కమరావతీరాగం

0
9

[box type=’note’ fontsize=’16’] సంచిక నిర్వహించిన హాస్యకథల పోటీకి వాగుమూడి లక్ష్మీ రాఘవరావు పంపిన హాస్యకథ “కమరావతీరాగం“. ఇల్లాలి కంఠ మాధుర్యానికి మురిసిపోదామనుకున్న మల్లన్నకు, ఒక్కొక్కసారి జీవితం మీద విరక్తి ఎందుకు పుట్టేదో ఈ కథ చెబుతుంది. [/box]

[dropcap]”బో[/dropcap]నమెల్లి పోతుందే బోనమ్మ

అమ్మతల్లి బోనం – పెద్ద పట్నమెల్లి పోతుందే బోనమ్మ

సుంకు బియ్యం – గొర్రెపిల్ల – సరుగు తంతు – సంబురాలు

సంబురాలు సంబురాలు-సంబురాలు

బీరప్ప కమరావతుల సంబురాలు

పెళ్ళితంతు మొదలాయె సంబురాలు”

సంబరం అంబరమంట శుద్ధిగ బోనమొండుతుంది కమరావతి.

యింటిదాని సంబురాన్ని చూచి, అంబరమంటిన సింగిడి, రంగురంగులు విరజిమ్ముతున్నట్లు ముసిముసి నవ్వులతో మీసం దువ్వుకున్నాడు మల్లన్న.

“బుద్ధికుదిరి యింటిది గంటెపడితే, దాని చేతివంట తింటానికి బీరప్ప కమరావతులతో పాటు, బొజ్జగణపయ్య పంచె పైకెత్తి లగెత్తుకుంటూ రావల్సిందే” అని మల్లన్న అనుకున్నాడు.

“గోఱ్ఱె.. గోఱ్ఱెమ్మ గోఱ్ఱె – పెళ్ళీడుకొచ్చింది గోఱ్ఱె” అని పాడుతూ, బోనమొండుతున్న కమరావతి జీవాల పెళ్ళికి అన్నీ సిద్ధం చేస్తుంది.

‘గొప్పోళ్ళ పెళ్ళిళ్ళక్కూడ లేని మేమేల సరాగం గొఱ్ఱెల పెళ్ళిళ్ళకుంటుంది. ఇది తరాలనాటి పాట. పాటంటే అసోంటిసొంటి పాటకాదు. మస్తు హుషారయిన పాట. యింటిది అర్రలో కూర్చుని, సొక్కంగా గొంతు సవరించుకుని బువ్వ బుక్కుతూ అల్కగా పాడిందంటే కోయిలమ్మలు కూడ పులకలెత్తిపోతాయి. కాకుంటే పాటలోని గొఱ్ఱెను, యింటిది గోఱ్ఱె చేసేసినప్పుడే, నాబి చల్లబడినట్లే అవుతుంది. దీనికి కంఠశుద్ధి మస్తుగా ఉంది గని డొక్కశుద్ధి మాత్రం వీసమెత్తు కూడ లేదు’ స్మితవదన దరహాసంతో అనుకున్నాడు మల్లన్న.

భారతీయ సనాతన సంప్రదాయాల్లోని ఆదర్శదాంపత్యానికి, ఈ తరంలో కమరావతిమల్లన్నలే చక్కని తార్కాణం; ఇది బండమీది రాత అని కొందరంటారు. “ఆదర్శదాంపత్యమంటే ఏమిటో నాకు తెల్వదుగానీ, మా ఆవిడ చీపురుకట్ట పట్టుకునీ, పప్పుగుత్తి పట్టుకునీ, మజ్జిగ కవ్వం పట్టుకునీ నా వెనక పడేటప్పుడు మాత్రం, నాకామె ఆదర్శ పతివ్రతే అని అనిపిస్తుంది” ఆ కొందరితో నవ్వుతూ అంటాడు మల్లన్న.

“మీ ఆవిడ చీపురుకట్ట, పప్పుగుత్తి, మజ్జిగ కవ్వం పట్టుకుని మీ మీదకు సమరాని కెందుకు సై అంటుంద”ని ఎవరన్నా అడిగితే,”మనం మందుకొట్టి గొంతెత్తితే గార్దభాలే గాబరాపడిపోతాయి. ఇక మనుషుల సంగతి చెప్పేదేమిటి? ఆ మనుషుల కోసం పట్టేస్తుంది మా ఆవిడ చీపురుకట్ట; ఏమాటకా మాటే చెప్పుకోవాలి. మా ఆవిడ చల్లకవ్వం పట్టి, మట్టికుండలో చల్ల చిలుకుతుంటే, అబ్బ దాని వయ్యారం… హయ్యంగవీనమే దాని చిరునవ్వుల యవ్వారం” అని మల్లన్న కవితలల్లేస్తాడు.

