కాంచన శిఖరం-6

0
12

[డా. భార్గవీ రావు రచించిన ‘Merukanchana’ అనే నవలని అనువదించి అందిస్తున్నారు శ్రీమతి రేణుక అయోల.]

[తాను ఆఫీసు పని మీద హంపి వెడుతున్నాననీ, తనతో వస్తావా అని భార్య శిల్పని అడుగుతాడు మేరు. బ్యాంకులో ఆడిటింగ్ అవుతోందని, తనకు కుదరదని అంటుంది. అయినా ఆ పాడుపడ్డ శిధిలాలలో ఏముంటుంది చూడడానికి అని అంటుంది. ఇష్టంగా చూస్తే అందులోని సొగసు తెలుస్తుందనీ, చరిత్ర అర్థం అవుతుందని, మన భవిష్యత్తుకు పునాది అవుతుందని అంటాడు మేరు. కానీ ఇప్పుడు రాలేననీ, మరోసారి చూద్దామని అంటుంది మేరు. అసంత్పృప్తి కలుగుతుంది మేరుకి. తను ఎప్పుడు ఆ శిల్ప సుందరి గురించి చెప్పినా, పెద్దగా ఆసక్తి చూపించదని అనుకుంటాడు. హంపి ప్రయాణం డా. టోనీ లొపెంటో కోసమే ఏర్పాటు చేస్తారు. మేరుకి టోనీ అంటే ఇష్టం కలిగింది. అతని విజ్ఞానం పట్ల గౌరవం కలిగింది. రమణ, టోనీ, మేరు ఒక జీపులో హంపి బయల్దేరుతారు. మార్గమధ్యంలో తుంగభద్ర డ్యామ్, కన్నడ విశ్వవిద్యాలయం భవనాలు చూస్తారు. ఆ యూనివర్శీటీ గురించి వివరాలు అడుగుతాడు టోనీ. రమణ వివరిస్తాడు. భారతదేశంలోని సాంస్కృతిక వైవిధ్యాన్ని టోనీ ప్రశంసిస్తాడు. రాత్రికి హంపి చేరి గవర్నమెంట్ గెస్టు హౌస్‍లో విశ్రాంతి తీసుకుంటారు. మర్నాడు ఉదయమే టోనీ తుంగభద్ర నది వద్దకు వెళ్ళి వస్తాడు. అప్పటికే అక్కడ చాలామంది స్నానాలు చేస్తున్నారని మేరుతో చెప్తాడు. ఆ ప్రదేశం చక్రతీర్థ అనీ, ఆ రోజు కార్తీక పౌర్ణమి అనీ, నదీ స్నానం చేయడం శుభప్రదమని వివరిస్తాడు మేరు. తరువాత విరూపాక్ష ఆలయం, గణపతి విగ్రహాలు, యంత్రోద్ధారక ఆంజనేయస్వామి ఆలయం సందర్శిస్తారు. కొన్ని శిలలను అధ్యయనం చేయాలని రమణ వెళ్ళిపోతాడు. టోని, మేరు ఇద్దరు నడుస్తూంటే, విజయనగర సామ్రాజ్యం గురించి ఎన్నో వివరాలు టోనీకి చెప్తాడు మేరు. తాను కొన్ని పురాతన వస్తువులు కొనాలని అనుకుంటున్నట్లు చెప్తాడు టోనీ. హైదరాబాదులో తన మిత్రుడు జి.వి. సాయం చేయగలడని అంటాడు మేరు. ఆ రాత్రి రమణ, టోనీ లాంజ్‍లో కూర్చుని కబుర్లు చెప్పుకుంటుంటే, మేరు ఓ కవితా సంకలనం తెరిచి చదువుకుంటాడు. నిద్ర రాక, నది ఒడ్డుకు వస్తాడు. అక్కడి అందమైన వాతావరణంలో కాసేపు తిరుగాడి, లోపలికి వెళ్లిపోదామని అనుకుంటాడు. ఇంతలో ఏదో ఒక ఆకారం తన వైపు వస్తున్నట్లు కనిపిస్తుంది. దెయ్యమో, భ్రమో అనుకుంటాడు. దగ్గరికొచ్చేసరికి ఆ ఆకారం ఒక స్త్రీ అని అర్థమవుతుంది. ఆమె మేరూ అని పిలిచి, తాను కేతకిననీ, శ్రీశైలంలో కలిసాం కదా అని గుర్తు చేస్తుంది. ఇంత రాత్రివేళలో ఇక్కడికెలా వచ్చావని అడిగితే, తన భర్తతో వచ్చానని, అదే గెస్ట్ హౌస్‍లో ఉంటున్నామని చెబుతుందామె. – ఇక చదవండి.]

