కనిపించుట లేదు!!!!

0
8

[dropcap]మా[/dropcap]నవ శరీర భాగాల మహా పరిషత్తు చాలా సీరియస్‌గా సాగుతోంది! ఎక్కడేమిటీ,ఆ బాడీ తాలూకు యజమానికి కూడా తెలియకుండా, ఆ వ్యక్తి లోపలే!!

ప్రపంచ వ్యాప్తంగా, మనిషిగా పిలవబడే ఘటాలు అన్నీ కేంద్రాలే ఈ సదస్సుకి!!

ఎవరు ఎట్లా కబురు పంపారో ఎవ్వరికీ తెలియదు, జరిగిపోతోంది, అంతే!!

ఓ నాలుగు గంటలు అందరూ (‘అన్నీ’ అనే అనాలి న్యాయంగా, కాస్సేపు ‘అందరూ’ అనే అందాము,శరీర భాగాలే అయినా! అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేసుకున్నాయి కదా, మన నాయకుల లాగా, అందుకు ఆ గౌరవం! కాస్సేపేలే!!) తర్జన భర్జనలు పడ్డారు, నీతులు చెప్పుకున్నారు, చెవులు కొరుక్కున్నారు (ఏవిటి, అన్ని భాగాలకీ విడిగా చెవులుంటా యేవిటీ?! అని అడగ వద్దు! ఉంటాయేమో, మేం చూశామా?!

అబ్బ, సూక్ష్మం పట్టండయ్యా, గుసగుస లాడుకున్నారని గ్రహించండి చాలు).

చివరకు ఏం తేల్చారో తెలుసా, ‘ముక్కు’ మాత్రమే కారణం అని తేల్చారు ఈ కరోనా మహమ్మారికి!!!

మొదట్నుంచి పసికడ్తూనే ఉంది, ఒక్కొక్కళ్ళ వాలకమూ, తనను చూసి మూతి తిప్పుకొనే వైనాలూ, ‘నాసికామణి’!

ఈ తుఫానేదో అన్ని తీరాలు దాటి తన వైపు మళ్ళుతోందని!

చివరకు ముక్కు, ‘నోరు’ విప్పి మాట్టాడటం మొదలు పెట్టింది. అందరూ, ఆసక్తి కంటే కొంత అక్కసుతో వింటున్నారు!

యుగయుగాలుగా మనిషి అందానికి ముక్కే కారణం అని ఏకుమ్మడిగా దానికి కట్టబెట్టిన కీర్తే, మిగతా అందరికీ కొంచెం తట్టుకోలేని విషయం అయింది.

అదీ అక్కసు అని అనటానికి కారణం!

సరే అది వాళ్ళ సొంత గొడవ, వాళ్ళ రాజకీయం. దాన్ని అట్లా ఉంచుదాం.

***

ముక్కోపన్యాసం, సంక్షిప్తంగా చెప్పాలంటే, ఇట్లా సాగింది:

ఏమిటోయ్ జుట్టూ, నేనా కారణం అన్నిటికీ! నువ్వు కాదు కదూ!

తలకు మాసిన రసాయనాలు, లోషన్లూ పట్టించే వేలం వెర్రి నీది కాదూ! ఎప్పుడైనా ఆలోచించావా, చర్మానికి, ముఖ్యంగా కళ్ళకీ ఏమి ప్రమాదం భవిష్యత్తులో తెచ్చిపెట్తుందో నీ యీ రంగు పైత్యం!!

ఒక్కళ్ళు నీ మొహాన కుంకుమ పెట్టి, (సరే,వాళ్ళ మొహానే అనుకో,) అఘోరిస్తున్నారా?! నుదురు గారూ, బెదురుతూ చూస్తున్నారే, చెప్పండి! పనులు అనుకున్నట్టు కానపుడు, బాదుకోటానికి తప్ప ఎందుకు పనికొస్తారట తమరు?!

ఇక కళ్ళ గారి గురించి ఎంత తక్కువ అనుకుంటే అంత సమయం ఆదా!!పొద్దున లేచినప్పటి నుంచి రాత్రి పూట, వస్తున్న నిద్ర ఆపుకుని మరీ చూసేది ఏమిటట?!

