కళ్యాణదుర్గం వెళ్ళే ముందు – ఒక జ్ఞాపకం-3

5
12

[dropcap]నా[/dropcap]కు ఆరేళ్ళ వయసు వచ్చేవరకు ఉన్న జ్ఞాపకాలు ఇంకొన్ని.

చెప్పాను కద అప్పట్లో కడపలో ఉండేవాళ్ళమని.

పొయిన వారం ‘ఇరుగు పొరుగు ఇకిగాయ్’లో శ్రీమాన్ పుట్టపర్తి నారాయణాచార్యుల గూర్చి, ఆపై హెడ్మాస్టర్ శ్రీ సీతారామయ్యగారి గూర్చి, శ్రీ పిన్నపాటి నరసింహయ్య గారి కుటుంబాల గూర్చి తెలుసుకున్నాం కద.

ఈ వారం ఇంకొన్ని ముచ్చట్లు చెప్పుకుందాం.

***

మా ఇంటికి పక్కన పడమర వైపు డాక్టర్ కృష్ణమూర్తిగారి బంగ్లా ఉండేది.

మా వీధిలో ఉన్న అన్ని ఇండ్లపైకి పెద్దగా రాజమహల్‌లా ఉండేది ఈ డాక్టర్ గారిల్లే. ఆ రోజుల్లో కడప పట్టణంలో వారిది చాలా సంపన్న కుటుంబం. డాక్టర్ కృష్ణమూర్తి గారి శ్రీమతి పేరు రుక్మిణమ్మ గారు. చాలా ధార్మికురాలు. నాకు గుర్తున్నంతవరకు వీళ్ళ స్వగ్రామం నెల్లూరు. కానీ కడపలో స్థిరపడ్దారు. ఆయన క్వాలిఫికేషన్ కాస్త తమాషాగా ఉండేది. ఆయన పేరు చివర GCIM అని ఉండేది. (Dr.M. Krishna Murthy Rao GCIM) అని ఉండేది.

ఇది క్వాలిఫికేషన్ పరంగా ఆయుర్వేదంలో ప్రభుత్వ గుర్తింపు పొందిన మెడికల్ డిగ్రీ అన్నమాట. ఈయన హస్తవాసి చాలా మంచిది అని పేరుండేది. వైద్యం చేయడంలో సరైన కీలకం వ్యాధి నిర్ధారణే కద. సరిగ్గా ఈ కారణంగా ఈయనకి చాలా మంచి పేరుండేది. మా కుటుంబానికి వారే ఫామిలీ డాక్టర్. ఆయనకి అల్లోపతి వైద్య విధానంలో కూడా అనేక డిప్లమోలు ఉన్నాయి, ఆయన ప్రధానంగా అల్లోపతి వైద్యమే చేసేవారు.

ఆయన చూడ్డానికి కూడా చాలా అందంగా సుకుమారంగా ఉండేవారు. రిమ్‍లెస్ కళ్ళజోడు పెట్టుకుని చూడ్డానికి చాలా హుందాగా ఉండేవారు. ఆయన మాటతీరుతోనే రోగికి వ్యాధి తగ్గిపోయిన భావన కలిగేది.

మా ఇంటి దగ్గర ట్రంకు రోడ్డులో వీరి క్లినిక్ ఎమ్‌కే హాస్పిటల్ ఉండేది. దాని పక్కనే, డాక్టర్ విశ్వం గారని ఉండేవారు. ఆయన క్లినిక్ పేరు పాపులర్ హాస్పిటల్. ఆయన కూడా జీసీఐఎం డాక్టరే.

‘పాపులర్ హాస్పిటల్ ఫాన్’ అని మా ఇంట్లో ఒక వాడుక మాట ఉండేది. అక్కడి పంకా ఊరికే నెమ్మదిగా తిరుగుతూ ఉంటుంది దాని రెక్కలు కూడా విడివిడిగా కనిపిస్తుంటాయి అది తిరుగుతున్నప్పుడు, దాని వల్ల గాలి రాదు.

శ్రీమతి రుక్మిణమ్మ గారు చాలా నిరాడంబరంగా ఉంటూ అందరితో కలగలిసిపోతారు, ఆమెకి మా కుటుంబం పట్ల ప్రత్యేక అభిమానం కద్దు. మీడియాలో ఇప్పుడు మనం సుధామూర్తి గారి గూర్చి, ఆవిడ సింప్లిసిటీ గూర్చి వింటూ ఉంటాం కద. సుధామూర్తి గారి గూర్చి విన్నప్పుడల్లా నాకు శ్రీమతి రుక్మిణమ్మగారు గుర్తు వస్తారు. వీరు కూడా మంత్రాలయ రాఘవేంద్రస్వామి భక్తులు, మధ్వ బ్రాహ్మణులు కావటం యాదృచ్ఛికం.

మా వెనుక వీధిలో డాక్టర్ భీంసేన్‍రావు గారని ఉండేవారు. ఆయన కూడా మధ్వ బ్రాహ్మలే. ఈయన చాలా ఆజానుబాహుడు. తెల్లగా అందంగా ఉండేవారు.