పెద్ద పట్నం వెళ్ళడానికి కమరావతి పడే హడావిడిని చూడగానే మల్లన్నకి, అతని పెళ్ళినాటి ముచ్చట్లు యాదికొచ్చాయి. కమరావతి మల్లన్నల పెళ్ళయ్యి చాలా సంవత్సరాలు గడిచింది. అయితే వారికి సంతానం కలగలేదు.

కమరావతి తను మహాపతివ్రతను కాదేమో, అందుకే సంతానవతిని కాలేక పోతున్నానేమోనని అప్పుడప్పుడప్పుడు బోరుమని ఏడ్చేసేది.. తను మహాపతివ్రత కావాలంటే ద్రౌపదిలాగా అయిదుగురిని కట్టుకోవాలా? అని భర్తనే ప్రశ్నించేది. మరల తనకు తానే చెంపలను వాయించుకునేది. బలవంతంగ భర్తకు పాదపూజ చేసేది. ఈ కాలంలో పతివ్రత కావాలంటే పాతపద్ధతులను అనుసరించకూడదని అనుకునేది.. కొత్త పద్ధతంటూ భర్తకు 101 బిందెలతో స్నానం చేయించేది. మల్లన్న జలుబు చేస్తుందే అంటే జలుబు రాకుండ నిమ్మపండ్ల వ్రతం చేస్తాననేది. మల్లన్న పటం ముందు భర్తను కూర్చో పెట్టి 108 భక్తి గీతాలు పాడి వినిపించేది. పాటలన్నీ బాగానే ఉండేవి గని కమరావతి పాడే అక్షరదోషాలకు అవి అర్థాలను మార్చేసుకునేవి. కమరావతికి పాడటమంటే మహాయిష్టం. ఆమె కంఠమాధుర్యంకూడ అందరిని ఆకర్షించేవిధంగ ఉంటుంది. అయితే ఆమె పాడేపాటల్లో అక్షరదోషాలు విపరీతంగ ఉంటాయి. అయినప్పటికీ కమరావతికి గానకోకిలనవ్వాలనే వాంఛ నిలువెల్ల ఉంది.

కమరావతి పాటలు పాడేటప్పుడు రామరామ అనడానికి బదులు రమరమ అని పాడేది. పతి సేవ అనడానికి పర సేవ అని పాడేది. నిన్నే నమ్మితిరా నాథ అనడానికి నిన్నే అమ్మితిరా అనాథ అని పాడేది. ఈ పడతిపూజ అందుకోరా అనడానికి ఈ బడితపూజ అందుకోరా అని పాడేది. నిన్ను మించిన దేవుడు నాకిల లేడురా అనడానికి నిన్ను దంచిన దేవుడు నాకిల లేడా రా? అని పాడేది.

ఒకసారి కమరావతి ధైర్యం చేసి,”దురితదుష్ట చతుష్టయరుధిరమంత” అనే పద్యాన్ని”డులిట డుసతచతుసట రంద్రమంతః” అని పాడేసింది.

ఇల్లాలి కంఠ మాధుర్యానికి మురిసిపోదామనుకున్న మల్లన్నకు, ఆమె పాటల్లోని అక్షరదోషాలు వినగానే ఒక్కొక్కసారి జీవితం మీద విరక్తి పుట్టేది. అయితే భార్య వండి పెట్టే వంటల రుచులను తలచుకుని పుట్టిన విరక్తిని చంపేసేవాడు.

కమరావతి పెరుగావడ, పాలావడ, పీష్ ఆవడ, చికెన్ ఆవడ, మటన్ ఆవడ, తేనె ఆవడలను చేసి పెడితే, మల్లన్న లొట్టలేసుకుంటూ చిన్నముక్కకూడ వదిలి పెట్టకుండ తినేవాడు.  కమరావతి మల్లన్నల యింటిప్రక్కనున్న యింట్లో ఉమాదేవి శంకరులు ఉంటున్నారు. యిద్దరూ ప్రభుత్వ పాఠశాలల్లో ఉద్యోగం చేస్తున్నారు. ఉమాదేవి తెలుగు టీచర్ కాగా, శంకరం గణిత ఉపాధ్యాయుడు. వేదపురాణేతిహాసాదుల మీద అభిమానం ఉన్నవాడు. వారికొక కుమార్తె, ఒక కుమారుడు, కుమార్తె పేరు అపాల.

