కల్పిత బేతాళ కథ-10 శిష్యుని సందేహం

0
12

[ప్రముఖ బాలసాహితీవేత్త డా. బెల్లంకొండ నాగేశ్వరరావు రచించిన ‘కల్పిత బేతాళ కథలు’ చదవండి.]

[dropcap]ప[/dropcap]ట్టువదలని విక్రమార్కుడు, తను ఆవహించిన శవంతో చెట్టుకు వేళ్లాడుతున్న బేతాళుని బంధించి భుజంపైన చేర్చుకుని మౌనంగా స్మశానం నుండి బయలుదేరాడు.

“మహీపాలా, అనన్య ప్రతిభావంతుడవు అయిన నీ పట్టుదల మెచ్చదగినదే! మన ప్రయాణంలో నీకు అలసట తెలియకుండా ‘శిష్యుని సందేహం’ అనే కథ చెపుతాను విను..” అంటూ చెప్పసాగాడు బేతాళుడు.

***

సదానందుడు కాశీకి వెళుతూ కొంతమంది శిష్యులతో కలసి ప్రయాణం చేస్తూ దారిలో వచ్చే గ్రామాలలో ప్రజలకు సందేశం వినిపిస్తూ వారు ఇచ్చే ఆహార పదార్థాలు స్వీకరిస్తూ అలా ఒక గ్రామం చేరారు. ఆ గ్రామ ప్రజలు సదానందునికి ఘన స్వాగతం చెప్పి గొప్ప విందు ఏర్పాటు చేసారు. సదానందుని ప్రసంగం వినడానికి ఆ గ్రామ ప్రజలందరు తరలివచ్చారు. సదానందుడు తన సందేశంలో.. “సహాయం పొందినవారికి సహాయం చేయడం గొప్ప విషయం కాదు. అపకారికి కూడా ఉపకారం చేయడమే క్షమాగుణం. ఇది చాలా గొప్ప ఉత్తమమైన సుగుణం.

నాయనలారా మనసును జయించడాన్ని ‘దమ’ అంటారు. చతుర్విధ దానాలు అంటే మరణ భయంతో ఉన్నవానికి అభయం యివ్వడం, వ్యాధిగ్రస్థునకు సరియైన చికిత్స చేయించడం, విద్యాదానం, అన్నదానం. ప్రత్యుపకారం ఆశించకుండా చేసే దానాన్ని ‘సాత్విక ‘దానం అని, తిరిగి ఉపకారాన్ని ఆశించి చేసే దానాన్ని ‘రాజస’ దానం అని, తృణీకారభావంతో చేసే దానాన్ని ‘తామస’ దానం అని అంటారు. దానం చేసేవారిని మూడు రకాలుగా విభజించవచ్చు. తనకు ఉన్నదంతా దానం యిచ్చేవాడు ‘దాత’. తన వద్ద ఉన్నదంతా యిచ్చి యింకా యివ్వలేకపోయానే అని బాధపడేవారిని ‘ఉదారుడు’ అనీ; తన వద్ద లేకున్నా యితరులను అడిగి తెచ్చి యిచ్చేవాడిని ‘వదాన్యుడు’ అంటారు. ఇది దాతల వివరం. శిబి చక్రవర్తి, బలి చక్రవర్తి, కర్ణుడు వంటి మహనీయులు మన చరిత్రలో దానమహిమ గొప్పగా మనకు తెలియజేసారు.

