కన్నడ కథాసుమాలు.. తెలుగు సుగంధాలు

0
9

[శ్రీ కల్లూరు జానకిరామరావు గారి ‘కన్నడ కుసుమాలు తెలుగు కోమలాలు’ అనే అనువాద కథాసంకలనాన్ని సమీక్షిస్తున్నారు కొల్లూరి సోమ శంకర్ ]

[dropcap]క[/dropcap]ల్లూరు జానకిరామరావు గారు వృత్తిరీత్యా విశ్రాంత ఆంగ్ల ఉపాధ్యాయులు. ప్రవృత్తి రీత్యా కవి, కథకులు, అనువాదకులు. వీరు అనువదించి ప్రచురించిన ‘కన్నడ కుసుమాలు తెలుగు కోమలాలు’ అనే అనువాద కథాసంకలనంలో 16 అనువాద కథలు, ఒక తెలుగు స్వీయ కథ ఉన్నాయి.

~

కర్నాటకలో పశువైద్యులైన డా. మురళీధర కిరణ్‍ కెరె రచించిన కథని ‘కపిల’ అనే పేరుతో అనువదించారు. కథలో ముఖ్యపాత్ర ఓ వెటర్నరీ డాక్టర్. అర్ధరాత్రి ఆయనకు ఫోన్ వస్తుంది. సురేష్ అనే వ్యక్తి తన జెర్సీ ఆవు కపిలకి అనారోగ్యంగా ఉందని చెప్తాడు. బాగా వానపడుతుండడం వల్ల, అలసట వల్ల, వాళ్ళ ఊరికి వెళ్ళడానికి అవకాశం లేక ఫోన్‍లో కొన్ని మందుల పేర్లు చెప్పి వెయ్యమంటాడు. కానీ ఆ ఆవు కోలుకోదు. దాంతో ఉదయాన్నే వెళ్ళి, ఆవుని జాగ్రత్తగా పరీక్ష చేసి చికిత్స చేసి కాపాడుతాడు. కానీ కొన్ని రోజుల తర్వాత అటువంటిదే జబ్బే సురేష్ పొరుగుంటి వారి చంద్రి అనే ఆవుకు వస్తే, దాన్ని కాపాడలేకపోతాడు. కథ చివర్లో పశువైద్యుడు, ఆవు యజమాని తీసుకున్న నిర్ణయం పాఠకులను చలింపజేస్తుంది.

ప్రముఖ కన్నడ రచయిత్రి మాలతి ముదకవి గారి కథని ‘నీడ’ అనే పేరుతో అందించారు. ఒకప్పటి ప్రేమికులు నందిని, నిఖిల్ చాలా ఏళ్ళ తరువాత తారసపడతారు. నందిని పలకరిస్తుంది. గతంలో తాము కలుసుకునే బస్ స్టాప్ వద్ద కలుసుకుందామని నిఖిల్ చెప్తాడు. మొదట సంశయించినా, సరేనంటుంది. సాయంత్రం అనుకున్న చోట కలుస్తారు. తనని క్షమించమని, తాను ఆమెను మోసం చేశానని, క్షమించమని అంటాడు నిఖిల్. తనని వదిలేసి వెళ్ళిపోయి నిఖిల్ మోసం చేశాడని అంటుంది నందిని. అప్పుడు తాను మిత్రుడితో చెప్పించినది అబద్ధమని, అలా ఎందుకు చేయాల్సి వచ్చిందో కూడా చెప్తాడు నిఖిల్. ఇద్దరూ ఒకరి అవసరం మరొకరికి ఉందని గ్రహిస్తారు. కొత్త జీవితం గడపాలని నిర్ణయించుకుంటారు. జీవితంలో వేసే కొన్ని తప్పటడుగులకి భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందన్న హెచ్చరిక చేస్తుందీ కథ.

