కాంచన శిఖరం-11

0
9

[డా. భార్గవీ రావు రచించిన ‘Merukanchana’ అనే నవలని అనువదించి అందిస్తున్నారు శ్రీమతి రేణుక అయోల.]

[ఒకరోజు మేరు వెళ్ళి రమేష్‍ని కలుస్తాడు. కాసేపు మామూలు విషయాలు మాట్లాడుకున్నాకా, ఇక అసలు విషయానికి వస్తాడు మేరు. తనని వెంటాడుతున్న కలల గురించి చెప్తాడు. తనకి కలలో కనబడే ఆడ నాగుపాము గురించి, అది చేసే నృత్యం గురించి రమేష్‍కి చెప్తాడు. అది ఆడపామని నీకెలా తెలుసంటే, తన సిక్స్త్ సెన్స్ చెప్తుందని అంటాడు మేరు. కలలో తానొక రాజునని అంటాడు. మన కలలో మనం ఎవరిమైనా కావచ్చంటాడు రమేష్. కలలోనే కాదు, పూర్వజన్మలో కూడా తానొక రాజునని అంటాడు మేరు. శ్రీశైలం తవ్వకాల్లో దొరికిన ‘శిల్ప’ విగ్రహం దగ్గర నుంచి కేతకి ద్వారా తనకి జరిగిన అనుభవాల దాక రమేష్‍కి వివరంగా చెప్తాడు. నాడీ జ్యోతిష్యుడు కూడా తను ఓ రాజవంశీకుడనని చెప్పిన విషయం చెప్తాడు. ఇది హిప్నాటిక్ రిగ్రెషన్ అనీ, మరింత ప్రాక్టికల్‍గా ఉంటే ఇవన్నీ మాయమైపోతాయని చెప్తాడు రమేష్. కేతకి గురించి, శిల్ప గురించి చెబితే, కేతకి మోజులో పడి భార్యాబిడ్డలకి అన్యాయం చేయద్దని అంటాడు రమేష్. తేలికపడ్డ మనసుతో ఇంటికొస్తాడు మేరు. శ్రీశైలం సైటుకి నల్లమల అటవీ మార్గం గుండా జీపులో వెళ్తుంటాడు మేరు. ఈ మార్గం గురించి చిన్నప్పుడు తనకి రుక్కమ్మ చెప్పిన విషయాలు గుర్తుచేసుకుంటాడు. ఇంతలో దారిలో ఒకచోట సన్యాసిలా ఉన్న ఓ విదేశీయుడిని చూసి, జీపు ఆపి ఆయన దగ్గరకు వెళ్తాడు. మేరుని పేరు పెట్టి పిలిచి, నువ్వు వస్తావని నాకు తెలుసంటాడు ఆ సన్యాసి. మీరెవరని అడిగితే, గుర్తు రావడం లేదా అని అడిగి, తాను స్వామీ చైతన్యనని చెప్తాడు. పూర్వజన్మలో మేరుకి మార్గదర్శనం చేసిన గురువునని గత జన్మ సంఘటనలు కొన్ని జ్ఞాపకం చేస్తాడు. తాను విదేశాలలో జన్మించడానికి కారణం చెప్తాడు. కాలంలో ప్రయాణించడం సాధన చేశాననీ, భగవద్గీత, భారతీయ ఉపనిషత్తులను అధ్యయనం చేశానని చెప్తాడు. పూర్వజన్మలో వాళ్ళు ఇంకెవరైనా గుర్తున్నారా అని మేరు అడిగితే రాజనర్తకి గుర్తుందని, ఆమె ఇప్పుడు కేతకిగా జన్మించిందని చెప్తాడు. తాను ఎన్నో పుస్తకాలు చదివానని కాని తన జీవితం పట్ల కలత చెందానని అంటాడు. రేమండ్ మోడి రాసిన పుస్తకం ‘లైఫ్ ఆఫ్టర్ డెత్’ చదివావా అని ఆయన అడిగితే, చదివానని, దాని తరువాత పుస్తకం కూడా చదివానని అంటాడు మేరు. ఆ రేమండ్ మోడీని తానేనని ఆయన చెప్తాడు. – ఇక చదవండి.]

