కనిపించిన దైవం

53
7

[dropcap]వ్యా[/dropcap]పార పనుల నిమిత్తం నా స్వంత ఊరు నిజామాబాదు నుండి హైదరాబాద్‌కు తరచూ వెళ్లవలసి వచ్చేది. అది అధమపక్షం వారానికి మూడు సార్లు అయ్యేది. నేనెక్కువగా నా కార్లో స్వయంగా నడుపుకుంటూ వెళ్తాను. ప్రయాణం పూర్తి చేయటానికి దాదాపు మూడు గంటల సమయం పడుతుంది. దారి పొడవునా రోడ్డుకి ఇరువైపులా పెద్ద వృక్షాలు, పక్కలో ఆకు పచ్చని పంట పొలాలు కనువిందు చేస్తూ ఉంటాయి. దాంతో ప్రయాణం బోరు కొట్టకుండా చాలా ఉల్లాసంగా ఉంటుంది.

అక్కడక్కడా పెద్ద హోటల్స్, రోడ్డు పక్కలో చిన్న టీ కొట్లు కనపడుతూ ఉంటాయి. నిజామాబాదు టౌన్ దాటిన తర్వాత ముప్పై కిలోమీటర్ల ఆవల చిన్న అడవి దాదాపు యాభై కిలోమీటర్ల వరకు దారి పొడవునా విస్తరించి ఉంటుంది. అడవిలో నుండి రక రకాల కోతులు రోడ్డు మీదకు వస్తుంటాయి. అక్కడక్కడ పులులు ఉన్నాయి అనుకుంటారు కానీ రోడ్డు మీదకి అవి ఏనాడు వచ్చిన దాఖలాలు లేవు.

అప్పుడప్పుడూ నెమళ్ళు మాత్రం విస్తృతంగా వస్తుంటాయి.

రాత్రి సమయంలో ద్విచక్ర వాహనాలు నడిపేవారు మాత్రం దారి దోపిడీ దొంగలుంటారనే భయంతో రాత్రి సమయంలో ఆ అడవి ప్రాంతాన్ని చీకటి పడే ముందుగానే దాటేస్తుంటారు

ఒకసారి హైదరాబాద్‌కు ఉదయం కారులో త్వరగా బయలుదేరాను. కారు ఊరు దాటి హైవే మీదకు రాగానే హిందీ పాటలు పెట్టుకుని వింటూ నడపసాగాను.

దాదాపు సగం దూరం చేరుకోగానే, మధ్యలో అడివి ప్రాంతం మొదలైంది. చుట్టూ పచ్చటి పెద్ద పెద్ద వృక్షాలు, దట్టమైన పొదలతో, ప్రకృతి తన అందాలతో కళకళ లాడుతూ వుంది.

దూరంగా రోడ్డు పక్కన పెద్ద మర్రి చెట్టు, దాని నీడలో కొత్తగా వేసిన చిన్న గుడిసె కనపడుతూ వుంది. అది దగ్గరకు రాగానే తల పక్కకు తిప్పి చూసాను. ఆ చెట్టు కింద కొత్తగా చిన్న గుడిసె హోటల్ వెలిసింది.

ఆ గుడిసెలో ముందు వేపు నాలుగు ప్లాస్టిక్ కుర్చీలు రెండు టేబుల్స్ వేసి వున్నాయి. ఆ పెద్ద మర్రి చెట్టు నీడలో ఆ గుడిసెను చూస్తుంటే చాలా ఆకర్షణీయంగా వుంది.

చుట్టూ అడవి, మధ్యలో చిన్న కాఫీ హోటల్, నిజంగా సేద తీర్చుకోవడానికి మంచి ఆహ్లాదకరమైన వాతావరణం అనుకుని, వెంటనే బ్రేక్ వేసి, కారుని రోడ్డు మీద నుండి కిందకు దింపి, ఆ హోటల్ పక్కన ఆపాను.

కాస్త నలుపుగా వున్న ఓ వ్యక్తి నా కారు ఆగగానే పరిగెత్తుకుంటూ వచ్చాడు.

“నమస్కరం సార్” అని అంటూ కుర్చీలు సరి చేసాడు. అప్పుడు అతడిని తేరిపారా చూసా. కాగు పట్టిన తెల్ల షర్ట్, పాత జీన్స్ ప్యాంట్ వేసుకుని, నన్ను చూడగానే నవ్వాడు.

