కాలయంత్రం – కథల తంత్రం – ఒక విశ్లేషణ – 4

3
10

[dropcap]1[/dropcap]952 తరువాత చరిత్ర ఆధారిత కాల్పనిక రచనలు చేసినవారి జాబితాలో పులిచర్ల సాంబశివరావు పేరు చేరుతుంది. ఇటీవలే వారు రాసిన చారిత్రక నవల విడుదలయింది. ఈ విషయం వడ్డి విజయ సారథి పోస్టు వల్ల తెలిసింది.

***

తెలుగులో చరిత్ర ఆధారిత కాల్పనిక రచనలు చేసేవారు గుర్తుంచుకోవాల్సిన అంశం ఒకటుంది. ఆసక్తికరంగా చరిత్రను ప్రదర్శించే చరిత్ర ఆధారిత కాల్పనిక రచనలే పలువురికి చరిత్ర పరిజ్ఞానాన్ని అందిస్తాయి. చరిత్ర పై ఆసక్తి కలిగించి వారిలో చరిత్ర శోధన తృష్ణను రగిలిస్తాయి.  కాబట్టి చరిత్ర ఆధారిత కాల్పనిక రచయితలు తమ రచనలలో సంక్లిష్టత అన్నది లేకుండా చూసుకోవాలి. పాత్రలను పరిచయం చేసేటప్పుడు వాటి ప్రాధాన్యం  తెలిసే రీతిలో పరిచయం చేయాలి. కథలో పాత్రలు వీలైనన్ని తక్కువగా ఉండేటట్టు చూసుకోవాలి. అవసరాన్ని మించిన పాత్రలు, కథకు అవసరం లేని పాత్రలు ఉండకూడదు.  ఎందుకంటే ఎన్ని పాత్రలు ఉంటే అంత అయోమయం కలుగుతుంది. ఎన్ని అనవసరమైన సంఘటనలుంటే అంత అయోమయం కలుగుతుంది.  అనవసరమైన అంశాలు కథలో ఉండకూడదు.  పాత్రలు  పాత్రల నడుమ సంబంధం విషయంలో జరుగుతున్న సంఘటనల విషయంలోనూ అయోమయం కలుగుతుంది. దీనికి తగ్గట్టు కథ ఒక సంఘటన నుంచి మరో సంఘటనకు నడుమ సంబంధం లేకుండా సాగితే అది ఈ అయోమయాన్ని మరింత పెంచుతుంది. ఆపై కథ ముగిసాక కథ అర్థం లేనిదిగా అనిపించి ఇంత శ్రమపడి చదివినదీ వ్యర్థం అనిపిస్తే మొత్తం కథా రచన వ్యర్థం అవుతుంది. అందుకే చరిత్ర కథ రచయితలు ముందుగా తాము ప్రదర్శించవలసిన ప్రధానాంశాన్ని నిర్ణయించుకుని, దానికి అవసరమైన సమాచారాన్ని అవసరమైనన్ని  కల్పనలతో, కాల్పనిక పాత్రలతో మాత్రమే సృజించాలి. తమకు ఉన్న చరిత్ర పరిజ్ఞానాన్నంతా కథలో గుప్పిద్దామని ప్రయత్నించకూడదు. తాము సేకరించిన సమాచారాన్నంతా  ప్రదర్శించేయాలన్న ఆత్రం చూపకూడదు. కథ పరిధులను, పరిమితులను గ్రహించి, ఎంత అవసరమో, అంతమటుకే కథతో సంబంధం ఉన్న అంశాలను మాత్రమే ప్రదర్శించాలి. ముఖ్యంగా తెలుగు పాఠకులను మెప్పించాలని, వారికి చరిత్ర పట్ల ఆసక్తి కలిగేటటువంటి రచనలు చేయాలనుకునేవారు తమ పరిజ్ఞాన ప్రదర్శనకు సంకెళ్ళు వేసుకోవాల్సి ఉంటుంది. లేకపోతే ఆ కథ కాలయంత్రం కథల సంకలనంలో సాయి పాపినేని రచించిన ‘కామవ్వసాని కథ’ లాగా ఉంటుంది.

‘కామవ్వసాని’ కథకు రెండు ఆథారాలున్నాయి. ఒకటి ‘గూడూరు శాసనం’ రెండవది ‘సిద్ధేశ్వర – చరిత్రము’. ఈ రెండింటికి ‘బయ్యారం శాసనం’, ‘మాణగల్లు దాన శాసనాల’ లోని అంశాలను జోడించి పరిశీలిస్తే జరిగిన చరిత్రను ఓ మోస్తరుగా ఊహించే వీలు కలుగుతుంది. అయినప్పటికీ ఇది లభిస్తున్న ఆధారాల ద్వారా చేసిన ఊహనే తప్ప ‘వాస్తవం’ కాదు. కాబట్టి ఎవరైనా ‘ఇదే వాస్తవం’ అంటే ముందుగా ‘వాస్తవం’ అంటే ఏమిటో నిర్వచించమని అడగాల్సి ఉంటుంది.

కాకతీయుల చరిత్ర విషయంలో డాక్టర్ పి.వి పరబ్రహ్మశాస్త్రి గారి తీర్మానాలు, నేలటూరు వేంకట రమణయ్య గార్ల తీర్మానాలు ప్రామాణికం. ఇంతవరకూ వాటిని కాదన్నవారు లేరు. కాకతీయ సామ్రాజ్య స్థాపనలో ప్రధాన పాత్ర పోషించినవి రెండు కుటుంబాలు. మాణగల్లు దాన శాసనం, బయ్యారం శాసనాల ప్రకారం ఆ  రెండు వంశాల వివరాలు లభ్యమవుతున్నాయి.

మాణగల్లు శాసనం బయ్యారం శాసనం
కాకతీయ కుటుంబం దుర్జయ కుటుంబం
గుండీయ రాష్ట్రకూట వెన్ననృప
ఎర్రియ రాష్ట్రకూట మొదటి గుండ్య
బేతీయ రెండవ గుండ్య
కాకర్త్య గుండన మూడవ గుండ్య
ఎర్రయ
పిండి గుండ్యన

మనకు చరిత్రలో మూడవ గుండ్యన దగ్గర నుంచి సరైన ఆధారాలు లభిస్తున్నాయి. రాష్ట్రకూట రాజు రెండవ కృష్టుడు వేంగీ రాజ్యంపై దాడి చేసినప్పుడు మొదటి భీముడు చాళుక్య రాజు . మూడవ గుండ్యన రాష్ట్ర కూటాల తరుపున పోరాడుతూ చాళుక్య భీముడు కొడుకు ‘ఇరిమర్తి గండ’ చేతుల్లో పెరువంగురు (నిడదవోలు) వద్ద ప్రాణాలు కోల్పోయాడు. ఇలా ప్రాణాలు కోల్పోయిన దుందెన గుండ్యనే మూడవ గుండ్యన అని చరిత్రకారుల అభిప్రాయం. ఈయన తరువాత రాజ్యానికి వచ్చిన ఎర్రయ కుర్రదీవి (కొరవి) అధికారి. రాష్ట్రకూటులు, చాళుక్యుల పోరులో కొరవిపై రాష్ట్రకూటులకు అధికారం వచ్చింది. ఎర్రయ రాష్ట్రకూటుల ప్రతినిధిగా ‘కొరవి’లో ఉన్నాడు. తరువాత కాలంలో చాళుక్య భీముడి సహాయంతో ముదిగొండ చాళుక్యులు ఈ ప్రాంతంపై పట్టు సాధించటంతో ‘ఎర్రయ’ కొరవిని కోల్పోయాడు.