అధ్యాయం 10

[dropcap]“కా[/dropcap]సేపు ఇక్కడ కూర్చుందామా?” తేనెపూసిన పలుకులు వెదజల్లే కేతకి మధురమైన స్వరం సైరన్ కూత లాగా వినిపించింది. ఏదో మాయలో ఉన్నట్లుగా ఆమెను అనుసరించాడు మేరు. వారు నదికి చాలా దగ్గరగా ఒకరికొకరు ఎదురుగా కూర్చున్నారు. హాయిగా వీస్తున్న చల్లని గాలి – నది లోని చిరు అలల సంగీతాన్ని మోసుకొస్తోంది. సుదూరంగా పర్వతాలు, వెండి వెన్నెలని కురిపించే పున్నమి చందమామ – స్వప్నం లాంటి వాతావరణాన్ని అక్కడ సృష్టించాయి.

మేరు కేతకి వైపు చూశాడు. ఆమె సాదాసీదాగా ఉండి, ఆకట్టుకోలేకపోయింది. ఆమె నలుపు రంగు, సన్నని శరీరం – లేత గోధుమరంగు షిఫాన్ చీరలో స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆమె ధరించిన ఎరుపు రంగు ఆమె ఎద సంపదని దాచలేకపోతోంది. చిన్న ముక్కు, సన్నని పెదవులు. ఆమె గుండ్రని ముఖంలో కళ్ళు పెద్దవిగా కనిపిస్తున్నాయి. ఆమె విశాలమైన నల్లని కళ్ళు మకరందంతో నిండిన రెండు పెద్ద పాత్రలలాగా, కనుగుడ్లు వాటిలో తేలియాడే నల్లని పండ్లవలె.. అబ్బురపరిచే విధంగా కనిపించాయి. మేరు కేతకి వైపు చూస్తూ ఉండగా, ఆమె దివ్యమైన శోభతో లేడి కన్నుల సుందరిలా కనిపించింది.

“ఎందుకు నన్ను అలా చూస్తున్నారు?” కేతకి అడిగిన ప్రశ్నతో – తోటి మనిషితో మాట్లాడుతున్నట్లు నమ్మకం కలిగింది మేరుకి.

“మీరు పని చేస్తున్న శ్రీశైలం సైట్‌లో తాజా సమాచారం ఏమిటి?” అని అడిగింది.

మేరు తన ఆలోచనలను సంబాళించుకుని, అక్కడి పురోగతి గురించి, కళాఖండాల గురించి – ప్రాచీన శాసనాన్ని చదవడం కోసం హంపి రావడం గురించి ఆమెకి చెప్పాడు.

“కేతకీ, మీరు రీసెర్చ్ చేస్తున్నారు కదా. పూర్తయిందా?” అడిగాడు.

“సగం అయింది. కానీ నా రీసెర్చ్ సూపర్‌వైజర్‌కీ, నాకూ చాలా విషయాలలో పొత్తు కుదరడం లేదు.”

“మీ థీసిస్ ఏమిటి?”

“నేను ఎంపిక చేసిన అధ్యయనం ద్వారా పురాణాలని, పురావస్తు శాస్త్రాన్ని అనుసంధానించాలని అనుకుంటున్నాను. కళాఖండాల ఆధారంగా పురాణ గాథలను పునర్నిర్మించడానికి నేను శ్రీశైలానికి వచ్చాను.”

మేరు తన ‘శిల్ప’ గురించి, శిల్ప శిరస్సు గురించి చెప్పాలని తహతహలాడాడు.