మంజు ఎం. దొడ్డమణి గారి కథని ‘అదృశ్య భల్లూకం’ పేరిట అనువదించారు. కనిపించని ఓ ఎలుగుబంటి ఆ ఊరిలోని ఆడవాళ్ళపైనే ఎందుకు దాడి చేస్తోంది? అమాయకులు, నిరక్షరాశ్యులైన ఊరి జనాలు దీని వెనుక ఉన్న రహస్యాన్ని ఛేదించలేకపోతారు. గ్రామస్థులంతా కలిసి, తన ఊరిపై దాడి చేస్తున్న ఎలుగుబంటి నుంచి తమని రక్షించమని అటవీశాఖ అధికారులకు అర్జీ పెట్టుకుంటారు. అటవీ అధికారులు పన్నెండు మందితో ఓ దళాన్ని ఏర్పాటు చేసి ఎన్ని రోజులు గస్తీ తిరిగినా, ఎలుగుబంటి కనబడదు. చివరికి వారు ఆ ఊరు నుంచి వెళ్ళిపోతారు. తర్వాత ఏమవుతుంది? కథలోని ఆఖరి వాక్యంలో చాలా నేర్పుగా ఆ ఎలుగుబంటి ఎందుకు కనిపించదో రచయిత్రి/అనువాదకులు చెప్పినప్పుడు – నిజానిజాలు గ్రహించలేని అమాయకులున్నంత కాలం మనుషుల్లోని కనిపించిన మృగాలు తమ దాడులు కొనసాగిస్తూనే ఉంటాయని అర్థమవుతుంది.

భార్యని హత్య చేశాడన్న ఆరోపణలపై అరెస్టయిన వ్యాస్‍ని మరో హత్య చేయించేలా ప్రోత్సహిస్తాడు పోలీస్ అధికారి. మరి వ్యాస్ అతని ఒత్తిడికి లొంగాడా? తన భార్యనే చంపమని ఎస్.ఐ. ప్రకాశ్ – వ్యాస్‍ని ఒప్పించి తన మిత్రుడిలా ఇంటికి వచ్చి పని కానిచ్చుకు వెళ్ళమని చెప్తాడు. కానీ అతని భార్య అనితని చూస్తే, ప్రకాశ్ చెప్పిన స్వభావం ఆమెలో కనబడదు. పైగా తనని చంపడానికే వ్యాస్ వచ్చాడని ఆమెకు తెలుసు. చిత్రమైన మలుపులతో, ఆసక్తికరంగా సాగే కథ ‘ది పర్‍ఫెక్ట్ మర్డర్’. కన్నడ మూలం పి. వాసుదేవమూర్తి.

ఋణం తీసుకున్న బ్యాంకుని మోసం చేయాలనుకుంటాడు కాళేరావు. వాయిదాలు కట్టకుండా ఉంటే, తర్వాత ప్రభుత్వాలు ఎలాగూ ఋణామాఫీలు ప్రకటిస్తాయి కదా, అప్పు ఎగ్గొట్టచ్చని భావిస్తాడు. బ్యాంకు వాళ్ళు ఎన్ని నోటీసులిచ్చినా పట్టిచ్చుకోడు. విసిగిపోయిన బ్యాంకు వాళ్ళు కోర్టులో కేస్ వేసి, న్యాయస్థానానికి రప్పిస్తారు. కాళేరావు తరఫు న్యాయవాది కోర్టులో ఎలా మసలుకోవాలో, ఎలా నడుచుకోవాలో అతనికి బాగా నేర్పుతాడు. బ్యాంకు తరఫు న్యాయవాది ఎలా వాదించినా కూడా, తాను ఋణం తీసుకోలేదనీ, బ్యాంకు పత్రాలలో ఉన్న సంతకం తనది కాదని వాదిస్తాడు.  కేసు వాయిదా పడుతుంది. రెండోసారి విచారణకు వచ్చినప్పుడు బ్యాంకు తరఫు లాయర్ చాలా తెలివిగా కాళేరావు చేస్తున్న మోసాన్ని కోర్టులో బట్టబయలు చేస్తాడు. ‘నాకేం తెలీదు దేవర’ కథ తాను తవ్విన గోతిలో తానే పడతాడనే నిజాన్ని మరోసారి ఋజువు చేస్తుంది. కన్నడ మూలం కె. ఉషా పి రాయ్.

శ్రీమతి వసుమతి ఉడుప గారి కథకి అనువాదం ‘మాసిపోని జ్ఞాపకాలు’. బెంగుళూరు నగరంలో ఒక ఒంటరి స్త్రీ ఇంట్లో ఒక గదిలో అద్దెకుండో మరో ఒంటరి స్త్రీ కథ ఇది. ఇంటావిడ ఇందిరని పిన్ని అని పిలుస్తూ, ఆవిడ అభిమానాన్ని సంపాదిస్తుంది శరావతి. కాలక్రమంలో ఇందిర తన మీద అజమాయిషీ చేస్తున్నట్టు అనుమానం వస్తుంది శరావతి. తనని అదుపాజ్ఞలలో ఉంచడానికి ప్రయత్నిస్తున్నట్లు భావిస్తుంది. నోరు జారి ఓ మాట అనేస్తుంది. మర్నాడు ఆదివారం.. ఇందిర తన గతాన్ని చెప్పాకా, ఆమెది అజమాయిషీ కాదనీ, తనపై బాధ్యత అని గ్రహిస్తుంది శరావాతి. చక్కని కథ.