అధ్యాయం 20

[dropcap]ఆ [/dropcap]రోజు నాగపంచమి.

శిల్ప తొందరగా లేచి స్నానం చేసి, పట్టుచీర కట్టుకొని గుడికి వెళ్ళడానికి అన్నీ సిద్ధం చేసుకుంది. వెండి పళ్ళెంలో కుంకుమ, పసుపు పెట్టుకుంది. పుట్టలో పాలు పొయ్యడానికి చిన్న చెంబులో పాలు తీసుకుంది. ఒక చిన్న వెదురు బుట్టలో పూలు, తమలపాకులు, కొబ్బరికాయ సర్దుకుంది. సూర్య కూడా అమ్మతో పాటూ లేచి తయారైపోయాడు, చక్కగా ధోవతీ కుర్తా వేసుకొని.

“అరే చాలా ఆశ్చర్యంగా వుందే! నా కళ్ళని నేను నమ్మలేకపోతున్నాను. శిల్పా నువ్వేనా?” అన్నాడు మేరు.

“అవును, అక్షరాలా నేనే” అంది నవ్వుతూ శిల్ప. “మేరూ, సూర్యని కూడా నాతో పాటు తీసుకువెళుతున్నాను. పుట్టలో పాముకి పాలు పోయించడానికి.. మా పిన్నికూతురు, వదినగారు కూడా వస్తున్నారు. పూజ అయిపోయి ఇంటికి వచ్చాక అంతా వివరంగా చెబుతాను.” అంటూ, బయలుదేరింది.

శిల్ప వాళ్ళు బయలుదేరి వెళ్ళిపోయినా ఇంకా అలాగే కూర్చుని ఆలోచిస్తున్నాడు మేరు, శిల్పలో ఏమిటి విపరీతమైన మార్పు అనుకుంటూ. దైవభక్తి వున్నా, ఇలా పూజలు, వ్రతాలు, నోములు, అంటేనే ఇష్టపడని శిల్ప ఈ రోజు పుట్టలో పాముకి పాలు పొయ్యడానికి వెళ్ళిందంటే చాలా ఆశ్చర్యంగా వుంది. పాములను పూజించడం అనేది సర్వేశ్వరవాదం (Pantheism), సందేహం లేదు, కానీ అది మనిషి ప్రకృతిని అర్థం చేసుకోవడానికి ముందు. ప్రాచీన కాలం నుంచి హిందువులు పాములను పూజించారు. మహాశివుడిలో మెడలో అలంకరణగా, పాలసముద్రంలో విష్ణుమూర్తికి పానుపుగా ఉన్నది పాము. క్షీరసాగర మథనమప్పుడు పర్వతానికి పాముని తాడులా కట్టి మథించారు. అయితే కాలక్రమంలో మనుషుల్లో మార్పు వచ్చి – జంతువులను, గ్రహాలను ఒక స్థాయిలో ఉంచి, పరమాత్మను పూజించసాగారు. మరి కాలంలో వెనక్కి వెళ్ళి ఇప్పుడు పాములను పూజించటం ఎందుకు?

శిల్ప పూజ ముగించుకునివచ్చి, చలిమిడి ప్రసాదం మేరు చేతిలో పెట్టింది. ఆమె ముఖంలో ఏదో వింత కాంతి.

“మేరూ నా గురించి ఆలోచిస్తున్నావని తెలుసు. హఠాత్తుగా ఈ పూజలేమిటని, ఈ నమ్మకాలేమిటని అనుకుంటున్నావు కాదూ.. ఒకసారి సూర్యకి విపరీతమైన జ్వరం వచ్చింది. మూడు రోజులపాటు ఎన్ని మందులు వేసిన, జ్వరం తగ్గలేదు. వాడు ఆ జ్వరంలో ఏమి తినేవాడు కాదు. వాడు తోటకూరకాడలా వేలాడిపోయాడు. ఏం చెయ్యాలో తోచలేదు. వాడ్ని ఒళ్ళో వేసుకొని వరండాలో కూర్చున్నాను. ఇంతలో అక్కడికి ఓ కోయ మహిళ వచ్చింది. జాతకం చెబుతానంటూ. నేనేమీ జవాబు ఇవ్వలేదు.