మొబైలు స్క్రీను లేదా మహలావు లాపుటాపు! చూడాల్సింది, చూడకూడనిది, ఏదైనా హద్దు ఉందా, అసలు మీ దృష్టిలో!

సరి సరి, సరైన దృష్టే ఉంటే,ఈ ప్రశ్నే రాదుగా!!

ఇక నోరు గారి ఖ్యాతి ఊరంతా తెలిసిందేగా!!

ఏది ప్యాకేజింగ్ నదరుగా కనబడితే అది కొనుక్కోవటమే, తినేయడమే!!ఒక కట్టు, శుధ్ధి ఉన్నాయా అసలు!!

కూరలు పళ్ళూ గింజలు మొలకలు తినండిరా అని తెలిసిన వాళ్ళు మొత్తుకుంటూంటే, నువ్వు తింటోందేమిటి ఎప్పుడైనా ఆలోచించావా!

కనీ వినీ ఎరగని జీవాలను పట్టి తింటావా?!నీ యీ చాపల్యం, విచ్చలవిడితనం కాదూ, అసలు కారణం ఇవ్వాళ ప్రపంచం ఇట్లా ఏడుస్తోందంటే!

ఇంతకంటే చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా ఈ విషయంలో, బాగా వణికించిదింగా ప్రపంచాన్నే!!

రీములు రీములు రాసేశారు, ఈ వచ్చిన కీటక రోగం గురించి, గంటలు గంటలు జాగ్రత్తలూ బోధించేశారు!

విన్నారా, విని పాటిస్తున్నారా అంటే, సామెత గుర్తు రాక తప్పదు మరి!

ఆయనే ఉంటే………

వినటం లేదు కాబట్టే మీటింగ్‌లూ, ఎపెక్స్ కాన్ఫరెన్సులూ!ఈ, ఒకళ్ళ మీద ఒకళ్ళ, కస్సులు బుస్సులూ!

అంతా బాగానే ఉంటే,ఇంత మేధో మథనం ఎందుకూ?!!

ఏవమ్మా చర్మమా, నీదైనది నీకెప్పుడూ నచ్చదా?! వేలం వెర్రిగా, మై పూతలు తెగ పూసేస్తావు, రంగు తేలటానికి!

రంగులో ఏముందమ్మా, మన మన గుణాల్లో, శరీరం బాగా ఉండటానికి ఎవరెవరం ఏమేం చెయ్యాలో,అవి చేస్తే, అందరం బాగుంటాం కదా!

ఎవరి దారి వారిదనేట్టు ఉంటే,ఇదిగో ఇట్లాగే ఊహించని దేదో మెడకు చుట్టుకుంటుంది,అందరూ బోనులో నుంచోవాల్సిందే అప్పుడు!

పున్నెం పాపం ఎరుగని నా లాంటి వారము కూడా!!

అయ్యా చెవులు గారు, మీరే వేళ్ళాడే రకాలు! ఇంకా మీకా వేళ్ళాడే తీగె లెందుకండీ?!ఇరవై నాల్గు గంటలూ!! తెలియలేదా, అవే, హెడ్ ఫోన్లు!ఆ రొద లేందే ఏమీ తోచదా ఏమిటి?!

అందరి లాగే చెవి కూడా నోరెత్తదనుకున్న ముక్కేశ్వర్‌కి పెద్ద ఎదురే తగిలింది!

“మాదేముంది,వాళ్ళు ఏది పురమాయిస్తే, వినమంటే అదే వింటాము, కాదు వినిపిస్తాము! మాకు ఛాయిస్ ఉన్నట్టూ, మేమే నిర్ణయించే వారము అన్నట్టూ ఏమిటీ ఈ అభాండాలు!!

వారు భాగవతం పెడ్తే, అదే వినిపిస్తాము, బొబ్బలు పెట్టే పాటలైతే అవే! మా ప్రమేయం ఏముందీ?”, అన్నాయి  తడబడుతూ – ‘వింటాము’ అనాలో, ‘వినిపిస్తాము’ అనాలో ఇదమిత్థంగా తేల్చుకోలేక!!

