కల్పిత బేతాళ కథ-16 ఒక వరం నాలుగు కోరికలు

0
13

[ప్రముఖ బాలసాహితీవేత్త డా. బెల్లంకొండ నాగేశ్వరరావు రచించిన ‘కల్పిత బేతాళ కథలు’ చదవండి.]

[dropcap]ప[/dropcap]ట్టువదలని విక్రమార్కుడు బేతాళుని కొరకు శ్మశానంలో ప్రవేశించి, తను ఆవహించిన శవంతో చెట్టుకు వేళ్లాడుతున్న బేతాళుని బంధించి భుజంపైన చేర్చుకుని మౌనంగా శ్మశానం నుండి బయలుదేరాడు.

“మహీపాలా, అనన్య ప్రతిభావంతుడవు అయిన నీ పట్టుదల మెచ్చదగినదే! మన ప్రయాణంలో నీకు అలసట తెలియకుండా ‘ఒక వరం నాలుగు కోరికలు’ అనే కథ చెపుతాను విను..” అంటూ కథ చెప్పసాగాడు బేతాళుడు.

***

భువనగిరి నగర పొలిమేరలలో శివయ్య అనే వ్యవసాయ కూలి చిన్న గుడిసెలో చూపు లేని తల్లి, తండ్రి, మూగ భార్యతో కలసి జీవిస్తూ ఉండేవాడు. కూలి పని లేని రోజు అడవికి వెళ్ళి ఎండుకట్టెలు కొట్టి తెచ్చి, భువనగిరి నగరంలో అమ్మేవాడు.

ఒక రోజు అడవికి వెళ్ళి ఎండుచెట్టును కొట్టి దానిపక్కనే ఓ మెక్కను నాటి పాదుచేసి, తను తెచ్చుకున్న మంచినీటిని ఆ మొక్కకు కొంత పోసాడు. అలా ప్రతిసారి మొక్క నాటడం దానిని సంరక్షణ చేయడం గమనించిన వనదేవత “నాయనా మానవులు తమ అవసరాలకు అడవులను విపరీతంగా నరకడం చూసాను, కానీ నీలా మొక్కలు నాటి సంరక్షించే వారిని ఇప్పుడే చూస్తున్నా. చాలా సంతోషంగా ఉంది” అన్నది.

వనదేవతకు చేతులు జోడించిన శివయ్య “అమ్మా మనిషిలేని భూమిని ఊహించవచ్చు కాని చెట్లు లేని భూమి ఎడారి కదా! మేము ఇప్పటికే అడవులను ధ్వంసం చేసి విపరీతమైన ఎండలు, అకాల వర్షాలు, పలురకాల ప్రకృతి విపత్తులు ఎదుర్కొంటూ తగిన మూల్యం చెల్లించుకుంటున్నాము. ఈ భూమి పైన చెట్లు ఎంత ఎక్కువ ఉంటే అంతగా సకలప్రాణకోటికి క్షేమం. లేకుంటే అంతా క్షామం. చెట్లు పలురకాల పక్షులకు నివాసంగా ఉంటూ మానవాళికి ప్రాణవాయువును అందజేస్తూ భూసారాన్ని కాపాడతాయి. పూలు, పండ్లు, వనమూలికలుగా వినియోగపడుతూ, ప్రకృతి సమతుల్యతను పరిరక్షిస్తూ, వర్షం కురిసే సమయంలో గాలిలోని తేమను నియంత్రిస్తాయి. చెట్ల వేర్లు భూమిలోనికి చొచ్చుకుపోయి నేలకోతను అరికడతాయి. సకాలంలో వర్షాలు పడటానికి చెట్లే కారణం అవుతాయి. మనిషి ఆర్థికతను చెట్లే నిర్ణయిస్తాయి. సుడిగాలులు మెదలు ఉప్పెనల వరకు తట్టుకుని నిలబడేవి చెట్లే. నాడు, నేడు, ఏనాడు చెట్లే మానవాళికి ప్రాణదాతలు” అన్నాడు.

“నాయనా చెట్ల పట్ల నీకు ఉన్న అవగాహనకు మెచ్చి ఒక వరం ఇస్తాను కోరుకో” అన్నది వనదేవత.

“తల్లీ పెద్దలైన నా తల్లి, తండ్రినీ సంప్రదించి రేపు వచ్చి నా కోరిక కోరుకుంటాను” అన్నాడు శివయ్య. ఆరోజు రాత్రి భోజనసమయంలో వనదేవత వరం గురించి ఇంట్లో వారి వద్ద ప్రస్తావించాడు శివయ్య. “నాయనా పుట్టుకతో చూపులేనిదాన్ని, నాకు కళ్ళు ఇవ్వమని అడుగు. నువ్వు ఎలా ఉంటావో చూసుకుంటాను” అన్నది శివయ్య తల్లి. “అబ్బాయి మనం ఎంతకాలం ఈ పూరిగుడిసెలో జీవిస్తాం, సకల సదుపాయాలు కలిగిన ఇంటిని కోరుకో” అన్నాడు శివయ్య తండ్రి. “మనకు సంతానం లేదు, మంచి బుధ్ధిమంతులైన సంతతిని కోరండి” అని సైగలు చేసింది శివయ్య మూగభార్య.

***

కథ చెప్పడం ముగించిన బేతాళుడు – “విక్రమార్క మహారాజా మరుదినం అడవికి వెళ్ళిన శివయ్య తన తల్లికి చూపు, తనకు సంతతి, తన భార్యకు మాట, తనకు సొంతఇల్లు ఏర్పడేలా కలసి నాలుగు కోరికలు ఒక వరంలో తీరేలా ఎలా కోరుకున్నాడు? సమాధానం తెలిసి చెప్పకపోయావో తలపగిలి మరణిస్తావు” అన్నాడు.

“బేతాళా, అడవికి వెళ్ళిన శివయ్య కనిపించిన వనదేవతకు నమస్కరిస్తూ ‘అమ్మా బుధ్ధిమంతులైన నా సంతానం నా సొంత ఇంటిముందు ఉద్యానవనంలో ఆడుకుంటూ ఉండగా, వారిని చూసిన నా తల్లి, తండ్రి, నా భార్యా గట్టిగా పిలిచేలా వరం ప్రసాదించు తల్లీ’ అని కోరిఉంటాడు. బదులుగా, ‘శివయ్యా, తెలివైనవాడవే. సొంత ఇల్లు, తల్లికి కంటిచూపు, భార్యకు మాట, బుధ్ధిమంతులైన పిల్లలను కలసి వచ్చేలా ఒక వరంతో నాలుగు కోరికలు తీర్చుకున్నావు. నీ కోరిక తప్పక నెరవేరుతుంది. నీవు కోరకుండానే నీ ఇంటి ఉద్యానవనంలో తేనె, పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు, లక్క, జిగురు, కుంకుళ్ళు వంటి పలు ఔషదీయ ఉత్పత్తులు అన్నిరకాలు లభిస్తాయి’ అనిఉంటుంది వనదేవత” అన్నాడు విక్రమార్కుడు.

విక్రమార్కునికి మౌనభంగం కావడంతో శవంతో సహా బేతాళుడు మాయమై చెట్టు పైకి చేరాడు.

పట్టువదలని విక్రమార్కుడు బేతాళుని కొరకు వెనుతిరిగాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here