ఇక్కడ బయ్యారం శాసనం ప్రసక్తి వస్తుంది. బయ్యారం శాసనం ‘గురుడ బేత’ గురించి ప్రస్తావిస్తుంది. ముదిగొండ చాళుక్యుల నేత బొట్టు బేత  నాలుగవ గుండ్యానను సంహరించి అధికారం సాధించినప్పుడు ‘గరుడ బేత’ పిల్లవాడు. తండ్రి మరణంతో సర్వం కోల్పోయాడు గరుడ బేత. అంటే ‘The Kakatiya family itself was about to become extinct, deprived of political recognition.’ కాకతీయ వంశం రాజవంశంగా అంతరించే పరిస్థితి వచ్చిందన్నమాట. ఈ సమయంలో అతని మేనత్త, విరియాల ఎర్రయ్య భార్య ‘కామవ్వసాని’ రంగప్రవేశం చేస్తుంది. చాళుక్య సామ్రాజ్యాధీశుడిని మెప్పించి గరుడ బేతకు రాజు అనుగ్రహం ప్రాప్తించేట్టు చేస్తుంది. ఇది జరగకపోతే కాకతీయ వంశం రాజ్యాధికారం మొగ్గలోనే నశించేది. కామవ్వసాని, మూడవ గుండ్యానలది సోదర సోదరీ సంబంధం.

సిద్ధేశ్వర చరిత్ర ప్రకారం ‘గండ’ కొడుకు ఎరుకదేవరాజు భార్య కుంతలదేవి బాలుడైన బేతరాజు తరపున రాజ్యం చేసి, అతడు ఎదిగిన తరువాత అతడికి రాజ్యం అప్పచెప్పింది. కుంతలదేవి, కామవ్వసాని ఒకరే అని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఈ సందర్భంగా వ్యాఖ్యానిస్తూ డాక్టర్ పి.వి పరబ్రహ్మ శాస్త్రి “It is not unreasonable to believe that Viriyala Erra’s wife Kamavvasani out of relationship took up the cause of Garuda Beta and helped him through her husband who already won the favour of the king by reinstating Bottu Beta at Koravi” అని వ్యాఖ్యానిస్తారు. అంటే కామవ్వసాని కథను ఎవరు ఏ కోణంలో రాసినా, ఎన్ని కల్పనలు చేసినా పరబ్రహ్మశాస్త్రి గారి తీర్మానం పరిధిలోనే జరగాల్సి ఉంటుంది. ‘విరియాల కామవ్వసాని తన భర్త సహాయంతో, తన మేనల్లుడు గరుడ బేతను రాజ్యంపై ఉంచి, తాను సంరక్షకురాలిగా ఉన్నది.’ అన్నదాని ఆధారంగా ఎవరెన్ని రకాల కల్పనలైనా చేయవచ్చు. వీరి వ్యక్తిత్వాలను ఔచిత్య పరిధి దాటకుండా, తార్కికంగా రూపొందించవచ్చు. ఇది చరిత్రకారులు ఆమోదించిన ‘కామవ్వసాని’ కథాబీజం.

కామవ్వసాని కథ సంపాదకుడి మాటలో ‘ఈ ఆధారాలతో కాకతీయుల వంశాన్ని కాపాడిన ‘కామవ్వసాని’ కథ ద్వారా కాకతీయుల మూలాలను, తర్వాత వారి ప్రాభవానికి కారణభూతమైన అనుమకొండ ప్రాముఖ్యతను చూపడమేకాక, ఏడు శతాబ్దాలు సాగిన అంధయుగం తరువాత ఆంధ్రదేశాన్నంతటిని ఒక తాటిపై తెచ్చిన కాకతీయ సామ్రాజ్యానికి పునాది వేసిన ఒక స్త్రీ కథ ద్వారా, ఒక అమాయకమైన ఆడబిడ్డ మనసును ఆనాటి పరిస్థితులు ఎంత కఠినంగా మార్చగలవో ఆవిష్కరించే ప్రయత్నం చేశారు’ అన్నారు. ఇంతకీ విరియాల కామసాని మొగ్గలో తుడిచిపెట్టుకుపోయే స్థితిలో కాకతీయుల పూర్వీకుడయిన గరుడ బేతయకు రాజానుగ్రహం కలిగించి, అతను ఎదిగేవరకూ సమ్రక్షణ బాధ్యత స్వీకరించిందే తప్ప, కాకతీయ సామ్రాజ్యానికి పునాది వేసిన స్త్రీ కాదు. ఇది గమనించాల్సిన విషయం.

