కాంచన శిఖరం-12

0
16

[డా. భార్గవీ రావు రచించిన ‘Merukanchana’ అనే నవలని అనువదించి అందిస్తున్నారు శ్రీమతి రేణుక అయోల.]

[నాగపంచమి రోజు పుట్టలో పాలు పోయడానికి శిల్ప ఉదయాన్నే నిద్రలేచి గుడికి వెళ్ళడానికి సిద్ధమవుతుంది. సూర్య కూడా అమ్మతో పాటు వెళ్ళడానికి తయారవుతాడు. పూజాసామగ్రితో గుడికి బయల్దేరుతున్న శిల్పని చూసి మేరు ఆశ్చర్యపోతాడు. నమ్మలేకపోతున్నాను అంటాడు. వివరాలు గుడికి వెళ్ళొచ్చాకా చెప్తానంటుంది. పాముని పూజించటంలోని ఆంతర్యాన్ని, భారతీయ పురాణాల్లో పాము స్థానాన్ని గుర్తుచేసుకుంటాడు మేరు. గుడి నుంచి వచ్చకా, తనలో మార్పుకి కారణమైన సంఘటనని మేరుకి చెబుతుంది శిల్ప. అద్భుతాల మీద, దైవనిర్ణయాల మీద నువ్వెప్పటి నుంచి నమ్మకం పెట్టుకున్నావ్ అని మేరు అడిగితే, సూర్య పుట్టాక అంటుంది. అలాంటి కొడుకు పుట్టడం తన అదృష్టమని, వాడితో తనది జన్మజన్మల బంధమని అంటుంది.  తరువాత తనకి తరచూ కలలో వస్తున్న పాముల గురించి, వాటి నృత్యం గురించి చెబుతుంది శిల్ప. ఇప్పటికి మేరు మానసిక సంఘర్షణ తనకి అర్థమైందనీ, మనకి తెలియని ఏదో ఒక అతీత శక్తి ఉందని అంటుంది. మరునాడు తనని ఆఫీసులో కలిసిన సుబ్బన్నగారితో పూర్వజన్మ గురించి, పాములను పూజించటం గురించి చర్చిస్తాడు మేరు. పూర్వజన్మ వివరాలు తెలుసుకోవడానికి జ్యోతిష్యం అవసరం లేదని, ఈ జన్మలో మంచి కుటుంబం, చక్కని ఆరోగ్యం, ఐశ్వర్యం సమపాళ్ళల్లో ఉంటే పూర్వజన్మలో మంచి కర్మలు చేసినట్టే అని సుబ్బన్న అంటారు. ఆయన వెళ్ళాకా ఆలోచనలో పడతాడు మేరు. ప్రాచీన విగ్రహాల స్మగ్లింగ్ కేసులో అనుమానితుడిగా ఉన్న జి.వి.ని పోలీసుకు అరెస్టు చేస్తారు. అతను బెయిల్ మీద బయటకి వచ్చా, చంద్రం, మేరు వెళ్ళి అతన్ని ఓదార్చి అసలు ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేస్తార్రు. టోనీ లెపెంటో, అతని మిత్రులు, కేతకి తనని ఎలా మోసం చేశారో వివరిస్తాడు జి.వి. విగ్రహాల చోరీలో తనని ప్రలోభపెట్టింది టోనీ అనీ, కేతకి తనని గాంధర్వ పద్ధతిలో పెళ్ళి చేసుకుని, విగ్రహాల ముఠాకి సహకరించిందని చెప్తాడు. కేతకి గురించి చెప్తూ ఆమె విపరీత మానసిక ప్రవర్తన గురించి చెప్తాడు జి.వి. తాను పూర్వ జన్మలో ఆస్థాన నర్తకినని నీకు చెప్పిందా అని మేరు అడుగుతాడు. అవునంటాడు జి.వి. ఆమె గురించి మరిన్ని ప్రశ్నలు అదుగుతాడు మేరు. ఆమె అసాధారణమైనదని. నిద్రలో నడుస్తుందనీ, ఆత్మలతో మాట్లాడుతుందనీ, గత జన్మలోని ప్రియుడి కోసం అన్వేషణ సాగిస్తోందని చెప్తాడు. ఆమె ఇప్పుడెక్కడ ఉందో, అసలు బ్రతికుందో లేదా తెలుసా అంటే తెలియదని చెప్పి; ఆమె చనిపోయినా తాను పట్టించుకోనని అంటాడు జి.వి. ఈ కేసు నుంచి తాను త్వరగా బయటపడగలని ఆశిస్తాడు జివి. పురావస్తు శాఖకు పలు స్థలాలలో దొరికిన అన్ని కళాకృతులను  ఒక చోట చేర్చి శ్రీశైలం సమీపంలో ఒక మ్యూజియం ఏర్పాటు చేయాలని ప్రతిపాదిస్తారు చారీగారు. పర్యాటకులు పడవల మీద ఈ ప్రాంతాన్ని సందర్శిస్తారనీ, తమ పర్యటనను వారికి ఎప్పటికీ గుర్తుండిపోయేలా చేయాలని ఆయన చెప్తారు. మేరు అందుకు సన్నాహాలు మొదలుపెడతాడు. – ఇక చదవండి.]

