[box type=’note’ fontsize=’16’] పంచ భూతాల విశిష్టతని కంద పద్యాలలో వివరిస్తున్నారు బుసిరాజు లక్ష్మీ దేశాయి “కందములు – పంచ భూతములు” అనే పద్య కవితలో. [/box]
భూమియె ఆధారమ్ముగ
సామాన్యముగా నశేష సంజాతమ్ముల్
ప్రామాణికమగు రీతుల
నేమాత్రము విడక కలుగు నిక్కము సుమ్మా.
జీవము పోకుండ నిలుపు
పావనమౌ జలములెపుడు పరిరక్షించున్
జీవనచక్రము నిరతముఁ
ద్రావగనెల్లరకు దొరకు దాహములందున్.
ఉచితమ్మగు జీవినిఁ గా
ల్చుచునగ్ని జగతిని వరుసలోననుఁ బెట్టున్,
పచనము చేసెడు వేళల
రుచిగల పాకముల నొసగు రోయక యెపుడున్.
గాలిని యెప్పుడు చూడగఁ
జాలదు ప్రాణుల నయనము, శ్వాసల యందున్
మేలుగ నాధారమ్మై
యేలని నాళులనుఁ గనగ నేరికిఁ దరమే?
గగనమనంగనె కనులను
నగపడునదిగో విమానమనియెడు మా మా
నగవుల్, హర్షోల్లాసము
లెగసెడు బాల్యపు గురుతులె, యింపవి యెపుడున్.