కారు దిగి చుట్టూ ఒకసారి చూసి, ఒళ్ళు విరుచుకుని, చెట్టుకింద పక్కగా వున్న సిమెంట్ కాగులో నుండి చెంబుతో నీళ్లు తీసుకుని మొహం తడుపుకుని వెళ్లి కుర్చీలో కూర్చొని “బాబు.. మంచి చాయ్ ఒకటి పెట్టి ఇవ్వు” అని చెప్పి జేబులోనుండీ మొబైల్ ఫోన్ తీసుకుని వాట్సాప్ చూడటం మొదలు పెట్టాను.

కాసేపటికి “సార్ చాయ్” అని స్త్రీ కంఠం వినిపించి తలెత్తి చూసాను. మంచి నల్లని రాతి శిల్పంలా వున్న చక్కటి అందమైన పల్లెటూరి యువతి చాయ్ కప్పు పట్టుకుని నిలుచుని వుంది.

తైల సంస్కారం లేని తల వెంట్రుకలు వెనక్కి లాగి పెద్ద జడతో, అమాయకమైన ముఖారవిందం కలిగి వుంది. బహుశా అతని భార్య అయివుంటుంది అనుకున్నాను.

చాయ్ అతి మామూలుగా వుంది. కానీ పెద్ద గ్లాస్ నిండుగా ఇచ్చారు. అది పూర్తి గా తాగేటప్పటికి కడుపు నిండినట్లయ్యింది.

అడివి చెట్ల సువాసనతో కూడిన గాలి పీలుస్తుంటే హాయిగా అనిపించి అక్కడే కొద్ధి సేపు కూర్చుండి పోయాను.

హోటల్ ముందు వేపు ఇటుకలతో చిన్న గోడ నడుం ఎత్తు వరకూ కట్టి దాని మీద కట్టెల పొయ్యి మీద చాయ్ చేస్తూ వుంది ఆ నల్లని యువతి. చక్కని కను ముక్కుతో, మంచి పొడవైన శరీరాకృతి కలిగి ఏదో తెలియని అందం కనపడుతూ వుంది.

బలమైన ఆహరం లేక కష్టించే జీవితం అయినందున కాబోలు శరీరం గట్టిగా వుంది.

ఇంతలో ఆవిడ భర్త వచ్చి “సార్ చాయ్ బావుందా? చాలా సేపు అయ్యింది కదా ఇంకొక చాయ్ తీసుకుంటారా” అని అమాయకమైన నవ్వుతో అడిగాడు.

కొద్ది సేపు అతడిని సూటిగా చూసి “ఏ వూరు మీది. ఇది అడవి కదా మరి రాత్రికి ఎక్కడుంటారు?” అని అడిగాను.

అది వినగానే అతడి మొహం సంతోషంతో విప్పారింది. “ఇక్కడే లోపల పడుకుంటాం, అన్నింటికీ దేవుడున్నాడు సార్. రాత్రి పూట లారీ వాళ్ళు ఎక్కువగా ఆపుతారు. మాకు అప్పుడే డబ్బులు వస్తాయి.” అని చెప్పి, భార్య కేసి చూసి “ఎంకీ! సార్‌కు ఇంకో చాయి పట్టుకు రా” అరిచాడు.

“నీ పేరేంటి” అడిగాను.

“నా పేరు నారాయణ, దాని పేరు ఎంకి.. నా పెళ్ళాం” అని తల గోక్కుంటూ సిగ్గుతో చెప్పాడు.

అంతలో చాయి పట్టుకుని వచ్చింది ఎంకి. చాయి అందుకుంటూ మళ్ళీ ఒకసారి ఎంకి మొహం కేసి చూసాను. ఎండలో కంది పోయి బాగా నలుపుగా అయిపోయిన మొహం, కానీ చెప్పలేని కళ తొణికిసలాడుతోంది.

బాగా ధనం ఉండీ, అన్ని రకాల సుఖాలున్నప్పటికీ పెద్ద పెద్ద భవంతులలో వుండే వారికి ఈ అందం, కళ ఎందుకుండదో అర్థం కాలేదు.

చాయ్ తాగి గాజు గ్లాస్ కింద పెట్టి వంద రూపాయల నోటు నారాయణ చేతిలో పెట్టాను.

“అబ్బో సార్, ఇంత పెద్ద నోట్ చిల్లర లేదు సార్” అంటూ వెనక్కి ఇవ్వబోయాడు.