అధ్యాయం 22

[dropcap]మొ[/dropcap]దట గ్రామం వెలసిందా, లేక దేవుని గుడి వెలసిందా చెప్పడం కష్టం. అయితే గ్రామం పేరు, దేవాలయం పేరూ, నాగశివయే నేడు.

స్థల పురాణం ప్రకారం, కొంత మంది ప్రజలు అనావృష్టి మూలంగా తమ గ్రామాన్నీ, వ్యవసాయాన్ని వదులుకొని వలసకి బయలుదేరారు. కొంత దూరం నడిచిన తరువాత ఒక పెద్ద రావి చెట్టు కింద సేద తీరారు. అయితే విచిత్రంగా వేప చెట్టు, రావి చెట్టు ఒక దానికి ఒక పెనవేనుకోని ఉన్నాయి. వారంతా ఆశ్చర్యంగా ఆ చెట్టు వైపు చూశారు.

“ఈ చెట్టు కొమ్మలు చూడండి. చాలా ఎర్రని రెమ్మలు అంతటా వేలాడుతున్నాయి”

“వాటిని ముట్టుకోకండి. అవి ఏమిటో దేవుడికే ఎరుక. ప్రమాదకరం కావచ్చు.”

“ఆహా. అవి కోరికలు తీర్చే చిహ్నాలు. రావి చెట్టు, వేపచెట్టు కలిస్తే శుభసూచకంగా భావిస్తారు.”

“చాలామంది, తమ కోర్కె తెలిపి, చిహ్నాలని పసుపు కుంకుమతో కలిపి గుడ్డలో ముడుపు కడితే, భగవంతుడు తమ కోర్కెలు తీరుస్తాడని నమ్ముతారు. వారి కోర్కెలు నెరవేరిన తరువాత వారు వచ్చి తాము కట్టిన మూటను విప్పి, భగవంతునికి తమ కృతజ్ఞాభినందనలు తెలుపుతారు” అన్నాడు ఆ బృందం లోని ఒక పెద్ద మనిషి.

“అయితే ఇక్కడ దేవాలయం లేదేం?” అన్నాడింకో వ్యకి.

“ఒకప్పుడు ఉండేదేమో. నదిలో మునిగిపోయిందేమో. కృష్ణవేణి నది ఇక్కడ దగ్గర లోనే ప్రవహిస్తూంది” అన్నాడు మరొక వ్యక్తి.

“లేక భగవంతుడు కూడా వేరొక సస్యశ్యామల ప్రాంతానికి మనలాగే వలస వెళ్ళాడేమో” అన్నాడు మరొక వ్యక్తి వ్యంగ్యంగా.

ఆడవారు రాత్రివేళ అప్పటికప్పుడు తయారు చేసిన పొయ్యి మీద వంటకి ఉపక్రమించారు. కొన్ని కట్టెపుల్లలు ఏరి మంట పెట్టారు.

లింగన్న నీళ్ల కోసం కొన్ని అడుగులు నడిచేడు. అతడికి కొంత నీరు గల చిత్తడి ప్రాంతం కనిపించింది. అతడు ఉత్సాహంతో, “ఇలా రండి, ఇక్కడ ఏం వుందో చూడండి” అని అందరినీ పిలవసాగాడు.