ముద్దుగ అల అనీ, పాల అనీ, అప్ప అనీ ఎవరిష్టమొచ్చినట్లు వారు పిలుస్తారు. ఎలా పిలిచిన పలికే సహనవంతురాలు అపాల. కుమారుడు దిలీప్ అందరూ దీపు అని పిలిచేవారు. దీపు కొంటెకోణంగి.

అపాల కమరావతిమల్లన్నల యింట్లోనే ఎక్కువగ ఉండేది. పిల్లలు లేని కమరావతి అపాల దీపులను స్వంత బిడ్డల్లాచూసుకునేది. అపాల కమరావతి పాడే పాటల్లోని తప్పులను సరిచేస్తూ, క్రొత్తపాటలను నేర్చుకునేది. “అబ్బా ఆంటీ వంద మా తరం కాదు వందేమాతరం” అని అపాల తప్పులను సరిచేస్తుంటే మల్లన్న,”మొగుడా అని పాడమంటే మింగుడా అని పాడుతుందమ్మ” అని తన ఆవేదనను అపాలకి చెప్పుకునేవాడు. అపాల ఇంటర్‌లో ఉన్నతస్థానాన విజయం సాధించింది. ప్రేమలో పడింది.

కమరావతి కంఠమాధుర్యానికి ఉమాదేవికూడ అబ్బురపడిపోయేది. అయితే ఆమె అక్షరదోషాలను వినగానే ఆమెకు దిమ్మతిరిగి బొమ్మ కనపడేది. కమరావతి పాటల్లోని తప్పులను సరిచేస్తుండేది. దీపుకు మాత్రం కమరావతి తప్పులతో పాడుతుంటేనే ఆనందంగ ఉండేది. అప్పుడప్పుడు దీపు ఆనందంతో జత కలిపేవాడు మల్లన్న.

ఒకసారి “వల్లకాటికిపోయి ఓరయ్యో- చల్లటీ కబురెత్తుకోచ్చాను మారయ్యో ఊరునేలే ఆసామి ఊరకుక్క- ఊరుకూరికే చచ్చిందంట మారయ్యో ఆసామి ఊరకుక్క ఆహాహా చచ్చింది ఓహోహో చచ్చింది మారయ్యా” అంటూ గోరంత మంచిని కొండంత చేసిచెప్పే తిక్క శంకరయ్య పాటను దీపు వ్రాసుకొచ్చి కమరావతిని పాడమన్నాడు. కమరావతి గొంతు సవరించుకుంది. ఒకటికి పదిసార్లు పాటలోని మొదటి అక్షరం వ ని జపించింది. పాడటం మొదలు పెట్టేసరికి ఆమెకు వ అనే అక్షరం గుర్తుకురాలేదు. ” క..కు… గ.. గు. జ..జు..త..తు..మ..ము. ర..రు….” యిలా అన్ని అక్షరాలను యాది చేసుకుని కడకు “నల్లకడికి పోయి” అంటూ పాట అందుకుంది. భార్య కోడిమెదడుకు జుట్టు పీక్కున్నాడు మల్లన్న.

మల్లన్న కమరావతిని ఉమాదేవికి అప్పగించి డొక్కశుద్ధి చేయమన్నాడు. చిరునవ్వుతో ఉమాదేవి అలాగే అంది.

మల్లన్న జీవాలవ్యాపారం చేస్తుంటాడు. ఆ మార్కెట్ లోనే తిక్కశంకరయ్య పాటలు పాడుతూ కూరలు అమ్ముతూ కాలం గడుపుతుంటాడు. ఒకసారి తిక్కశంకరయ్య కమరావతి పాటలను విని రెండురోజుల వరకు తనెవరో మరిచిపోయి, “ముఖ్యమంత్రిగారు నా ముక్కుపొడుం డబ్బా పోయింది. గూఢచారి 116 ని పంపి వెతికించి తెప్పించి యివ్వండి, ఉపవాసముంటే అప్పుతీరదు–వల్లకాటి కెళితే పోయింది తిరిగిరాదు. మీరు ఉపవాసముండవద్దు. వల్లకాటికి వెళ్ళవద్దు. ముక్కుపొడుం డబ్బా తెప్పించి యివ్వండి” అంటూ ఊరంత తిరిగాడు. కడకు కమరావతి చేతిముద్ద తినే మనిషయ్యాడు.

