ఇరుగు-పొరుగు. ఇకిగాయ్
[dropcap]నా[/dropcap]కు ఆరేండ్ల వయసు వచ్చేవరకు ఉన్న జ్ఞాపకాలు ఇంకొన్ని.
చెప్పాను కద, అప్పట్లో కడపలో ఉండేవాళ్ళమని.
నేను ఇటీవల ‘ఇకిగాయి’ అనే పుస్తకాన్ని చదివాను. ఆ పుస్తకం వ్రాసింది అమెరికా రచయిత ద్వయం విక్టర్ గ్రాసియా, ఫ్రాన్సిస్ మిరాల్. అది జపనీస్ పదం, ‘జీవించడంలో ఆనందం’ అని చెప్పుకోవచ్చు ఆ పుస్తక శీర్షికకి అర్థం.
ఆ పుస్తకంలో రచయితలు జపాన్ సమాజంలో ఉండే సంఘజీవితాన్ని చూసి అబ్బురపడతారు. ఇరుగు పొరుగువారు అందరూ కలిసి మెలిసి ఒక కుటుంబంలాగా ఉండటం, ఒకరికి ఒకరు చేదోడువాదోడుగా ఉండటం, నిరంతరం ఏవో చిన్న చిన్న పనులు ఆనందంగా చేసుకుంటూ ఉండటం, సంప్రదాయ విధానాలలో వ్యాయామం తదితర విద్యలు ఇప్పటికీ పాటిస్తూ ఉండటం చూసి అబ్బురపడతారు ఈ రచయితలు. ఈ కారణంగా ఆ సమాజంలో ప్రజల ఆయుర్దాయం ఎక్కువగా ఉందని, ప్రజలు ఆనందంగా ఉన్నారని కూడా రచయితలు పేర్కొంటారు.
ఎందుకిదంతా ఇప్పుడు చెబుతున్నానంటే, నేను ఇలాంటి సమాజాన్ని కళ్ళారా చూశాను. ఎక్కడో కాదు మన దేశంలోనే. ఎప్పుడో కాదు, కేవలం ఒక నలభై అయిదు యాభై సంవత్సరాల క్రితం.
నా చిన్నతనంలో కడపలో ఇలాంటి ‘ఇరుగు పొరుగు’ ఉండే సమాజాన్ని చూశాను. కడపేమీ చిన్న పల్లె కాదు. అప్పటికే అది జిల్లా రాజధాని. ఆ లెక్కన ఆ రోజుల్లో మన పల్లెలలో ఇంకా ఆరోగ్యకరమైన పరిస్థితులు ఖచ్చితంగా ఉండేవని విశ్వసిస్తాను నేను.
మనం ఎంతో గొప్ప నాగరికతకి వారసులం. శరీర ఆరోగ్యానికి యోగా, ప్రాణాయామం, మానసిక ఆరోగ్యానికి ధ్యానం, ఆరోగ్య సమతౌల్యతలని సరిచేయటానికి ఆయుర్వేదం, మనిషిని సరైన మార్గంలో ఉంచటానికి మాన్యువల్ లాంటి రామాయణ గ్రంథాలు, కోటానుకోట్ల సంవత్సరాలకి సరిపడ విజ్ఞాన భాండాగారాలు అయిన వేదాలు ఇవన్నీ మన స్వంతం.
కానీ మనం పాశ్చాత్య పోకడలు గొప్పవని భ్రమకి గురయ్యాము, మన సమాజపు సహజ అస్తిత్వాన్ని, మన గొప్పదనాన్ని విస్మరించాము. సాక్షాత్తు మన తొలి ప్రధాని నెహ్రూగారు ఇలాంటి భావదాస్యం కలిగిన వ్యక్తి కావటాన ఇలా మనల్ని మనం కించపరచుకునే భావనల్ని మన సమాజంలో వేగంగా వ్యాప్తి చేయగలిగారు. మనల్ని మన విలువలకి దూరం చేశారు. నెహ్రూ గారు బాహటంగా చెప్పుకునేవారు, భావజాలం పరంగా తాను పాశ్చాత్యుడినని, యాదృచ్చికంగా తాను హిందువునని.