ఈ పై వ్యాఖ్యలో ‘ఏడు శతాబ్దాలు సాగిన అంధయుగం’ అన్న వాక్యం ఆమోదయోగ్యం కాదు. ఏడు శతాబ్దాలు అంటే ఏడువందల ఏళ్ళు. ‘కాకతీయులలో మొదటి ప్రభువైన బేతరాజు (మొదటివాడు) క్రీ.శ. 1000  సంవత్సరమున రాజ్య పాలనను ప్రారంభించినట్టు మనము చూడగలము” అంటారు ఆచార్య ఖండవల్లి లక్ష్మీ రంజనం, ఖండవల్లి బాలేందు శేఖరంలు ‘ఆంధ్రుల చరిత్ర – సంస్కృతి’ పుస్తకంలో (పేజీ 158). ‘కాకతి బేతయ్య 1052 వరకూ జీవించాడు’ అని కాలయంత్రం సంపాదకులు తమ నోట్‍లో రాశారు. అప్పటి శతాబ్దం వరకు ఏడువందల ఏళ్ళు అంటే 4వ శతాబ్దం. అంటే నాలుగవ శతాబ్దం నుంచి పదకొండవ  శతాబ్దం వరకు ‘అంధయుగం’ అన్నది సంపాదకుల అభిప్రాయమా? శాతవాహనుల తరువాత పల్లవులు, బృహత్పలాయనులు, ఆనందులు, శాలంకాయనులు, విష్ణుకుండినులు, కళింగులు, గంగ వంశజులు, తూర్పు చాళుక్యులు, చోడులు ఆంధ్రదేశాన్ని పాలించిన కొన్ని రాజవంశాలు. ఈ కాలంలో బౌద్ధం విజృంభించింది. దిగజారింది. అనేక అద్భుతమైన కట్టడాలు వెలిశాయి.  ఈ కాలంలో  వ్యాపారుల కూటములు   విదేశీప్రయాణాలు చేశాయి. ఇతరదేశాలలో భారతీయ సంస్కృతి, సాంప్రదాయాల విస్తరణ జరిగింది. బృహత్ ఆలయాలు వెలిశాయి.  ఇది అంధయుగం ఎలా అయింది? రాజుల నడుమ యుద్ధాలు జరుగుతూండటం సర్వసాధారణం. కాకతీయులు కూడా ఏనాడూ ప్రశాంతంగా రాజ్యం చేయలేదు. అసలు అంధయుగం కాకతీయ సామ్రాజ్య పతనం తరువాత సంభవించింది. ఇంతలో నాయకులు, రెడ్డిరాజులు చిరుదివ్వెను వెలిగించారు. అది విజయనగర సామ్రాజ్య స్థాపనతో ‘అఖండదీపం’ అయింది. కాబట్టి, కాకతీయులకు ముందు అఖండ ఆంధ్ర ప్రాంతాలలో అంధయుగం నెలకొన్నదన్న వ్యాఖ్య సత్యదూరం. ఆమోదయోగ్యంకాదు.

ఇక ‘కామవ్వసాని’ కథను పరిశీలిస్తే సంపాదకుడి వ్యాఖ్యలోని ఏ అంశం కూడా కథలో ప్రతిబింబించదు. ‘ఆడబిడ్డ’ మనసు కనబడనే కనబడదు. కథలో పాఠకులు లీనమయ్యే వీలు లేకుండా ప్రతి అధ్యాయంలో కొత్త పాత్రలు రంగ ప్రవేశం చేస్తూంటాయి. అంతకుముందు జరిగినదానితో సంబంధం ఏమిటో అర్థం కాని రీతిలో ప్రవర్తిస్తాయి. పైగా అధ్యాయం అధ్యాయానికి కొత్త పాత్రలు ప్రవేశించటం అయోమయం కలిగిస్తుంది. దీనికితోడు అనవసరమైన వర్ణనలు, కథకు సంబంధం లేని సమాచారం, పరిచయం లేని పదాల వాడకం కథను గజిబిజిగా అయోమయంగా చేస్తాయి. కథ చదవటాన్ని ఒక ప్రయాసగా, పెద్ద బండరాయిని భుజం మీద ఎత్తుకుని కొండనెక్కుతున్న భావనను కలిగిస్తాయి. తీరా ఇంత ప్రయాసపడి సాధించేదేమిటంటే… ఏమీ లేదు. కాకతీయుల మూలాల సంగతి ప్రస్తావించటం అటుంచి, సంపాదకుడి నోట్ లేకపోతే, చరిత్రతో పెద్ద పరిచయంలేని సామాన్య పాఠకుడికి ఈ కథ కాకతీయులకు సంబంధించిందని తెలిసేవీలు లేదు. సామాన్య పాఠకులలో ఎంతమందికి కాకతీయుల పూర్వీకుడు దండెన గుండడు అని తెలుసు? ఎంతమందికి గరుడ బేతయ గురించి తెలుసు? కథలో ఎక్కడా కాకతీయ అన్న పదం రాదు. ఒక సందర్భంలో ” ఆ సమయంలో కాకతెమ్మ అనుగ్రహమేమో అనుమకొండకు వచ్చిందామె” (పేజీ 187) అన్న వాక్యంలో తప్పించి కాకతి అన్న పదం కథలో రాదు. అంటే సామాన్య పాఠకుడికి ఈ కథకీ కాకతీయులకూ సంబంధం తెలిసే వీలు లేదు. విరియాల కామసాని కాకతీయ వంశానికి చెందిన రాజును రక్షించినామెనే తప్ప ఆమెది విరియాల వంశం. అంటే రచయిత కథలో పలు రకాల అనవసరమైన వివరాలు, వర్ణనలు, కథతో సంబంధంలేని అనేకానేక పేర్లు ప్రస్తావించటంపై చూపిన శ్రద్ధ తాను ప్రదర్శిస్తున్న కథాంశంపైనే పెట్టలేదన్నమాట.

‘కాలయంత్రం’ సంకలనంలోని ఇతర కథలలోలాగే ఈ కథలోనూ focus లేదు. ఏ అంశానికి ప్రాధాన్యం ఇవ్వాలోనన్న విషయంలో స్పష్టత లేదు. ఏవేవో గొప్ప విషయాలు చెప్తున్నానన్న భావన అడుగడుగునా కనిపిస్తుంటుంది తప్ప ఆ విషయంలో గొప్ప ఏమిటో అర్థం కాదు. ఇంతకీ కథ చెప్పటంలో ఒకో పాత్ర పేరుకు ఒకో అధ్యాయం ఉండటం ఎందుకో అర్థం కాదు. ఎందుకంటే కథ మామూలుగా నడుస్తుంటుంది. ఆ అధ్యాయం  ఆ పాత్ర దృక్కోణంలో సాగదు. కనీసం ఆ అధ్యాయంలో ఆ పాత్ర ప్రాధాన్యం అంతంత మాత్రమే. ‘పిండి గుండన’ చెప్పిన కథ’లో ‘పిండి గుండన’ మనకు కథ చెప్పడు. రచయిత చెప్తాడు. ఈ అధ్యాయంలో ఎర్రయకు కామసానికి పరిచయం ఉంటుంది. వాళ్ళ పెళ్ళి జరగటం ఉంటుంది. అంతే తప్ప అది అతను చెప్పిన కథ కాదు. అన్ని అధ్యాయాలూ ఇంతే.  ఈ అధ్యాయంలోని వర్ణనలు, పలు ఇతర అంశాలు కథకు ఏమాత్రం పనికిరావు.  ఇలాంటివి కథా రచన ప్రక్రియలో రచయిత పట్టును, అవగాహనను ప్రశ్నార్థకంలో పారేస్తాయి. ‘రచయిత ఆలోచనలలో స్పష్టత కొరవడిందేమో’ననిపిస్తాయి.