“సరేలే.. ఉండనీ.. మళ్ళీ వచ్చినప్పుడు ఇద్దువు కానీ” అంటూ కార్ వేపు అడుగులు వేసి, చూడకూడదనుకుంటూనే ఎంకివేపు ఒక సారి చూసి కార్ ముందుకురికించాను. చాలా సేపు అమాయకమైన ఎంకి మొహం, ఆ చూపులే కళ్ళ ముందు కదలాడాయి. ఎక్కడా ఇసుమంత మేకప్ లేదు కానీ అర్థం కాని ఆకర్షణ కనపడింది. బహుశా నిష్కల్మషమైన పల్లెటూరి పడుచుల్లో మాత్రమే ఇది ఉంటుందేమో అనిపించింది.

మరుసటి రోజు పని పూర్తి చేసుకుని ఇంటికి వెనక్కి మళ్ళాను. తిరుగు ప్రయాణంలో నాతో పాటు ఇద్దరు స్నేహితులను కూడా నా కారులో వెంటేసుకుని బయలుదేరాను.

రామాయంపేట అడవి లోకి ప్రవేశించగానే నాతో వచ్చిన స్నేహితుడు అడిగాడు “ఇక్కడెక్కడైనా చాయి కొడదామా?” అని.

అది విన్న నేను “ఇదిగో కొద్ది దూరం లోనే మంచి స్పాట్ వుంది. అక్కడ ఆగుదాం” అన్నాను.

నారాయణ హోటల్ దగ్గర కారు ఆపి కిందకు దిగాను. మమ్మల్ని చూడగానే ఎప్పటిలా పరిగెత్తుకొచ్చాడు నారాయణ.

అతడి మొహంలో సంతోషం పెల్లుబికింది. నమస్కారం పెట్టాడు.

నే వెళ్లి సిమెంట్ తొట్టిలో వున్న నీటితో మొహం కడుక్కున్నాను. మేం ముగ్గురం కుర్చీల్లో చెట్టుకింద కాళ్ళు జాపుకుని కూర్చున్నాం.

“నారాయణా.. ఏంటి తొట్టిలో నీళ్లు కొన్నే వున్నాయి?” అన్నాను ఏమీ తోచక.

“అక్కడ కనిపించే ఊరి నుంచి సైకిల్ మీద తేవాలి సార్. కొద్ది సేపు అయ్యాక వెళతాను.” అన్నాడు సంజాయిషీ ఇస్తూ.

అతడు చూపించిన వేపు తల ఎత్తి చూసాను. చాలా దూరంలో చిన్న చిన్న ఇళ్ళు కనపడుతున్నాయి. ఊరు దాదాపు రెండు కిలోమీటర్లు ఉంటుంది. “చాలా దూరం కదా, ఎన్ని బిందెలని మోస్తావు.” అన్నాను.

“ఏం జెయ్యాలె సార్.. పొట్టకూటికి తప్పదు.” అన్నాడు ముఖం విచారంగా పెట్టి.

కట్టెల పొయ్యి వద్ద చాయ్ పెడుతున్న ఎంకిను చూసా. అదే అందం. ఎటువంటి భావం లేని మొహం. జడలో అడవి పూలు పెట్టుకుని వుంది. అప్పుడు గమనించాను జడను. నల్లని వెంట్రుకలు ఒత్తుగా వున్నాయి. ఎన్ని జాగ్రత్తలను తీసుకుని, ఎంత డబ్బు ఖర్చు చేస్తే కూడా పట్టణంలో అమ్మాయిలకు అలాంటి జడ రాదు.

స్నేహితులతో మాట్లాడుకుంటూ అరగంట కూర్చుండి పోయా.

కార్ ఎక్కే ముందు నారాయణను పిలిచి డబ్బులు ఇవ్వ బోతుంటే “వద్దు వద్దు సార్” అంటూ దూరం జరిగాడు.

స్నేహితులతో కలిసి కారు ఎక్కి అక్కడ నుండీ కదిలాను.

”ఇక్కడ కూడా నీ ఇన్‌ఫ్లూయెన్స్ ఏంటి” అని నవ్వారు నా ఫ్రెండ్స్ ఇద్దరూ.

