కాలిబాటలు నా స్వర్గద్వారాలు

    0
    16


    ప్రొఫెసర్ ఎమ్. ఆదినారాయణ
    గారు జగమెరిగిన బాటసారి. కాలినడకన యాత్రలు చేస్తూ ‘భ్రమణకాంక్ష‘లు తీర్చుకుంటూ తనకెదురైన అనుభవాలకు, తను పొందిన అనుభూతులనూ పాఠకులకు అందిస్తూ పాఠకులనీ యాత్రికులుగా చేస్తున్నారు. ఆయన వ్రాసిన యాత్రావ్యాసాల, ఇతర వ్యాసాల కూర్పు – “కాలిబాటలు నా స్వర్గద్వారాలు” అనే పుస్తకం. “మనల్ని ఒక చోటు నుంచి మరొక చోటుకు తీసుకెళ్ళే వాహనం మన పాదాలే” అంటూ సాగిన ఈ రచన ఆదినారాయణ గారు కాలినడకన చేసిన వివిధ యాత్రల గురించి వివరిస్తుంది.
    ***
    కాలిబాటలు నా స్వర్గద్వారాలు‘ అనే వ్యాసంలో- కాలానుగుణంగా పూజలలో ‘పాదాల’ ఆరాధన ఎలా పెరిగిందో తెలిపి, నడక ఒక ఔషధమని చెబుతారు. కాలిబాటలు నేరుగా మనుషుల హృదయ మందిరాలలోకి దారి తీస్తాయని చెబుతారు.

    హిమాలయాలలో పాదయాత్ర‘ అనే వ్యాసంలో తనకి హిమాలయాలంటే ఎందుకు ఆకర్షణ కలిగిందో చెబుతారు. స్థానికులతో సాంగత్యం ఏర్పరుచుకుంటేనే ప్రయాణాల్లోని సౌందర్యం అవగతమవుతుందని అంటారు. వ్యాసంలో ఓ పిట్టకథ – “రక్షించండి… రక్షించండి…” అన్న కేకలు విని అక్కడికి వెళ్ళిన ఓ వ్యక్తికి ఎదురైన వింత అనుభవం ఆసక్తికరంగా ఉంటుంది.

    విశాఖపట్నం – అల్లూరు కొత్తపట్నం పాదయాత్ర‘ అనే వ్యాసంలో ఓ రష్యన్ వాకర్ తనకి ఏ రకంగా ప్రేరణిచ్చారో చెబుతారు. 550 కిలోమీటర్ల దూరాన్ని అంచెలంచెలుగా అధిగమించిన వైనాన్ని, మార్గమధ్యంలో ఆదరించి ఆహారం సమకూర్చిన గ్రామస్థులనీ, వారితో జరిపిన చర్చలనీ వివరిస్తుంటే… ఆయా ఊర్లలో తిరుగాడుతున్నట్టూ, ఆ చర్చలలో తామూ పాల్గొన్నట్టూ పాఠకులకి అనిపిస్తుంది.

    280 కిలోమీటర్లు ఆంధ్రప్రదేశ్‌లోనూ, 720 కిలోమీటర్లు తమిళనాడులోను సాగిన నడక గురించి ‘అల్లూరు కొత్తపట్నం – కన్యాకుమారి పాదయాత్ర‘ అనే వ్యాసంలో వివరిస్తారు. ఈ యాత్రలో ఒక జాలరితో మాటలు కలిపి వాళ్ళ వలల గురించి, వాళ్ళు పట్టే చేపల గురించి తెలుసుకుంటారు, పాఠకులకూ తెలుపుతారు. ఒట్టూరు గ్రామంలోని యువకులతో కబుర్లాడి, అక్కడి పక్షుల గురించి అవగతం చేసుకుంటారు. కొన్ని రకాల గాలుల గురించి తెలుసుకుంటారు. గిద్ద, సోల, అరసోల, తూములు, పుట్టి వంటి కొలమానాలను ఓ ముసలమ్మ నుంచి తెలుసుకుంటారు. తమిళ తీరంలో రచయితకి ఎదురైన అనుభవాలు ఆసక్తిగా చదివిస్తాయి.

