కల్పిత బేతాళ కథ-15 చట్టం అందరికి సమానమే

0
14

[ప్రముఖ బాలసాహితీవేత్త డా. బెల్లంకొండ నాగేశ్వరరావు రచించిన ‘కల్పిత బేతాళ కథలు’ చదవండి.]

[dropcap]ప[/dropcap]ట్టువదలని విక్రమార్కుడు బేతాళుని కొరకు స్మశానంలో ప్రవేశించి, తను ఆవహించిన శవంతో చెట్టుకు వేళ్లాడుతున్న బేతాళుని బంధించి భుజంపైన చేర్చుకుని మౌనంగా స్మశానం నుండి బయలుదేరాడు.

“మహీపాలా, అనన్య ప్రతిభావంతుడవైన నీ పట్టుదల మెచ్చదగినదే! మన ప్రయాణంలో నీకు అలసట తెలియకుండా ‘చట్టం అందరికి సమానమే’ అనే కథ చెపుతాను విను” అంటూ చెప్పసాగాడు బేతాళుడు.

***

పూర్వం రత్నగిరి రాజ్యాన్ని చంద్రసేనుడు అనే రాజు పరిపాలిస్తుండేవాడు. ఒకరోజు అతని మంత్రి “మహారాజా ఖజానాలో ధనం కొరతగా ఉంది. రాజ్యంలోనూ, వెలుపలా రహదారులన్ని మొన్నటి వరదలకు దారుణంగా దెబ్బతిన్నాయి, మనం రహదారులు బాగుచేయిస్తే, ప్రజలకు చేయవలసిన ఇతర సౌకర్యాలకు ధనం కొరవడుతుంది, కనుక మన దగ్గర ఉన్న ధనంతో అన్ని రహదారులు కొత్తగా నిర్మిద్దాం. ఆ రహదారులపై ప్రయాణించే వాహనదారుల నుండి కొద్దిపాటి సుంకం(పన్ను) వసూలు చేద్దాం! ఆలా వచ్చిన ధనంతో ప్రజల అవసరాలు తీర్చుతూ వెళదాం” అన్నాడు.

“మంచి యోచన. వెంటనే నూతన రహదారులు నిర్మించండి, చట్టం అందరికి సమానమేనని, రహాదారులపై రాజ్యపొలిమేరలు దాటి వెళ్లే ప్రతి వాహనదారుడు ప్రభుత్వానికి సుంకం చెల్లించాలని, ఇది మా ఆజ్ఞగా, రాజ్యం అంతటా దండోరా వేయించండి. అలా చెల్లించనివారికి జరిమాన లేక చెరసాల శిక్ష విధించబడుతుందని తెలియజేయండి” అన్నాడు చంద్రసేన మహారాజు. నూతన రహదారుల నిర్మాణం జరిగింది. దండోరా ద్వారా ఆ విషయం రాజ్య ప్రజలందరికి తెలియజేయబడింది. అమరావతి రాజ్యానికి ఉన్న నాలుగు రహదారులలో సుంకం వసూలు చేయడానికి ఏర్పాట్లు జరిగాయి.

కొంతకాలం తరువాత ‘తాడికొండ’ అనే గ్రామంలో జరిగిన అభివృధ్ధి పనులను పరిశీలించడానికి రాజు గారు తన పరివారంతో, ఉదయం తన రథంపై వెళ్లి సాయత్రం తిరిగి రాజ భవనానికి చేరుకున్నాడు. మరుదినం ఉదయం రాజుగారు సభ తీరి ఉండగా, ఓ యువకుడు ముఖద్వారం వద్ద వాదులాడుతూ కనిపించాడు.

“ఎవరక్కడ ఏమిటి అతను అంటున్నది?” అన్నాడు రాజుగారు.

“చిత్తం ప్రభూ ఇతను ఎవరో పిచ్చివాడు, తమరు ఇతనికి బాకి పడ్డారట” అన్నాడు ద్వారపాలకుడు.

అది విన్న రాజు ఆశ్చర్యపోతూ “అతన్ని సభలో ప్రవేశ పెట్టండి” అన్నాడు. సభలోనికి వచ్చిన యువకుడిని చూసిన మంత్రి “నాయనా రాజుగారు నీకు ఏ విధంగా బాకిపడ్డారో వివరించు” అన్నాడు.

“అయ్యా, నేను దక్షణ దిశ సుంకం వసూలు చేసే ఉద్యోగిని, నిన్న రాజు గారు రథంపై వెళుతూ, తన పరివారాన్ని కూడా వెంట తీసుకు వెళ్లివచ్చారు కాని, సుంకం చెల్లించలేదు. వారి వద్దనుండి నాకు రావలసిన ధనం వివరాల పత్రం యిదిగో” అని దాన్ని మంత్రికి అందించాడు ఆ యువకుడు.

మంత్రి చేతిలోని పత్రం అందుకున్న మహరాజ చిరునవ్వుతో “ఈ పత్రం లోని పైకంతో పాటు ఈ ఉద్యోగికి వంద వరహాలు బహుమతిగా ఇవ్వండి” అని ఆజ్ఞాపించాడు.

***

కథ పూర్తి చేసిన బేతాళుడు, “విక్రమార్క మహారాజా, రాజునే సభాముఖంగా ఎదిరించిన ఆ యువకుని చంద్రసేనుడు శిక్షించకుండా వంద వరహాల బహుమతితో ఎందుకు సత్కరించాడు? సమాధానం తెలిసి చెప్పకపోయావో తలపగిలి మరణిస్తావు” అన్నాడు బేతాళుడు.

“బేతాళా ఆ యువకుడి రాజ్యభక్తి, నిజాయితీ, చట్టం అమలు చేయడంలో కఠినత్వం, అమలుచేస్తున్న విధానం అభినందనీయంగా తలచారు. ఎక్కడైనా పాలకులు ఏర్పచిన చట్టాలను పాలకులే పాటించకపోతే, ప్రజలు నవ్విపోరా? ప్రజలకు పాలకులు ఆదర్శంగా ఉండాలి, వారు చేసిన చట్టాలు వారు అనుసరించిన వారే నిజమైన పాలకులు. చట్టం ముందు అందరూ సమానమే కదా! చట్టాలను అమలు చేయడంలో ఉద్యోగుల పాత్ర ముఖ్యమైనది. అందుకే ఆ యువకునికి అభినందిస్తూ వంద వరహాలు బహుమతిగా ఇచ్చాడు” అన్నాడు విక్రమార్కుడు.

విక్రమార్కునికి మౌనభంగం కావడంతో శవంతో సహా బేతాళుడు మాయమై చెట్టు పైకి చేరాడు.

పట్టువదలని విక్రమార్కుడు బేతాళుని కొరకు వెనుతిరిగాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here