తడబడ్డా,కాస్త గట్టిగానే,అడిగాయి!! వేళ్ళాడినా, నిటారుగానే ఉండే వాటి సహజ స్థితి లాగానే!!

దీంతో, “ఏవి తెమ్మంటే ఆ పార్సెల్సు పట్టుకొని తెచ్చియ్యడమేనా, మంచి చెడ్డా చూడక్కర్లేదా ఆ మాత్రం” అని చేతుల్నీ —

“ఏ అడ్డమైన చోటుకి సాగమంటే అక్కడికి నిట్ట నిలువుగా చేరి పోవటమేనా కాస్త విచక్షణ చూపించ నక్కరలేదా, తొక్క తగ్గవి ఏవో, తొక్కరానివి యేవో తేల్చుకోటానికి” అని కాళ్ళనూ —

అడిగి, కడిగి పారేయలన్న ఉద్దేశం మానేసుకున్నది, పాపం కోటేరు, సంపెంగ లాంటి వాటితో పోల్చబడే ముక్కు– కొంచెం, అహ, కాదు, చాలానే, చిన్నబోయి!!

చిన్నబోయినా, ఏ గాలి ఎటు వీస్తోందో ఇట్టే వాసన పసిగట్టే చక్కని sensor కాదూ ‘ముక్కు’! అంటే, native intelligence తో ఇట్టే పట్టేసింది!!

ఇక మిగిలిన బొజ్జ రాయుణ్ణి మాత్రం అడిగి ఏం ప్రయోజనం, “ఏది లోపల వేస్తే దాన్ని అరిగించే ప్రయత్నం మాత్రమే పనిగా కలదాన్ని, నన్నడిగి వేస్తున్నారా, చెత్తైనా, ఉత్తమమైనా, నా లోపల!! నిమిత్తమాత్రురాలిని” అని జవాబిస్తుందని, అదీ విరమించుకున్నది!!

మిగతా అందరూ కూడా చెవుల మాటలతో అలర్ట్ అయిపోయారనిన్నీ గ్రహించింది!!

అవును మా సంగతైనా అంతే, చూడమన్నదే చూస్తాం, వేసుకోమన్నదే వేసుకుంటాం, పూసిందే ఉంచుకుంటాం!!

నోటిలో వేసిందే, లోపలికి పంపిస్తాం!!

ఇందులో మమ్మల్ని ఆడిపోసుకోటానికి ఏముందీ!! అన్నది వారి సారాంశమని!!

అప్పుడు వెలిగింది, తన లాగే వారందరూ నౌకర్లేననీ, కనిపించని ‘బుధ్ధి’ అనే మేనేజర్‌దే అసలు తప్పనీ!!

మీటింగ్ మొదలై చాలా సేపైంది అందరి చూపులు, ఆలోచనలు ఇప్పుడు, ఆ మేనేజర్‌ని పట్టుకొని ఝాడిద్దామనే!! అటు చూశారు ఇటు చూశారు, అది ఎక్కడుంటుందో, గబుక్కున అర్థం కాలే దెవరికీ!

వాటికే కాదు మనకు తెలుసా అని!

ఇంతకీ ఉన్నట్టా, లేనట్టా?!! అదేనండీ ‘బుధ్ధి’!

“పెద్దక్షరాలలో రాసి అడుగుతున్నాను, ఉన్నట్టా లేనట్టా,ఉండీ లేనట్టా?!!”

నా ఉద్దేశం చెప్పనా, ఖచ్చితంగా ఉన్నది,

కానీ వాడుకలో లేనట్టుంది!

అదిగో మళ్ళీ–లేనట్టు, ఉన్ళట్టూ రెండూ అంటారు మీరే!!

సరే,ఫిఫ్టీ ఫిఫ్టీ అనుకోండి,గొడవలేని వ్యవహారం!!

బుధ్ధి జీవులందరూ ఆలోచించాలి మరి!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here