    కేరళలోని కొన్ని ప్రాంతాలలో ఉమ్మడి కుటుంబ వ్యవస్థ ఇప్పటికీ ఎందుకు నిలిచి ఉందో చెబుతారు ‘కన్యాకుమారి – మంగుళూరు పాదయాత్ర‘ అనే వ్యాసంలో. ఈ యాత్రలో భాగంగా ప్రముఖ రచయిత్రి కమలాదాస్ గారిని కలుస్తారు. వేంబనాడు సరస్సు మీదుగా కొచ్చిన్ వరకూ వెళ్ళే పడవ ప్రయాణం హృద్యంగా ఉంటుంది. రకరకాల పడవల గురించి తెలుసుకుంటారు పాఠకులు.

    800 పేజీల రాతప్రతిని కుదించి ముద్రణలో సుమారు 34 పేజీలలో అందించిన వ్యాసం ‘కాశీ – తిరువైయ్యారు పాదయాత్ర‘. రాముడి ప్రయాణాలను తెలిపేది ‘రామాయణం’ అని గ్రహించిన రచయిత రాముడిలా ఎక్కువ దూరాలు నడిచే అవకాశం తనకీ లభిస్తే బాగుండని కోరుకుంటారు. ఆ కోరిక నెరవేరి మూడు నెలల పాటు సాగిన తన పదవ పాదయాత్రకి ‘యాత్రిక్ రామ’ అని పేరు పెట్టుకున్నారు. తులసీదాసు జీవించిన గంగానదీ తీరం నుంచి ప్రారంభించి, గోదావరి ఒడ్డున రామదాసు నడయాడిన చోటుకు చేరి, అక్కడ్నించి మరో గొప్ప వాగ్గేయకారుడు త్యాగయ్య జీవించిన తిరువైయ్యారుకు సాగిన నడక ఇది. తులసీదాసు, రామదాసు, త్యాగరాజుల గురించి ఆసక్తికరమైన సమాచారం లభిస్తుందీ వ్యాసంలో.

    ‘వాకింగ్ వారియర్’గా పేరుగాంచిన మహాత్మాగాంధీ చేసిన దండియాత్ర మార్గంలో నడక సాగించడం గురించి తెలిపే వ్యాసం ‘సబర్మతి – దండి పాదయాత్ర‘. 15 రోజులలో 400 కిలోమీటర్లు సాగిన యాత్రలో – ఇటుకబట్టీలు ఎక్కువగా ఉండే గజేరా ప్రాంతంలోని పనివారు మండుటెండలో కూడా మొక్కల్ని నాటుతూ కనిపిస్తారు. ‘ఎందుకింత శ్రమ’ అని అడిగితే, మా తరువాత పని చేయడానికి వచ్చేవారి కోసం అంటూ జవాబిస్తారు. పర్యావరణం పట్ల ఈ మాత్రమైనా స్పృహ ఉండబట్టే అక్కడ కొంతైనా పచ్చదనం ఉందంటారు రచయిత. ఈ యాత్ర పొడగునా గాంధీజీని దైవస్వరూపుడిగా భావించే వ్యక్తులని చూస్తాం.

    ‘మన పాదాల చుట్టూ వల వేయడమే అలల పని’ అంటారు ‘భీమిలి – చిలకాసరస్సు పాదయాత్ర‘ అనే వ్యాసంలో. చేపల కంచేరీ గ్రామం దాటాక ఒకచోట ‘కూర్చుంటే చెట్టునీడ, నడుస్తుంటే మబ్బునీడ’ కావాలని కోరుకునే తన కొడుకుకి నాలుగు మంచిమాటలు చెప్పమంటుందో తల్లి. రకరకాల పడవలు, తెప్పల గురించి తెలుస్తుందీ వ్యాసంలో. తీరం నుంచి ఎంత దూరం వెళితే, ఎంత లోతులో తిమింగలాలు కనిపిస్తాయో తెలుస్తుంది. తాగుబోతులలో నాలుగు జంతువులు ఉంటాయని ఓ మహిళ చెప్పిన మాటలు ఎంతో వాస్తవం!