నేను భారతీయుడిని అని చెప్పుకోవడానికి గర్విస్తాను అని ఊరికే పెదవి చివరనుంచి అంటుంటాం కానీ, మనకు నిజంగా మన భారతీయత పట్ల ఆ గర్వం ఉందా అని అనిపిస్తూ ఉంటుంది.
ఏ వ్యక్తికైనా తనకంటూ ఒక ప్రత్యేకత ఉంటుంది, ఏ సమాజానికైనా తనదైన ఒక అస్తిత్వం ఉంటుంది. ఆ వ్యక్తి గానీ, ఆ సమాజం గానీ తమ ప్రత్యేకత పట్ల, తమ యొక్క అస్తిత్వం పట్ల నిజంగా గర్వం ఉంటే (గర్వం అనే మాట మంచి అర్థంలో వాడాను) తమ ప్రత్యేకతని అలాగే కాపాడుకుంటూ వస్తారు.
కానీ మనం చాలా సులభంగా ఇతరుల ఆకర్షణకి గురవుతాము, మనల్ని మనం కించపరుచుకుంటాం. పాశ్చాత్యులు గుర్తించారు కాబట్టి ఇటీవల యోగాని, ధ్యానాన్ని కాస్త గౌరవిస్తున్నాము.
ఇంతకూ ఆ రోజుల్లో నేను చూసిన సమాజంలో ఇరుగు పొరుగు ఎలా ఉండేవారు అని అనుకుంటున్నారు కదూ, అదిగో అక్కడికే వస్తున్నాను.
** మా వీధిలోనే రాష్ట్రపతి చేతి మీదుగా పద్మశ్రీ పురస్కారం అందుకున్న సరస్వతి పుత్ర శ్రీమాన్ పుట్టపర్తి నారాయణాచార్యులు ఉండేవారు. కానీ వారిలో ఏ కోశానా అహంకారం, అతిశయం ఉండేది కాదు. హాయిగా మా వీధిలోనే శ్రీ రామకృష్ణ హైస్కూల్లో తెలుగు పండితుడిగా ఉద్యోగం చేసేవారు. వారి కుటుంబ సభ్యులు కూడా మామూలుగా అందరితో కలివిడిగా ఉండేవారు. వారి ఇల్లు కూడా మామూలుగా ఉండేది.
** అత్యంత ఐశ్వర్యవంతులైన డాక్టర్ కృష్ణమూర్తిగారి కుటుంబం మా వీధిలో ఉండేది. వారు కూడా హాయిగా అందరితో కలిసి మెలిసి ఉండేవారు.
ఇలా తమ తమ రంగాలలో లబ్ధప్రతిష్ఠులైన వారు ఎందరో అక్కడ ఉండేవారు. కానీ అందరూ కూడా ఇరుగుపొరుగు వారితో ఒకే కుటుంబంలాగా కలగలుపుగా ఉండేవారు.
ఇరుగుపొరుగు:
మా వీధి పేరు గాడిచర్ల రామారావు వీధి.
మా వీధికి తూర్పు దిక్కున గాంధీగారి విగ్రహం ఉండేది. దీన్ని రెండవ గాంధీ బొమ్మ అని వ్యవహరించేవారు. మరి ఒకటో గాంధీబొమ్మ ఎక్కడ ఉంది అని మీకు అనుమానం రావచ్చు. మీ అనుమానం సమంజసమే. ఈ ఒకటో గాంధీ బొమ్మ కడప వన్ టవున్ పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్న రోడ్ జంక్షన్‌లో ఉండేది.
సరే ఈ రెండో గాంధీ బొమ్మ దగ్గరకి వద్దాం ఇప్పుడు మళ్ళీ. ఈ రెండో గాంధీ బొమ్మ వెనుకే మద్రాసు వెళ్ళే ట్రంక్ రోడ్ ఉండేది. గాంధీగారి బొమ్మ పక్కనే మూర్తీ స్టూడియో ఉండేది. ఈ బొమ్మా, ఈ స్టూడియో ఈ రెండూ కూడా పెద్ద లాండ్‌మార్క్స్ అన్నమాట చిరునామా చెప్పటానికి.