టూకీగా కామవ్వసాని కథను చెప్పుకోవాల్సివుంటుంది. పిండి గుండన చెల్లెలు కామవ్వ. ఆమె బావ ఎర్రయ్యను వివాహమాడుతుంది. పిండి గుండ్యన కొడుకు బేతయ. పురిటిలోనే తల్లిని పోగొట్టుకోవటంతో కామవ్వసాని వద్ద పెరుగుతాడు. కొరివి బొట్టు బేతయ వశమవుతుంది. అతడు కామవ్వసానిని పిల్లలను బంధిస్తాడు. కామవ్వసాని తండ్రి చనిపోతాడు. ఎర్రయ చాళుక్య రాజు ఓటమి వార్త విని ఆత్మహత్య చేసుకుంటాడు. దాంతో కామవ్వసాని పై బొట్టు బేతయ వొత్తిడి ఎక్కువవుతుంది. ఒకరోజు ఆమె పిల్లలతో సహా తప్పించుకుని పోతుంది. ఆమె అనుమకొండలో అందరికీ మాతృసమానమవుతుంది. ఆమె దగ్గరికి మాన్యఖేట వారసుడు జయసింహుడు వచ్చిచేరతాడు. ఏడేళ్ళలో అనుమకొండ సురక్షితమయిన కోటతో సుశిక్షితులయిన సైన్యంతో , పూర్వపు సబ్బినాడులో చాళుక్యుల ఆధీనంలో ఉన్న ప్రాంతాలన్నిటినీ కలుపుకుని, ఆంధ్రదేశపు నడిబొడ్డులో ఒక నూతన శక్తిగా ఎదిగింది అంటాడు రచయిత ఈ సందర్భంగా. జయసింహుడు మాన్యఖేట సింహాసనాన్ని అధిష్టిస్తాడు. రాజమహేంద్రి గెలుచుకోవాలనుకుంటాడు. దానికి వ్యూహానికి అనుమకొండనే కేంద్రం. ఇంతలో కామవ్వసాని చక్రవర్తిని కలసి అందరూ ఆమెకే కప్పం చెల్లించాలన్న ఆదేశాన్ని పట్టుకువస్తుంది. అనుకున్నట్టే జైత్రయాత్ర జరుగుతుంది. బొట్టు బేతడిని పట్తుకుతెచ్చి కామవ్వసాని ముందు పారేస్త్తాడు . అతడిని కొరతగడ్డపై కూర్చోబెడతారు. అతని చావుకై క్షణం కూడా కళ్ళు మరల్చకుండా చూస్తూంటుంది కామసాని. ఇదీ కథ!!

ఈ కథ అనవసరమయిన చర్చలు, వర్ణనలతో నిండి అసలు కథేమిటో అర్ధంకాని పరిస్థితిని కల్పిస్తాయి. రచనలో పలు సందర్భాలలో రచయిత ఎలాంటి వివరణ లేకుండా పలు సంక్లిష్టమైన పదాలను వాడటంతో, సామాన్య పాఠకుడు అనేకమైన అర్థంకాని పదాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. కథ చదవటంలో, అర్థం చేసుకోవటంలో, ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ‘మరుత్తుల అచ్చుకట్టు తరినేల’ ‘వెలిపొలాలు’ ‘సిద్ధాయాలు’ ‘నీరుడిపన్నులు’ ‘కానికెలు’ ‘పంగ తప్పుట’ ‘ఇల్లరి’ వంటి పదాలు   సామాన్యులకు అందవు. రచన అందరికీ అర్థం కావాలని కఠిన పదాల వాడకాన్ని పరిహరించిన తరుణంలో, సామాన్యులకు పరిచయం లేని ఇలాంటి పదాలను ఎలాంటి వివరణ లేకుండా వాడటం రచనను నిర్వీర్యం చేసే అంశం. అలాగని, ఇలాంటి పదాలు వాడకూడదని కాదు. వాటి అర్థం కూడా ఇస్తే పాఠకుడికి పదాల అర్థం తెలుస్తుంది. కథను మరింత సులభంగా అర్థం చేసుకోగలుగుతాడు. పాఠకుడిని ఎడ్యుకేట్ చేసినవాడూ అవుతాడు రచయిత. అయితే ఈ సందర్భాలూ, ఈ వర్ణనలూ కథకు ఏమాత్రం దోహదం చేయవు. ఇవి లేకున్నా కథకు ఎలాంటి నష్టం లేదు. పాఠకులకు ఆనాటి పరిస్థితులను చేరువ చేయాలనుకోవటం అభిలషణీయమే అయినా సందర్భరహితంగా, అర్థంకాని పదాలతో అనవసరం.   ఇవి కేవలం రచయిత పరిజ్ఞాన ప్రదర్శనకు తప్ప ఎలాంటి ప్రయోజనం సాధించవు.

ఇక కథలో ‘నాటికి మూడుతరాల వెనుక’ ‘దండెన – గుండడు’ అనే పూర్వీకుడొకడు రట్ట ప్రభువు కన్హర దేవుని సేవలో లెంక(?)గా, బాహాబాహీ  యుద్ధంలో చాళుక్య భీముని కొడుకు ఇరమర్తి గండని చంపి’ (పేజి 172) అంటాడు రచయిత.

“In the Masulipatnam  plates of Bhima I have notice that his eldest son Irimarthiganda killed a Rashtrakuta general Dandena Gunda, in an engagement that took place at Peruvangunda’. (The Kakatiyas by Dr PV Parabrahma Sastry Page No. 38) అంటే చరిత్రలో దొరికిన ఆధారాల ప్రకారం ‘దండిన గుండ’ రాష్ట్రకూట రాకుమారుడు ఇరుమర్తి గండడి చేతిలో మరణించాడు. కాని చరిత్ర ఆధారిత కాల్పనిక రచనలో ఇరుమర్తి గండడిని బాహాబాహి యుద్ధంలో దండిన గుండెడు చంపాడు. చరిత్ర ఆధారిత కల్పన కాదు ఇది. రచయితలు చరిత్రను మార్చలేరు. చరిత్రలో ఉన్న అంశం ఆధారంగా ఎన్ని కల్పనలైనా చేయవచ్చు. అది బాహాబాహీ యుద్ధం కావచ్చు. కత్తియుద్ధం కావచ్చు. గుర్రం పై నుంచి దూకుతూ, ఏనుగు తొండాలను పట్టుకుని వ్రేలాడుతూ, నేలపై పడి పొర్లుతూ, బురదగుంటల్లో దొర్లుతూ, ఆకాశంలో ఎగుర్తూ, మేఘాలపై వ్రేలాడుతూ  ఎక్కడైనా, ఎలాగైనా వారి యుద్ధాన్ని ఊహించి వర్ణించవచ్చు. ఎంతటి భీకరమైన యుద్ధమైనా కావచ్చు. ఎంతటి శౌర్యాన్నయినా ప్రదర్శించవచ్చు. కానీ ఇరుమర్తి గండడి చేతిలో దండిన గుండడు మరణించాల్సిందే! అతని తలరాతను, మరణాన్ని పరబ్రహ్మశాస్త్రి కూడా మార్చలేరు! ఇక ఈ కథలోని అప్రస్తుత అంశాలను లెక్కించాలంటే తొంభైశాతం పైగా కథను ప్రస్తావించాల్సి ఉంటుంది. అవన్నీ చదువుతుంటే ఈ కథలో ‘ఎర్రయ్య’ అడిగినట్టు ‘ఎందుకింతగా చెప్తున్నావ్ బావా?’ అని అడగాలనిపిస్తుంది.