తనంతట తానుగా చెప్పడం మొదలు పెట్టింది. సూర్య పుట్టినప్పుడే సర్పదోషంలో పుట్టాడనీ, నాగపాముని పూజించినట్లు అయితే నయం అయిపోతుందని చెప్పింది. వాడు తిండి, పాలు తాగకుండా అలా వాడిపోవడం చూడలేకపోయాను. ఆమె చెప్పినట్లుగానే పసుపు గుడ్డలో ఒక రూపాయి కాయిన్ కట్టి పాలలో ముంచి ప్రార్థించాను. నువ్వు నమ్మవుగాని మేరూ, సూర్య జ్వరం తగ్గిపోయింది. ఎంత నమ్మొద్దు అనుకొన్న నమ్మవలసి వచ్చింది. ఇది భగవంతుడి దయా, లేక అద్భుతమా!”

“చాలా ఆశ్చర్యంగా వుంది శిల్పా, నువ్వెప్పటి నుంచి ఈ అద్భుతాల మీద, దైవనిర్ణయాల మీద నమ్మకం పెట్టుకొన్నావూ?”

“ఎప్పుడైతే స్వయంగా అనుభవించానో అప్పటి నుంచి. నిజం మేరూ, సూర్య పుట్టాక నాలో చాలా మార్పు వచ్చింది. వాడితో ఆడుకుంటున్నప్పుడు, వాడికి బట్టలు తొడిగి, పాలుపట్టినప్పుడు ఏదో ఉద్వేగానికి లోనవుతాను. వాడు నాకు చిన్ని కృష్ణుడిలా అనిపిస్తాడు. వాడు పుట్టి మూడు సంవత్సరాలే అయినా నీ మాటల్లో చెప్పాలంటే ఎన్నో జన్మల అనుబంధంలా అనిపిస్తుంది. నిజంగా నేను చేసుకున్న అదృష్టం అనుకుంటాను అలాంటి కొడుకు పుట్టడం. వాడు లేని జీవితం అసలు ఊహించలేను మేరు”

శిల్ప మాటలని జీర్ణించుకోవడానికి చాలాసేపు పట్టింది మేరుకి. మౌనంగా వింటూ వుండిపోయాడు.

“ఇంకో విషయం మేరూ, ఈ మధ్య కలల్లో నన్ను సర్పాలు వెంటాడుతుంటాయి. అవి నృత్యం చేస్తుంటాయి. ఆ నృత్యం చాలా ఆకర్షణీయంగా వుంటుంది. వాటితోపాటూ నేను కూడా నర్తిస్తూ ఉంటాను. బాధతో కాదు, ఆనందంతో ఆ నృత్యం చేస్తూ ఉంటాను. అప్పుడప్పుడు ఇంకో పాము నన్ను వెంటాడుతూ వుంటుంది. సరిగ్గా అలాంటప్పుడే విపరీతమైన చెమట్లు పట్టి ఎవరో కొట్టి లేపినట్లు తెలివి వస్తుంది” అలా చెబుతూ కళ్ళు మూసుకుంది శిల్ప రాత్రి వచ్చిన కలలు మరచిపోవడానికి.

‘ఆ వెంటాడుతున్న పాము కేతకి అయిఉంటుందా’ శిల్ప మాటలు వింటూ ఆలోచిస్తున్నాడు మేరు.

“మేరు ఇప్పుడు నేను నిన్ను అర్థం చేసుకొన్నాను. నిజంగా చెబుతున్నాను. నీ భావాలకి అర్థం తెలుస్తోంది. నీ మానసిక సంఘర్షణ అర్థం అయింది. పురాణాలైనా, మార్మిక వాదమైనా ఏదో అతీతమైన శక్తి మన వెనకాల వుంది. అది మనకి అర్థం అవుతున్నా వాటిని పరిశోధించడానికి మనకున్న శక్తి చాలదు. ఆత్మని తెలుసుకోవడం చాలా కష్టం.. మేరూ ఈ నిజం మేరు తెలుసుకోగలిగాను.” అంది.

***

మేరు ఆఫీసుకి వచ్చేసరికే సుబ్బన్నగారు అతని గురించి ఎదురు చూస్తూ కుర్చీలో ఉన్నారు.

