈ కథలో కూడా ప్రధానాంశాన్ని ఎన్నుకుని, లోతైన పరిశోధన చేసి, పాత్రతో తాదాత్మ్యం చెంది రచించే బదులు ‘రాయమన్నారు కాబట్టి రాసినట్టు’ అనిపిస్తుంది తప్ప రచయిత ‘మనసు’ కథలో ఉన్నట్టనిపించదు.

ఇదే ‘సింగుపురం కత’ లోనూ కనిపిస్తుంది.  ఫోకస్ లేకపోవటం, అసలు కథ అప్రస్తుత విషయాల్లో ఎక్కడో అణగిపోవటం ఈ కథలోనూ కనిపిస్తుంది.  దీర్ఘాసి విజయభాస్కర్ రాసిన ఈ కథలో పాత్రల పరిమితి పట్ల సానుభూతి, అవగాహన కలిగే బదులు అంతా తర్కదూరంగా, హాస్యాస్పదంగా అనిపిస్తుంది. మాండలికంలో రాయటం, కాస్త కవితాగానం రాసేస్తే కథ అయిపోతుందనుకుంటే పొరపాటు. ‘మగాడు’ కథలోలాగే ఈ కథలోనూ ఎలాంటి ఆధారాలు, ఋజువులు చూపకుండా ‘సింగుపురం చిత్తు చేసిన సింహబాహు కొడుకే విజయబాహు. అక్కడే వాళ్ళ మదర్ పేరుమీద మా సింహళాన్ని ఎస్టాబ్లిష్ చేశాడు’ అనిపించేసి మన గొప్పతనం నిరూపించేశామనటం ఉంది. అయితే, మగాడు కథకు భిన్నంగా శ్రీకాకుళం వద్ద ఉన్న సింగుపురానికి శ్రీలంకకూ సంబంధంవుందన్న వాదన వుంది. అసలీ కథ చెప్పిన విధానమే గందరగోళంగా ఉంటుంది. ముందు ఆ పుస్తకాలు తగుల బెట్టటం అంతా కథకు అనవసరం. ‘సింహళంను స్థాపించింది మనమే’ అని చెప్పాలనుకున్నప్పుడు కథ Focus దానిమీదే ఉండాలి. కానీ చెప్పాలనుకున్న విషయం ఒకటి, చెప్పిందొకటి అవటంతో అసలు విషయం అప్రస్తుతం అయిపోయింది. Establish కాలేదు. అయితే ఈ కథ ఉన్న ‘మహావంశ’ను పరిశీలించిన వారు ‘సింహపురం’ ఎక్కడుందన్న విషయంలో ఏకాభిప్రాయం వ్యక్తం చేయలేదు. గుజరాత్ నుంచి కళింగ వరకు అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. వాటిలో శ్రీకాకుళంలోని ‘సింగుపురం’ ప్రస్తావన కూడా ఉంది. చివరికి మలేషియా, థాయ్‍లాండ్ పేర్లు కూడా ఈ చర్చల్లో ఉన్నాయి. కాబట్టి శ్రీకాకుళం దగ్గరి ‘సింగుపురమే’ ‘సింహపురం’ అని చెప్పాలనుకుంటే అన్ని ఆధారాలు సేకరించి ‘సింగుపురం’ ‘సింహపురి’ అని నిరూపించే ఉద్దేశంతో  కథ సాగాల్సి ఉంటుంది. ఇందుకు భిన్నంగా   అప్రస్తుతమైన విషయాలన్నీ చెప్పి ఒక్క వాక్యంలో అసలు విషయం చెప్పేసి ‘నిరూపించేశాం’ అనుకుంటే, అది   అనుభవ రాహిత్యాన్ని సూచిస్తుంది తప్ప చరిత్ర ఆధారిత కథగా నిలవదు.

ఈమని శివనాగిరెడ్డి రాసిన ‘ఆగిన అందెల సవ్వడి’ కథలో కూడా ఇతర కథలలాగే ఏ పాత్ర ఎదగక పోవటం, కథ ఎలాంటి ఉత్తేజం, ఉద్విగ్నత లేకుండా సాగటం   చూడవచ్చు. చివరికి అత్యంత రమణీయంగా ఉండాల్సిన శృంగార సన్నివేశాలు, కంటతడి పెట్టించాల్సిన సంఘటనలు కూడా as a matter fact గా సాగిపోతాయి. కథ చూపటం కన్నా చెప్పటం, అదీ హడావిడిగా ఏదో చేయకూడని పని చేస్తున్నట్టుగా గబగబా ముగించి నిట్టుర్చేసినట్టు తోస్తుంది కథ చదువుతుంటే. ‘ఏదో రాయాలి కాబట్టి రాసినట్టుంటుందీ’ కథ కూడా.

మిగతా కథల విశ్లేషణ వచ్చేవారం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here