కమరావతి పాటల్లో పాడే అక్షరదోషాలను ఉమాదేవి కూడ సరిచేయలేక పోయింది. కమరావతి ఖాళీ ఉన్నప్పుడల్లా తన పాటలను పాడి వినిపించడానికి ఉమాదేవి భర్త శంకరం దగ్గరకు వెళ్ళేది.

శంకరం కమరావతి పాటలను విన్నప్పుడల్లా “సున్నాను కని పెట్టింది నేనే; రామానుజంకి ఎక్కాలు నేర్పింది నేనే; పాస్కల్ నన్నడిగే పకోడీలు తిన్నాడు. పునరపి జననం – పునరపి మరణం – ఎందుకు భేదం – ఎందుకు మోదం” అని జుట్టు పీక్కునేవాడు. పీక్కున్న జుట్టును సవరం కట్టించుకోమని భార్యకు యిచ్చేవాడు. దీపు తన తండ్రి సినిమాకు డబ్బులివ్వనప్పుడల్లా తండ్రి మీదకు కమరావతిని పాటపాడటానికి పంపేవాడు. శంకరం యింటిలోకి అవతారం, ఆనందవనం అద్దెకు దిగారు. “హోహోహ్లాదహ్లాద! పాటలంటే నేను చెవి కోసుకుంటా” అన్న ఆనందవనానికి కమరావతి గురించి చెప్పింది అపాల.

ఆనందవనాన్నే అపాల ప్రేమించింది. ఇద్దరూ దగ్గరదగ్గరగా ఉండి ఒకరిగురించి మరొకరు బాగా తెలుసుకోవాలనుకున్నారు. అపాల ప్రేమపూర్వక అభ్యర్థనను అనుసరించి ఆనందవనం మిత్రుడు అవతారంతో అపాల యింటిలోనే అద్దెకు దిగాడు. ఈ విషయం ఉమాదేవికి శంకరానికి తెలియదు. నాలుగురోజుల పాటు అప్పులవాళ్ళ బాధనుండి బయటపడవచ్చని ఆనందవనంతో అవతారం వచ్చాడు.

అపాల మాటలను విన్న ఆనందవనం కమరావతి పాటల్లోని భాషాదోషాలను సరిచేసి, ఆమెను మహాగాయనిని చేస్తానని తన మిత్రుడు అవతారం మీద ఒట్టేసి గట్టిగ చెప్పాడు. ప్రేమికుని సాహసం చూసి అపాల మహదానంద పడింది. కమరావతిని పరిచయం చేసింది. “వచ్చేవచ్చే వసంతమాసం – పంపే పంపే శుకసందేశమ” అనే పల్లవిని ఆనందవనం పాడి, అలాగనే పాడమని కమరావతితో అన్నాడు. కమరావతి గొంతు సవరించుకుంది. ఆ సవరింపులో ఆమె గొంతుతో కదలాదిన స్వరాల మాధుర్యానికి ఆనందవనం పులకరించిపోయాడు. నవీనరాగకల్పనకు యిలాంటి కంఠాలే కావాలనుకున్నాడు. కమరావతి పాటను అందుకుంది.

“వాచ్చె వాచ్చే సంతలో మాసం – పందే పందే సంకసందేశం” అని కమరావతి పాడగానే వంటచేస్తున్న అవతారం “పాలల్లో వెయ్యాల్సింది పంచదార కాదు. చింతపండు” అంటూ చింతపండు వేసాడు. గుడ్లు తేలేసాడు.