మేరుని చూడగానే “నమస్కారం అండి. పురాతన దేవాలయాలకి సంబంధించినవి ఇంకా కొన్ని వివరాలు తీసుకొచ్చాను. అవన్నీ జిల్లాలకి సంబంధించినవి. వాటి గురించిన మాన్యుస్క్రిప్టు అంతా సిద్ధంగా వుంది. మనం కృష్ణశాస్త్రిగారిని ఎప్పుడు కలుద్దాం!?” అని అడిగారు.

“అతను ఎప్పుడు ఖాళీగా ఉంటారో ఇంకా కనుక్కోలేదు. కాని మీ గురించి మీ యొక్క ప్రాజెక్టు గురించి చెప్పాను. అతను తప్పకుండా సహాయం చేస్తారు. వేడిగా కాఫీ తాగుదామా?” అన్నాడు మేరు సుబ్బన్నగారితో.

“వద్దు. ఈ రోజు నేను ఉపవాసం.”

“నాగపంచమి నిన్న కదండీ”

“మొన్న చవితి, రేపు షష్టి ఇంకా రాబోయే రోజులన్నీ కూడా పవిత్రమైనవే” అన్నారు సుబ్బన్నగారు.

ఆయన స్పందనని గమనించి హేతుబద్ధంగా చూడాలనుకున్నాడు మేరు.

“సుబ్బన్నగారూ, పాములని పూజించడం మూఢనమ్మకం అంటారా? మనం అందరం పాముకి పాలుపోస్తాము. కాని జర్నలిస్టులు పాములు పాలు తాగవని నిరూపించారు. వాటికి వినబఢదని కూడా అంటారు. అవి సంగీతానికి అణుగుణంగా ఆడతాయన్నది కట్టుకథ అంటారు కదా?”

“మన హిందూ పురాణాలలో ప్రతిదానికి దాని స్థానం దానికుంది. విశ్వాసం ఉంటే అవి పవిత్రమైనవిగా అనిపిస్తాయి. లేదంటే ఒక మూఢనమ్మకం మాత్రమే”.

“అసలు ఈ మార్మిక వాదానికి ఆధారం ఏమిటి?”

“మన ఆలోచన విధానం. మన ప్రాచీన సంస్కృతిని అర్థం చేసుకోవడాని సైన్సు గీటురాయి కాదు. ఇదీ పురాణమంటే నా దృష్టిలో.”

“సార్, మీరు వైదిక జ్యోతిష్యంలో నిపుణులని చంద్ర చెప్పాడొకసారి. నాడీ జ్యోతిష్యంతో పోలిస్తే ఇది ఎంత వరకు ఆధారపడదగినది?” అడిగాడు మేరు.

“అసలు పూర్వజన్మ వివరాలు తెలుసుకోవడానికి జ్యోతిష్యం అవసరం లేదు. మీ ఉదాహరణే తీసుకుందాం. మంచి సంప్రదాయ కుటుంబంలో జన్మించారు. ఆరోగ్యం, ఐశ్వర్యం అన్నీ సమపాళ్ళలో వున్నాయి. ఇవి పూర్వజన్మలో మీరు చేసిన మంచి కర్మలను సూచిస్తాయి. మీ పూర్వజన్మ సంస్కారం వల్లనే చాలామంది కన్నా ఉన్నత స్థితిలో ఉన్నారు” చెప్పారు సుబ్బన్నగారు.

సుబ్బన్నగారి మాటలు విన్నాక ఇంకా ఏం మాట్లాడాలో అర్థం కాలేదు మేరుకి. మౌనంగా వుండిపోయాడు.

“ఇలాంటి వన్నీ అర్థం చేసుకోవాలంటే ఎన్నో తత్వశాస్త్ర గ్రంథాలు చదవాలి, వాటిని అన్వయించాలి. అయితే కర్మ గురించి తెలుసుకోవడం ఉపయుక్తం. జీవితంలో సంభవించే జయాపజయాలను సమాన దృష్టితో స్వీకరించాలి. వినడానికి, చెప్పడానికి తేలికగానే ఉంటుంది, కానీ ఆచరణలో కాస్త కష్టం. అయితే అదే విధి. కర్మని అనుభవించాల్సి ఉంటే, ఈ జన్మలో కాకపోయినా, మరు జన్మలోనైనా అనుభవించక తప్పదు.”