ఈ గాడిచర్ల రామారావు వీధికి రెండో చివర, అంటే పడమర వైపు ఒక పురాతన శివాలయం ఉండేది. ఆ శివాలయం తరువాత మోచంపేట ప్రారంభం అవుతుంది.
ఏదైనా వీధికో, ఊరికో ఒక వ్యక్తి పేరు పెట్టారంటే, ఆ మహానుభావుడిని ముందు తరం వాళ్ళు మరచిపోరాదు అనే ఒక లక్ష్యంతో పేర్లు పెడతారు కద.
కానీ మా వీధికి ఆ పేరు ఎందుకు పెట్టారో, ఆ మహానుభావుడు ఎవరో ఏమో నాకైతే తెలియదు. ఆయన గూర్చి నాకు తెలిసింది శూన్యం. నేను ఆ దిశగా ఎప్పుడూ ఆలోచించలేదు, మా పెద్దలకు తెలుసేమో కానీ నేను ఎప్పుడు అడగలేదు ఎవర్నీ. ఇక ఆధునిక పోకడలు ఎక్కువయ్యాక, మా వీధి పేరు జీ.ఆర్.స్ట్రీట్ అయి కూర్చుంది. ఇక్కడ తెలంగాణ లో రంగారెడ్డి జిల్లా కాస్త ఆర్ ఆర్ డిస్ట్రిక్ట్ అయినట్టు.
మా వీధి ఒకప్పుడు బ్రాహ్మణ ఆగ్రహారం అనుకుంటా.
ఇక్కడి కుటుంబాల మధ్య అప్యాయత అనురాగాలు బలంగా ఉండేవి. అందరూ ఒకే కుటుంబమా అన్నంత స్వచ్ఛంగా, స్నేహంగా ఉండేవారు.
పండగలు, పేరంటాలు చాలా కోలాహలంగా జరుపుకునేవారు. ముఖ్యంగా ఆ రోజుల్లో టెలిఫోన్, టీవీ, ఇంటర్‍నెట్, సెల్‍ఫోన్ వంటి ఉపకరణాలు ఉండేవి కావు. ఈ ఉపకరణాల వల్ల సమయం ఆదా అవుతుంది, ఎక్కడివారితోనైనా మాట్లాడుకోవచ్చని అనుకుంటాం కానీ, పక్కన ఉన్న వారిని విస్మరిస్తున్నాము, సమయాన్ని వృథా చేస్తున్నాము అని నాకు అనిపిస్తుంది.
ఈ ఉపకరణాలు ఏవీ లేని రోజుల్లో మనుషులు చాలా ఆప్యాయంగా మసలుకునేవారని తోస్తోంది.
మా అమ్మా, నాన్నలు విద్యుత్ దీపాలు లేని కాలాన్ని కూడా చూశారు.
వాళ్ళు విద్యుత్ దీపాల్ని, పెద్ద పెట్టె లాంటి రేడియోని చూసి సాంకేతికత అభివృద్ది అయిందని సంతోషపడేవారు. నేను టీవీలు, ఇంటర్‍నెట్, లాండ్‌లైన్లు, మొబైల్‍ఫోన్లు లేని రోజుల్ని చూశాను. ఈ అభివృద్ధి నిజంగా చాలా గొప్పదే.
కానీ సాంకేతికత మనకు బానిసగా ఉండాలే తప్ప మనం దానికి బానిస కాకూడదు అని బలంగా చెప్తాను.
ముఖ్యంగా ఇప్పటి తరం పిల్లల్ని చూస్తే జాలి వేస్తొంది. వాళ్ళు సాక్షాత్తు సెల్ ఫోన్‌కి బానిసలు అయ్యారు.
ఇక ఆ రోజుల్లో మనుషుల గూర్చి చెపుతాను.
పుట్టపర్తి నారాయణాచార్యులు గారి ఇల్లు మా ఇంటి ఎదురుగా మూడిండ్ల అవతల ఉండేది. వారి సతీమణి శ్రీమతి పుట్టపర్తి కనకమ్మ గారు మా అమ్మ (సంజీవలక్ష్మి)కి బాగా పరిచయం. కడప పట్టణానికి విచ్చేసిన జిల్లెళ్ళమూడి అమ్మగారి దర్శనానికి మా అమ్మగారు, శ్రీమతి కనకమ్మ గారు వెళ్ళిన ముచ్చట నాకు ఇప్పటికీ జ్ఞాపకమే. అక్కడనుంచి వస్తూ వస్తూ జిల్లెళ్ళమూడి అమ్మగారి ఫోటో ఒకటి పట్టుకొచ్చారు మా అమ్మగారు.