***

వారం రోజుల తర్వాత మరి కొందరు మిత్రులతో కలిసి అక్కడే ఆగాను. చాయి బిస్కెట్, అయింతర్వాత నారాయణ వచ్చి నవ్వుతూ నిలబడ్డాడు.

ఆ నవ్వు నాకు చిరపరిచితమే. నా దగ్గర పని వాళ్ళందరూ ఏదైనా అవసరం పడ్డప్పుడు అలాగే నవ్వుతారు.

చిరాకు అణుచుకుంటూ చూసా అతడి వేపు ఏంటి అన్నట్లుగా.

“సార్ ఓ వెయ్యి కావాలి.. కాస్త పెట్టుబడికి.. హోటల్‍లో రొట్టెలు, కూరలు పెడదామనుకుంటున్న సార్” అన్నాడు.

అతడిని చూసి జాలి వేసింది నాకు. జేబులో చేయి పెట్టి ఆరు నోట్లు తీసి అతడి చేతిలో వుంచాను.

వాటిని చూసి బిత్తరపోయాడు నారాయణ. “సార్ మూడు వేలు ఇచ్చారు” అన్నాడు కళ్ళు పెదవి చేసి.

“మంచిగా బిజినెస్ చేసుకో…. అప్పుడప్పుడు కొంత, కొంత వెనక్కి ఇచ్చేయ్” అని చెప్పి కారెక్కాను.

ఆ తర్వాత నేనెన్ని మార్లు వెళ్లినప్పటికీ నా దగ్గర డబ్బులు తీసుకోకుండా వెనక్కి ఇచ్చేసేవాడు నారాయణ. హోటల్‌లో గిరాకీ ఎక్కువ కావటం గమనించి సంతోషించాను. భార్యాభర్తలిద్దరూ కలిసి కష్టపడుతూ ఉండేవారు. ఎంకి ఈ మధ్యన నవ్వుతూ త్రుళ్ళుతూ ఉండేది. హోటల్‌లో కుర్చీలు పెంచారు. ఎక్కువ కార్లు ఆగేవి.

ఆ దారిలో వెళ్తు అక్కడ ఆగినప్పుడల్లా ఒక బీదవాడికి, కష్టంలో సహాయం చేశానని తృప్తిగా అనిపించేది. మధ్యలో కొంత డబ్బు ఇవ్వబోయాడు. కానీ నాకు తీస్కోవాలనిపించలేదు. వద్దని వారించి వెళ్ళిపోయాను.

ఒక రోజు నేను, భార్యతో కలిసి హైద్రాబాదు ప్రయాణం అయ్యాను. సరిగ్గా ఎప్పుడూ ఆగే ఆ హోటల్ దగ్గర కార్ ఆపి చూస్తే హోటల్ మూసేసి వుంది. మొత్తం ఖాళీగా వుంది. కుర్చీలు, టేబుల్స్ కూడా లేవు. గట్టు మీద పొయ్యి కూలిపోయి కనపడింది.

కార్ దిగి చుట్టూ చూసాను. అక్కడ ఎవరూ కనిపించలేదు. చాలా రోజులనుండీ హోటల్ నడిపిన దాఖలాలు కనపడలేదు.

కాస్త అసంతృప్తిగా చిరాకుగా అనిపించింది. నా చిరాకుని గమనించిన మా ఆవిడ నా వేపు చూసి “ఇంకో హోటల్ దగ్గరలో లేదా? అక్కడకు వెళదాం పదండి” అంది.

సరేనంటూ కూర్చుని కార్ స్టార్ట్ చేసాను. కొద్ది దూరంలోనే ఇంకొక చిన్న గుడిసె హోటల్ కనిపించి ఆగాను. కార్ దిగి ఇద్దరం అక్కడున్న డొక్కు కుర్చీలలో సాగిల పడ్డాము.

“బాబు! రెండు చాయ్‌లు తీసుకురా” అని అక్కడున్న కుర్రాడికి చెప్పి కళ్ళు మూసుకుని వ్యాపార లావాదేవీల గురించి ఆలోచించ సాగాను.

కొద్ది సేపటికి తెచ్చిన చాయ్ కప్పులు అందుకుని ఆ కుర్రవాడిని చూసి “ఒరేయ్ బాబూ.. ముందు కాస్త దూరంలో ఇంకొక హోటల్ ఉండేది. అతని పేరు నారాయణ. వాళ్ళు ఏమయ్యారు,హోటల్ మూసేసి ఉంది” అని అడిగాను.