ఆనందవనం కమరావతి భాషాసమస్యను అర్థం చేసుకున్నాడు. దీర్ఘ కాలప్రణాళికను ఒకదానిని రూపొందించుకున్నాడు. ఆ ప్రణాళికలో భాగంగ “నానూనెనీనూనెనానూనెనీనానూనె”అంటూ కమరావతితో అనిపించసాగాడు. కమరావతి పని చేసుకుంటూ కూడ నానూనెనీనూనె అని పాడుకోసాగింది. అదే నూనో అర్థంకాక మల్లన్న జుట్టు పీక్కునేవాడు. దేవదాసు కుక్కపిల్లను పక్కన పెట్టుకుని త్రాగితే, తను మేకపిల్లని పక్కన పెట్టుకుని తాగాలని రకరకాల ఆలోచనలు చేసేవాడు. ఆనందవనం కమరావతికి రకరకాలుగ తెలుగు అక్షరాలను పలికిస్తూనే, అపాలతో “జింగిరిజింగిరిబాల” అంటూ ప్రణయగీతాలాలపించసాగాడు.

ఆనందవనం ప్రణయగీతాలను కమరావతి పసిగట్టింది. వారి ప్రేమ గురించి భర్తకు చెప్పింది.

మల్లన్న ఆనందవనం గురించి ఆరా తీయసాగాడు. అవతారం ఖాళీ సమయాల్లో దీపు తెలుగు నోడ్సులు వ్రాసి పెట్టసాగాడు. కమరావతి ప్రభావాన నోట్సుల్లో, ‘పదిమంది’ అని వ్రాయాల్సింది ‘పందిమంది’ అనీ, ‘కళ్ళు తెరిచిచూడు’ అని వ్రాయాల్సింది ‘కాళ్ళు తెరిచిచూడు’ అనీ, ‘భారతం’ అని వ్రాయాల్సింది ‘భరతం’ అనీ వ్రాయసాగాడు. ఆనందవనం ‘నానూనె’తో పాటు ‘జాజిజిజూజోజో జీజజాజిజూజోజో’ వంటి అనేక అక్షరబంధాలను కలిపించి కమరావతితో పలికించసాగాడు. అతని “కాకీ కకీకాకకూ కాకరాకకాక కీకాకకూ కాక కేక కేక”వంటి అక్షరబంధాలు అందరిని ఆకర్షించాయి. దీపు వాటిని ఉచ్చరిస్తూ, బడిపంతులును కూడ అబ్బురపరిచాడు.

మల్లన్న ఆనందవనం గురించి మొత్తం తెలుసుకున్నాడు. అనందవనం తలిదండ్రులు అతని చిన్నతనంలోనే కారు ప్రమాదంలో చనిపోయారు. అతను అనాథాశ్రమంలో పెరిగి పెద్దయ్యాడు. అనందవనం గురించి అపాల గురించి కమరావతి మల్లన్నలు ఉమాదేవి శంకరంలకు చెప్పి, వారి ప్రేమకు ప్రాణం పోసారు.

ఆనందవనానికి ఈ విషయం తెలిసింది. కమరావతిమల్లన్నలకు నమస్కరిస్తూ, “మీ మేకలకు మే భాష నేర్పి నా రుణం తీర్చుకుంటాను” అన్నాడు.

ఆనందవనం ప్రభావాన కమరావతి పాటల్లో అక్షరదోషాలు తగ్గిపోయాయి. ఆమెతో పాటల కచ్చేరి పెట్టించారు. తొలి కచ్చేరిలోనే ఆమెకు మహాగాయని అని బిరుదు వచ్చింది. కమరావతీగానం ప్రపంచవ్యాప్తంగ ప్రజాదరణను పొందింది. కమరావతి తన పేరు మీద కమరావతీరాగం అనే కొత్తరాగాన్ని కనిపెట్టింది. అది ఆదునిక సమాజాన్ని కూడ ఆకర్షించింది. ఆమె సన్మాన కార్యక్రమంలోనే ఆనందవనం అపాలాల పెళ్ళి జరిగింది.

కమరావతి అక్షరదోషాల జబ్బు అవతారాన్ని అంటుకుంది. అవతారం, ‘శివకుమారుడు’ అని వ్రాయాల్సింది ‘శవకుమారుడు’ అని వ్రాయడం, ‘కందిపప్పు’ అని వ్రాయాల్సింది ‘కిందిపప్పు’ అని వ్రాయడం, ‘సాంబారుపొడి’ అని వ్రాయాల్సింది ‘సోంబేరు పొడి’ అని వ్రాయడం చేయసాగాడు. ఆనందవనం అపాలలు యిద్దరూ కలిసి అవతారం కోసం మరో దగ్గుకాల… సారీ… సారీ… దీర్ఘకాల ప్రణాళికను సిద్ధంచేసారు.

సర్వేజనాః ఆనందో భవంతు!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here