ఆ రోజుల్లో డాక్టర్.కృష్ణమూర్తిరావు గారిలో సినీ నటుడు నాగేశ్వరరావుని, డాక్టర్. భీంసేన్‍రావు గారిలో నందమూరి తారకరామారావుని పోలిక చూస్కుని ఆనందపడేవారు కడప ప్రజలు. ఈ పోలిక ఏదో ఉబుసుపోక చేసినది కాదు సుమా. వారి ముఖకవళికలు, మాట తీరు, నడక తీరు కూడా అలాగే ఉండేవి యాదృచ్ఛికంగా.

ఇప్పటి దాకా ఎన్ని ఇళ్ళ గూర్చి చెప్పానో, ఆ కుటుంబాలన్నింటి మధ్య చాలా బలమైన అప్యాయతానురాగాలు ఉండేవి. ఆ కుటుంబాలన్నీ చాలా సన్నిహితంగా మెలిగేవి. అంతా ఒకే ఇంటి వారా అన్నంత ఆప్యాయతానురాగాలు ఉండేవి ఆ మనుష్యుల మధ్య.

నా చిన్నతనంలో నేను అనుకునేవాడిని, ఈ గాడిచర్ల రామారావు వీధిలోని మేమందరం ఒకే కుటుంబం వాళ్ళమేమో అని. నిజానికి ఆ రోజుల్లో అందరూ అలాగే ఉండేవారు.

అక్కడి ఆడ వాళ్ళందరూ మా అమ్మకి అత్యంత ఆప్తులే.

పైన చెప్పిన ఇళ్ళేకాక, బొమ్మల వాళ్ళ ఇల్లు అని (వాళ్ళింటి ముందు డెకరేషన్ గా ఐరన్ గ్రిల్ తో కొన్ని చిత్రాలు ఉంటాయి), గరిమెళ్ళ వాళ్ళ ఇల్లు అని, సుందరమ్మ అత్త ఇల్లని, కామేశ్వరీ వాళ్ళ అమ్మ అని, ఇలా రకరకాల రెఫరెన్స్‌లతో పిలవబడే వాళ్ళూ ఉండేవారు. మొత్తానికి అందరూ కలిసిమెలిసి ఉండేవారు. ఏదైనా పేరంటం జరిగితే ఆ సందడి చెప్పనలవి కాదు. ఇదంతా దాదాపు నలభై అయిదేళ్ళ క్రితం మాట.

ఆ రోజుల్లో పెద్ద పెట్టె లాంటి రేడియో తప్పవేరే ఏ ఇతర వినోద మాధ్యమాలు ఉండేవి కావు. అన్నట్టు ఈ రేడియోకి లైసెన్స్ తీసుకోవాలి. ప్రతి నెల పోస్టాఫీస్ కి వెళ్ళి ఈ లైసెన్స్ ఫీజ్ కట్టి రావాలి. ఒక బ్యాంక్ పాస్ బుక్ లాంటి బుక్ కూడా ఇచ్చేవారు పేమెంట్ వివరాలు ఎప్పటికప్పుడు నమోదు చేయటానికి. ప్రతినెల ఫీజ్ కట్టిన తరువాత, ఆ పాస్ బుక్ లాంట్ దాంట్లో, తపాల ముద్ర కొట్టి ఆ నెల వివరాలు నమోదు చేసి ఇచ్చేవారు.

నీలిరంగులో ఉన్నఆ బుక్ అట్టపై ఒక పొడగాటి రేడియో టవర్ బొమ్మ, ఆ టవర్ చివర తరంగాలలాంటి డిజైన్ ఉండేది. ఆకాశవాణి లోగో కూడా ఉండేది. ఈ రేడియో పెట్టెలోంచి ప్రసారాలు రావాలంటే ఏరియల్ ఉండాలి. ఈ ఏరియల్ ఎలాగుంటుందంటే, మన అరచేతి వెడల్పు గలిగిన పల్చటి రిబ్బన్ లాంటి ఇనుప జాలీ ఓ పదడుగుల పొడవు ఉండేది. దాన్ని గదిలోపల పై కప్పువద్ద ఆ చివర నుంచి ఈ చివరకి దండెంలాగా కట్టాలి. ఇప్పుడు ఆ పెద్ద రేడియో పెట్టె నుంచి ఒక వైరు తీస్కుని ఈ ఏరియల్‌కి తగిలించాలి. అప్పుడు ఆకాశవాణి ప్రసారాలు వస్తాయన్నమాట అందులోంచి.

రేడియో ఆన్ చేయగానే, ఒక బల్బులాంటిది వెల్గుతుంది. ఆ తరువాత స్టేషన్లు మార్చుకుంటూ వినవచ్చు. అప్పట్లో ఎఫ్.ఎం స్టేషన్లు ఉండేవి కావు. కడప, హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం స్టేషన్లు వచ్చేవి. వీటిని మీడియం వేవ్ ప్రసారాలు అని వ్యవహరించేవారు. కానీ ఒక్క కడప స్టేషన్ మాత్రమే స్పష్టంగా వచ్చేది.

కార్మికుల కార్యక్రమం, ఆదివారం మధ్యాహ్నం నాటకం, వార్తలు ఇలా కొన్ని ప్రత్యేక కార్యక్రమాలు అన్ని స్టేషన్ల వారు కలిసి సంయుక్తంగా నిర్వహించేవారు.