    గొప్ప మానవతావాది, వైద్యులు, విద్యావేత్త అయిన డా. కె.ఎన్. కేసరి గారి స్వగ్రామంలో ఒక స్మారక చిహ్నం ఏర్పాటు చేయదలచి, ఆ ఊరి నుంచి వారి కార్యరంగమైన మద్రాసుకు చేసిన యాత్ర విశేషాలు ‘ఇనమనమెళ్ళూరు – మద్రాసు పాదయాత్ర‘ అనే వ్యాసంలో వివరిస్తారు. కేసరిగారు నడిచిన బాటలో 120 ఏళ్ళ తర్వాత ఆయనకు నివాళిగా నడిచారు రచయిత.

    తానొక సంచారిగా మారడానికి ప్రేరణగా నిలిచిన ‘సిపాయి మార్కు అగ్గిపెట్టె‘ గురించి, జిప్సీల పట్ల కలిగిన అవగాహన గురించి, చిన్నతనంలో ఏ పనికైనా బాగా దూరాలు నడవాల్సి రావడం గురించి… ఆసక్తికరంగా చెబుతారు.

    కళ, ప్రకృతి, ఇంగ్లీషు మీదా తనకి ప్రేమ కలగడానికి కారకులైన గురువులని తలచుకుంటూ నిజమైన విద్య ఏమిటో, నిజమైన గురువులంటే ఎవరో చెబుతారు ‘బడికి వెళ్ళే బాటలో జ్ఞానగంగావతరణం‘ అనే వ్యాసంలో. ప్రకృతి లోని శాశ్వతత్వం గురించి, మానవ జీవితపు తాత్కాలికత గురించి నేర్చుకున్న వైనాన్ని వివరిస్తారు.

    దొమ్మరుల గురించి ఎన్నో వివరాలు అందిస్తారు ‘దేశ దొమ్మరులు‘ అనే వ్యాసంలో. జిప్సీల గురించి ప్రజలకు తెలియజేసిన ఎందరో కళాకారులనీ ఈ వ్యాసంలో సంక్షిప్తంగా పరిచయం చేస్తారు.

    తనను ప్రకృతి ప్రేమికుడిగా, శ్రామిక సౌందర్య ఆరాధకుడిగా మార్చిన తన గ్రామ పరిసరాలను ‘కాశీయాత్ర మార్గ మజిలీ – చవటపాలెం‘ అన్న వ్యాసంలో వివరిస్తారు.

    ఏనుగుల వీరాస్వామి కంటే ఏడు సంవత్సరాల ముందుగా కాశీయాత్ర చేసిన వెన్నెలకంటి సుబ్బారావు గారి గురించి ఒక వ్యాసం, రాహుల్ సాంకృత్యాయన్ గురించి రెండు వ్యాసాలు, శ్రీశ్రీ గురించి ఒక వ్యాసం, లలితకళా చక్రవర్తి లక్ష్మయ్యగారి గురించి ఒక వ్యాసం ఉన్నాయి ఈ పుస్తకంలో. కొంతమంది విదేశీ కళాకారుల గురించి వివరాలతో కూడిన వ్యాసాలున్నాయి. ‘కాకుల ప్రేమికుడు’ అయిన సుకల శ్రీనివాసరావు గురించి ఓ వ్యాసం ఉంది. మనుషుల గురించే కాకుండా మానవాళికి ఎంతో మేలుచేసే గాడిదలు, పిచ్చుకల గురించి వ్యాసాలున్నాయి.
    ***
    ఈ పుస్తకం చదివితే మనకేం వస్తుంది? కొన్ని దార్లు తెలుస్తాయి, ఊర్లు తెలుస్తాయి. మంచితనాన్ని పోగొట్టుకోని స్వచ్ఛమైన మనసులున్న మనుషులు తెలుస్తారు. వివిధ ప్రాంతంలోని అలవాట్లు, ఆచారాలు, విశ్వాసాలు తెలుస్తాయి. పరిసరాల విజ్ఞానం కలుగుతుంది. అన్నిటికన్నా ముఖ్యంగా ‘నడక’ ప్రాధాన్యత తెలుస్తుంది. ఇంతకంటే ఎక్కువ ఏం ఆశించగలం ఓ పుస్తకం నుంచి?
    బాటసారి బుక్స్ ప్రచురించిన ఈ 284 పేజీల పుస్తకం వెల 150 రూపాయలు. ఈ పుస్తకం అన్ని ప్రముఖ పుస్తక విక్రయ కేంద్రాలలోనూ లభిస్తుంది.

    LEAVE A REPLY

    Please enter your comment!
    Please enter your name here