కళ్యాణ రాముడు

5
8

[శ్రీరామనవమి సందర్భంగా డా. శ్రీమతి కొఠారి వాణీ చలపతి రావు రచించిన ‘కళ్యాణ రాముడు’ అనే వ్యాసాన్నిఅందిస్తున్నాము.]

[dropcap]సృ[/dropcap]ష్టి, స్ధితి, లయలలో స్థితికారకుడైన శ్రీ మహావిష్ణువు ‘ధర్మసంస్థాపనాయ సంభవామి యుగేయుగే’ అంటూ భూమి మీద  దుష్టశిక్షణ, శిష్టరక్షణ చేసి ధర్మాన్ని కాపాడటం కోసం పది అవతారాలు ఎత్తాడు. అందులో ఏడవ అవతారం రామావతారం. ఇది మానవావతారం. అందుకే దశరథ మహారాజు ద్వారా కౌసల్య కడుపున రాజవంశంలోని ఒక మామూలు మనిషిగా జన్మించి – ఎంతో కష్టం, నష్టం, దుఃఖం అనుభవిస్తూ కూడా ‘మనిషి అంటే ఇలా ఉండాలి’ అన్నట్టు మానవ లోకానికంతటికీ ఆదర్శ పురుషుడు అయ్యాడు. పినతల్లి స్వార్థబుద్ధితో రాజ్యాధికారాన్ని లాక్కున్నా, అడవులకు వెళ్ళమని ఆజ్ఞాపించినా పితృవాక్య పరిపాలన కోసం భార్య సీతను వెంట తీసుకొని తమ్ముడు లక్షణుడు తోడు రాగా 14 సంవత్సరాలు కఠోర వనవాస దీక్షను బూనాడు. పెద్దల మాటను మన్నించి మర్యాద రాముడయ్యాడు – పురుషోత్తముడయ్యాడు – సకల గుణాభిరాముడయ్యాడు.

త్రేతాయుగంలో ఇక్ష్వాకు వంశంలో చైత్ర శుద్ధ నవమి నాడు పునర్వసు నక్షత్రపు కర్కాటక లగ్నంలో అభిజిత్ ముహూర్తంలో జన్మించిన రాముని చరితను వ్రాసిన వాల్మీకి మహర్షి తన రామాయణ ఇతిహాసంలో రాముడిని ఇలా వర్ణించాడు –

‘ఇక్ష్వాకు వంశ ప్రభవో రామో నామ జనైః శ్రుతః
నియతాత్మా మహావీర్యో ద్యుతిమాన్ ధృతిమాన్ వశీ’ అని.

ఇక్ష్వాకు వంశంలో పుట్టిన రామ అని పేరు గల ఈ మహాపురుడు జనులందరి చేతా తెలియబడినవాడు. నిశ్చితమగు స్వభావం కలవాడు. స్వయంప్రకాశం కలవాడు, ధైర్యము, ఇంద్రియ నిగ్రహము కలవాడు. సమస్త ప్రపంచాన్ని తన అధీనంలో వుంచుకున్నవాడు అని దీని భావం.

శ్రీ రాఘవం దశరథాత్మజ మప్రమేయం
సీతాపతిం రఘుకులాన్వయ రత్న దీపం
ఆజానుబాహుం అరవిందదళాయతాక్షం
రామం నిశాచర వినాశకరం నమామి॥

అన్న పద్యంలో రాముని వర్ణన ఎలా వుంటుందంటే రాముడొచ్చి మన కళ్ళ ముందు నిల్చున్నట్లుగా వుంటుంది. ఆజానుబాహుడైన దేహం కలవాడు, రఘుకులాన్వయానికి రత్నదీపం వంటి వాడు, తామర రేకుల వంటి విశాల నేత్రములు కలవాడు, రాక్షసులను సంహరించినవాడు అయిన రాముడు దశరథాత్మజుడు, సీతాపతి.

అసలు ‘రామ’ అన్న రెండక్షరాలలోనే పరబ్రహ్మ వుంది. శ్రీరాముని హృదయంలో రమింపచేసుకోగల తత్వం వుంది. అందుకే ‘రమయతీతి రామః’ అన్నది రామ శబ్దానికి నిర్వచనం అయింది. ఆ రాముని గురించి వాల్మీకి రచించిన ఇతిహాసం రామాయణం. ‘రామస్య ఆయనమ్ రామాయణం!’

‘రా’ అనగానే మన నోరు తెరుచుకొని మనం చేసిన పాపాలన్నీ బయటకు వెళ్ళిపోతాయి. మళ్ళీ ‘మ’ అనగానే నోరు మూసుకుంటుంది గనుక బయటవున్న పాపాలు లోపలికి ప్రవేశించవు. అందుకే రామనామ స్మరణ జ్ఞానాన్ని, జన్మరాహిత్యాన్ని కలిగిస్తుందని ఆధ్యాత్మిక కోవిదులు చెబుతారు.