ఇక హైదరాబాద్, బొంబాయి వంటి నగరాలలో ఉండేవారికై ప్రత్యేకంగా వివిధభారతి వాణిజ్యప్రసార విభాగం అని ఉండేది. అది ఇంచుమించు ఇప్పటి ఎప్.ఎం స్టేషన్ల లాగా వినోద కార్యక్రమాలు, సినిమాపాటలు ఎక్కువగా ప్రసారం చేస్తూ మధ్య మధ్యలో ప్రకటనలు వేసేవారు.

ఇవన్నీ ఒకెత్తైతే, సిలోన్ (రేడియో శ్రీలంక) ప్రసారాలు ఒకటీ ఒకెత్తు.

ఇవి షార్ట్‌వేవ్ ప్రసారాలు అనే ప్రత్యేక సాంకేతికతతో ఎంత దూరం వారైనా వినేలాగా ఉండేవి. వీటిలో ఎక్కువ హిందీ పాటలు వచ్చేవి. వీటిలో సాయంత్రం కాసేపు తెలుగు ప్రసారాలు వచ్చేవి.

ఈ రేడియో సిలోన్ లో క్రైస్తవమతప్రచార కార్యక్రమాలు ఎక్కువ వచ్చేవి.

ఆ పాటలన్నీ నాకు నోటికి వచ్చు ఆ రోజుల్లో. ఆ మత ప్రచార కార్యక్రమానికి ముందు ‘వేద పుస్తకమా, వేద పుస్తకమా, వెల లేని మణీ నీవు….వేద పుస్తకమా వేద పుస్తకమా’ అని బైబిల్ గూర్చి పాట వచ్చేది. (బైబిల్ వేదపుస్తకమేంటో?)

అదే విధంగా ఆకాశవాణి కడప స్టేషన్‌లో కూడా ఉదయాన్నె భక్తి కార్యక్రమాలలో క్రైస్తవ ప్రసారాలు వచ్చేవి.

భక్తి కార్యక్రమంలో శుక్రవారం ఉదయం ఖవ్వాలీలు ఉర్దూ కార్యక్రమాలు వచ్చేవి, ముస్లిం సోదరుల కోసం.

వెంకటేశ్వర సుప్రభాతం తదితర భక్తి ప్రసారాలు సరేసరి.

నాకు ఇప్పటికీ బాగా గుర్తున్న కార్యక్రమం సంస్కృత పాఠాలు.

“కేయూరాణి న భూషయంతి పురుషం హారా న చంద్రోజ్వలా
న స్నానం న విలేపనం న కుసుమం నాలంకృతా మూర్ధజాః
వాణ్యేకా సమలంకరోతి పురుషం యా సంస్కృతా ధార్యతే
క్షీయంతేఖిల భూషణాని సతతం వాగ్భూషణం భూషణం”

అది అప్పట్లో నాకర్థమయ్యేది కాదు కానీ నన్ను చాలా ఆకర్షించేది. దాని అర్థమేమిటని అడిగితే మా అప్ప దాని అర్థం విప్పి చెప్పారు “మనిషికి బంగారు ఆభరణాలు, ముత్యాల హారాలు అలంకారం కాదు. పూల మాలలు, పరిమళద్రవ్యాలు, స్నానాలు ముఖ్యం కాదు. సంస్కారంతో కూడిన మాటలే మనిషికి సిసలైన అలంకారాలు. పైవన్నీ క్షీణించేవే, క్షీణించని మంచి మంచిమాటయే సిసలైన ఆభరణం” అని.

నన్ను భలే ఆకట్టుకున్నాయి ఆ మాటలు.

సంస్కృత వార్తా ప్రసారాలు కూడా వచ్చేవి ఆకాశవాణి కడప ద్వారా.

అర్థం అయినా కాకున్నా వినటానికి భలేగా ఉండేవి ఆ వాక్య నిర్మాణాలు. ఆ వార్తలని చదివే వ్యక్తి ఇలా ప్రారంభించేవాడు

“ఆకాశవాణి సంప్రతి వార్తాహః సృయంతాం. ప్రవాచకో బలదేవానంద సాగరః” అనే వాక్యాలతో వార్తలు మొదలయ్యేవి.

ఆ భాషలో ఏదో ఆకర్షణ ఉండేది.

రేడియోలో నిజంగా మనుషులు ఉండేవారనుకునేవాడిని నేను చిన్నప్పుడు. చాన్నాళ్ళు అదే బలంగా విశ్వసించేవాడిని.

టీవీలు, ఫోన్‌లు, ఇంటర్‌నెట్ ఉండేవి కావు ఆ రోజుల్లో. లాండ్‌లైన్ ఫోన్ కూడా పక్కింటి డాక్టర్ కృష్ణమూర్తిగారింట్లో మాత్రం ఉండేది.

మేము ఉండేవీధికి అనుకునే వెనుకవైపు భుజంగరావు వీధి అని ఉండేది. ఈ రెండు వీధులలో అందరూ బ్రాహ్మణులే ఉండేవారు ఇక్కడ.

ఈ రెండు వీధులకి వెనుక వైపు ఉన్న వీధి పేరు వ్యవహారంలో ’మధ్వ వీధి’. పేరుకి తగినట్టు అక్కడ అందరూ మధ్వ బ్రాహ్మణులు ఉండేవారు. ఆ వీధిలో రాఘవేంద్రస్వామి మఠం, ఆంజనేయస్వామి గుడి ఉండేవి.