ప్రతి ఒక్కరూ ఉత్సాహంగా అక్కడికి చేరేరు. వారికి ఆ జలధార, బంగారం కన్నా ఎక్కువ విలువైనదిగా అనిపించింది. వారు చేతులతో అవరోధాలు తొలిగించి, నీటిని ప్రవహించేటట్లు చేసారు. ఆ ధార వెడల్పుగా మారి స్పష్టంగా కన్పించసాగింది. వారందరూ సంతోషంగా గంతులు వేనూ దోసిళ్ళతో నీళ్ళు తాగసాగారు. పిల్లలు నీటిలో ఆడుకోసాగారు.

“నీటిని పాడు చేయకండి, దీనిని మనం తాగడనికి, వంటకీ, ఉపయోగించుకోవాలి” ఆడవాళ్లు హెచ్చరించారు.

“మనం ఇక్కడే ఎందుకుండకూడదూ? జలధార కనిపించడం శుభశూచకం.”

ఎండిన నేలలో నివసించే వ్యక్తులు సహజంగా అలాంటి ప్రదేశాన్ని – నివసించడానికి ఎంచుకుంటారు. తరువాత రోజు తమ వ్యవసాయ పనిముట్లతో ఆ నీటికుంటని తవ్వనారంభించారు, సాయింత్రాని కల్లా అది కాలువ రూపం సంతరించుకుంది.

“శ్రీశైలం మల్లన్న మనని ఇక్కడ ఉండమని ఆదేశించాడు. రేపు మనం మన గుడిసెలు వేసుకుందాం” అంది శివమ్మ భావావేశంగా. ఆ సమూహం, అక్కడే ఉండడానికి నిశ్చయించుకుని సమీపం లోని అడవి నుంచి, కావల్సిన సామగ్రిని సేకరించారు. వర్షాకాలం సమీపిస్తూ ఉండడంతో, వారు, భూమిని దున్నడానికి నిశ్చయించుకున్నారు.

కొంతకాలం తరువాత, ఓ రోజు, భూమన్న, సెలయేట్లో స్నానం చేస్తుండగా, అతని వేలికి ఒక రాయి తగిలింది. ఎంత ప్రయాసతో, దానిని పైకి లేపేడు. అది ఒక శివలింగం. అది నల్లగా, నునుపుగా, పొడవుగా ఉంది. ఆ గుంపంతా ఆ ప్రదేశానికి చేరుకున్నారు శివలింగాన్ని చూడ్డానికి. భూమన్న తనకు దొరికిన అమూల్యమైన వస్తువుని తీసుకొని వస్తూంటే “శంభో హర హర మహాదేవ” అని స్తుతించడం ప్రారంభించేరు. ఆ నాదానికి చుట్టుప్రక్కల ప్రాంతాలన్ని ప్రతిధ్వనించాయి.

వారందరూ ఏకాభిప్రాయంతో రెండు చెట్ల కింద ఒక రాతి పలక మీద ఆ లింగాన్ని ఉంచారు. అ తరువాత ఏం చేయాలో తెలుసుకునేందుకు భూమన్న, అతని స్నేహితులు – పురోహితుడుని తీసుకు రావడానికి శ్రీశైలం కాలినడకన బయలుదేరారు. ఎర్రన్న శివలింగాన్ని మధ్య లోనికి జరపడానికి ప్రయత్నించాడు. అయితే అది ఒక్క అంగుళం కూడా కదలలేదు.

“మనందరం ఈ లింగాన్ని ఇక్కడి కెలా తేగలలిగాం?” అంటూ మరింత మంది ఆ లింగాన్ని కదపడానికి ప్రయత్నించారు. కానీ వారందరు, ఎంతా ప్రయత్నించినా శివలింగాన్ని ఒక్క అంగుళం కూడా కదపలేకపోయారు. వారంతా ఆశ్చర్యపోయి, భక్తి శ్రద్ధలతో “శంభో హర హర మహాదేవ” అని స్తుతించడం ప్రారంభించారు.