ఈ సంకలనంలోని అత్యంత వైవిధ్యమైన కథ ‘నగరం వివస్త్రమైన రోజు’. శీర్షిక తెలియజేస్తున్నట్టే – ఉన్నట్టుండి ఓ రోజున ఊర్లోని మనుషులంతా, వయోభేదం లేకుండా నగ్నంగా మారిపోతారు. బట్టలు మాయమైపోతుంటాయ్.. వీధుల్లో తిరుగుతున్నవారు సిగ్గుతో, అవమానంతో క్రుంగిపోతారు. అతి విచిత్రకరమైన సంఘటన ఏదో జరిగిందని జనాలు గ్రహిస్తారు. మనుషుల్లోని స్వార్థానికి ప్రతీక నగ్నత్వం. కథలో చివర్లో జనాలు నిస్వార్థంగా తోటి మనిషికి సాయం చేయడంతో.. మళ్ళీ అందరికీ వాళ్ళ శరీరాలపై దుస్తులు వస్తాయి. ప్రతీకాత్మక, అధివాస్తవిక కథ. ఇలాంటి కథలను రాయడంలో ఎంతో నేర్పు ఉండాలి. డా. మీర్జా బషీర్ గారి మూలకథని, అంతే నైపుణ్యంతో అనువదించారు జానకిరామరావు గారు.

జి. సరిత గారి కథకి అనువాదం ‘లక్ష్మి’. భర్తకి పక్షవాతమొచ్చి – కుటుంబాన్ని నడిపేందుకు కొట్టు పెట్టుకున్న లక్ష్మికి ఎన్నో కష్టాలు, ఆటంకాలు ఎదురువుతాయి. కానీ వాటన్నిటినీ తట్టుకుని – జీవితంలో నిలదొక్కుకోగలిగిదంటే కారణం ఓ తాత! ఆయన నూరిపోసిన ధైర్యం లక్ష్మి భావి జీవితానికి మార్గదర్శనం చేస్తుంది.

కె. ఉషా పి రాయ్ గారి కథకి అనువాదం ‘నెచ్చెలికి బాష్పాంజలి’. సుమ సుధ అనే ఇద్దరు స్నేహితురాళ్ళు ప్రధాన పాత్రధారులు. ఇద్దరూ ఒకే ఆఫీసులో పని చేస్తుంటారు. సుమ పై అధికారి. ఎంత ఆప్తస్నేహమైనా, పనివేళల్లో వ్యక్తిగత విషయాలను ప్రస్తావించి, సమయం వృథా చేయడానికి ఇష్టపడదు సుమ. ఆమె భర్త ఓ ఛార్టర్డ్ ఎకౌంటెంట్. పెళ్ళయి చాలా ఏళ్ళయినా సంతనం కలగని సుమ, ఆమె భర్త చివరికి ఎవరినైనా దత్తత తీసుకోవాలని అనుకుంటారు. ఈ విషయాన్ని సుధకి కూడా చెప్పదు. ఓ రోజు హఠాత్తుగా సుధని తన కాబిన్‍లోకి పిలిచి తాను మాతృత్వాన్ని అనుభవిస్తున్నానని చెబుతుంది. విస్తుపోయిన సుధకి – తాను ఓ ఆడపిల్లను దత్తత చేసుకున్నామని చెప్పి సాయంకాలం ఇంటికి రమ్మంటుంది. సాయంత్రం భర్తతో కలిసి సుమ ఇంటికి వెళ్ళి పాపని చూసి సంతోషిస్తుంది సుధ. కానీ ఆ పాపకి ఒక పాదం లేకపోవడం చూసి బాధపడుతూంటే, ఆ పాపనే ఎందుకు తెచ్చుకుందో సుమ చెప్పిన కారణం విని స్నేహితురాలి మీద ప్రేమతో కన్నీరు కారుస్తుంది సుధ.