ఈ మధ్వ వీధిలో మాకు వింతగా తోచే అంశం ఏమిటంటే, అక్కడి వాళ్ళందరూ తెలుగు వాళ్ళే అయినా, తెలుగునేలపైనే ఉంటున్నా కూడా కన్నడం వారి మాతృభాషగా ఉండేది. వాళ్ళందరూ హాయిగా కన్నడంలో మాట్లాడుకునేవారు. మాకు అదొక వింత లాగా ఉండేది. గాడిచర్ల రామారావు వీధిలోంచి కేవలం ఒక రెండు వందల అడుగులు దాటి అక్కడికి వెళితే ఏదో వేరే రాష్ట్రానికి వెళ్ళిన అనుభూతి కలిగేది. మా చిన్నప్పుడు స్కూలుకెళ్ళాలంటే ఈ మధ్వ వీధి గుండానే వెళ్ళాలి. ఇక్కడి వ్యక్తుల పేర్లన్నీ ‘ఫలానా చార్’ అని ఉండేవి. ఇంకా అక్కడక్కడా ‘కులకర్ణీ’ అని, ‘రావు’ అని కూడా ఉండేవి.

మా నాన్న పేరు ‘హనుమంత రావు’ అని ఉండటం, మా నాన్నని మేము ‘అప్ప’ అని సంబోధించడం, మా నాన్నగారి బాల్యం బళ్ళారిలో గడవటం తదితర కారణాల వల్ల చాలా మంది మమ్మల్ని మధ్వ బ్రాహ్మణులు అని అనుకునేవారు.

అక్కడి ఆడవాళ్ళ కట్టు బొట్టు కూడా కాస్త వైవిధ్యంగా ఉండేది. ఒక విధమైన తిలకంలాంటి బొట్టు, గోచి పోసి కట్టుకున్న చీరలు ఇలా ఉండెది స్త్రీల ఆహార్యం.

మొగవాళ్ళు చొక్కాలు అరుదుగా ధరించేవారు. వీరంతా ఎప్పుడు చూసినా అనాచ్ఛాదితంగా ఉండే ఛాతీతో, గోచి పోసి కట్టుకున్న పంచెకట్టు, నుదుటిపై తిలకం, కణతల వద్ద గంధం బొట్లతో కనిపించేవారు. వీరిలో కొట్టవచ్చినట్టు కనిపించే అంశం ఛాతీపై ప్రత్యేక పాటర్న్‌లో గంధం బొట్లు, భుజాలపై కూడా ప్రత్యేక గంధం బొట్లు వీరి ప్రత్యేకత. ఇదేలాంటి గంధం పాటర్న్‌తో రాఘవేంద్ర స్వామి వారు కనిపించేవారు కాలెండర్ ఫోటోలో, రాఘవేంద్ర స్వామి బృందావనానికి కూడా ఈ తరహాలో గంధం వ్రాసేవారు.

ఆ వీధిలో వినపడే కన్నడ భాష సరేసరి. ఆ గుడిలో వీళ్ళు పూజలు చేస్తూ, లేదా వంటలు చేస్తూ, నైవేద్యాలు పెడుతూ కనిపించేవారు. ఆ గుడి ముందు వెళుతుంటే కడుపునిండుగా ఉన్నా సరే లోపలనుంచి వచ్చే వాసనలకి, తెగ ఆకలేసేది.

ఏది ఏమైనా ఆ వీధిలో రాఘవేంద్ర స్వామి గుడిలో జరిగే ఆరాధన ఉత్సవాల సందర్భంగా జరిగే భోజనాలు ఒక ప్రత్యేక ఆకర్షణగా తోచేది. చాలా పద్దతిగా ఉండే వారి కట్టు, బొట్టు, ఆ మడి ఆచారం కంగారు పుట్టించేవి.

వాస్తవానికి మా ఇంట్లో పండగలప్పుడు, తిథి సమయంలో చాలా మడి పాటించేవారు పెద్దవారు.

‘ఏయ్! అది తాకొద్దు, ఇటు రావొద్దు, అమ్మను తాకొద్దు, ఇదిగో ఈ గీత దాటి ముందుకు రావద్దు’ అని, బోలెడు నియమ నిబంధనలు ఉండేవి. వండిన ఆహార పదార్థాలు ఎలా పడితే అలా తాకకూడదని నియమం ఉండేది, పరిశుభ్రులం అయ్యాక మాత్రమే అంట్లని (వండిన పదార్థాలని) తాకాలి. అలా అంట్ల గిన్నెలని తాకిన తర్వాత చేతిని కడుక్కోకుండా వేరే ఏ వస్తువుని తాకకూడదు. ఇలా విపరీతమైన నియమాలు ఉండేవి మా ఇంట్లో ఆ రోజుల్లో.

మనమే మడి అనుకుంటే, వీళ్ళు మనకంటే ఎక్కువ చేస్తున్నారే అని అనిపించేది మధ్వ వీధి బ్రాహ్మణులని చూస్తే. దానికి తోడు వాళ్ళ కన్నడ భాష ఒకటి అసలు అర్థమయ్యేది కాదు.