ఎర్రయ, గుండ్యనల పరిచయం అయిన తరువాత నుంచి ముహూర్తం నిర్ణయించటం, పెళ్ళి అవటం దానికి సంబంధించిన వర్ణనలు, సంభాషణలు రచయిత ఆనాటి పరిస్థితులను చెప్పాలని ప్రయత్నించినట్టు తోస్తున్నది కానీ అనవసరమైనవి కథా గమనానికి అడ్డుపడతాయి. కథ నడవదు. పేజీలు నడుస్తుంటాయి. ఈ భాగంలో వచ్చిన పేర్లు, వ్యక్తులవి, ప్రాంతాలవి  కథలోని విసుగుకి, అయోమయాన్ని జోడిస్తాయి.

రేచర్ల బమ్మడు చెప్పిన కథలో కూడా అనవసరమైన సమాచారం కుప్పలు తెప్పలుగా ఉంటుంది. ఏ రకంగానూ కథను ముందుకు నడపదు. దీనికితోడు అనవసరమైన పాత్రల పరిచయం ఉంటుంది. గొగ్డడు, బొల్లయ, వెజ్జు,. ఎర్రయ ‘కొరవి’లో బొట్టు బేతడి ఆధీనంలో ఎందుకు ఉన్నాడో  రచయిత వివరణ ఇవ్వలేదు. ఎందుకంటే నేలటూరి వెంకటరమణయ్య కానీ, పరబ్రహ్మ శాస్త్రి కానీ చెప్పిన చరిత్ర ప్రకారం ఎర్రయ, చాళుక్యులకు విధేయుడిగా ఉంటూ బొట్టు బేతన కొరవిపై అధికారం సాధించటంలో తోడ్పడ్డాడు. ఆ రకంగా చాళుక్య ప్రభువుల దృష్టిలో ఎర్రయ ప్రత్యేక గుర్తింపు పొందాడు.

‘విరియాల ప్రభువులు అప్రతిహతంగా ఏలిన కొఱవికోట నేడు వారికి కారాగృహంలా మారింది’ (పేజి 180)

“It’s is not unreasonable to believe that Viriyala Erra’s wife Kamavasani out of relationship took up the cause of Garuda Beta and helped him through her husband who already won the favor of the kind by reinstating Bottu Beta at Koravi’ (Kakatiya by Parabrahma Sastry Page No. 43)

విరియాల కామసాని భర్త విరియాల ఎర్ర , చాళక్య ప్రభువుకు ప్రీతిపాత్రుడు ఎందుకయ్యాడంటే ‘Gunda IV was slain by Viriyala Erraa’ అంటే కామవ్వసాని సోదరుడుని చంపి రాజ్యం బొట్టు బేతకు అప్పజెప్పి ప్రభువు పట్ల తన విధేయతను ప్రకటించుకున్నాడన్నమాట విరియాల ఎర్ర. అతని భార్య విరియాల కామవ్వసాని. అలాంటప్పుడు ప్రభువులకు విధేయుడుగా ఉండి తాను కొరవి గెలవటంలో సహాయపడిన ఎర్రయ  భార్యను బొట్టు బేత ఎందుకని బంధించాడు? విరియాల కామసాని వైపు చెడు దృక్కులు ప్రసరించే ధైర్యం ఎలా చేశాడు? ఈ సమయంలో ఎర్రయ ఏం చేస్తున్నాడు? అందరూ దండం పెట్టి గౌరవించే పని కామవ్వసాని ఏం చేసింది? మరి ఆమె భర్త వీరుడు ఎర్రయ్య ఏమయ్యాడు? అయితే, బొట్టు బేతకు కొరవి చిక్కటంలో సహాయం చేసిన ఎర్రయ నిస్సహాయుడు ఎలా అయ్యాడు?  పైగా, ఎర్రయ చాళుక్య ప్రభువుకు ప్రీతిపాత్రుడని చరిత్రకారులు చెప్తున్నారు. అలాంటప్పుడు ఎర్రయ దయాదాక్షిణ్యాలతో కొరవిపై అధికారం సాధించిన బొట్టు బేత ఎర్రయ కుటుంబాన్ని ఎందుకని బంధించాడు? విరియాలవారికి కొరవి చెరసాల ఎందుకయింది? చాళక్య ప్రభువు తరఫున యుద్ధంలో పాల్గొని, ఆయన మరణిస్తే ఆత్మహత్య చేసుకున్న( కథ ప్రకారం) ఎర్రయను సామంతరాజు బొట్టుబేతయ చెరలో పెడితే ప్రభువు ఎలా వూర్కున్నాడు? ఇంతకీ కొరవిపై విరియాలవారు కాదు, కాకతీయుల పూర్వీకులు (అప్పటికి వారికాపేరు రాలేదు) అధికారం నెరపేవారు. ఇవేవీ చెప్పకుండా “ఎర్రయ ప్రభువు నిస్సహాయుడు” (పేజీ 180) అని వ్యాఖ్యానిస్తే, అంతకుముందు మేనల్లుడికి కామవ్వసాని పాలిస్తున్నట్టు చెప్పి తరువాత పేరాలోనే వారు నిస్సహాయులనిచెప్తే , చరిత్ర సంగతి అటుంచి కథ ఏమిటో, ఎటుపోతోందో ఏమీ అర్ధంకాదు.
ఇలా అనేక ప్రశ్నలు కథలో అడుగడుగునా ఉత్పన్నమవుతాయి. చరిత్ర ఆధారిత కాల్పనిక కథలో, ఇదేమిటి? ఇదెలా సాధ్యం? అన్న ప్రశ్నలు ఉత్పన్నమయితే కథకుడు విఫలమయినట్టే.  అయితే ఈ కథలో చిత్రించినట్టు బొట్టు బేతయ శక్తిమంతుడు కాడు. చాళుక్య ప్రభువు దయా దాక్షిణ్యాలపై ఆధారపడ్డవాడు. ఇక కథలో కామవ్వసాని పెద్ద సైన్యాధికారిగా గొప్ప రాజకీయ చతురత కలదిగా చూపించారు. ఇదీ అనౌచిత్యం. చరిత్రలో ఆమోదించిన దాని ప్రకారం ఆమె గరుడ బేతయతో చాళుక్య ప్రభువును కలుస్తుంది. గరుడు బేతయకు  చిన్న సంస్థానం ఇప్పిస్తుంది. ఇంతే  ఆమె చేసింది. ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే, చరిత్రలో  బొట్టు బేతయ్య  ఏమయ్యాడో తెలియదు. మళ్ళీ అతని వంశానికి చెందినవారి ప్రసక్తి 90 ఏళ్ళ తరువాత వస్తుంది. కానీ కథలో అతడు శక్తిమంతుడు, కామవ్వసాని కోసం ఆశపడతాడు. ఆమె  సైన్యం సేకరిస్తుంది, బొట్టు బేతయను చంపిస్తుంది. ఇదంతా అసంబద్ధం.  ఇక ‘అనుమకొండ’ను గరుడు బేతయ పోరులో సాధించలేదు.