మేరు చిన్నగా నవ్వాడు.

కొన్ని ఫోటోలు తీసి మేరు టేబుల్ మీద పెట్టి “ఇంక భయలుదేరుతాను. మళ్ళీ కలుద్దాం” అంటూ సుబ్బన్న గారు మేరు ఆఫీసునుంచి బయటకు నడిచారు.

మేరు కుర్చీలో రిలాక్స్‌డ్‌గా వెనక్కి వాలి సుబ్బన్నగారికి తనకి మధ్య జరిగిన సంవాదాన్ని విశ్లేషించసాగాడు.

అధ్యాయం 21

“నీకేమైంది జి.వి? ఇన్నాళ్ళు ఎక్కడున్నావు? దీనిలో నీవెలా ఇరుక్కున్నావు?” చంద్రం జి.వి. పక్కన కూర్చుని చాలా ఆందోళనగా అడుగుతున్నాడు.

జి.వి. బెయిలు మీద విడుదలయ్యాడు. ఫురావస్తు సామగ్రి స్మగ్లింగ్‍ కేసులో అనుమానితులలో ఒకడిగా పోలీసులు అతన్ని అరెస్టు చేశారు. వారం రోజులు పోలీసుల కస్టడీలో ఉండి వచ్చేసరికి జబ్బుపడినవాడిలా, వేధింపులకు గురైనవాడిలా కనిపిస్తున్నాడు.

మేరు అతనిని నెమ్మదిగా తడుతూ, “నీవు మా గురించి ఎందుకు ఆలోచించలేదు? నీవు సమస్యలలో ఉన్నప్పుడు – మేము నీ స్నేహితులం, శ్రేయోభిలాషులం అని నీకు నమ్మకం కుదరలేదా?” అన్నాడు.

జి.వి. మేరు భుజం మీద తల ఉంచి గొల్లుమన్నాడు. ఆ క్రుంగుబాటు నుంచి అతన్ని దూరం చేయాలనుకున్నారు మేరు, చంద్రం. జి.వి. మౌనంగా రోదిస్తూ, వెక్కిళ్ళు పెడుతూ, బాధని దిగమింగుకునే ప్రయత్నం చేశాడు. కాసేపటి తరువాత, టోనీ లెపంటోని, అతని మిత్రులని, కేతకిని ఎలా కలిసాడో వివరించాడు.

“టోనీ లెపెంటోని కలవడం నా జీవితంలో ఒక పెద్ద మలువు. అతని ఉద్దేశాలని నేనెప్పుడూ అనుమానించలేదు. అతడు మర్యాదస్తుడు, నికార్సైన పెద్దమనిషనే భావించాను. అతను తన రంగంలో నిష్ణాతుడు. ఈజిప్టు గురించి, గ్రీస్ గురించి నాకు చాలా విశేషాలు చెప్పాడు. పురావస్తు సామాగ్రి గురించి నాతో మాట్లాడింది అతనే. అప్పటి దాకా నాకు అంతర్జాతీయ మార్కెట్‍లో వాటి విలువ, గిరాకీ గురించి తెలియదు. తన దగ్గర ఉన్న ఓ పురాతన కళాఖండాన్ని – ‘టోటెమ్‌’ని – నాకు ఇచ్చాడు. అది నకిలీదని చెప్పాడు. కానీ అది అసలైనదో, నకిలీదో నేను గుర్తించలేకపోయాను” చెప్పాడు జి.వి.

“కానీ, ఈ కంభకోణంలో నువ్వెలా ఇరుక్కున్నావు?” అడిగాడు చంద్రం.