ఇక విష్ణు సహస్ర నామ స్మరణ అయితే ఎంత శక్తివంతమో మాటల్లో చెప్పలేనిది. అయితే వెయ్యి నామాలు చదవటానికి సమయం, ఓపిక చాలా అవసరమవుతాయి భక్తునికి. అందుకే ఒక రోజు పార్వతి శివుని అడిగించట – విష్ణుసహస్ర నామ పఠనానికి కాస్త సూక్ష్మమైన మార్గం ఏమయినా వుంటే చెప్పమని – కేనోపాయేన లఘునా విష్ణోర్నామ సహస్రకం?’ ఇది పార్వతి శివుడి అడిగింది. సమాధానంగా శివుడు ‘శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే’ అని చెప్పాడట. ఈ శ్లోకాన్ని రోజుకు మూడుసార్లు పఠిస్తే విష్ణు సహస్ర నామ పారాయణ ఫలితం లభిస్తుంది. అంతేకాదు శివసహస్ర నామ ఫలితం కూడా దక్కుతుంది, అన్నది శివుడు ఇచ్చిన సమాధానం. అది కూడా అనలేనివాళ్ళు – ‘రామ రామ – రామ’ అని మూడు సార్లు అనుకున్నా చాలు. అదే రామ తారకమంత్రం. భక్తులకు ఈ సంసార ఝంఝాటం నుంచి విముక్తి కలిగించి మోక్షాన్ని ప్రసాదించటమే గాక పునర్జన్మ రాహిత్యాన్ని వరంగా ప్రసాదించే మంత్రం. అలాంటి రాముడి చరిత్రను తెలిపే ఎన్నో రామాయణ ఇతిహాసాలు ఎన్నో భాషల్లో వచ్చాయి. అందులో యథార్థ గాథలతోపాటు కల్పిత కథలూ ఎన్నో వచ్చి మధ్యలో చేరాయి. ఆ కల్పిత కథలు సహితం ఔచిత్యాన్ని కోల్పోకుండా రచించబడినవయితే అసలు కథకు అవి శోభను తెచ్చాయేగానీ నష్టం కలిగించేలేదు, రసాభాస కానివ్వలేదు.

ఇన్ని రామాయణాలను ఇంతమంది వ్రాయటానికి కారణం ఇప్పటికే వ్రాస్తుండబడటానికి కారణం రాముడు ఇంటింటి బాలుడిలా – ప్రతి ఇంటి దైవంలా ‘దైవం మానుష రూపేణా’ అన్నట్టు సంచరించడం, కొలువైవుండటం. అంతేకాదు, రాముడిని తమ నిత్యజీవితంలో భాగంగా చేసుకున్నారు అందరూ. ‘పిబరే రామ రసం’ అని సంకీర్తనకారులు అంటే, ‘శ్రీరామ నీ నామమేమి రుచిరా – ఏమి రుచీ ఏమి రుచీ – ఎ౦త రుచిరా!’ అంటూ రామనామం లోని రుచిని మరిగి పాటలుగా పాడుకున్నారు భక్తులు. కష్టమొచ్చినప్పుడు ‘రామా నీవే కలవు’ అని ప్రార్థించటం – ‘రామ రామ’ అన్న రామరక్ష మంత్రాన్ని జపించటం, జరగరానిది జరిగినప్పుడు ‘రామ రామ’ అనుకోవటం – తమ ఇంట పుట్టిన బిడ్డలకు ‘రాముని’ పేరు పెట్టుకోవడం! ఇలా ఒకటా రెండా? రాముడు కేవలం దైవంగా మిగిలిపోయి వుంటే – జనం రామునికి ఇంత దగ్గరయ్యేవాళ్ళు కాదు – హృదయంలో చేర్చుకునేవారు కాదు. గుడిలోని గర్భగుడిలో వుంచి – పూజలు చేసేవారు అంతే! రామునిలోని సుగుణాల కారణంగానే ఆయన జనబాహుళ్యంలోనే కాక తిర్యక్కులలో, వానరజాతిలో, ప్రకృతిలోని అణువణువులో ఆనాటి నుంచే ఈనాటి వరకూ ఒక సజీవ పాత్రలా నిలిచిపోయాడు.

‘రామాయణ మహాకావ్యమ్ శతకోటి ప్రవిస్తరమ్
ఏకైకమక్షరం ప్రోక్తమ్ పుంసామ్ మహా పాతక నాశనమ్’ అన్నారు అందుకే.

అంత గొప్ప కావ్యమైన రామాయణంలో నాయకుడైన రాముణ్ణి ‘ఆపదామపహర్తాం దాతారం సర్వసంపదాం

లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం’ అని ప్రార్థిస్తారు భక్తజనకోటి. రామనామంలో పంచాక్షరీ మంత్రం మిళితమై వుందని – రాముడిని స్మరిస్తే శివుడ్ని కూడా స్మరించినట్టే అని నమ్ముతారు. రామాయణం అంత గొప్పది గనుకనే – ఆదికావ్యమైన వాల్మీకి రామాయణాన్ని అనుసరిస్తూ ఆ తర్వాత ఎన్నో రామాయణాలు వచ్చాయి. ఎన్ని వచ్చినా మనకు ప్రామాణిక గ్రంథం మాత్రం సంస్కృత రామాయణమే.