“మీరు భారతీయ పురాణాలపై పని చేస్తున్నారా?” అడిగాడు.

కేతకి రెండు నిమిషాలు మౌనంగా ఉంది.

“మేరు, పురాణాలకు హద్దులు లేవు. వాటి విశ్వజనీనత్వమే నన్ను ఈ అధ్యయనాన్ని పురికొల్పింది.. నేను దీనిలో ఎంతగానో లీనమైపోయాను. కానీ, ఎక్కడో లంగరు పోగొట్టుకున్నాను.. నాకు తెలియదు.. నేను నా పరిశోధనపై దృష్టి పెట్టలేకపోతున్నాను..”

మేరుని పట్టించుకోకుండా తనలో తానే మాట్లాడుతున్నట్టు మాట్లాడటం కొనసాగించింది.

“నన్ను గతం వెంటాడుతోంది.. కొన్నిసార్లు నేను కేతకిని కాదు, ఏదో రాజాస్థానంలో నర్తకిని అనిపిస్తుంది. నేను నా కలలలో తీవ్రంగా నృత్యం చేస్తుంటాను, ఒళ్ళంతా చెమటలు పట్టి మెలకువ వస్తుంది.. నా పాదాలు ఇప్పటికీ లయబద్ధంగా కదలాడుతున్నాయి.”

మేరు అయోమయంగా చూశాడు.  తన కలల లోని శిల్ప ఈమెనా? మెట్ల బావిలోంచి దొరికిన స్త్రీ తల గురించి ఆమెకు చెప్పాలా వద్దా? అనుకున్నాడు.

“కొన్నిసార్లు, నేను చనిపోయినవారిని రక్షించే సెల్కెట్‌గా రూపాంతరం చెందుతాను. మీకు తెలుసా మేరు, ఆమె ఈజిప్షియన్ దేవత, ఆమె తన తలపై పవిత్రమైన తేలును ధరిస్తుంది, ఆమె రాతి శవపేటిక చుట్టూ తన రెక్కలు చాచుతుంది.”

డా. టోనీ లెపాంటో ఈజిప్ట్ గురించి మాట్లాడినప్పుడు సెల్కెట్ గురించి చెప్పాడు.

“నేను మేరీ లాగా కాకుండా గ్రీకుల ఆరాధ్య దేవత గియా లాగా కన్నెమాతలా (వర్జిన్ మదర్) ఉండాలనుకుంటున్నాను. నేను ఆమెలా విశ్వ మాతగా ఉండాలనుకుంటున్నాను..”

“కొన్నిసార్లు, నన్ను నేను అసురులకు అమృతాన్ని అందిస్తున్న మోహినిలా లేదా ఆఫ్రొడైట్‌లా ఊహించుకుంటాను..”

తన కనుబొమ్మల మీదుగా జారుతున్న చెమటను మేరు చాలాసార్లు తుడుచుకున్నాడు. తన్మయత్వంలో ఉన్నట్టు మాట్లాడిన కేతకిని చూస్తూ ఉండలేకపోయాడు.

మకరందంతో నిండిన ఆమె కళ్ళ నుండి కన్నీరు కారింది. కన్నీటి చుక్కలు చంద్రకాంతిని ప్రతిబింబిస్తూ ఆమె బుగ్గలపై ముత్యాల వలె ప్రకాశించాయి. మేరు ఆమెను తన చేతుల్లోకి తీసుకోవాలని, ఆమె చెంపలను ముద్దాడి కన్నీళ్లను తుడవాలని, ఆమెను ఓదార్చాలని అనుకున్నాడు, కాని ఒక అదృశ్య భయం అతన్ని వెనక్కి లాగింది. మారుమాట్లాడకుండా లేచి గెస్ట్‌హౌస్ వైపు నడవడం ప్రారంభించాడు. వెనుదిరగకుండా హడావిడిగా నడిచాడు.

గెస్ట్‌హౌస్ ప్రధాన ద్వారం వద్దకు చేరుకున్న తర్వాత, మేరు వెనక్కి తిరిగి చూడకుండా ఉండలేకపోయాడు. కేతకి కొన్ని గజాల వెనకాల మెల్లగా నడుస్తోంది. ఇప్పుడు ఆమె నవ్వుతూ ఉంది, ఏడవడం లేదు! ఆమె మెల్లగా నడుస్తుంటే వెనుకగా మేరుకి అందెల సవ్వడి వినిపించింది. అది నిజమా లేక ఊహాజనితమా అని అతనికి తెలియలేదు.