కాసేపటికి ఆ ప్రాంతమంతా పండగ వాతావరణం నెలకొంది. కొంతమంది ఆ ప్రాంతాన్ని శుభ్రంగా ఊడ్చి, పేడతో అలకటం ప్రారంభించారు. రకరకాల ముగ్గులతో ఆ ప్రాంతాన్ని అలంకరించారు. పచ్చని ఆకులు, అడవి పువ్వులు గుత్తులు గుత్తులుగా కట్టి అలంకరించారు. ఒక స్త్రీ నూనెతో కూడిన ప్రమిదెని తెచ్చి దీపం వెలిగించింది.

ఒక యువకుడు అగరత్తులతో పరుగెత్తుకు వచ్చాడు. ఎంతోమంది కొబ్బరికాయలు కొట్టారు ఉత్సాహంగా. వారంతా ఎంతో ఉత్తేజితులై ఉన్నారు. ఆ రాత్రి ఎవ్వరూ నిద్రపోలేదు. వారంతా శ్రీశైలం వెళ్ళిన వారి గురించి ఎదురుచూస్తున్నారు.

తెల్లవారుతుండగా మల్లమ్మ పెట్టిన గట్టి కేకకి చాలా మంది ఉలిక్కిపడ్డారు.

“పాము, పాము” అంటూ, ఆమె లింగం వైపు చూపెట్టసాగింది. పడగ విప్పిన పాము శివలింగాన్ని చుట్టుకొని ఉంది.

కొంతమంది స్పష్టంగా ఆ పాముని చూడడానికి సమీపంగా వెళ్ళారు.

అది సర్పమే కానీ, నిజం సర్పం కాదు. రాతి సర్పం, ఇదెలా సాధ్యం, ఇది నిన్న లేదే? నిన్న ఇక్కడ లింగం మాత్రమే ఉంది. పాము ఎక్కడ నుంచి వచ్చింది. అది కూడా నిజమైనది కాదు. అది ఎవరో శివలింగానికి తగ్గటుగా చెక్కినట్లు ఉంది.

వారంతా, ఆశ్చర్యంతో నిలుచోగా, శ్రీశైలానికి వెళ్ళిన వ్యక్తులు తిరిగి వచ్చారు. వారు తమతో బాటు పురోహితుని కూడా వెంట తెచ్చారు. ఆయన ఆ ప్రాంతాన్ని పరిశీలించి, శివలింగం వైపు చూశారు.

“చూడండి స్వామి, పాము, నాగుపాము లింగంపై పడగ విప్పింది” అని చూపించింది మల్లమ్మ.

పురోహితుడు, శివలింగానికి సాసాంగ నమస్కారం చేశారు. “స్వామీ నాగశివా, నీవు ఈ ప్రాంతాన్ని, నీ సన్నిధిగా ఎంచుకొన్నావా? నీ కరుణా కటాక్షాలు పొందిన ఈ ప్రజలు థన్యులు” అంటూ శివుని స్తుతిస్తూ గీతాలాపన చేయసాగాడు. అందరూ ఆయనతో గొంతు కలిపేరు.

నాగేంద్ర హారాయ త్రిలోచనాయ
భస్మాంగ రాగాయ మహేశ్వరాయ
నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ
తస్మై నకారాయ నమశ్శివాయ

ఆ ప్రాంతమంతా ‘ఓం నమశ్శివాయ‘ అంటూ దైవస్మరణతో మారుమ్రోగింది.

నాగశివ మహిమ నాలుగు వైపుల ప్రసరించడానికి ఎక్కువ కాలం పట్టలేదు. శ్రీశైలం వచ్చిన యాత్రికులు, నాగశివ దేవాలయనికి రావడం మొదలుపెట్టారు.

దేవాలయం ఆవరణలో, వేప, రావి చెట్లు, గర్వంగా నిలుచున్నాయి. కోరికలు తీర్చే చిహ్నాలు గాలిలోకి ఎగురుతున్నాయి. కొంతమంది ధర్మకర్తలు చిన్న ఆలయాన్ని నిర్మించారు. నాగశివ లింగం మీద చిన్ని గోపురం నిర్మించారు. ఆలయం చుట్లూ ఓ మట్టి గోడ నిర్మించబడింది. తెల్లని నారింజ రంగు చారికలు గోడకు, సాంప్రదాయకమైన వన్నె తెచ్చిపెట్టాయి.

(ముగింపు త్వరలో)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here