కె. తారాభట్ గారి కథకి అనువాదం ‘చీకటి బ్రతుకులు’. బాలికగా జన్మించినప్పటికీ, బాలుడి లక్షణాలున్న చాంద్‌ను – తల్లి చనిపోవడంతో ఓ అనాథాశ్రమంలో చేరుస్తాడు తండ్రి. మరో పెళ్లి చేసుకుంటాడు. కొన్నేళ్ళ తరువాత అతనే వెళ్ళి కూతురిని ఆశ్రమం నుంచి ఇంటికి తీసుకువస్తాడు. మారుతల్లి ఆరళ్ళు పెడుతుంది. అమాయకురాలైన చాంద్ అన్నీ సహిస్తుంది, గొడ్డు చాకిరీ చేస్తుంది. చివరికి ఆర్థిక ఇబ్బందులకు తాళలేక తండ్రే స్వయంగా చాంద్‍ని అమ్మేస్తాడు. అత్యంత వేదన నిండిన ఈ కథ అనువాదంలా అనిపించదు. తెలుగు కథ చదువుతున్నట్టే ఉంటుంది. కథలోని ఆఖరి వాక్యాలు కన్నీరు తెప్పిస్తాయి.

డ్రైవ్-ఇన్’ బి.ఆర్. నాగరత్న గారి కథకి అనువాదం. డబ్బు సంపాదనే ధ్యేయంగా బ్రతికే ఓ వ్యక్తి కథ. తమ తెలివిని, వనరులను ఆదాయం పెంచుకోడం ఎలా వాడుకోవచ్చో ఈ కథలో నాని పాత్ర వెల్లడిస్తుంది.

కె. తారాభట్ గారి కథకి అనువాదం ‘ఆర్తనాదం’. కుటుంబ సభ్యుల మధ్య ఆప్యాయతలు నశించి, స్వార్థం పెచ్చుమీరితే, ఆ ఇంట్లో అనాదరణకి గురవుతున్నవారి జీవితం ఎంత దుర్భరంగా ఉంటుందో ఈ కథ చెబుతుంది. ఈ కథ గురించి ముందుమాటలో శ్రీ. టి.ఎస్.ఎ. కృష్ణమూర్తి గారు వెల్లడించిన అభిప్రాయంతో పాఠకులు ఏకీభవిస్తారు.

శ్రీమతి కుముదా పురుషోత్తం గారి కథకి అనువాదం ‘దీర్ఘాయుష్షు’. ఒక కుటుంబం. చిన్నకొడుకు చదువుకుని ఉద్యోగాల కోసం విదేశాలకీ వెళ్లిపోతే, కూతురు పెళ్ళయి ఢిల్లీ ఉంటుంది. వృద్ధురాలయిన 90 ఏళ్ళ తల్లి పెద్ద కొడుకు హరి దగ్గర ఉంటుంది. పెద్ద కోడలు వాణి అత్తగారిని ఎంతో జాగ్రత్తగా చూసుకుంటుంది. వృద్ధాప్యంతో పాటు మతిమరుపు కూడా వచ్చిన అత్తగారితో వాణి ఎలా నెట్టుకొచ్చిందో ఈ కథ చెబుతుంది. మోసేవాళ్ళపైనే మరింత భారం మోపుతారన్న వాస్తవాన్ని ఈ కథ మరోసారి గుర్తుచేస్తుంది.

ప్రదీప్ గులతి గారి కథకి అనువాదం ‘చారులత స్వప్నం’. పేద కుటుంబంలో పుట్టిన చారులతని పెళ్ళీడు వచ్చాకా, థాయ్‍ల్యాండ్‍లో పనిచేస్తున్న సుబ్రోతోకిచ్చి పెళ్ళి చేస్తారు. కొద్ది రోజులు బాగానే ఉన్న సుబ్రోతో – తర్వాత తన అసలు రూపాన్ని బహిర్గతం చేస్తాడు. భార్యని తారుస్తాడు. ఆమె ఇండియా వెళ్ళడానికి లేకుండా, డాక్యుమెంట్లన్నీ తన దగ్గరే ఉంచుకుంటాడు. బలవంతంగా వేశ్యావృత్తిలోకొస్తుంది చారులత. ఆమెను రక్షించి తమ షిప్‍లోనే రహస్యంగా ఇండియాకి తీసుకొస్తాడు అనిల్. మరి స్వదేశానికొచ్చిన చారులత జీవితాన్ని దిద్దుకుందా? ఆసక్తిగా చదివిస్తుందీ కథ.