“Consequent on the loss of Koravi, Beta I with the help of Sura made temporarily Verpugonda his capital. Subsequently he could influence the king and obtain annamakonda – vishaya as fief… It is Beta who first came to annamakonda and settled as subordinate of the western Chalukya king. (Pg. 44). ‘he obtained….’ అంటే చాళుక్య ప్రభువును మెప్పించి ఆయన ద్వారా అనుమకొండను పొందాడన్నమాట. పోరాడి గెలుచుకోలేదు. అనుమకొండ పురాతనపేరు ‘అర్మకొండ’.

కథలో చూపించినట్టు అనుమకొండ ఆ కాలంలో ఆంధ్రదేశపు నడిబొడ్డున శక్తి కాదు. అప్పటికి అనుమకొండ మామూలు ప్రాంతం మాత్రమే. ఈ కల్పనకు ఆధారంలేదు. పైగా ఇది చరిత్ర వక్రీకరణ కూడా. ఒక చిన్న సంస్థానాన్ని పట్టుకుని ఆంధ్రదేశంలో శక్తి కేంద్రం అనటం వాస్తవ చరిత్రకాదు.  రెండవ ప్రోలయ రాజ్యానికి వచ్చిన తరువాతే కాకతీయుల ఉచ్చదశ ప్రారంభమాయింది. ఆ తరువాతనే అనుమకొండ ఒక శక్తిలా ఎదిగింది. అంతవరకూ, ఆ తరువాత చాలాకాలం వరకూ,  అనుమకొండ రాజులు సామంత రాజులే.  కాజీపేట దర్గా శాసనం ఈ విషయాన్ని స్పష్టం చేస్తుంది. ఈ శాసనం ప్రకారం, అనుమకొండను శాశ్వతంగా కాకతీయులకు సంపాదించింది మొదటి ప్రోలయ. అది కూడా చోళులకు ఆయన చేసిన సహాయానికి కృతజ్ఞతగా చక్రవర్తి ఆయనకు అనుమకొండను ఇచ్చాడు.

The Kazipet Dargah inscription states that Kakatiya Prola I got Anumakonda-vishaya, as also sabbi-1000, as a fief through a charter from Trailokyamalla in recognition of the services he and his father rendered to the Calukya in the latter’s  wars with Cholas. The Sanigarama epigraph of Trailokyamalla Somevara I dated 1050 states that mahasamanta Kakatiya Prolarasa acquired greatness by the kindness of the King. (A Comprehensive History of India Vol IV Part I.Chapter VI Kakatiyas by N. VenkataRamanayya and PV Parabrahma Sastry) . దీన్ని బట్టి చూస్తే ఈ కథలో ప్రదర్శితమయిన చరిత్ర కాల్పనిక చరిత్ర తప్ప చరిత్ర ఆధారిత కల్పన కాదు అనిపిస్తుంది.

కామవ్వసాని గరుడబేతను వెంట తీసుకుని చాళుక్య ప్రభువున కలిసిందన్నది ఆధారాలున్న చరిత్ర. అందరూ కామవ్వసానికి కప్పం కట్టమని చక్రవర్తి ఆజ్ఞ ఇచ్చినట్టు చూపినది కల్పన. కామవ్వసాని అనుమకొండనే కాదు, ఏ ప్రాంతంపై అధికారం నెరపినట్టు ఆధారాలులేవు. ఇతర ఏ శాసనంలోనూ ఆమె ప్రస్తావన లేదు. అలాంటప్పుడు వేల సంఖ్యలో ఆమె సైన్యాన్ని అజమాయిషీ చేసినట్టు, రాజకీయ తంత్రాలలో ఆమె పాల్గొన్నట్టు చూపటం అనౌచిత్యం, అసత్యం.  చక్రవర్తి అందరినీ ఆమెకు కప్పం కట్టమనటం అర్ధంలేనిది.  లేనిచోట మరో ఝాన్సీ రాణిని సృష్టించటం కూడని పని. ఈ కథలో బొట్టు బేతయ సంతానం నాగతిరాజు, కుసుమాదిత్య (ఈయన పేరు కథలో చెప్పలేదు) లలో “నాగతిరాజు గరుడబేతయ కత్తివేటుకు నేలకొరిగాడు. విజయకేతనంలా బల్లెంపై నిలబెట్టిన అతడి తలతో ముదిగొండవైపు సాగాడు గరుడబేతయ (పేజీ 191)” అని వుంటుంది కథలో. ..

పాలంపేట శాసనం ప్రకారం గణపతిదేవుడి సేనాపతి రేచెర్ల రుద్రుడు నాగతిరాజును ఓడించాడు. ఈ శాసనం క్రీశ 1213 నాటిది. కుకనూరు శాసనం ప్రకారం కుసుమాదిత్యుడు అగ్రహారాలు దానమిచ్చాడు. క్రీశ 1218కి చెందిన నత్తరామేశ్వరం శాసనం ప్రకారం వీరిద్దరు బొట్టుబేతయ కుమారులు. ఈ బొట్టుబేతయ, ఎర్రయ కొరవిలో నిలిపిన బొట్టుబేతయ ఒకరే అనుకుంటే కుదరదు. ఎందుకంటే ఆ బొట్టుబేతయ 11వ శతాబ్దంవాడు. ఈ ఇద్దరు బొట్టుబేతయ కుమారులు 12వ శతాబ్దం వారు. కాబట్టి నాగతిరాజు, కుసుమాదిత్యులు, ఆ వంశానికి చెందినవారే కానీ, వేరే బొట్టు బేతయ కుమారులని అనుకోవాల్సివస్తుంది. అదీగాక కొరవిపై బొట్టువారి పాలన 12వ శతాబ్దం చివరివరకూ సాగింది.

From about A.D. 1000, these Bottu chiefs were in possession of Koravi-Rajya as subordinates of the Chalukyas of Kalyana. The Kakatiya chiefs too did not trouble them any more till about A.D.1170. ( The Kakatiyas by PV Parabrahma Sastry , page No.56).