అధ్యాయం 11

మేరు నిద్రపోలేక పోయాడు, కల్పిత శిల్పని తన ఊహలనుండి తొలగించి, తన భార్య శిల్పకు దగ్గర కావాలని కల కంటున్నాడు.. కలలో శిల్ప తమ మొదటి సంతానమైన బాబుకి పాలుపడుతోంది. ఆ దృశ్యం చాలా అపురూపంగా ఉంది. ఆమెకి ఎలాంటి మానసిక ఒత్తిడి కల్పించకూడదు అనుకున్నాడు మేరు. శిల్ప బాలింతరాలు.. బాలింతరాలుగా ఆమె అందం ఇంకా పెరిగింది. ఆమె ఇపుడు తన ప్రియురాలు, ఊహాసుందరిలా కనిపించటం లేదు.. ఒకప్పుడు చిలిపితనం చిందులు వేసిన ఆమె పెదవుల మీద ఇప్పుడు నిండుతనం; మొత్తం మీద ఆమె నిండుగా పారే గోదావరిలా హుందాగా ఉంది.

కేతకిని కలసి వచ్చాక ఇంకా ఆమె జ్ఞాపకాలు వదలటం లేదు.. పదే పదే ఆమె గురించే ఆలోచనలు… అసలు కేతకేనా తన ఊహలలోని ‘శిల్ప’? కాని రూపం వేరు.. ఆత్మ శిల్పదేనా? ఇంకా ఆమెని పూర్వజన్మ స్మృతులు నీడలా వెంటాడుతున్నాయా..?  కానీ కేతకిలో ఏదో తెలియని ఆకర్షణ ఉంది, అదే కేతకి గురించి ఆలోచించేలా చేస్తోంది.

పడుకోవడానికి అయోమయంగా మంచమెక్కాడు మేరు. నిద్ర పట్టీపట్టగానే కలల్లోకి జారుకున్నాడు. కలలో అతను ఏదో చిట్టడివిలో నడుచుకుంటూ వెళుతున్నాడు. అంతా అయోమయంగా ఉంది. ఆ ప్రదేశంలో మృతువు తార్లడుతున్నట్లుగా ఉంది. చాలామంది దుఃఖిస్తున్నట్లుగా సన్నని రోదనలు వినపడుతున్నాయి..  పద్మవ్యూహం లాంటి ఆ దారి అతన్ని భూగర్భంలోకి తీసుకువెళ్ళింది.. అక్కడ ఎన్నో గదులున్నాయి. అక్కడ కలయ తిరుగుతూ, చీకటి నిండిన ప్రతీ గదిలోకి తొంగి చూశాడు. ఉన్నట్టుండి ఆ నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ విషాదవంతమైన ఏడుపు వినిపించింది.. కాని ఏడుస్తున్న వాళ్ళు ఎవరో అతనికి కనిపించలేదు.. అతను వెదుకుతూ మెల్లగా తూర్పు వైపున ఉన్న గదిలోకి తొంగిచూశాడు.. అక్కడో శవం శవయాత్ర కోసం సిద్ధమైనట్లు బట్టలో చుట్టబడి వుంది. ఏడుపులు ఇంకా పెద్దవైయ్యాయి. అయితే అక్కడ ఎవరూ కనిపించలేదు.. కాని ఆ వేదనామయమైన ఏడుపుని మేరు గుర్తించాడు.. అది అచ్చం కేతకి గొంతులా అనిపించింది.. కేతకి ఏడుస్తోంది.