“త్రవ్వకాల సైట్ నుంచి కొన్ని కళాఖండాలను దొంగిలించడం నేను చూశాను. ఒక సాయంత్రం వెంకడు కొన్ని కళాకృతులను అతడి గదిలోనికి తీసుకెళుతున్నాడు. నేను టోనీని నిలదీయగా. ప్రాచీక కళాకృతుల పట్ల తన ఆసక్తిని తెలిపి, తన ప్రమేయాన్ని అంగీకరించాడు. నాకు కొంత డబ్బిచ్చాడు. అందులో తప్పు లేదని, కొన్ని వస్తువులు కనబడకపోయినా ఎవ్వరూ పట్టించుకోరని అన్నాడు.”

“అది పెద్ద ముఠా అన్న సంగతి నీకెలా తెలిసింది?”

“కేతకి నా జీవితంలోకి ప్రవేశించినప్పడు.”

 “కేతకియా..” మేరు ఒక్కసారిగా అప్రమత్తమయ్యాడు.

“మేరూ, నీకు గుర్తుందా, శ్రీశైలం సైట్‍లో త్రవ్వకాలు జరిపిన తొలిరోజుల్లో ఆమెను మనందరం కలిశాము. చారీగారితో పాటు, ఆమె ఓ బృందంలోని సభ్యురాలిగా వచ్చింది.”

“నాకు గుర్తుంది. ఆమె హిహెచ్.డి చేస్తున్నాని చెప్పింది, చాలా ప్రజ్ఞావంతురాలు..” అన్నాడు మేరు. హంపీలో తాను ఆమెను కలిసిన విషయం చెప్పాలో వద్దో నిర్ణయించుకోలేకపోయాడు మేరు. అయినా కేతకి ద్వారా ఈ విషయం జి.వి.కి తెలిసే ఉంటుంది కదా అనుకున్నాడు.

“మీరు పెళ్లి చేసుకున్నారా?” అడిగాడు చంద్రం.

“మేము చేసుకున్నాము. కానీ సాంప్రదాయబద్ధంగా కాదు. మేము భార్యాభర్తల లాగ కలసి ఉన్నాం. అది గాంధర్వ వివాహమని ఆమె నాతో అంది”.

జి.వి. చెప్పటం కొనసాగించాడు – “కేతకి టోనీతో కలిసి ఒకటి రెండు సార్లు వచ్చింది. అప్పుడే ఆమె నా పట్ల ఆసక్తి కనబరిచింది. నా గది లోకి వచ్చి మనం సేకరించిన కళాకృతులు చూసింది. నేను వాటికి నెంబర్లు వేసి, ఒక ఫైలు తయారు చేసి హైదరాబాదు పంపడంలో నిమగ్నుడై ఉన్నాను. ఆమె ఓ మోహిని.. విపరీత మానసిక ప్రవర్తన గలది. ఎప్పుడూ గతంలోనే జీవిస్తుంది.”

“తాను పూర్వ జన్మలో ఆస్థాన నర్తకినని నీకు చెప్పిందా?” అడిగాడు మేరు ఊపిరి బిగపడుతూ.

“చెప్పింది” అని మేరుతో అన్నాడు జి.వి. కానీ ఆ విషయం నీకెలా తెలిసని మేరుని అడగలేదు.

“అవును మేరూ, ఆమెతో కలిసి ఉండడం వల్ల నా జీవితం నరకంగా మారింది. జీవితంలో ప్రతీదీ ఆమెకి వ్యసనం లాంటిదే.. అవి పిహెచ్.డి అయినా, పాములైనా, పురాణ గాథలైనా! మేము రతి జరిపినప్పుడు కూడా, నేను ఆలసిపోయేవాడిని. తృప్తి ఉండేది కాదు. ఆమెకు అనంతమైన కామ వాంఛ ఉండేది” చెప్పటం ఆపి, నాలుగు గ్లాసుల నీళ్లు తాగి, కొంతసేపు సేదదీరాడు జి.వి.

ఇదంతా విని మేరు నిరాశ చెందాడు. అతని దృష్టిలో కేతకి ఓ దేవదూత, సౌందర్యవతి, స్వాప్నికురాలు. కేతకి గురించి మరింతగా తెలుసుకోవడానికి మేరు జి.వి.ని అతడు ఇంకా ఎన్నెన్నో ప్రశ్నలు వేశాడు. ఆమె అసాధారణమైనదని. నిద్రలో నడుస్తుందనీ, ఆత్మలతో మాట్లాడుతుందనీ, గత జన్మలోని ప్రియుడి కోసం నిరంతరం అన్వేషించేదని చెప్పాడు జి.వి.