అంటే, కళ్యాణ చాళుక్యుల సామంత రాజులుగా క్రీశ 1000 నుంచి బొట్టు వంశంవారు క్రీశ 1170 వరకూ అప్రతిహతంగా కొనసాగారు. క్రీశ 1163లో కాకతి రుద్రుడు స్వతంత్ర రాజయిన తరువాత రేచెర్ల రుద్రుడిని కొరవిని పాలిస్తున్న బొట్టు వారిపై దాడికి పంపాడు. ఆ యుద్ధంలో ఓడిపోయి వీరిద్దరూ విసురునాడులో తలదాచుకున్నారు. కానీ కాకతీయ గణపతిదేవుడు వీరిని అక్కడ కూడా ప్రశాంతంగా నిలవనివ్వలేదు. క్రీశ 8వ శతాబ్దం నుంచి 12వ శతాబ్దం చివరి వరకూ బొట్టు వంశం కొరవిపై పట్టును నిలుపుకుంది. The Kakatiya chiefs too did not trouble them  అంటుంది చరిత్ర. కానీ, కథలో చూపించింది వేరు చరిత్ర. దీన్ని అల్టెర్నేట్ చరిత్ర అని కూడా అనలేము.  కాబట్టి ఈ కథలో చూపినట్టు బల్లెంపై తలను నిలబెట్టి రావటం అన్నది అనౌచిత్యమైన ఊహాత్మక కల్పన తప్ప నిజంకాదు. బేతరాజు ప్రాణాలు పోతూంటే కామసాని నిర్భావంగా ఎదురుచూస్తూ కూచోవటం కూడా కల్పన.  బ్రతికివున్న వారిని నిర్దాక్షిణ్యంగా చంపటం చరిత్ర రచయితలకు శోభనివ్వదు. ఇంతకన్నా కథ చివరలో గరుడ బేతయ తరువాతవారే కాకతీయులుగా పేరొందారని చెప్తే కనీసం కామవ్వసానికీ కాకతీయులకూ వున్న సంబంధం పాఠకులకు తెలిసేది.

అంటే, కామవ్వసాని కథలో కొన్ని చరిత్రలో ఉన్న పేర్లు, బోలెడన్ని కల్పనలు, అనేక కల్పిత పాత్రలు ఉన్నాయి. ఇది ఏ రకంగానూ వాస్తవ చారిత్రక రచన కాదు. కనీసం కల్పనలోనైనా దృష్టి కామవ్వసాని పాత్ర వ్యక్తిత్వం, ఆమె మనసు, ఆమె ఒక శక్తిగా ఎదిగిన వైనంపై కేంద్రీకరించి ఉంటే కల్పన అయినా ఆసక్తికరంగా ఉండేది. ఇందుకు భిన్నంగా కథలో ఏది, ఎందుకు జరుగుతుందో, ఏ పాత్ర ఎందుకు వస్తోందో, ఏం చేస్తోందో దానివల్ల కథకు ఏమి లాభమో తెలియని పరిస్థితులలో అయోమయం చిక్కని  అంధకారమయ్యేట్టు ఒకదాని తరువాత ఒకటిగా పేర్లు, పదాలతో, కథ నిండిపోతుంది. ఇంతకీ సంపాదకుడి మాటల్లో తప్ప, కామవ్వసాని కాకతీయులకు చేసిన ‘సేవ’, ‘మేలు’ ఏమిటో కథలో కనబడదు. కథ చదివిన వారికి ఏ రకంగా ఆమె కాకతీయుల సామ్రాజ్యం నిలవటంలో తోడ్పడిందో తెలియదు. అసలు ఆమె అంత ‘గొప్ప’ ఎందుకయ్యిందో కూడా అర్థం కాదు.

 ఈ కథలో వచ్చిన పేర్ల పాత్రల జాబితా:

ఎర్రయ, పిండి గుండ్యన, కామవ్వసాని, దండెన గుండడు, రట్టప్రభువు కన్హరదేవుడు, ఇరమర్తి గండడు, వల్లికమ్మ, అగ్గలయ్య, బావనీడు, విరియాల భీముడు, కాచమ్మ, బేతయరట్టకుడు, కుప్పమ్మ, ఎరుకసానులు, తైలపుడు, సత్తిగదేవుడు, దుగ్గన, ఎరుకసాని,బమ్మడు, సూరన, గరుడ బేతయ, రాజేంద్ర చోడుడు, జటాచోడ భీముడు, ముదిగొండ బొట్టుబేతడు, గొగ్గడు, గౌరమ, బొల్లయ వెజ్జు, కోయడు సింగినాదం, ఎరవ భీముడు, మైలమ్మ, తొండయ, పొల్వాస మేడరాజు, విక్రమాదిత్యుడు, కొండయరసు, జయసింహుడు, అక్కమ్మ, రాజరాజ నరేంద్రుడు, విజయాదిత్యుడు, చక్రవర్తి, రవ్వరసుడు, నాగతిరాజు.
ఈ జాబితాకు, నగరాలు, పల్లెలు, రాజధానులు, కొండలు, నదులు వంటివి జోడించాలి. ఇప్పటికే సామాన్య పాఠకుడి మనస్థితి ఎలావుంటుందో ఊహించవచ్చు. దీనికితోడు, కథా గమనంతో సంబంధంలేని వర్ణనలు, పదాడంబరాలు.. కథను జటిలం చేస్తాయి.ఇంత కష్టపడితే, కథ అంతా కల్పన తప్ప చరిత్ర ఆధారితం కాదు. చరిత్రలో అంతగా ప్రాధాన్యంలేని పాత్రలను ఎంతో గొప్పగా చూపించాలని ఏవేవో అనౌచిత్యమూ సత్య దూరమయిన కల్పనలతో గజిబిజిగా గిజిబజిగా అల్లిన కథ ఇది.  ఈ కథలో గొప్ప వీరుడిగా చూపిన గరుడ బేతయను, పరబ్రహ్మ శాస్త్రి petty chief  (పేజీ44) అంటారు.

