కల్పిత బేతాళ కథ-14 ప్రాప్తం

0
19

[ప్రముఖ బాలసాహితీవేత్త డా. బెల్లంకొండ నాగేశ్వరరావు రచించిన ‘కల్పిత బేతాళ కథలు’ చదవండి.]

[dropcap]ప[/dropcap]ట్టువదలని విక్రమార్కుడు శవాన్ని ఆవహించి ఉన్న బేతాళుని బంధించి భుజాన వేసుకుని మౌనంగా నడక సాగించసాగాడు.

శవం లోని బేతాళుడు “మహీపాలా, పట్టుదలకు మారు పేరైన నువ్వు పరాక్రమంతో పాటు సాహాసివి. తత్త్వవివేక, మహాభూత, నాటకదీప, యోగానంద, ఆత్మానంద, అద్వైతానంద, విద్యానంద పంచశీల గ్రంథాలను అభ్యసించిన సకల గుణసంపన్నుడవు నీవు. నాకు చాలా కాలంగా ఒక సందేహం ఉంది. మన ప్రయాణంలో నీకు అలసట తెలియకుండా ఉండేలా ఆ సందేహాన్ని ‘ప్రాప్తం’ అనే కథా రూపంలో చెపుతాను విను” అంటూ చెప్పసాగాడు.

***

పూర్వం అంగ, వంగ, కళింగ, కుళింద, కాశ్మీర, నేపాళం, భూపాల, పాంచాల, పాండ్య, బర్బరీ, కిరాత, విదేహ, విదర్బ, మళయాళ, గౌళ, గాంధార, కురు, కేరళ, మగధ, కొంకణ, సిందు, సౌవీర, ఆంధ్ర, ఛేది, సాల్వ, కోసల, సౌరాష్ట్ర, మత్య, సూరసేన, సుంహ్మ, కౌశంబి, పుళింద, లాట, కర్ణాటక, త్రిగర్త, బృహద్దద, యవణ, టెంకెణ, దశార్ణవ, పౌండ్ర, బాహ్లీక, ద్రావిడ, కాంభోజ, ఘూర్జుర, కైకేయ, అవంతి, చోళ, సింహళ, కుంతల, నిషిద, పార్శన, కామరూప, భోజ, మాళ్వ, విరాట, మ్లేచ్చ, అమరావతి, వంటి పలు రాజ్యాలు ఉండేవి.

వీటిలో కుంతలరాజ్యాన్నీ గుణశేఖరుడు పరిపాలిస్తూ, ప్రజల జీవన విధానం గురించి తెలుసుకునేందుకు మారు వేషంలో తన మంత్రి సుబుధ్ధితో కలసి తన రాజ్యంలోని  పలు నగరాలు రాత్రులు సంచరిస్తూ ఉండేవాడు.

ఒకరోజు అలా రాజధానిలో పర్యటిస్తున్న సందర్బంగా, తూర్పు వీధిలోని ఓ ఇంటిలో నుండి అర్ధరాత్రి దాటినా దీపం వెలగడం గమనించి ఆయింటి అరుగుపై తన మంత్రితో చేరాడు.

“మీరు పూజారిగా ఇంతకాలం సేవలు చేస్తున్నప్పటికి ఆ దేవుడు కాని, మన రాజుగారు కాని ఏమైనా సహాయం చేసారేమో చూసారా! మీకు వచ్చే ఆదాయంతో మన కుటుంబం పోషించుకోవడం చాలా కష్టంగా ఉంది. రేపు పిల్లల పెండ్లి ఎలా చేస్తాం? నాకు ఏమి తోచడంలేదు” అన్నది ఆడమనిషి స్వరం.

“పిచ్చిదానా నారు పోసినవాడు నీరు పొయ్యడా! రోజు నాచే అర్చని చేయించుకునే ఆ దైవానికి నా గురించి తెలియదా! మన రాజు మంచివారే. భయపడక కాలం పైన భారంవేసి ముందుకు సాగుదాం! నిద్రపో. వేకువనే నేను ఆలయానికి వెళ్ళాలి కదా!” అన్నది పురుష స్వరం.

వారి కుటుంబ కష్టాలు స్వయంగా తెలుసుకున్న రాజుగారు మరుదినం పెద్ద గుమ్మడికాయ తెప్పించి దానిలోపలి భాగం అంతా ఖాళీ చేయించి దాని నిండుగా బంగారు నాణాలు నింపి, ఎప్పటిలా గుమ్మడి కాయను అంటించి భటుల ద్వారా ఆ గుమ్మడి పండును మరుదినం ఉదయం పూజారి ఇంటికి పంపించాడు.

గుమ్మడికాయ పూజారి భార్యకు అందించి “అమ్మా ఎవరో నాకు రెండు గుమ్మడికాయలు ఇచ్చారు, ఒకటి నేను తీసుకున్నాను ఇదిగో మరోకటి మీరు తీసుకొండి” అని ఇచ్చి వెళ్ళాడు రాజభటుడు.

మధ్యాహ్నం రాజు గారి వంటవాడు వచ్చి “ప్రభూ ఈ రోజు తీసుకువచ్చిన కూరగాయలలో ఈ గుమ్మడికాయ వంట కొరకు కోయగా దీని నిండా బంగారు నాణాలు కనిపించాయి” అన్నాడు.

అది చూసిన గుణశేఖర మహారాజు ఆశ్చర్యపోయాడు.

***

కథ చెప్పడం ముగించి, “విక్రమార్క మహీపాలా, పూజారి ఇంటికి రాజు పంపిన గుమ్మడికాయ తిరిగి రాజు గారి వద్దకు ఎలా వచ్చిందో నాకు అర్ధం కాలేదు. నీకు తెలిసి, ఊహించి సమాధానం చెప్పలేక పోయావో నీ తల పగిలి మరణిస్తావు” అన్నాడు బేతాళుడు.

“బేతాళా మానవ సహాయానికి దైవబలం కూడా తోడు అవ్వాలి. తన సహాయం పూజారికి తెలియకుండా దేవుడే పంపినట్లు అందజేయాలి అనుకున్నాడు రాజు. ఆ పూటకు బియ్యం లేకపోవడంతో పూజారి భార్య అంగడిలో గుమ్మడికాయ ఇచ్చి బియ్యం తీసుకు వెళ్ళి ఉంటుంది. అదే అంగడిలో  రాజు గారి పనివారు కూరగాయలు తీసుకురావడంతో ఆ గుమ్మడికాయ రాజు గారి వంటశాలకు చేరింది” అన్నాడు విక్రమార్కుడు.

విక్రమార్కునికి మౌనభంగం కావడంతో శవంతో సహా బేతాళుడు మాయమై చెట్టు పైకి చేరాడు.

పట్టువదలని విక్రమార్కుడు మరలా బేతాళునికై వెనుతిరిగాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here