ఆ రామాయణం ప్రకారం ఈ రోజు – అంటే చైత్రశుద్ధ నవమి రోజు రాముని జననం, సీతారాముల కళ్యాణం జరిగాయి, పుట్టినరోజు నాడే కళ్యాణం రోజు కావటానికి కారణం ఇదే.

చాలామందికి పుట్టిన రోజు – కళ్యాణం ఏమిటి అన్న అనుమానం వుంది. గనుక చెబుతున్నాను.

రాజైనంత మాత్రాన రాముని జీవితం పూలపక్క కాలేదు. మామూలు మనుషుల కన్నా ఎక్కువ కష్టాలను అనుభవించాడు – మంచి వ్యక్తిగా, మర్యాద రామునిగానే కాక – రాజుగా రాజధర్మాన్ని పాటించటం కోసం మనసును కష్టపెట్టుకొని మరీ కొన్ని పనులు చేయాల్సివచ్చింది. దాని కారణంగానే ఇప్పటికీ రామాయణం కొన్ని విమర్శలను ఎదుర్కోవలసి వస్తున్నది. వాటిని త్యాగాలుగా గుర్తించలేని వాళ్ళు రాముడిని నిందించారు కూడా.

ఇవీ రాముని కష్టాలలో ఒక భాగమే – పూర్వ రామాయణంలో సీతావియోగం చాలదన్నట్టు – మళ్లీ ఉత్తర రామాయణంలో కూడా సీతా పరిత్యాగం చేయవలసి వచ్చింది. అంతెందుకు – రామావతారం పరిసమాప్తం అయిన తర్వాత కూడా మహమ్మదీయుల దాడుల బెడద రామమందిరాలకు తప్పలేదు. అలా కొన్ని దశాబ్దాలుగా పట్టుకున్న పీడ మొన్నీమధ్యనే – మళ్లీ అయోధ్యలో రామమందిరం నిర్మింపబడటం, బాలరాముని ప్రతిష్ఠ జరగటంతో తొలగిపోయి మళ్లీ రామయ్యను మనం స్వంతం చేసుకోగలిగాం.

ఈసారి శ్రీరామనవమి ఉత్సవాల ప్రత్యేకత అదే!

భద్రాచలంలో అంగరంగవైభవంగా ఈ రోజు జరుగుతున్న శ్రీసీతారాముల కళ్యాణాన్ని తిలకిస్తున భక్తుల హృదయాలు మరింత ఆనంద పారవశ్యంలో మునిగిపోవటానికి కారణం అదే!

తాటాకు పందిళ్లు, అధిక సంఖ్యలో భక్త సందోహం పెళ్ళికి రావడం, తెలంగాగా ప్రభుత్వం పట్టుకెళ్ళే ముత్యాల తలంబ్రాలు, రామదాసు చేయించిన పుస్తెతో కలిపి మూడు పుస్తెలు గుచ్చిన పసుపు తాడును రాముడు సీత మెడలో కట్టడం, బాజాలు, మంగళ తూర్యాలు, వేద పండితులు పఠించే పెళ్ళి మంత్రాలు, అందమైన, అర్థవంతమైన విశ్లేషకుల పెళ్ళి వ్యాఖ్యానాలు, వడపప్పు, పానకంలను భక్తులు సేవించటం కళ్యాణాక్షతల పంపకం – ఇలా ఒకటా, రెండా – అంగరంగ వైభవం శ్రీ సీతారాముల కళ్యాణం! చూడటానికి భక్త కోటికి రెండు కళ్ళు సరిపోవు – చేతులు జోడించడానికి రెండు చేతులు సరిపోవు! అన్నట్టు వుంటుంది ఆ వేడుక.

దేవుడి పెళ్ళికి అంతా ఆహ్వానితులే! ప్రత్యేకంగా ఎవరూ పిలవాల్సిన అవసరం లేదు. మన రామయ్య పెళ్ళి మన ఇంట్లో పెళ్ళి కనుక ‘సీతారాముల కళ్యాణము చూతము రారండీ’ అంటూ అందరం పెళ్ళికి వెళ్ళవలసిందే. ఈ రోజుల్లో ‘తూతూ మంత్రం’ అన్నట్టుగా అవుతున్న పెళ్ళిళ్ళు సిగ్గుపడేలా- సంప్రదాయం, శాస్త్రం కలగలిసిన ఆ పెళ్ళి వైభవాన్ని చూసి తరించి కన్నులకు పండుగ చేసుకోవాల్సిందే. అక్కడి కళ్యాణాక్షతలను తెచ్చి మన ఇంట్లో పెళ్ళి కావల్సిన ఆడపిల్లల తల మీద వేసి త్వరలో పెండ్లికూతుళ్ళు అయ్యేలా, మంచి భర్త లభించేలా ఆ సీతారాముల ఆశీస్సులను వాళ్ళకు అందించాల్సిందే! ఇప్పుడు ఈ పెళ్ళిని చూడకపోతే మళ్లీ సంవత్సరం దాకా ఆ అవకాశం రాదు. మంగళం మహత్. అంత వరకూ కళ్యాణరాముని దర్శనానికి వేచి వుండక తప్పదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here