పెద్ద బొట్టు పెట్టుకుని ఉన్న జిల్లెళ్ళమూడి మాతాజీ ఫోటోని ఆశ్చర్యంగా చూస్తుండేవాణ్ణి ఆ రోజుల్లో.
కడప పట్టణంలో పాత బస్టాండ్ పక్కనున్న ‘కడప అవధూతేంద్ర స్వామి’ని గూర్చి కూడా వారు మాట్లాడుకునేవారు. నేనింకా పుట్టకముందు జరిగిన ఒక సంఘటన చెప్పేవారు మా అమ్మగారు.
కడప అవధూతేంద్ర స్వామి గారి గూర్చి మా అమ్మకి తెలియని రోజులవి. ఆ రోజుల్లో ఒక రోజు శ్రీమతి పుట్టపర్తి కనకమ్మ గారు, మా అమ్మగారు ఇద్దరూ కలిసి వెళుతూ ఉండగా ఒక వ్యక్తి ఎదురయ్యాడట. ఆ వ్యక్తి మాసి ఉన్న తలతో, తైల సంస్కారం లేని జుత్తుతో, అశుభ్రంగా కనిపిస్తున్నప్పటికీ ఆయనలో ఏదో వర్చస్సు ఉందట. శ్రీమతి కనకమ్మగారు హటాత్తుగా ఆగి ఆ వ్యక్తికి రోడ్డుపైనే పాదాభివందనం చేశారట. ఆయన కూడా కాసేపు ఆగి నిలబడిపోయి, దయనిండిన వదనంతో చిరునవ్వు నవ్వుతూ ఉండిపోయాడట కాసేపు. అంత గొప్పావిడ అశుభ్రంగా కనిపిస్తున్న ఒక సామాన్యుడికి అలా నమస్కారం చేసేటప్పటికి మా అమ్మగారికి అసలేమి అర్థం కాలేదట. ఆ తర్వాత తెలిసింది ఆయనే ‘కడప అవధూతేంద్ర స్వామి’ అని.
ఆయన ఖండయోగం చేసిన దృశ్యాన్ని శ్రీమతి కనకమ్మ గారు ప్రత్యక్షంగా చూశారట. ఈ విషయం ఆమె మా అమ్మగారికి స్వయంగా చెప్పారు. ఆ తర్వాత ఈ ఖండయోగ ప్రస్తావన భగవాన్ వెంకయ్య స్వామి చరిత్రలోనూ, షిరిడీసాయిబాబా చరిత్రలోనూ చదివాను.
అంటే ఒక యోగి, తను సజీవంగా ఉండగానే, తన శరీర భాగాలు అన్నీ ఖండింపబడినట్టుగా విడివిడిగా దూరందూరంగా పారవేసి ఆ తర్వాత మళ్ళీ అన్నింటినీ తన శరీరంగా ధరించడం అన్నమాట.
ఆ దృశ్యాన్ని చూసిన శ్రీమతి కనకమ్మ గారు ఎంత ధన్యజీవి! ఆ విషయాన్ని గూర్చి స్వయంగా ఆవిడ చెబుతుండగా విన్న మా అమ్మ అదృష్టవంతురాలు. ఇవన్నీ విన్న బాల్యంలో విన్న నేను చిత్రమయిన అనుభూతికి గురయ్యే వాడిని.
ఆ తరువాత నేను కడపలో పని చేసే రోజుల్లో ఈ అవధూతేంద్ర స్వామి వారి గుడికి వెళ్ళాను ఎన్నో సార్లు. కడపలో ఎందరో పెద్ద వారు కడప అవధూతతో తాము ప్రత్యక్షంగా గడిపిన అనుభవాలని చెప్పగా విన్నాను.
