కల్పిత బేతాళ కథ-18 అవినీతికి మందు

0
9

[ప్రముఖ బాలసాహితీవేత్త డా. బెల్లంకొండ నాగేశ్వరరావు రచించిన ‘కల్పిత బేతాళ కథలు’ చదవండి.]

[dropcap]ప[/dropcap]ట్టువదలని విక్రమార్కుడు బేతాళుని కొరకు శ్మశానంలో ప్రవేశించి, తను ఆవహించిన శవంతో చెట్టుకు వేళ్లాడుతున్న బేతాళుని బంధించి భుజంపైన చేర్చుకుని మౌనంగా శ్మశానం నుండి బయలుదేరాడు.

“మహీపాలా, అనన్య ప్రతిభావంతుడవు అయిన నీ పట్టుదల మెచ్చదగినదే! మన ప్రయాణంలో నీకు అలసట తెలియకుండా ‘అవినీతికి మందు’ అనే కథ చెపుతాను విను” అంటూ చెప్పసాగాడు బేతాళుడు.

***

అవంతి రాజ్య పొలిమేరలలో సదానందుడు ఆశ్రమం నిర్మించుకుని పలువురికి ఉచిత విద్యాదానం చేస్తుండేవాడు. ఒకరోజు సాయంత్రం ఎప్పటిలా తన విద్యార్థులకు సదానందుడు పాఠం బోధిస్తుండగా, అవంతిరాజు గుణశేఖరుడు, అతని మంత్రి సుబుధ్ధి కలసి సదానందుని దర్శనానికి వచ్చారు. వారిని చూస్తూనే వారికి ఆసనాలు చూపించాడు సదానందుడు.

ఆసనాలపై ఆసీనులైన రాజు, మంత్రి, విద్యార్థులతో కలసి పాఠం వినసాగారు.

“నాయనలారా మీలో చాలామంది రాజ, మంత్రికుమారులు ఉన్నారు. యుధ్ధరంగంలో సైన్యాలను షడంగ దళాలుగా విభజన జరిగినట్లు కౌటిల్యుని అర్థశాస్త్రం లోనూ, కామాందకీయంలోనూ, మానసోల్లాసంలోనూ వివరింపబడింది. ‘మొత్తాలవారు’, ‘కైజీతగాండ్రు’ అనే సైన్య విభాగాలు అర్థశాస్త్రంలో చెప్పబడిన ‘భృతబలం’ శ్రేణులుగా కనిపిస్తుంది.

మెదట షడంగ దళాల గురించి చెపుతాను. ‘మౌన బలం’ – ఈ బలగాలు తమ ఉనికిని మాత్రం రాజు మీద ఎక్కువ ఆధారపడి అతని నుండి సర్వదా మెప్పు కోరుతుంది. వంశపారంపర్యంగా నమ్మకంగా రాజును సేవించేది. ‘భృతబలం’ – ఈ దళాలు రాజుకు చేరువగా ఎల్లప్పుడూ ఉంటాయి. భృతబలం అంటే అప్పటికప్పుడు జీతం ఇచ్చి సమకూర్చుకునేది. యుధ్ధం అంటే ముందువరసలో ఈ దళమే ఉంటుంది.

‘శ్రేణిబలం’ – దేశాభిమానం ఎక్కువ కలిగిన దళం ఇది. యుధ్ధం వలన జరిగే లాభ నష్టాలు, కష్ట సుఖాలు సమంగానే ఇది భరిస్తుంది. ‘సహృద్ బలం’ – మిత్ర సామంత రాజుల వలన పొందిన సైన్యం ఇది.

‘ద్విషన్ బలం’ – ఒకప్పుడు శత్రువుగా ఉండి సంధి వలన కాని మరేవిధంగా అయిన రాజుకు వశపడిన సామంతుడు సహాయార్థం పంపే బలాన్ని ‘అమిత్ర బలం’ అంటారు. ‘అటవీ బలం’ -పుళిందులు, శబరులు మోదలగు అటవిక కూర్పబడిన సైన్యం.