ఇక మళ్ళీ మన గాడిచర్ల రామారావు వీధికి వస్తే, ఇక్కడి శివాలయం దాటి ముందుకు వెళితే మోచంపేట (మోక్షంపేట) అనే ప్రాంతం వస్తుంది, అక్కడ పూర్వం శ్రీ వైష్ణవులు ఎక్కువ ఉండేవారని చెబుతారు.

ఇప్పుడు ఆ విధమైన అగ్రహారం లాంటి వ్యవస్థ ఏమీ లేదు. ఇప్పుడు ఈ బ్రాహ్మణ వీధుల్లోని ఇళ్ళూ అన్ని ఒక్కొక్కటే మైనారిటీ సోదరుల వశం అయ్యాయి. దుబాయ్ వెళ్ళి చేతినిండా డబ్బుతో తిరిగి వచ్చిన మైనారిటీ సోదరులు ఒకటొకటిగా ఇళ్ళు కొనుక్కునేసి, ఇంచుమించు ఓల్డ్ సిటీలాంటి లుక్ తెప్పించేశారు.

ఇప్పుడా బ్రాహ్మణ అగ్రహారం లాంటి లుక్ లేదు, ఆ సంప్రదాయాలు లేవు, ఆ మనుషులు లేరు ఆ అప్యాయతలు లేవు. కేవలం ఓ నలభై నలభై అయిదు ఏళ్ళలో ఎంతో మార్పు వచ్చింది అక్కడ. బహుశా తమ ఆప్యాయతలని ప్రపంచమంతా పంచి పెట్టటానికి వివిధ ప్రాంతాలకి వెళ్ళిపోయారు ఉద్యోగ రీత్యా, ఇతర కారణాల రీత్యా. అలా ఉద్యోగ రీత్యా కడప వదిలేసి వచ్చేసిన వాళ్ళలో నేను ఒకడ్ని, నేను ఇప్పుడు హైదరాబాద్‌లో స్థిరపడ్డాను.

శివాలయం:

మా వీధిలో ఒక పురాతన శివాలయం ఉండేది అని చెప్పాను కద. చాలా విశాలమయిన గుడి అది. కాసేపు ఆ గుడికి వెళదాం, నాతో రండి.

గుడి అనంగానే ఎందుకో నా ఊహల్లో మొదట ఆ శివాలయమే మెదులుతుంది ఇప్పటికీ. నేను జీవితంలో చూసిన మొదటి గుడి కావటం వల్లనుకుంటాను.

చక్కతో చేయబడ్డ ఎత్తైన ధ్వజసంభం, నందీశ్వరుడు, గుడి ఆవరణ అంతా పరచబడిన నల్లరాతి గ్రానైట్ బండలు. ఇవన్నీ ఇప్పటికీ గుర్తు వస్తుంటాయి.

ప్రదక్షిణాల అనంతరం గుడిలోకి వెళ్ళే వాళ్ళం. నాకు లీలగా గుర్తు, ఆ గుడి ప్రధాన ద్వారం ఎత్తు తక్కువుండేది, పెద్ద వాళ్ళందరూ తల వంచి లోనికి వెళ్ళేవారు.

లోనికి వెళ్ళాక మరీ పెద్దది కాని చక్కటి శివలింగం. శివలింగంపై నిరంతరం నీటి ధార పడేలా అమర్చిన ఇత్తడి పాత్ర, పాత్రని పట్టుకుని, సపోర్ట్ చేస్తూ అమర్చిన ఇత్తడి గొలుసులు తళ తళా మెరుస్తూ ఉండేవి. అది బంగారు పాత్రనా అని అడిగే వాడిని చిన్నప్పుడు. ఏ మాటకామాటే చెప్పుకోవాలి, ఎన్ని దేవాలయాలు తిరిగినా, ఎంత ఐశ్వర్యం ఉట్టి పడే దేవస్థానాలు చూసినా, నిలువెత్తు అలంకరణలతో నిండిన విగ్రహాలని చూసినా కలగని ఆనందం, శివుడి గుళ్ళని, శివలింగాన్నీ చూస్తే కలిగేది. శివలింగాన్ని చూస్తూ కళ్ళు మూసుకుంటే, ఒక విధమైన ప్రశాంతత లభిస్తుంది.

డీప్ హిప్నాటిక్ స్టేట్ లోకి వెళ్ళి,ఆలోచనా రహిత మానసిక ప్రశాంతతని పొందే స్థితిని ‘ఆల్ఫా స్టేట్ ఆఫ్ మైండ్’ అంటుంటారు మనో వైజ్ఞానికులు. నా వరకు నాకు శివలింగం ముందు కళ్ళు మూసుకుని నిలబడితే అలా ఉంటుంది.

అలాంటి ఆనందం ఇంకెక్కాడా దొరకదు నాకు.

ఆ నిరాడంబరత్వం నాకు నచ్చుతుంది. అదేంటో శివాలయాల్లో పరిశుభ్రత పాటించరు పెద్దగా. అంటే నా ఉద్దేశం హాయిగా కాజువల్‌గా ఉంటారు. కానీ కొన్ని ఇతర దేవాలయాల్లో శుభ్రతకి అత్యంత ప్రాధాన్యత ఇస్తూ, ‘అబ్సెసివ్ కంపల్సివ్ డిసార్డర్’ ఉన్న వారిలా పదే పదే తుడుస్తూ, తళతళలాడేలా ఉంచే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అఫ్‍కోర్స్ అలా ఉన్న వాతావరణం బాగుంటుంది, కానీ శివాలయాల్లో ఉండే సింప్లిసిటీ, హోమ్లీనెస్ నాకు ఎందుకో బాగా నచ్చుతుంది.

