కల్పిత బేతాళ కథ-4 మంత్రి తెలివి

0
9

[ప్రముఖ బాలసాహితీవేత్త డా. బెల్లంకొండ నాగేశ్వరరావు రచించిన ‘కల్పిత బేతాళ కథలు’ చదవండి.]

[dropcap]ప[/dropcap]ట్టువదలని విక్రమార్కుడు చెట్టుపై శవాన్ని ఆవహించి ఉన్న బేతాళుని బంధించి భుజాన వేసుకుని మౌనంగా నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు “విక్రమార్క మహరాజా నీ సాహసం, కార్యదీక్షత మెచ్చదగినవే, మహిపాలా నన్ను బంధించి నీవు తప్పు చేస్తున్నావు. నేను చాలా శక్తిమంతుడను. నీ గురించి నాకు పూర్తిగా తెలుసు. ఇంద్రుని వరప్రసాదమైన నవరత్నఖచిత పీఠమైన, నెమలి ఆకృతి కలిగిన బంగారు సింహాసనం అధిష్టించే నీ సింహాసనానికి కలిగిన మెట్లపై ఉన్న సాలభంజికలు పేర్లు చెపుతాను విను.. శృంగారతిలక, జయ, విజయ, మలయవతి, ఆనంద సంజీవని, గంధర్వసేన, ఐప్రభావతి, సుప్రభ, సంభోగనిధి, సుభద్ర, చంద్రిక, కురంగనయన, అనంగధ్వజ, ఇందువదన, విలాసరసిక, కోమలి, సౌందర్యవతి, లావణ్యవతి, లజ్జావతి, ఇందుమతి, జనమోహిని, విద్యాధరి, హరిమధ్య, సుఖప్రదాయని, ప్రభోధవతి, మలయవతి, హంసగమన, అంగసుందరి, సుకేసి చతురిక, వామాంగి, తలోదరి వంటి వారు ఉన్నారు, నీకు మార్గంలో ప్రయాణ అలసట తెలియకుండా ‘మంత్రి తెలివి’ అనే కథ చెపుతాను..”

అమరావతి రాజ్యం పాలించే చంద్రసేన మహరాజుకు వయసు పైబడటంతో తన రాజ్యాన్ని రెండు భాగాలుగా చేసి తన ఇరువురి కుమారులకు పట్టాభిషేకం చేయదలచి, తన మంత్రి సుబుద్ధితో సంప్రదించి రాజ్యం అంతటా దండోరా వేయించి, ఇరుగు పొరుగు రాజులకు ఆహ్వానాలు పంపించాడు. కొన్నిరోజుల తరువాత మంత్రి సుబుధ్ధి కుమారులు ఇరువురు మంత్రిత్వవిద్య పూర్తిచేసుకుని చంద్రసేనుని ఆశీర్వాదానికి వచ్చారు.

ఇంతలో ఇరుగు, పొరుగు దేశాల రాయబారులు వచ్చి చంద్రసేన మహరాజు గారికి తమ రాజుగార్ల సందేశం అందించి విశ్రాంతి మందిరానికి వెళ్లిపోయారు. చంద్రసేనుడు “నాయనలారా మీకు చిన్నపరిక్షపెడతాను, మన ఇరుగు,పొరుగురాజులు పంపిన సందేశం యిది. దీని అర్ధం ఏమిటి, దీనికి మనం పంపవలసిన సమాధానం ఏమిటి” అన్నాడు. ఆ రాజులు పంపిన సందేశం చూసిన మంత్రి సుబుధ్ధి పెద్ద కుమారుడు ఆ రాయబారులు తెచ్చిన సందేశ అర్థాన్ని వివరించాడు. చిన్నకుమారుడు ఆ రాయబారులతో తిరిగి పంపవలసిన సందేశాన్ని ఎలా పంపాలో చంద్రసేనుడికి వివరించాడు. వారిని పంపిన చంద్రసేనుడు సమావేశమందిరంలో తన మంత్రి సుబుధ్ధిని కలసి రాయబారులు తెచ్చిన అమరావతి దేశపు నాణెం రెండు భాగాలుగా ఉండటం, దాన్ని ఆ రాజులు సందేశంగా పంపడం చూపించాడు.