వంటినిండా చెమట్లు పట్టాయి. ఉలిక్కిపడి నిద్రలో నుంచి లేచాడు. తెల తెలవారుతోంది. రాత్రి – ఉదయం ఒడిలోకి జరుకుంటోంది.. పక్షుల కిలకిలారావాలు తానింకా గెస్టుహవుస్ లోనే ఉన్నట్టు మేరుకి గుర్తు చేశాయి.. తనకొచ్చిన కల విచిత్రంగా అనిపించింది.. ఇంక లాభం లేదనుకొని మంచం మీద నుంచి కిందకి దిగి.. వేడి నీళ్ళతో స్నానం చేసి.. వేడి వేడి కాఫీకప్పుతో పేపరు అందుకున్నాడు మేరు.

దీక్షగా పేపరు చదువున్న మేరుని నాలుగవ పేజీలో ఓ మూలన ఉన్న ఓ వార్త ఆకట్టుకుంది. ఇద్దరు స్మగ్లర్లు పురాతన వస్తువులు అమ్ముతూ పట్టుపడ్డారట. ఆ వార్త ఆంధ్రప్రదేశ్ నుంచి కాదు.. వేరే రాష్ట్రం నుంచి. అయినా ఎందుకో మేరుకి ఒక్కసారి శ్రీశైలం వెళ్ళి రావాలనిపించింది.. సేకరించిన కళాఖండాలన్నీ ఆఫీసులో అప్పజెప్పినప్పటికీ అన్ని సరిగ్గా ఉన్నాయోలేవో అని చూసి రావాలనుకొన్నాడు. తాను రహస్యంగా దాచుకొన్న ఆ శిల్పం శిరస్సుని కూడా ఇచ్చేయాలని తలచాడు. నిజమైన శిల్ప భార్య రూపంలో దొరికాకా, ఇంకా ఎందుకు దానిని దాచిపెట్టుకోడం?తనలో తానే ప్రశ్నించుకున్నాడు.. అయినా మనసు సమాధానం పడలేదు.. రూపంలో తన భార్య ‘శిల్ప’ ఆ శిల్ప సుందరిలా ఉన్నా ఏ మాత్రం శృంగార భావనలు వ్యక్తం చేయకుండా నిరాడంబరంగా ఒక సాధారణ స్త్రీలా ఉంటుంది. కేతకి మాత్రం ఉద్రేకపరిచేలా, ఆశగొలిపేలా ఉంటుంది, ఎందుకు?

ఇలా ఆలోచిస్తుంటూ గుర్తుకొచ్చింది – కేతికి ఈ గెస్ట్ హౌస్‌ లోనే తన భర్తతో పాటు ఉంటునట్లు చెప్పింది.. ఇంక ఆలస్యం చెయ్యకుండా పరుగులాంటి నడకతో ఆమె గురించి కనుక్కోవడానికి రిసెప్షన్ వద్దకు వెళ్ళాడు.

కాని అక్కడ ఆ పేరుతో ఎవరూ రిజిస్టర్ చేసుకోలేదని చెప్పారు. అయిన ఆశ వదలక కేతకి ఎలా ఉంటుందో వర్ణించి చెప్పాడు మేరు. సన్నగా, నల్లగా, మరీ పొడుగు కాకుండా, పెద్ద కళ్ళతో ఉంటుందనీ చెప్పాడు. అయినా కూడా వాళ్ళు అలాంటి వాళ్ళు ఎవరూ రాలేదనే సమాధానం చెప్పారు. ఆశ చావక మళ్ళీ వాళ్ళకి కొన్ని గుర్తులు చెప్పాడు. నిన్న రాత్రి తన వెనుకే గెస్ట్ హౌస్‍లోకి వచ్చిందని చెప్పాడు. ఇంతలో ఏదో గుర్తుకొచ్చిన వాడిలా, ఒక ఉద్యోగి “ఆఁ, గుర్తుకొచ్చింది, మీరు చెప్పిన గుర్తులు ఉన్న ఆవిడ.. జి.వి. సత్యనారాయణగారి భార్య కదా.. వాళ్ళు ఓ గంట క్రితమే ఖాళీ చేసి వెళ్లారు” అన్నాడు.

అంతే కేతకి జి.వి. సత్యనారాయణ భార్య అన్నమాట! అంటే తన స్నేహితుడు. జి.వి., ఈయన ఒకరేనా? మరి అతని గురించిన వివరాలు కేతకి ఎందుకు చెప్పలేదు? అసలు తన స్నేహితుడు జి.వి. ఈయనే ఒకరే అయితే ఎక్కడ ఎప్పుడు కలుసుకొన్నారు? కేతకి అతనితో సంతోషంగా ఉందా?

