కల్పిత బేతాళ కథ-11 వరుని ఎంపిక

0
9

[ప్రముఖ బాలసాహితీవేత్త డా. బెల్లంకొండ నాగేశ్వరరావు రచించిన ‘కల్పిత బేతాళ కథలు’ చదవండి.]

[dropcap]ప[/dropcap]ట్టువదలని విక్రమార్కుడు తన ఆవహించిన శవంతో చెట్టుకు వేళ్లాడుతున్న బేతాళుని బంధించి భుజంపైన చేర్చుకుని మౌనంగా స్మశానం నుండి బయలుదేరాడు.

“మహీపాలా, అనన్య ప్రతిభావంతుడవు అయిన నీ పట్టుదల మెచ్చదగినదే!  పద్మము, మహాపద్మము, శంఖము, మఖరము, కచ్చపము, ముకుందము, నీలము, కుందము, వరము వంటి నవనిధులు కలిగిన నీవు – ధన్వంతరి, క్షపణకుడు, అమరసింహుడు, శంఖువు, బేతాళభట్టు, కాళిదాసు, వరాహమిహిరుడు, వరరుచి, ఘటకర్పరుడు వంటి కవులను పోషించే నీ సాహిత్యపోషణ లోకం అంతా కొనియాడబడుతుంది. నీకు అలసట తెలియకుండా ‘వరుని ఎంపిక’ అనే కథ చెపుతాను విను..” అంటూ చెప్పసాగాడు బేతాళుడు.

***

మాళవరాజ్యంలో గుణశేఖరుడు అనే వ్యాపారికి సుగుణాలరాశి అయిన ఏకైక కుమార్తె ఉంది. ఆమెకు తగిన వరునిగా అతని దృష్టిలో ముగ్గురు యువకులు ఉన్నారు. వారిలో తగిన వరుని ఎంపిక చేసుకోలేక తన మిత్రుడైన నగర న్యాయాధికారికి వద్దకు వెళ్ళి “మిత్రమా, నా ఏకైక కుమార్తె వివాహం చేయదలచాను. నా దృష్టిలో ముగ్గురు యువకులు ఉన్నారు. కోట్లాది రూపాయల నా ఆస్తినీ, నా వ్యాపారాలతో పాటు అల్లారుముద్దుగా పెంచిన నా కుమార్తెను బాగా చూసుకోగలిగిన సమర్థవంతుడైన యువకుని ఎంపిక చేయవలసింది” అన్నాడు. మరుదినం న్యాయాధికారి ముగ్గురు యువకులను పిలిపించి “నాయనలారా వారం తరువాత మీరు మరలా నాకు కనిపించండి, కానీ ఈ వారంలో మీరు ఏదైనా ఒక మంచి పనిచేసి దాన్ని వచ్చేవారం నాకు తెలియజేయండి” అన్నాడు. మరుసటి వారం న్యాయమూర్తితో గుణశేఖరుడు సమావేశం అయిఉండగా  ఆ ముగ్గురు యువకులు వచ్చారు. “చెప్పండి నాయనా, మీరు గత వారం చెసిన మంచి పని గురించి” అన్నాడు న్యాయమూర్తి.

మెదటి యువకుడు “నా తండ్రి మరణించినా ఎటువంటి పత్రం లేకున్నా ఆయన చేసిన బాకీ ఉందనీ వచ్చిన నా తండ్రి మిత్రుడి మాట నమ్మి అతని బాకీ తీర్చాను” అన్నాడు. రెండో యువకుడు “అగ్నిప్రమాదంలో చిక్కుకున్న వృధ్ధుడిని కాపాడాను” అన్నాడు. మూడవ యువకుడు “మా బద్దశత్రువు కుమారుడుని ప్రాణాపాయస్ధితిని నుండి కాపాడాను” అన్నాడు.

***

కథ పూర్తి చేసిన బేతాళుడు “విక్రమార్క మహరాజా, ఆ ముగ్గురిలో తగిన వరునిగా న్యాయమూర్తి ఎవరిని ఎంపిక చేసాడో చెప్పు. జవాబు తెలిసి చెప్పకపోయావో తలపగిలి మరణిస్తావు” అన్నాడు.

“బేతాళా మొదటి యువకుడు విషయంలో – తండ్రి ఆస్తి తీసుకున్నప్పుడు తండ్రి అప్పు కూడా తీర్చడం కూడా కుమారుడిగా అతని ధర్మం. రెండో యువకుడు విషయంలో సాటిమనిషి, ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడం మంచి లక్షణం, అది కనీస ధర్మం. మనిషి వేదనను సాటిమనిషే అర్థం చేసుకోవాలి. లేదంటే జంతువులకు మనుషులకు తేడా లేకుండా పోతుంది. సహజమైన మానవతా చర్య నీవు చేసే ఈ పనిలో కనిపిస్తుంది. ఇక మూడవ యువకుడి విషయంలో శత్రువును కూడా క్షమించడం ఉత్తమ లక్షణం. సహనం, ఓర్పు, త్యాగనిరతి, క్షమాగుణం కలిగి అపకారికి కూడా ఉపకారం చేసే స్వభావం కలిగిన ఆ మూడవ యువకుడు గుణశేఖరునికి తగిన అల్లుడు” అన్నాడు విక్రమార్కుడు.

విక్రమార్కునికి మౌనభంగం కావడంతో శవంతో సహా బేతాళుడు మాయమై చెట్టు పైకి చేరాడు.

పట్టువదలని విక్రమార్కుడు బేతాళునికై వెనుతిరిగాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here