***
సరే మళ్ళీ నా బాల్యానికి వద్దాం. పుట్టపర్తి నారాయణాచార్యులవారు నేను చిన్నప్పడు మాట్లాడే మాటలు బాగా ఇష్టపడి వినేవారు. ఆయన గొప్పతనం తెలియక నేను హాయిగా భయం లేకుండా కబుర్లు చెప్పేవాడిని. ఆ మహానుభావుని ఒడిలో నా బాల్యం గడిచింది అనేది ఒక గొప్ప అనుభూతి.
వారి ఇల్లు కాస్త తమాషగా అనిపించేది నాకు. ఇంటి ప్రారంభంలో ఇరుకైన చిన్న వసారా ఉంటుంది. అది దాటి అంతే వెడల్పున్న వరండా లాంటి గది దాటి లోపలికెళితే మనల్ని ఆశ్చర్యపరుస్తూ ఒక పెద్ద గది ఉంటుంది. అందులో ఒక పాత కాలంనాటి చెక్క ఊయల కనిపిస్తుంది. ఆ గది పైకప్పుకి మధ్య భాగంలో ఉన్న ఒక పెద్ద గవాక్షిలోంచి ధారాళంగా వెలుతురు వర్షిస్తుంటుంది.
వారింట్లోకి వెళ్ళంగానే మనకు నలుపుతెలుపులలో ఉన్నఒక పెద్ద ఫోటో ఫ్రేం కన్పించేది. అందులో రాష్ట్రపతి శ్రీ వీవీ గిరి గారి చేతుల మీదుగా శ్రీ పుట్టపర్తి నారాణయణాచార్యులు గారు పద్మశ్రీ పురస్కారాన్ని అందుకుంటూ ఉన్న చిత్రం ఉంటుంది. ఇవేకాక ఎన్నో అవార్డులు, ట్రోఫీలు, ఫోటో ఫ్రేం కట్టిన నిలువెత్తు ప్రశంశాపత్రాలు మనల్ని పలకరిస్తాయి.
చాలా ఇన్‌స్పైరింగ్‌గా అనిపించేది అవన్నీ చూస్తుంటే.
***
మా ఇంటి ఎదురుగా శ్రీ సీతారామయ్యగారని స్కూల్ హెడ్మాష్టర్ గారు ఉండేవారు. ఈయన సన్నగా పొడవుగా, ఆరోగ్యంగా ఉండేవారు. ఆయన చెవుల్లో మొలిచిన జుత్తు నాకు తమాషాగా అనిపించేది. ఈయన ఒక వాకింగ్ స్టిక్ పట్టుకుని నడుస్తూ ఉండేవారు. నిజానికి ఆ స్టిక్ ఒక అలంకార ప్రాయమే. ఆయన దాని మీద ఆధారపడ్డట్టుగ నాకు తోచేది కాదు. ఆయన నిటారుగా, హుందాగా అడుగులు వేస్తూ అందర్నీ గమనిస్తూ నడిచేవారు. ఆయన్ని చూసిన వారు విధిగా ఆయనకి నమస్కరించటం గమనించాను నేను ఆ రోజుల్లో. ఆయన ఎలాంటి భావం కనపడనీయకుండా తలని మాత్రం కాస్త కదిలించీ కదిలించక వాళ్ళని గుర్తించాను అన్న భావన వ్యక్తం చేసేవారు. ఆయన హుందాతనం నాకు అబ్బురమనిపించేది.
ఈయన ‘డిసిప్లిన్‍కి పెట్టింది పేరు’ అని ప్రతీతి. మా అక్కయ్యలు, అన్నయ్య ఈయన గూర్చి కథలు కథలుగా చెప్పుకునే వారు. ఆయన కోపం చవిచూడకుండా, సజావుగా బయటపడ్డ విద్యార్థి కనిపించడట. ఎన్ని బెత్తాలు విరిగేవో, ఎన్ని తొడలు ఎర్రగా కందేవో లెక్కే లేదట. నా తొడలు చేసుకున్న అదృష్టమేమో కానీ, దేవుని దయవల్ల నేను స్కూల్లో చేరే నాటికి ఆయన రిటైర్ అవటమో, వేరే స్కూల్‍కి వెళ్ళటమో జరిగింది.