“అవును సార్, పది రోజుల కింద నారాయణని పోలీసులు పట్టుకెళ్లారు. రాత్రి సమయంలో అడవుల్లో నుండీ వచ్చే వారికి అన్నం పెట్టేవాడట. పోలీసులు అది తెలిసి, వాడిని వాళ్ళ ఆచూకీ చెప్పమని పట్టుకెళ్లారని తెలిసింది. కొద్ది రోజుల పాటు వాడి భార్య కూడా పోలీసుల చుట్టూ తిరిగింది. కానీ నారాయణ ఎక్కడున్నాడో తెలియలేదు. ఆ తర్వాత వారం రోజులకు కూడా కనపడటం లేదు. ఏం జరిగిందో ఎవరికీ తెలియదు” అన్నాడు ఆ హోటల్ కుర్రాడు.

అది విని చిరాకుగా, బాధగా అనిపించింది. మా ఆవిడ నా మొహం చూసి “ఏమైంది అతనికేమన్న డబ్బులు ఇచ్చారా?” అంది అనుమానంగా.

నేను కాస్త ఆలోచించి “లేదు” అని అన్నాను.

మళ్ళీ నా వంక చూసి “ఇచ్చే వుంటారు” అంది నా మనస్తత్వం తెలిసి.

ఇంతలో కుర్రాడు చిల్లర డబ్బులు ఇవ్వబోయాడు. నేను తీసుకోకుండా వాడి వేపు చూసి “హోటల్ ఎలా నడుస్తోంది” అన్నాను.

“పర్లేదు సార్, ఇంకాస్త పెట్టుబడి పెడితే ఇంకా బావుంటుంది. ఇప్పుడు మాత్రం మా పొట్ట గడుస్తుంది అంతే” అన్నాడు విచారంగా.

ఒక క్షణం ఆగి జేబులోనుండి రెండు పెద్ద నోట్లు తీసి వాడి చేతిలో పెట్టి “ఇవి తీసుకుని బాగు చేసుకో, హోటల్ బాగా నడిచి డబ్బులు రాగానే తిరిగి ఇవ్వాలి.. ఏంటి అర్థం అయ్యిందా” అని లేచి నిలబడ్డాను.

రెండడుగులు ముందుకు వేయగానే మా ఆవిడ నా వెనకాలే అడుగులేస్తూ “ఎందుకలా అడగక ముందే పందారాలు పంచేస్తారు” అంది కోపంగా.

“పోనీ బీదవాడు కదా?” అని సంజాయిషీ ఇస్తూ కారు వైపు నడిచాను.

చాలా సార్లు హైదరాబాద్ వస్తూ పోతూ ఖాళీ అయిపోయిన నారాయణ గుడిసె కేసి చూస్తూ పోయాను. ఆ తర్వాత దాదాపుగా అది మర్చి పోయాను. కొద్ది దూరంలో వుండే కొత్త గుడిసె హోటల్‌లో ఆగి చాయ్ తాగటం అలవాటు అయిపోయింది.

ఒక రోజు కాస్త త్వరగానే బయలుదేరి అడవి లోని హోటల్‌లో చాయ్ తాగి హైదరాబాద్ వైపు కాస్త వేగంగా వెళ్ళసాగాను.

అడవి దాటిన తర్వాత వచ్చే చేగుంట అనే ఊరు దాటి వెళ్తున్నాను. కాస్త దూరంలో ఎవరో రోడ్ మీద ఒక పక్కన పడి ఉండడం కనిపించింది. అతనికి మరి కాస్త దూరంలో ఒక సైకిల్ పడి పోయి వుంది. కార్ కాస్త మెల్లిగా నడుపుతూ పక్క నుండి చూస్తూ వెళ్లాను. ఎవరో పల్లెటూరి మధ్య వయస్కుడు,శరీరం మీద గాయాలు కనిపిస్తూ ఉన్నాయి. గమనించి చూస్తే కదలటం లేదు. చుట్టూ పక్కల ఎవరూ లేరు. బహుశా ఏదో వాహనం వెనక నుండి గుద్దేసి పోయినట్లనిపించింది. వ్యాపార పనుల రీత్యా వెళ్తున్న నాకు సమయం తక్కువగా వుంది. కానీ అలా గాయపడిన మనిషిని వదిలి వెళ్లడం అమానుషం అనిపించి, ముంజేతికున్న వాచీలో సమయం చూసుకుని, కారు కాస్త ముందుకు తీసుకెళ్లి రోడ్ పక్కన ఆపి దిగి వెళ్లాను.