అయితే ఈ రచనను జాగ్రత్తగా పరిశీలిస్తే, రచయితకు తనకెంతో తెలుసని తెలిసినదాన్ని పాఠకుడికి తెలియచెప్పాలన్న తపన వున్నదనీ అర్ధమవుతుంది. కానీ, రచనానుభవం లేకపోవటంవల్ల, తనకన్నా ముందు చరిత్ర ఆధారిత కాల్పనికి రచనలను అధ్యయనం చేయకపోవటంవల్ల, ఇంకా రచన పట్టుబడకపోవటంవల్ల కథను రూపొందించటం, కథా గమనం దెబ్బతినకుండా కథలో సమాచారాన్ని చొప్పించటం, పాత్రల వ్యక్తిత్వాలను తీర్చిదిద్దటం వంటివి వీలు కాలేదు. సాధారణంగా రచనల ఆరంభంలో, ఎంతో చెపాలని తపన వున్న ప్రతి రచయితా ఎదుర్కొనే పరిస్థితి ఇది. ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొనేందుకు ఒక చిట్కా వుంది. రచయిత తన ఆవేశానికి అడ్డుకట్ట వేయకుండా రాయాలనుకున్నది, చూపాలనుకున్నది అంతా చూపెయ్యాలి, రాసెయ్యాలి. తరువాత కథను పలుమార్లు చదువుతూ, అందులోని పాత్రలు, ప్రాంతాల పేర్లు, ఇతర పదాలు ప్రత్యేకంగా రాసుకోవాలి. ఆ తరువాత ఒకో అధ్యాయం సారం రాసుకోవాలి. ఇదంతా చేసిన తరువాత ఒకో అధ్యాయం సారం చదువుతూ, ఆ పాత్ర ఆ అధ్యాయంలోనేకాక కథ మొత్తానికీ ఏరకంగా ఉపయోగపడుతోందో గమనించాలి. ఆ పాత్ర తీసేసినా కథ దెబ్బతినటంలేదని నిర్ధారించుకుని ఆ పాత్రను నిర్దాక్షిణ్యంగా తొలగించాలి. ఇది ఇతర వర్ణనలు, పదాల వాడకానికి కూడా వర్తిస్తుంది. ఇదంతా చేసిన తరువాత మళ్ళీ కథను మరోసారి తొలగించిన విషయాలు లేకుండా రాసుకుని చదువుకుని చూడాలి. ఆ తరువాత కథలో లోటుపాట్లు, అన్వయదోషాలను చూసుకుని పూరించాలి. తరువాత మరో ప్రతిని రాసుకుని చదివి చూసుకుని సంతృప్తిగా వుంటేనే ప్రకటించాలి. కథ చదువుతున్నాప్పుడు ఎలాంటి సందేహాలు ఉత్పన్నం కాకూడదు. రచయిత సామాన్య పాఠకుడై కథను చదవాలి. తనకు తెలిసినదంతా పాఠకుడికీ తెలుస్తుందనుకోకూడదు. ఎలాగయితే అధ్యాపకుడి తరగతిలో అందరికన్నా వెనుకబడిన విద్యార్థికి అర్థమయ్యేట్టు చెప్పాలని తపనపడతాడో అలా రచయిత కనీస పరిజ్ఞానం లేని పాఠకుడూ చదివి ఆనందించేట్టు రచనను తీర్చిదిద్దాలి. అవసరమయితే రచనలో నిష్ణాతులయిన వారి సలహాలు, సూచనలు తీసుకోవాలి. రచన అనేది ఒక తపస్సు లాంటిది. దాన్లో షార్ట్‌కట్‌లు లేవు. “అరిస్తే వాద్యం, స్మరిస్తే పద్యం” అవటం అందరికీ వీలుకాదు. ఆ స్థాయికి రావటంవెనుక ఎన్నో ఏళ్ళ తపన, శ్రమలు అవసరం.

చరిత్ర రచనలో ‘స్పష్టత’ అన్నది ప్రాధాన్యం వహిస్తుంది. చెప్పే విషయాన్ని సూటిగా చెప్పాలి. స్పష్టంగా చెప్పాలి. కామవ్వసాని కథలో దృష్టి కామవ్వసాని పైనే ఉండాలి. ఇంతకీ చరిత్ర కామవ్వసానిని గుర్తుపెట్టుకొనేందుకు ప్రధాన కారణం సంపాదకుడి మాటల్లోనే కాకతి వల్లభుడు గరుడు బేతయ్య అనే కుర్రవాడిని వెంటబెట్టుకొని చాళుక్య చక్రవర్తిని దర్శించి కాకతి వంశాన్ని నిలిపింది. ఆ విషయం ఈ కథలో అసలు హైలైట్ అవ్వాల్సిన అంశం. చరిత్ర ఆమెను గుర్తుంచుకున్నది ఇందుకోసం.  ఇదీ కథలో ఒక్క వాక్యంతో తేలిపోతుంది. కామవ్వసాని చతురత, తెలివితేటలు కనబడేది ఈ సందర్భంలోనే.  ఆ విషయం వదిలి ఎన్నెన్ని విషయాలు చెప్పినా, ఎంత పాండిత్య ప్రదర్శన చేసినా, ఎన్ని కల్పనలు చేసినా అవన్ని ప్రాణంలేని శవానికి చేసిన అలంకరణలు మాత్రమే.  కథలో ఒక చోట దండెనగుందెడిని ఇరమర్తి గండడు చంపితే, ఇరమర్తిగండడిని దండెన గుండ్యడు చంపినట్టు తారుమారు చేశారు. పాపం హాయిగా జీవించిన బొట్టుబేతరాజును కొరతగడపై కూర్చోబెట్టి చంపారు. అతడి వ్యక్తిత్వాన్ని చంపి వదిలిపెట్టారు. ఏ రకంగానూ ఇది ఆమోదయోగ్యం కాదు. గత డెభై ఏళ్ళుగా శూన్యంగావున్న వాస్తవ చరిత్ర రచనల లోటును పూడ్చేందుకు ఇలాంటి కథలను సాధనంగా భావించే వీలే లేదు. చరిత్ర ఆధారిత కాల్పనిక కథల్లో ప్రధానాంశం ‘కథ’ను చెప్పటం మాత్రమే. కథను సూటిగా స్పష్టంగా చెప్తే చాలు. దాన్లో ఆనాటి వాతావరణం ఉందా? అప్పటి పదాలున్నాయా? అప్పటి పేర్లున్నాయా? వంటి విషయాలన్నీ అదనపు అలంకారాలు మాత్రమే. ముందుగా రాగం పాడటం తెలిస్తే ఆపై ఆ రాగాన్ని మరింత అందంగా చేసే అలంకారాలు గురించి ఆలోచించవచ్చు (ఇప్పటికే వ్యాసం నిడివి ఎక్కువయిందని కథలో ఇతర చారిత్రకాంశాలు, అనేక కథాంశంతో సంబంధంలేని ఇతర అంశాలను   ప్రస్తావించలేదు.).

ఈ కథకు నాలుగేళ్ళ క్రితమే భవదీయుడు  ‘కాకతీదీపమైన కామసాని’  కథ రాశాడు. ఇది ‘ఉజ్జ్వల భారత మహోజ్జ్వల గాథలు’ చరిత్ర ఆధారిత కాల్పనిక కథల సంపుటిలో ఉంది.

మిగతా కథలు వచ్చేవారం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here