ఆ విధంగా ఆయన డిసిప్లిన్‍ని చవిచూసే అవకాశం గానీ, తొడపాశం అనే అనుభవం గానీ నాకు కలగనే లేదు. మా నాన్న గారి ప్రమోషన్లు, బదిలీల వల్ల , ఆ తర్వాత నేను కడప స్కూళ్ళలో చదివే అవకాశమే రాలేదు. ఆ విధంగా శ్రీ సీతారామయ్యగారి శిక్షా స్మృతులని తప్పించుకోగలిగాను ఎప్పటికీ.
ఈ డిసిప్లిన్ కారణంగానేమో ఆయన్ని మా నాన్నగారు ‘పులీ’ అని చనువుగా పిలిచేవారు.
ఈయన, మా నాన్నగారు మంచి స్నేహితులు. ఈ సీతారామయ్యగారు మా ఇంటికి హాయిగా వచ్చేసేవారు. ఆయన వచ్చేటప్పటికి పిల్లలందరూ గప్‌చుప్ అయిపోయేవారు, బహుశా వీరందరూ ఈయన బాధితులేమో పూర్వం. పిల్ల కాకికేమి తెలుసు ఉండేలు దెబ్బ అన్నట్టు నేను హాయిగా తిరిగేవాడిని ఆయన ముందు కూడా.
***
ఈ సీతారామయ్యగారింటికి కాస్త పక్కగా పేపర్ సుబ్బారావు గారు అని ఉండేవారు. ఇండియన్ ఎక్స్‌ప్రెస్, ఆంధ్రప్రభలకి ఆయన ఏజంట్. వారి సతీమణి కూడా మా అమ్మగారికిమంచి స్నేహితురాలు. ఇప్పటిదాకా నేను చెప్పిన శ్రీమతి కనకమ్మ గారు అయితేనేమి, సీతారామయ్యగారి శ్రీమతి అయితేనేమి, పేపర్ సుబ్బారావు గారి శ్రీమతి గారు అయితేనేమి, వీరందరూ మా అమ్మగారికంటే వయస్సులో పెద్దవారు. అంటే, మా అమ్మగారికి పెళ్ళయి, కడపకి కొత్త కోడలిగా వచ్చేనాటికే వీరందరూ పిల్ల పాపలతో స్థిరపడిన పెద్ద ముత్తైదువలన్నమాట. అందుకే మా అమ్మగారిని వాళ్ళు ’ఏమే పిల్లా’ అని చనువుగా పిలవటం అలవాటు, లేదా పేరుపెట్టి చనువుగా ’సంజీవమ్మా’ అని పిలిచేవారు. మా అమ్మగారు వీళ్ళందరినీ కూడా ‘అత్తా! అత్తా’ అని పిలిచేది.
మా ఇంటికి కుడిపక్క శ్రీ పిన్నపాటి నరసింహయ్య గారు ఉండేవారు. వీరు ఆర్టీవో వ్యవహారాలకు, రవాణా రంగానికి సంబంధించి ఏదో కన్సల్టెన్సీ చేసేవారు.
మిగతా అన్ని కుటుంబాలతో మాకున్న అనుబంధం ఒకెత్తు, వీరి కుటుంబంతో ఉన్న అనుబంధం ఒక్కటీ ఒకెత్తు.
దానికి కారణం లేకపోలేదు. పూర్వం ఎప్పుడో వారి పూర్వీకులు, మా పూర్వీకులు ‘గొందిపల్లి’ అనే గ్రామం నుంచి కడపకి వలస వచ్చేశారట. అందువల్ల మా రెండు కుటుంబాలు ఒకే కుటుంబంలాగా కలిసిమెలిసి ఉండేవి.
నరసింహయ్య గారు తరచూ హైదరాబాద్‌కి వెళ్ళి వస్తూ ఉండేవారు. వారి ద్వారానే పుల్లారెడ్డి మిఠాయిలు అనే పేరు వినడం మొదటిసారి. ‘జి.పుల్లారెడ్డి నేతి మిఠాయిలు, కర్నూలు, హైదరాబాద్’ అని వ్రాసి ఉన్న అట్టపెట్టెలు వీరింట్లో అబ్బురంగా చూసేవారం. ఇప్పట్లో లాగా రంగుల్లో ఉండేవి కావు ఆ అట్టపెట్టెలు. ఇంగ్లీష్, తెలుగు అక్షరాలు పుల్లారెడ్డి నేతి మిఠాయిలు అన్నవి ఒక విధమైన ఫాంట్‌లో నీలి రంగుతో ఉండేవి. ఆ పెట్టె మీద అంతా అలా అక్షరాలే ఉండేవి. అట్టపెట్టెలే కాక, రేకు పెట్టెల్లో కూడా లభించేవి.