దగ్గరకు వెళ్లికూర్చొని చూసాను. అతను కదలటం లేదు. కానీ ఊపిరి ఆడుతూ వుంది. పిలిస్తే ఆ వ్యక్తి పలకటం లేదు. స్పృహలో లేడు. తలకు గాయం కనపడుతూ ఉంది. జేబులో నుండి రుమాలు తీసి తలకు గట్టిగా కట్టాను. మంచి నీళ్లు తాగిస్తే మంచిదని అనిపించి లేచి నీటి బాటిల్ తెద్దామని కారు వేపు అడుగులు వేసాను. ఇంతలో అటుగా వెళ్తున్న ఆటోలో నుంచి నల్గురు వ్యక్తులు దిగి నన్నూ, కింద పడిన వ్యక్తిని చూసి, అందులో ఒకడు “నువ్వలా గుద్దేసి వెళ్ళిపోతున్నావేంటి.. ఆగు” అన్నాడు పెద్ద గొంతుకతో .

“నేను వచ్చేటప్పటికీ అతను కింద పడి వున్నాడు. ఎవరు కొట్టారో తెలీదు. నీళ్లు తెస్తా కారులో వున్నాయి” అని చెప్పి వెనక్కి తిరిగాను.

“మా దగ్గర నీళ్ళున్నాయి. నువ్ కదలటానికి వీల్లేదు. పోలీసులకి ఫోన్ చేస్తా ఉండూ” అంటూ ఇంకో ఇద్దరు నాకడ్డంగా నిలబడ్డారు.

“పిలవండి పర్లేదు. అతడిని నా కారు కొట్టలేదు” అన్నాను ఒకింత అసహనంగా .

ఇంతలో ఒక జీప్ వచ్చి పక్కన ఆగింది. అందులోనుండి కాస్త మొరటుగా కనపడే వ్యక్తులు నల్గురు దిగుతూనే, అందులో ఒకడు “ఏం జరిగింది?” అన్నాడు కరకు స్వరంతో.

ఆ వ్యక్తిని చూస్తే చిన్న కిరాయి గూండా లాగా కనిపించాడు. ఆటో లో దిగిన వ్యక్తి నన్ను చూపిస్తూ “ఆ కారుతో గుద్దేసి పోతున్నాడన్నా, అది చూసి మేము ఆపినం” అన్నాడు గొప్పగా, గర్వంగా.

అది విని నాకేసి చూసాడా గూండా “కారు నడుపుడు రాదా? రోడ్ మీద నడిశెటోడికి ఇలువ లేదా? రోడ్ నీ అయ్య జాగీరా?” అని నా దగ్గరగా వచ్చి అరిచాడు. వాడి నోట్లోనుంచి నాటు సారా వాసన గుప్పుమంది.

నన్ను నేను తమాయించుకుని “చూడు బాబు.. నేనతడిని కారుతో కొట్టలేదు. ఏం జరిగిందో నాకు తెలీదు. కింద పది వున్న అతడిని చూసి సహాయం చేద్దామని ఆగాను.” అని అనునయంగా, నిదానంగా అన్నాను.

వాడు నే చెప్పేది ఏమాత్రం పట్టించుకోకుండా “నీ కారేది… అదేనా? ముందు దాని తాళం ఇవ్వు” అన్నాడు.

సహాయం చేద్దామని ఆగి పొరపాటు చేశానేమో అని మొదటిసారిగా అనిపించింది. “ముందు అతడిని ఏదైనా హాస్పిటల్ తీసుకెళ్లడం మంచిది” అని సముదాయించినట్లుగా అన్నాను.

దానికి అతను ఇంకాస్త నా దగ్గరకు వచ్చి “అవన్నీ మే జూసుకుంటాం గానీ నువ్వు ఎక్కువ నకరాల్ జేయక్” అని అరిచాడు.

నాకేం చేయాలో అసలు అర్థం కాని పరిస్థితి. చుట్టూ చూసాను, ఈ గొడవ చూసి దారిన పోయే చాలా వాహనాలు ఆగిపోయి ట్రాఫిక్ నిల్చిపోయింది.