మీ గ్రామ ప్రజలు దేశం అంతటా విద్య, వ్యాపార, వివాహాది విషయాలలో సంబంధాలు పెంపొందించుకొండి. మీ గ్రామ ప్రజలు అందరికి నా శుభా ఆశీస్సులు” అని తన ప్రసంగం ముగించాడు సదానంద స్వామి. ఆ రాత్రి అక్కడే బస చేసి మరుదినం మరో గ్రామానికి తన శిష్యులతో కలసి వెళ్లాడు. ఆ గ్రామంలో సదానందునికి ఎటువంటి స్వాగతం, ఆహారపదార్థాలు లభించలేదు. తమ వద్ద ఉన్న సామాగ్రితో వంట ప్రయత్నాలు కొందరు శిష్యులు చేస్తున్నారు. మరికొందరు శిష్యులు అక్కడ ఉన్నమర్రి చెట్టు కింద ఉన్న ప్రదేశాన్ని నీళ్లు చల్లి ఊడ్చి శుభ్రపరిచారు. సాయంత్రం సదానందుని ప్రసంగం వినడానికి చాలామంది జనం ఎటువంటి పండు, ఫలహారాలు తీసుకురాకుండా వచ్చారు. ఆ గ్రామంలో సదానందుడు ప్రసంగిస్తూ “భక్తులారా, మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్యదేవోభవ, అతిథిదేవోభవ అన్నారు పెద్దలు. తిథి చూడకుండా వచ్చేవాడే అతిథి. అతిథి దైవసమానుడని శాస్త్రాలు చెపుతున్నాయి. అతిథిని యథాశక్తిన ఆదరించాలి. అది మన భారతీయ సంస్కృతిలో భాగం. అతిథిని గౌరవించనివారికి నరక ప్రాప్తి కలుగుతుంది. మీరంతా గ్రామం విడిచి దూరప్రాంతాలలో స్ధిరపడకండి. వివాహాది శుభకార్యాలకు ఈ గ్రామంలోనే చేసుకుంటూ ఇక్కడే ఉండండి. ఈ రోజుకు స్వస్తి” అని తన ప్రసంగం ముగించాడు.

“గురువర్యా నాదో సందేహం” అన్నాడు ఒక శిష్యుడు.

***

“విక్రమార్క మహరాజా, ఆ గ్రామ ప్రజలను దేశం నలుమూలలకు వెళ్ళి స్ధిరపడమని, ఈ గ్రామ ప్రజలను ఇక్కడే ఉండమని ఆశీర్వదించారు. సదానందస్వామి ఎందుకు అలా అన్నాడో అని శిష్యునికి సందేహం వచ్చింది. ఈ ప్రశ్నకు జవాబు తెలిసి కూడా చెప్పకపోయావో తల పగిలి మరణిస్తావు” అన్నాడు బేతాళుడు.

“బేతాళా ఆ గ్రామప్రజలు దయా, పాపభీతి, ఆకలి విలువ తెలిసిన సద్గుణ సంపన్నులు. వారి గుణగణాలు, మంచి బుద్ధి లోకం అంతా తెలుసుకుని నేర్చుకునేలా దేశవ్యాప్తంగా వారందరిని వెళ్ళి స్ధిరపడమని, ఈ గ్రామప్రజలు సంస్కారహీనులు. దానగుణహీనులు, ఎదుటివారి ఆకలి గురించి అవసరాలు గమనించనివారు. వీరి అవలక్షణాలు దేశం అంతా నేర్పకుండా ఇక్కడే వారిని ఉండమన్నారు. ఆ గ్రామం వారి ప్రవర్తన, ఈ గ్రామం వారి ప్రవర్తన వ్యత్యాసం గమనించి అలా సదానంద స్వామి చెప్పారు. మనిషికి ఒడ్డు, పొడవు, రంగు, రూపు కాదు ముఖ్యం. బంగారాన్ని రుద్ది చూస్తాము, మనిషి ప్రవర్తన పైనే వారి అర్హత నిర్ణయింపబడుతుంది” అన్నాడు విక్రమార్కుడు.

విక్రమార్కునికి మౌనభంగం కావడంతో శవంతో సహా బేతాళుడు మాయమై చెట్టు పైకి చేరాడు.

పట్టువదలని విక్రమార్కుడు బేతాళునికై వెనుతిరిగాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here