వాళ్ళకూ మాకు ఇంటి దేవుడు ఒకరే – శ్రీ వేయినూతుల కోన లక్ష్మీ నరసింహస్వామి.
వేంపల్లె వెళ్ళే మార్గంలో ఉన్న గొందిపల్లికి దగ్గరగా ఉన్న ఈ ‘వేయి నూతుల కోన నరసింహ స్వామి’ దేవస్థానానికి వీరు వంశపారంపర్య ధర్మకర్తలు. సంవత్సరానికి ఒక సారి వైశాఖ శుక్లపక్ష చతుర్దశి నాడు వచ్చే నృసింహ జయంతి సందర్భంగా కొన్ని రోజులపాటు ఘనంగా ’వేయి నూతుల కోన తిరునాళ్ళు’ ఏర్పాటు చేసేవారు శ్రీ నరసింహయ్యగారు, ధర్మకర్త హోదాలో. ఆ నెలరోజులు వాళ్ళ ఇంట్లో పండుగ వాతావరణం ఉండేది. వాళ్ళ చుట్టాలందరూ ఎక్కడెక్కడినుంచో వచ్చి ఆ సంబరాలలో పాలుపంచుకునే వారు. అందరూ కలిసి ఒక శుభముహూర్తాన బస్సులోనో, ట్రాక్టర్‍పైనో నలభై కిలోమీటర్ల దూరంలో ఉన్న వెయ్యినూతుల కోనకి బయలుదేరేవారు. ఆ సందడి ఇంకా నా కళ్ళ ముందర జరిగినట్టే ఉంది నాకు. తెల్లవారు ఝామున కోలాహలంగా బయలుదేరేవారు.
శ్రీ నరసింహయ్యగారి శ్రీమతి గారి పేరు సావిత్రమ్మ. ఈవిడా మా అమ్మగారు ఇంచుమించు సమవయస్కులు. ఇద్దరూ బాగా సన్నిహితంగా ఉండేవారు.
చెప్పాను కద ఆ రోజుల్లో అంకుల్, గింకుల్, ఆంటీ-గీంటీ అని పిలిచేవారం కాదు.
నరసింహయ్య మామ, సావిత్రమ్మ అత్త అంతే, వారిని అలాగే పిలిచేవారం. వాళ్ళ పిల్లలందరితో ఇప్పటికీ టచ్‌లో ఉన్నాము. వాళ్ళ చిన్నబ్బాయి హరి నా కంటే చిన్న వాడు వయసు రీత్యా. నన్ను ‘ఆనంద్ అన్నా’ అని పిలుస్తాడు. ఈ అబ్బాయి ఇప్పుడు ‘బోష్’ అనే కంపెనీలో చాలా పెద్ద పదవిలో జర్మనీలో ఉన్నాడు.
ఈ హరియే, అంతకు ముందు హైదరాబాద్ లోని బిర్లా ప్లానెటోరియం డిజైనింగ్ చేసి పెట్టడంలో, వారికి సాంకేతిక సహకారం అందించటం విషయంలో కీలకపాత్ర పోషించాడు.
ఇంకో అద్భుతమైన విషయం చెబుతాను. ఎక్కడో జర్మనీలో ఉన్నా కూడా ఈ అబ్బాయి తనకు వంశపారంపర్యంగా లభించిన ఆలయ ధర్మకర్తృత్వాన్ని సజావుగా నిర్వహిస్తున్నాడు. ఇప్పటికీ ప్రతి సంవత్సరం వచ్చి, అడవి మధ్యలో ఉన్నఈ వేయి నూతుల కోన దేవాలయానికి సంబంధించి తిరుణాళ్ళు అంతే శ్రద్ధగా నిర్వహిస్తున్నాడు.
(ఇంకా ఉంది)