“మహప్రభూ ఇప్పుడు మన రాజ్యం రెండు భాగాలుగా విభజింపబడుతుంది కనుక మనపై దాడి చేయడం సులభం అని దీని అర్థం తెలిసేలా మన దేశ నాణాన్ని రెండు భాగాలు చేసి మనకు హెచ్చరికగా పంపారు. దీనికి తగిన సమాధానంగా వారి ఇరువురికి మన దేశపు సంపూర్ణ నాణాన్ని పంపాలి. చూపరులకు మన రాజ్యం రెండుగా కనిపించినా, ఆపద సమయంలో మనం ఐకమత్యంగా ఉంటామని సంపూర్ణ నాణెం ద్వారా వారి మార్గంలోనే వారికి సందేశం పంపాలి. ఎందుకంటే మీ పెద్ద కుమారుడు జయుడిపై దాడి జరిగితే, రెండోసారి చిన్నవాడైన విజయుని రాజ్యంపై దాడి జరుగుతుంది. అన్నపై దాడి జరిగినపుడు తమ్ముడు, తమ్ముడిపై దాడి జరిగితే అన్న ఒకరిని ఒకరు ఆదుకుంటారు” అని మంత్రి వివరించాడు. తన మంత్రి, అతని కుమారులు ఒకే విధమైన సమాధానం చెప్పినప్పటికి చంద్రసేన మహరాజు సమ్మతించక ఇరుగు పొరుగు రాజుల కుమార్తెలను తన కుమారులకు వివాహం చేయదలచానని వారికి వార్త పంపించాడు.

అప్పటి వరకు కథ చెపుతున్న బేతాళుడు “విక్రమార్క మహరాజా, మంత్రి అతని కుమారులు చక్కటి సలహ ఇచ్చినప్పటికి వారి మాటలు కాదని శత్రురాజులతో వియ్యన్ని అందుకోవడానికి చంద్రసేనుడు నిర్ణయం ఎందుకు తీసుకున్నాడు, దీనిలోని ఆంతర్యం ఏమిటి? తెలిసి చెప్పక పోయావో నీ తల పగిలి మరణిస్తావు” అన్నాడు.

“చంద్రసేన మహరాజు చాలా తెలివైనవాడు. ఎంతో దూరదృష్టి కలిగిన, ఆలోచనాపరుడు. ఏ సమస్యకైనా శాశ్వత పరిష్కారమార్గం ఆలోచించాలి. తన కుమారులు రాజ్యమేలుతున్నంత కాలం ఇరుగు పొరుగు రాజులు ఎప్పుడు దాడి చేస్తారో అన్న భీతితో దేశప్రజలు సుఖశాంతులకు దూరం అవుతారు. ప్రజలను భయాందోళనలకు దూరంగా ఉంచవలసిన బాధ్యత రాజుపై ఉంటుంది కనుక, అందరికి ఆమోదయోగ్యమైన మార్గాన్ని ఎంచుకున్న చంద్రసేనుడు తన కుమారులతో శత్రురాజుల కుమార్తెల వివాహ ప్రతిపాదన చేసాడు. అలా వివాహం జరిగితే తమ కుమార్తెల రాజ్యాన్ని కాపాడవలసిన బాధ్యత కూడా వారిపై ఉంటుంది. దానితో శత్రుభయం లేకుండా రాజ్యాన్ని అభివృధ్ధి పథంలో నడపవచ్చు. చంద్రసేనుడు గోప్ప మేధావి” అన్నాడు విక్రమార్కుడు. అతని సమాధానం వింటూనే శవాన్ని ఆవహించి ఉన్న బేతాళుడు రివ్వున ఎగిరిపొయాడు.

పట్టువదలని విక్రమార్కుడు బేతాళునికై వెనుతిరిగాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here