ప్రమిదలు పెట్టి పెట్టి నూనె కారి జిడ్డుజిడ్డుగా నల్లబారిన గోడలు, నవగ్రహ మండపం ఇవన్నీ కూడా నాకు ఇష్టంగానే తోచేవి.

సరే, అదే గుడిలో ఇంకో చిన్న మందిరంలో పార్వతీ దేవి ఉండేవారు. సాధారణమైన అలంకరణతో మా అమ్మని చూసినట్టు ఉండేది అమ్మవారిని చూస్తే.

విశాలమైన గుడి ఆవరణలో, వినాయకుడి గుడి, నవగ్రహా మందిరం కూడా ఉండేవి. వినాయకుని ముందు గుంజీలు తీయటం సరదాగా ఉండేది. అక్కడే గుడి ఆవరణలో ఇంకో చిన్న దేవుని మందిరం ఉండేది. వీరభద్రుడు అనుకుంటా. ఆయన మందిరం ముందు నిలబడి గట్టిగా చప్పట్లు కొట్టాలి. అది ఎందుకో ఆచారం. ఈ చప్పట్లు కొట్టే పద్దతి నాకు చాలా నచ్చేది. ఎప్పుడెప్పుడు గుడికి తీస్కువెళతారా అని ఎదురు చూసేవాడిని.

ఈ గుడిలో ఆధ్యాత్మిక ప్రసంగాలూ, ప్రవచనాలు, సన్మానాలు, సభలు కూడా జరిగేవి. సభలు అంటే గుర్తొచ్చింది, శ్రీమాన్ సరస్వతిపుత్ర పద్మశ్రీ పుట్టపర్తి నారాయణాచార్యులు గారు ఇక్కడ శివతాండవ స్త్రోత్ర పఠనం, పురాణ ప్రసంగం చేయటం బాగా గుర్తుంది నాకు. మా ఇంటి ఎదురుగా ఉండే ఆయన, నేను ’తాతా! తాతా” అని పిలిచే ఆయన అలా వేదిక మీద మైకు ముందు కూర్చుని అలా ప్రసంగం చేస్తుంటే ఆశ్చర్యంగా ఉండేది నాకా వయసులో.

నా స్కూల్ ముచ్చట్లు:

మా స్కూల్ ఎంకే హాస్పిటల్ ఎదురుగా చెన్నూరు బస్టాప్‍గా పిలవబడే బస్టాప్ దగ్గర ఉండేది. అక్కడికి దగ్గర్లోనే శ్రీ రామకృష్ణ మఠం వారి గ్రంథాలయం ఉంటుంది. ఈ గ్రంథాలయంలో అనేక సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతు ఉంటాయి.

కాకపోతే మేము మా ఇంటి వెనుక ఉన్న మధ్వ వీధి గుండా వెళ్ళేవారం స్కూల్‌కి. ఇలా వెళ్తే స్కూల్ వెనుక వైపు నుంచి చేరుకోవచ్చు. నిజానికి వెనుకవైపు ఎంట్రన్స్ లేదు. వెనుకవైపు ఎత్తుగా నిర్మించబడ్డ సిమెంట్ గోడ ఉండేది. నిజానికి ఈ గోడదాటి లోనికి వెళ్ళలేము. తలుపు గానీ, గేట్ గానీ ఏమీ ఉండేవి కాదు. కానీ ఎవరో పుణ్యాత్ములు బడి తాలూకు ఆ సిమెంట్ గోడకి ఓ పెద్ద కన్నం చేసి ఉంచారు. మేము ఆ కన్నం గుండా స్కూల్ ఆవరణలోకి ప్రవేశించేవారం.

మా స్కూల్ ఆవరణ చాలా విశాలంగా ఉండేది. అక్కడ ఆకాశరామన్న పూలు అనబడే తెల్ల బుడ్డపూలు పూచే పెద్ద పెద్ద వృక్షాలు ఉండేవి. ఆ పూల రెక్కలని కొందరు నిపుణులు నాలుక పై రాచుకుని బెలూన్ లాగా చేసేవారు, ఇంకొదరు నిపుణులు దానితో ‘పుయ్.పుయ్య్య్’ అని ఈలపాటలాంటి చప్పుడు సృష్టించేవారు. టీచర్ల దృష్టిలో ఇవన్నీ నిషిద్ధ క్రీడలు నిజానికి.

ఇలాంటి విద్యలలో నాది ఎప్పుడూ ఫెయిల్యూర్ స్టోరీనే.

మా అక్కయ్య రుక్మిణీ నిపుణురాలు అని చెప్పలేను కానీ ఈ బుడ్డపూలతో నా మీదకి మెరుగ్గా ప్రయోగాలు చేసేది.

ఈ స్కూల్ కి సంబంధించి ఒక విషయం బాగా జ్ఞాపకం ఉంది నాకు. ఇంద్రజాలం చేసే ఒక బృందం వచ్చి చిన్న గారడీలు మొదలుకుని, కొన్ని ఒళ్ళు గగుర్పొడిచే విన్యాసాల దాకా ప్రదర్శించి మమ్మల్ని వినోదపరిచారు. వాటిలో ఒక విన్యాసం ఏమిటంటె, మెజిషియన్ తనతో పాటు ఉన్న ఒకావిడని మొదలు కుర్చీ మీద కుర్చోబెడతాడు.