“హేయ్” అన్న పిలుపుతో ఆలోచనల నుంచి తేరుకొని వెనక్కి తిరిగి చూశాడు మేరు.

పలకరించింది హైదరాబాద్‍కి చెందిన అతని పాత క్లాస్‌మేట్ రమేష్. గుర్తుపట్టడానికి కొంత సమయం పట్టింది..

“అరే రమేష్ నువ్వా..! ఏమిటి సంగతి? ఇక్కడికి ఎలా వచ్చావు? ఎలా ఉన్నావు? నిన్ను ఇక్కడ హంపిలో కలుస్తానని అస్సలు ఊహించలేదు. ఇక్కడ ఎలా ఊడిపడ్డావ్?” అని ఆశ్చర్యపోతూ అడిగాడు మేరు రమేష్‌ని.

“నువ్వు నన్ను చూసి ఆశ్చర్యపోతున్నావు, కానీని, నేను మాత్రం నీ గురించి కనుక్కుంటూనే ఉన్నాను. నువ్వు ఇక్కడ ఉన్నావని మీ డిపార్ట్‌మెంటు వాళ్ళు చెప్పారు” అన్నాడు రమేష్ నవ్వుతూ.

“అది సరేగాని నువ్వు ఇక్కడెందుకున్నావో చెబుతావా?” అడిగాడు మేరు.

“నా భార్య ‘ఆశ’ కాలేజి రోజుల్లో హిస్టరీ స్టూడెంట్.. అప్పుడే కాలేజీ ద్వారా హంపీకి పిక్నిక్‌కి ఇక్కడికి వద్దామనుకుంటే వాళ్ళు అమ్మగారు వాళ్ళు వద్దన్నారట. తన కలని సాకారం చేయడం నా బాధ్యత కదా, అందుకని ఇప్పుడు నాతో వచ్చింది..”

“రమేష్ నువ్వు మెడిసన్ అయ్యాక మనస్తత్వశాస్త్రం చదువుతానన్నావు కదా.. ఇప్పుడేం చేస్తున్నావ్?” అడిగాడు మేరు.

“నేను మనస్తత్వ శాస్త్రం చదివి, సైకాలజిస్టుగా ప్రాక్టీసు చేస్తున్నాను” అని చెప్పి, “ఏం ఎందుకలా అడిగావు?” అన్నాడు రమేష్

“నీకు సుధాకర్ జ్ఞాపకం ఉన్నాడా? అతనే నీ గురించి చెప్పాడు. చాలామంది డాక్టర్లు కార్డియాలజీలో స్పెషలైజ్ చేస్తారు. మరి నువ్వు సైకియాట్రీ ఎందుకు ఎంచుకున్నావో అని మేం ఆశ్చర్యపోయేవాళ్ళం” అన్నాడు మేరు.

“మేరు, నీకు తెలుసు కదా, అనారోగ్యాన్ని ఎదుర్కోవడంలో మనసుదే ప్రధాన పాత్ర. మన దేశంలో బాగా నిర్లక్ష్యం చేయబడిన విభాగం. సాధారణ కౌన్సిలింగ్, చికిత్సలతో ఎన్నో మానసిక రుగ్మతలను నయం చేయవచ్చు” చెప్పాడు రమేష్.

“రమేష్, నిన్ను కొన్ని విషయాలు అడగాలి.. మనం వృత్తిపరంగా కలుద్దామా?” అడిగాడు మేరు.

“తప్పకుండా. కానీ ఇప్పుడు కాదు. ఆశ నా కోసం ఎదురుచూస్తూ ఉంటుంది. మనం మళ్ళీ హైదరాబాదులో కలుద్దాం..” అంటూ పర్సు లోంచి తన విజిటింగ్ కార్డ్ తీసి మేరు చేతిలో ఉంచి, స్నేహపూర్వకంగా మేరుని హత్తుకుని వెళ్ళిపోయాడు రమేష్.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here