చతురంగ దళాలు అంటే రథ, గజ, తురగ, పథాతి దళాలతో కూడిన దళాలు.

ఇంకా, షడ్ గుణాలు అంటే తనకన్నా శత్రువు బలం కలిగిన వాడైతే, అతనితో సఖ్యత పడటాన్ని ‘సంధి’ అంటారు. శత్రువుకన్న ఎక్కువ బలం కలిగి యుధ్ధం ప్రకటన చేయడాన్ని ‘విగ్రహం’ అంటారు. బలం ఆధిక్యంగా ఉన్నప్పుడు దండయాత్త చేయడాన్ని’యానం’ అంటారు. సమ బలం ఉన్నప్పుడు సమయ నిరీక్షణ చేయడాన్ని ‘ఆసనం’ అంటారు. ఇతర రాజుల సహాయం లభించినప్పుడు ద్వివిధాన నీతి ప్రవర్తనను ‘ద్వైధీభావం’ అంటారు.

బలం కోల్పోయినపుడు శత్రు ధనాన్ని పీడించడాన్ని’సమాశ్రయం’ అంటారు, ఈ రోజుకు స్వస్తి” అన్నాడు సదానందుడు.

పాఠం పూర్తి అయిన అనంతరం “విజయోస్తు గుణశేఖర మహరాజులకు” అని ఆశీర్వదించాడు.

గుణశేఖరుడు సదానందునికి నమస్కరిస్తూ “గురుదేవా రాజ్యంలో అవినీతి పెరిగిపోయింది. ఎన్ని రకాలుగా ప్రయత్నించినా అవినీతిని అరికట్టలేకపోతున్నాము. ముఖ్యంగా రాజోద్యోగులను నియంత్రించడం చాలా కష్టంగా మారింది. ఆ విషయమై తమ సలహ తీసుకుందామని వచ్చాను” అన్నాడు గుణశేఖరుడు.

“మహరాజా, ఈ విషయంలో తమరు నా సలహలను కఠినంగా అమలు జరిపితే ఫలితం కనిపిస్తుంది. నేను తమకు చెప్పే సూచనను వెంటనే అమలుపరచండి” అని తన సూచన వివరించాడు సదానందుడు.

మరు దినం అవంతి రాజ్యమంతటా సదానందుడు చెప్పిన విషయం చాటింపు వేయించాడు మంత్రి సుబుధ్ధి. ఆ రోజునుండి రాజ్యంలో ఎక్కడా లంచం తీసుకున్నట్లు ఫిర్యాదులు రాలేదు. అలా ఆ రాజ్యంలో అవినీతి పూర్తిగా రూపుమాసిపోయింది.

***

కథ చెప్పడం ముగించిన బేతాళుడు “విక్రమార్క మహరాజా, అవంతి పాలకుడైన గుణశేఖరుడికి సదానందుడు ఇచ్చిన సలహ ఏమిటి? ఏ ప్రకటన విని అవంతిరాజ్య లంచగొండులు భయపడ్డారో ఊహించి నాకు తెలియజేయి. సమాధానం తెలిసి కూడా నాకు చెప్పకపోయావో తలపగిలి మరణిస్తావు” అన్నాడు.

“బేతాళా, లచం తీసుకునేవారు, ఇచ్చేవారు కూడా ఉరితీయబడతారు అని అవంతి రాజ్యం అంతటా దండోరా వేయించాడు మంత్రి సుబుధ్ధి. ఆ ప్రకటన విన్న లంచగొండులంతా ప్రాణభయంతో లంచం తీసుకోవడం మానుకున్నారు. అలా ఒకరోజు వ్యవధిలో అవంతి రాజ్యంలో అవినీతి సమూలంగా రూపుమాసిపోయింది” అన్నాడు విక్రమార్కుడు.

విక్రమార్కునికి మౌనభంగం కావడంతో శవంతో సహా బేతాళుడు మాయమై చెట్టు పైకి చేరాడు.

పట్టువదలని విక్రమార్కుడు బేతాళుని కొరకు వెనుతిరిగాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here