ఆ తరువాత తనకి కాఫీ కావాలి అని అడుగుతాడు. ఆమె ‘కాచుకుని త్రాగండి’ అంటుంది.

వాడి అసాధ్యంకూలా, ఆమె తలమీద పెద్దగా మంట పెట్టి ఏదో గ్యాస్ స్టవ్ మీద గిన్నె పెట్టి కాచుకున్నట్టు తొణకక బెణకక, కాఫీ కాచుకుని గ్లాసులోకి వంచుకుని మంట ఆర్పేస్తాడు. పిల్లలం మేమంతా ‘కెవ్వు కెవ్వు’ మంటూ ఒకటే కేకలు.

ఈ సంఘటన తలచుకునే కొద్దీ నాకు ఇప్పటికీ ఒళ్ళు గగుర్పొడుస్తుంది.

ఈ స్కూల్లోనే నేను మొదటిసారిగా ‘అ అమ్మ; ఆ ఆవు; ఇ ఇల్లు; ఈ ఈగ…’ తదితర పాఠాలు చదువుకున్నాను.

అందులోనే బుజ్జి మేక బుజ్జి మేక ఏడకెడితివి? రాజు గారి తోటలోన మేతకెడితిని’ అనే పాట/కవిత ఉండేది.

వానలో జర్రున జారి పడ్డ కుర్రాడి గూర్చి పాట ఒకటి ఉండేది. అది చదివి తెగ నవ్వుకునేవాళ్ళం.

ఆ తెలుగువాచకంలో ఉన్న అన్ని బొమ్మలూ గుర్తున్నాయి నాకు. ఈగ బొమ్మ కూడా అసహ్యం వేయకుండా చక్కగా ఉండేది. బుట్ట బొమ్మ ఒకటి బాగా గుర్తు నాకు.

తెలుగువాచకం మొదటి పేజిలో ఆంధ్రపదేశ్ ప్రభుత్వం అనే పేరుకి పైభాగంలో ఉండే పూర్ణకుంభం చాలా బాగా గుర్తు ఉంది. ఇప్పుడా సింబల్ ఉందో లేదో?

చంద్రుడు నాతో పాటు వచ్చేవాడు:

మా వీధిలో మా దూరపు బంధువులు చాబాల రాము అనే ఆవిడ ఉండేవారు. ఆవిడ పేరు రామలక్ష్మో ఏదో ఉంటుంది, అందుకే రాము అనేవారు. వాళ్ళ ఊరు అనంతపురం జిల్లా చాబాల కావటం వల్ల ఆవిడని చాబాల రాముగా పేర్కొనేవారు మా ఇంట్లో.

ఒకసారి వాళ్ళింటికి వెళ్ళి వస్తూ ఒక విషయం గమనించాను, నేను నడుస్తున్నంత సేపు తలెత్తి పైకెత్తి చూస్తే చంద్రుడు నాతో నడిచినట్టు కనిపించింది. అదే విషయాన్ని ఆశ్చర్యంతో మా అమ్మతో చెబితే ఆవిడ నవ్వేసి, చంద్రుడు అక్కడే స్థిరంగా ఉంటాడు, మనకు అలా కనిపిస్తుంది అంతే అన్నది. నాకు అది చాలా ఆశ్చర్యం కలిగించింది నిజానికి. చాలా రోజులు అదే విషయాన్ని తలచుకుంటూ ఉండేవాడిని.

పెద్ద దర్గా ఉరుసుకి వెళ్ళేవాళ్ళం

మా చిన్నప్పుడు పెద్ద దర్గా ఉరుసుకి వెళ్ళేవాళ్ళం. ఆ కోలాహలం చెప్పనలవి కాదు. అక్కడ నాకు బాగా గుర్తుండి పోయినవి పెద్ద ఎత్తున వాళ్ళు పాడే ఖవ్వాలీలూ, రోడ్డుకి ఇరువైపులా అమ్మే రంగురంగుల బొమ్మలు, బెలూన్లూ, బెండు బత్తాసు (పంచదార పాకంతో చేసే కడ్డీలాంటి తీపి పదార్థం).

ఆ తరువాత కొన్ని ఏళ్ళకి ఈ పెద్ద దర్గా సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ పుణ్యమా అని దేశవ్యాప్తంగా పేరు గడించి, కోట్ల ఆస్తులని సంపాయించింది.

ఇక కళ్యాణదుర్గం వెళ్ళటానికి రంగం సిద్దం అయింది

మా అన్నయ్య తిరుపతి విశ్వవిద్యాలయంలో ఎమ్మే ఇంగ్లీష్ విజయవంతంగా పూర్తి చేసుకుని రావటం, అయ్యేఎస్‌లో సీట్ వచ్చే అవకాశం ఉన్నా అది వద్దనుకుని, హాయిగ ఆదోనిలో ఇంగ్లీష్ లెక్చరర్‌గా ఉద్యోగం తెచ్చుకుని చేరిపోవడం జరిగిపోయాయి. అది ఆయనకి ఇష్టమైన ఉద్యోగం కాబట్టి, ఎంతో ఆలోచించి తీసుకున్న నిర్ణయం కాబట్టి మా నాన్నగారు కూడా ఏమనలేకపోయారు. నిజానికి మా నాన్నగారికి, మా అన్నయ్యని కలెక్టర్ గా చూడాలి అనే కోరిక ఉండేది.

