కల్తీ కాలం

0
9

[dropcap]స[/dropcap]త్యమూర్తి ఇంట్లోకి వస్తూ “ఏమోయ్! అబ్బాయి ఇంట్లో లేనట్టు ఉన్నాడు! పరీక్ష బాగా రాశాడా?” అని దాదాపు అరిచినట్టు అడిగాడు.

“అబ్బబ్బ వస్తున్నా!” అంటూ వంట గదిలో నుంచి వచ్చింది సత్యమూర్తి భార్య రమాదేవి.

“ఎందుకు అంత గట్టిగా అరుస్తున్నారు? స్కూటర్ చప్పుడు వినబడగానే కాఫీ పెడుతున్నా!” అంటూ కాఫీ కప్పు అందించింది.

“అది సరేలే! ఇంతకీ మన చిట్టి పరీక్ష ఎలా రాశాడు? ఎక్కడికి ఆఘోరించాడు?” అన్నాడు సత్యమూర్తి.

“చాలా బాగా రాశాడట. ఇప్పుడే స్నేహితుడి ఇంటికి వెళ్లాడు. ఆ మాత్రం రిలాక్స్ అవ్వాలి కదాండి?” అంది రమాదేవి.

“నీ మొహం! రేపటి పరీక్షకు వెలగ పెట్టొద్దూ?” అంటూ ఉండగానే, చిట్టి – చంద్రశేఖర్ వచ్చాడు.

“ఏమోయ్! ఎలా రాశావు? ఇంక పెత్తనాలు చాలు. రేపటి పరీక్షకు చదువు” అని విసుగ్గా అన్నాడు సత్యమూర్తి.

“బాగా రాశాను డాడీ! రేపు పరీక్ష లేదు. ఎల్లుండి ఉంది. అందుకే ఫ్రెండ్ ఇంటికి వెళ్లాను. ఎల్లుండితో పరీక్షలు ఆఖరు” అని సమాధానపరిచాడు చిట్టి.

ఆ మాటలు విన్నాక, మౌనంగా సత్యమూర్తి స్నానం చేయడానికి వెళ్ళాడు.

***

“ఆఖరి పరీక్ష అయిపోయింది. బ్రహ్మాండంగా రాశాను, మంచి స్కోర్ వస్తుంది” అని నమ్మకంగా చెప్పాడు చిట్టి.

“ఇక నీట్ కి ప్రిపేర్ అవ్వు” అని చిరాకుగా అన్నాడు. “మంచి రేంకు తెచ్చుకో, డబ్బు కట్టి చదవడానికి నేను వ్యతిరేకం” అని హెచ్చరించాడు సత్యమూర్తి.

“మీకు ఆ భయమేమీ వద్దు. నాకు తప్పక మంచి ర్యాంకు వస్తుంది!” అని చెప్పిన కొడుకు ఆత్మవిశ్వాసానికి సంతోషించాడు మూర్తి.

***

ఆ రోజు మూడు గంటలకి ఇంటర్మీడియట్ పరీక్షల ఫలితాల కోసం విద్యార్థులంతా వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నారు. కానీ మన చిట్టి నంబరు ఫెయిల్ అయినట్టుగా వచ్చింది. దానితో సత్యమూర్తి తన మీద పిడుగుపడ్డట్టు బాధపడ్డాడు. ఆఫీసు మధ్యలో నుంచి వచ్చేసి అగ్గిమీద గుగ్గిలం అయిపోయాడు.

“నువ్వూ, నీ కొడుకు నన్ను వీధిపాలు చేశారు. నాకు ముందే తెలుసు, ఇంత పని చేసాడు” అని పెంకులు ఎగిరిపోయేలా అరుస్తూ, తిట్ల దండకం మొదలుపెట్టాడు సత్యమూర్తి.

ఇంతలో చిట్టి వచ్చాడు. ఇంట్లో మౌనం రాజ్యమేలుతోంది.

“డాడీ! ఇది ఇంపాజిబుల్! పాస్ కాకపోవడం అనేది జరగని పని. ఏదో తప్పు జరిగింది!” అంటూ చిట్టి చెప్పాడు.

ఈ మాటలకు సత్యమూర్తి దిగ్గున లేచి, కొట్టినంత పని చేస్తూ, “పరీక్ష తప్పిన ప్రతి గాడిద చెప్పేది ఇదే! మళ్లీ రాసి ఏడు!” అని కసిరాడు.

“ఆ అవసరం లేదు. ఉండదు. నేను రీకౌంటింగ్ పెట్టిస్తాను” అని దృఢంగా చెప్పాడు చిట్టి.

టీవీలో ఇంటర్ బోర్డు దగ్గర జరుగుతున్న గందరగోళం మెయిన్ న్యూస్‌గా దావానలంలా విస్తరిస్తోంది. ‘చిట్టి మాటలలో నిజం ఉండవచ్చునేమో, వాడు పాస్ అయ్యాడేమో! ఇదే జరిగితే తప్పక తిరుపతి వస్తాం!’ అంటూ సత్యమూర్తి మొక్కేసుకున్నాడు.

దాదాపు 20 మందిని పొట్టన పెట్టుకున్న ఇంటర్మీడియట్ బోర్డు రిజల్ట్స్ నిర్వాకం చూసి, చిట్టి తండ్రితో “ఇలా చచ్చి ఏమి సాధిస్తారు డాడీ! పాస్ అవక పోయినంత మాత్రాన చావాల్సిందేనా? ” అన్నాడు.

“మన మీద మనకు నమ్మకం ఉండాలి. నేను అలాంటి పని చేయను. ఎక్కడో ఏదో తప్పు జరిగింది. నా మీద నాకు పూర్తి నమ్మకం ఉంది. నిజానికి నాకు మంచి స్కోరు రావాలి” అని ఘంటాపథంగా చెబుతూ కుర్చీలో కూర్చున్న కొడుకు ఆత్మవిశ్వాసానికి, మూర్తిలో ఆశ్చర్యం, ఆనందం కలగాపులగం అయ్యాయి.

మరో మూడు రోజులలో రివైజ్డ్ రిజల్ట్స్ వచ్చినప్పుడు చిట్టి మాట నిజమైంది. అతడికి 985 మార్పులు వచ్చాయి. ఇంట్లో పండుగే పండుగ. సత్యమూర్తికి ఆఫీసులో ప్రశంసల వెల్లువ. చిట్టి తొందరపాటు నిర్ణయం తీసుకోకుండా, విశ్వాసం కోల్పోకుండా జరిగిన అన్యాయానికి దృఢంగా నిలబడిన తీరు అభినందనీయం, ఆచరణీయం.

***

పిల్లలూ! జీవితం చిన్నది. తొందరపాటు చర్యలు చేయకండి. మీరు పాస్ అయి కూడా ఉండవచ్చు. పరీక్షలో కాదు జీవితంలో పాస్ అవాలి.

తల్లి తండ్రులారా! పిల్లలను ఇట్టే దూషణ, అట్టే భూషణ చేయకండి. ఇది కలియుగం. కల్తీ యుగం. పిల్లలు తిరిగి రారు. తస్మాత్ జాగ్రత్త. జాగ్రత్త. జాగ్రత్త.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here