“టోనీ బృందం వ్యవహారంలో ఆమె పాత్ర కూడా ఉందని నువ్వు అనుమానిస్తున్నావా?” అడిగాడు చంద్రం.

“ఖచ్చితంగా. ఆ కళాకృతులు సంపాదించడంలో ఆమే వారికి సాయం చేసి ఉంటుంది. ఎందుకంటే, నా గదిలోకి వచ్చే అవకాశం ఆమెకి మాత్రమే ఉంది.”

“కేతకి ఇప్పుడు ఎక్కడ ఉంది?” అడిగాడు మేరు సంశయంగా.

“నాకు తెలియదు. ఆమె మాయమైంది. ఒక రోజు నేను మేలుకొని చూస్తే ఆమె పక్క మీద లేదు. నేను ఆమె గురించి వెతకలేదు. అలా చాలా సార్లు జరిగింది. అయితే కొన్ని రోజుల తరువాత తనంతట తానే తిరిగి వచ్చేది. నేను ఎక్కడికెళ్ళావని అడిగితే తాను, ‘ప్రాచీన అన్వేషణ’ సాగిస్తున్నానని చెప్పేది. అదేమిటో దేవుడికే తెలియాలి. కానీ ఈసారి మటుకు ఆమె తిరిగి రాలేదు.” చెప్పాడు జి.వి.

“ఆమె జీవించి ఉందని నువ్వు భావిస్తున్నవా?”

“మరణిస్తే మంచిదే. అటువంటి వారు ఎప్పటికీ సంతోషంగా ఉండలేరు. వేరొకరికి నరకం చూపిస్తారు” జివి గొంతు కర్కశంగా ఉంది.

“ఒక వేళ ఆ స్మగ్గరకు ఆమె సహాయపడుతూ ఉంటే, వారు ఆమెను మట్టుపెట్టి ఉండచ్చు.”

“అయ్యుండచ్చు. ఇదంతా ముగిసినందుకు నాకు సంతోషంగా ఉంది. నన్ను రక్షించినందుకు – చంద్రం, మేరు, మీకు అనేక కృతజ్ఞతలు. ఈ చట్టపరమైన చిక్కుముడి నుంచి త్వరలో బయటపడగలనని నా నమ్మకం” అన్నాడు జి.వి.

***

“ఇప్పుడు అన్ని కళాకృతులు – చట్టపరంగా, అధికారికంగా మన అధీనంలో ఉన్నాయి. మ్యూజియం కోసం మనం ఒక బ్లూప్రింట్ తయారు చేయాల్సి ఉంది” సమావేశంలో చెప్పారు చారీగారు.

“కానీ, అవి చాలా ఉన్నాయి సార్.”

“ఫరవాలేదు. మనకి ఆంధ్ర రాష్ట్రంలో 48 త్రవ్వకపు స్థలాలు ఉన్నాయి. త్రవ్వకాలలో సేకరించిన అన్ని కళాకృతులని మనం ఒక చోట సమీకరిద్దాం. నాగార్జున కొండ లాగా, ఓ పర్యాటక స్థలాన్ని ఏర్పాటు చేయాలని భావిస్తున్నాను. శ్రీశైలాన్ని సందర్శించే యాత్రికులు దీనిని కూడా చూడ్డానికి వస్తారు.”

“ఇందుకు తగినట్లుగా ప్లాన్ రూపొందించమని మన ఇంజనీర్లకు చెబ్దాం. పర్యాటకులు పడవల మీద ఈ ప్రాంతాన్ని సందర్శిస్తారు, తమ పర్యటనను వారికి ఎప్పటికీ గుర్తుండిపోవాలి.”

“మంచి ఉత్సాహపూరితమైన ఆలోచన” అన్నాడు మేరు. “ఇప్పుడే పని ప్రారంభిద్దాం. రాష్ట్ర ప్రభుత్వంతో చేయవలసి ఉన్న పని చాలా ఉంది. దీనికి టెండర్లను పిలవడంతో పాటు మరెన్నో సమకూర్చుకోవాలి” అన్నాడు.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here