మా పెద్దన్నయ్య ఉద్యోగంలో చేరబోయే కాలేజిలో డిగ్రీ చదవటానికి మా పెద్దక్కయ్య శ్రీమతి రామలక్ష్మి కూడా బయలుదేరారు. వాళ్ళిద్దరికి తోడుగా ఉండటానికి, వండిపెట్టటానికి, చేయి విరిగి అతికిన మా బామ్మ గారు బయలుదేరారు.

ఈ లోగా మా నాన్నగారికి కూడా ప్రమోషన్ మీద కళ్యాణదుర్గంకి తహసిల్దారుగా బదిలీ అయింది. మా నాన్నగారు ఎక్కడున్నా మా అమ్మ తోడు లేకుండా ఉండలేకపోయేవాడు. పిల్లలని వదిలి మా అమ్మగారు ఉండలేకపోయేవారు. ఈ కారణాల వల్ల ఆయనకి ఎన్ని ట్రాన్స్పర్లు వచ్చినా మేము కుటుంబం మొత్తం ఆయన వెంబడి వెళ్ళాల్సిందే.

కడపలో మా ఇంటిని ఎవరో తెలిసిన వాళ్ళు రెకమెండ్ చేసిన మీదట ఒక తమిళ బ్రాహ్మణ కుటుంబానికి బాడుగకి ఇచ్చి బయల్దేరాం. ఆ తమిళాయన నల్ల దుస్తులు వేసుకుని గంధం బొట్లు పెట్టుకుని ఉన్నాడు. ఆయన మెడలో మాలలు. మా వాళ్ళు కూడా ఆసక్తిగా అడిగారు ఆయన్ని, ఆ నల్లదుస్తుల వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటి అని. అప్పుడు చెప్పాడు ఆయన, తను అయ్యప్ప దీక్షలో ఉన్నానని. అలా అయ్యప్ప దీక్ష అనే ప్రక్రియ గూర్చి మొదటి సారి నాకు అప్పుడే తెలిసింది.

****

అన్నీ శుభవార్తలే.

మా అన్నయ్యకి పీజీ అవంగానే ఉద్యోగం దొరికింది. మా నాన్నగారికి తహసిల్దారుగా పూర్తి స్థాయి పదోన్నతి దొరికింది. మా బామ్మ చేయి అతికింది.

ఇక మేము కళ్యాణదుర్గం వెళ్ళాలి.

ఇందాకే చెప్పాను కద, మా వీధిలో అందరూ ఒక కుటుంబంలాగా ఉండేవారని. ఇక అందరి వీడ్కోళ్ళు, కన్నీళ్ళతో సాగనంపటాలు, జాగ్రత్తలు చెప్పటాలు జరుగుతున్నాయి.

మమ్మల్నందర్నీ ఇంకా సర్ప్రైజ్ చేస్తూ మా పక్కింటి డాక్టర్ కృష్ణమూర్తి గారు, వారి సతీమణీ శ్రీమతి రుక్మిణమ్మ గార్లు వాళ్ళింటికి డిన్నర్‌కి ఆహ్వానించారు. మా అప్ప చాలా మొహమాటస్తుడు. ఆయన యథాప్రకారం ‘అయ్యొయ్యో అదేం వద్దు’ అని వీలయినంత వరకు తప్పించుకోవటానికే చూశారు. కానీ వాళ్ళు ఒప్పుకోలేదు, మీరు వచ్చేతీరాలి అని బలవంతం చేశారు.

మా అక్కయ్యలు తెగ సంబరపడి పోయారు ఈ ఆహ్వానం అందుకున్న పిమ్మట.

సాయంత్రం లారీలో సామాన్లు కళ్యాణదుర్గంకి బయలుదేరాయి. బోసిబోయిన ఇల్లు అదోలా కనపడింది.

ఇక మేము డాక్టర్ గారింట్లో భోంచేసి కళ్యాణదుర్గం బయలుదేరాలి, ఎవరో తెలిసిన వారు కారు పంపారు.

అదొక గొప్ప ఫేర్వెల్. మల్లీశ్వరి సినిమాలో పెద్ద డైనింగ్ టేబుల్ చూసి వెంకటేష్ ఆశ్చర్యపోతాడు చూడండి, అలా ఉండింది మా పరిస్థితి ఆ రాత్రి.

వారి ఐశ్వర్యం గురించి కాదు నేను ఇప్పుడు చెప్పదలచుకున్నది. వారి ఆదరణ గూర్చి. నిండైన ప్రేమతో, మమ్మల్ని సమాదరించి కానుకలు ఇచ్చి మాకు ఆ రాత్రి విందుని ఒక మరపురాని ఈవెంట్‍గా వారు మలచిన తీరు అద్భుతం.

ఇక కళ్యాణదుర్గంకి బయలు దేరాం.

వచ్చేవారం కళ్యాణదుర్గం విశేషాలు తెలుసుకుందాం.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here