“అసలు ఆ కార్ లాక్కోండి.. లేదా ఆ పడ్డ వాడికి ఖర్చులకు డబ్బులు తీసుకోండి” అంటూ ఇంకొకడు సలహా ఇచ్చాడు.

నేను ఇక లాభం లేదు, గట్టిగా ఎదుర్కొంటే గానీ ఈ న్యూసెన్స్ నుండీ బయటపడలేమని అర్థం అయ్యి “నాకు సంబంధం లేదంటే మీకు వినపడటం లేదా? ఎవరు కొట్టేసి వెళ్లారో నాకు తెలీదు. పడ్డవాడిని చూసి సాయం చేద్దామని నేను కార్ దిగి వచ్చా” అని పెద్దగా అరిచా.

దాంతో అక్కడున్న కొందరు ఇంకా పెద్ద గొంతేసుకుని అరవటం మొదలు పెట్టారు “కార్ కళ్ళు మూసుకొని నడిపి ఇంకా ఎక్కువ మాట్లాడుతవ్.. కాల్లిరగ కొడతా” అన్నాడొకడు నా కాలర్ పట్టుకుని.

చుట్టూ వంద మందికి పైన జమ అయిపోయారు. అంతా గోల గోలగా అరుపులు కేకలు మొదలయ్యాయి. అందరు నన్ను దోషి కింద తేల్చేశారు. అందరి వంకా చూసాను.

అందులో కొందరు నన్ను కొట్టడానికి ఉద్రేకంగా వున్నారని అర్థం అయ్యింది. నేనేం చెప్పినా అక్కడ జనాలు వినేట్లుగా లేరు.

ఇంతలో పొడవాటి గడ్డంతో, దృఢంగా వున్నఒక వ్యక్తి గుంపు వెనక నుండీ ముందుకు వచ్చి, “ఏయ్ జరగండి దూరం, ఆ సార్ మా మనిషి.. నాతో కలుస్తనీకి వచ్చిండు. ఆయన కొట్టలేదు, నేనాడికెళ్ళి జూస్తనే వున్నా.. ఒక వ్యాన్ గొట్టి పోయింది.” అని పెద్దగా అరుస్తూ నా చుట్టూ వున్న వాళ్ళను దూరంగా నెట్టేశాడు.

ఆ వ్యక్తి చేతిలో కట్టెలు కొట్టే చిన్న గొడ్డలి వుంది. ఒత్తయిన గడ్డంతో వున్న అతను నన్ను చూసి “మీరు వెళ్ళండి సార్, మళ్ళీ రండి” అని కారు వేపు దారి చూపాడు. ఇతనెవరో సమయానికి దేవుడిలా వచ్చి కాపాడాడు అని మనసులో దండం పెట్టుకుని గబగబా వెళ్లి కారెక్కి స్టార్ట్ చేసాను. కారు దగ్గరికి వచ్చి పక్కన నిలబడి చెయ్యి ఊపుతున్న అతడిని మళ్ళీ ఒకసారి చూసాను.

అతను నా వైపు చూసి “నేను సార్, హోటల్ నారాయణను.. అదిగో అక్కడ కనిపిస్తుందిగా, అదే నా కొత్త చాయ్ హోటల్, వాపస్‌ల రండి” అన్నాడు నిర్మలంగా నవ్వుతూ. అప్పుడే అక్కడికి వచ్చిన ఎంకి నన్ను చూసి నమస్కారం పెట్టింది.

ఆ వ్యక్తి నారాయణ అని తెలిసి ఆశ్చర్యపోయి “థాంక్స్ నారాయణ, చాలా సహాయం చేసావు” అన్నాను.

“అదేంటి సార్, మీరు పెద్దోళ్ళు, మీరు ఎంత మంచోరో నాకు తెల్వదా” అని రెండు చేతులతో నమస్కారం పెట్టాడు.

వారిద్దరినీ మనస్ఫూర్తిగా ఆశీర్వదించి కార్ స్టార్ట్ చేశాను.

అక్కడనుండి బయటపడిన నేను కార్ నడుపుతూ ఆలోచించసాగాను. నాకు చాలా సంతోషంగా వుంది. అయితే అది నేను తప్పించుకున్నందుకా లేక నారాయణ సురక్షితంగా వున్నందుకా? అన్నది అర్థం కాలేదు.. అయితే మనం చేసిన సహాయం, మనకు తిరిగి సహాయం చేస్తుందనే పెద్దల మాట గుర్తుకొచ్చింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here