కుసుమ కోమలం’ జానకిరామరావు గారి స్వీయ తెలుగు కథ. కుసుమ, కోమల్ అనే దంపతులు అరమరికలు లేకుండా జీవిస్తుంటారు. కుసుమ ఇప్పుడిప్పుడే కథా రచయిత్రిగా పేరుతెచ్చుకుంటోంది. ఆమెకు కోమల్ సహాకరం ఉంది. ఉన్నట్టుండి కుసుమ కళ్ళలో ఏదో సమస్య తలెత్తి క్రమంగా అంధురాలైపోతుంది. నేత్రధామ్‍లో పనిచేస్తున్న కోమల్ స్నేహితుడు మూర్తి సలహా మేరకు ఐ బ్యాంకులో రిజిస్టర్ చేసుకుంటారు. ఓ రోజు ఓ పెద్ద డాక్టర్ వస్తున్నారనీ, కుసుమని తీసుకుని రమ్మని చెప్తాడు మూర్తి. ఆ డాక్టర్ కోసం కుసుమ ఎదురుచూస్తుండగా, ఏదో పని మీద కోమల్ బయటకు వెళ్తాడు. ఇంతలో డాక్టర్ గారు రమ్మన్నారంటూ మూర్తి కోమల్‍కి ఫోన్ చేస్తాడు. హాస్పటల్‍కి ఎదురుగానే ఉన్నా, వచ్చేస్తున్నా అంటాడు కోమల్. కానీ ఓ ట్రక్ గుద్దేయడంతో యాక్సిడెంట్ అవుతుంది. కోమల్‍ని ఆసుపత్రిలో చేర్చాల్సి వస్తుంది. పరిస్థితి క్షీణిస్తున్న కోమల్, చివరి కోరికగా తన కళ్ళను కుసుమకి అమర్చేలా చూడమని కోరి చనిపోతాడు.

శ్రీమతి వసుమతి ఉడుప గారి కథకి అనువాదం ‘మల్లయ్య గణితం’. కపంటంలేని మల్లయ్య లెక్కల్లో ఎంత ఘటికుడో ఈ కథ చెబుతుంది. నవ్విస్తుంది.

శ్రీమతి వసుమతి ఉడుప గారి మరో కథకి అనువాదం ‘ఎంగిలి’. ఆధునిక మానవ సంబంధాల లోని నీచాన్ని ఈ కథ చాటుతుంది. మనిషి అక్కర్లేదు కానీ, కోట్ల విలువైనా ఆమె ఆస్తి కావాలి. ‘తాను జారుడుమెట్ల పైనున్నాననే సత్యం తెలిసిన యువతి రాధ, ఆ జారుడుమెట్ల నుండి జారకుండా పట్టు సాధించింది’ అన్న వాక్యాలు రాధ మనోనిబ్బరాన్ని చాటుతాయి. భర్త దుర్గుణాలు నచ్చక, పుట్టింటికి వచ్చేసి, చదువుకుని తన కాళ్ళ మీద తాను నిలబడుతుంది రాధ. అక్క నిర్ణయాన్ని సమర్థించి, ఆమెకు అండగా ఉంటాడు తమ్ముడు రామకృష్ణ. తదుపరి కాలంలో వారి జీవితం మలుపులు అనేక మలుపులు తిరుగుతుంది. వృద్ధాప్యం మీద పడి, రాధ చనిపోయిన తర్వాత, ఆమె ఆస్తి కోసం ఆమె భర్త తరపు వాళ్ళొచ్చి గొడవ చేస్తారు, కోర్టులో కేసు వేస్తారు. తీర్పు రాధ భర్త కుటుంబీకులకు అనుకూలంగా వస్తుంది. ‘భర్త ఎంగిలి వద్దనుకుని వచ్చిన రాధకి, ఆమె ఎంగిలే భర్తవైపు వాళ్ళకి కావల్సి వచ్చింది’ అంటూ కథని ముగిస్తారు.

~

మూల రచయితల నాడి, వారి రచనలలోని వేడి, తడి గ్రహించి అనువాదాలందిస్తున్నా’రంటూ ముందుమాట శీర్షికలో శ్రీ. టి.ఎస్.ఎ. కృష్ణమూర్తి గారు చెప్పిన మాటలు అక్షరసత్యాలనిపిస్తాయి ఈ కథలు చదివాకా.

“కథనాలు ఆసక్తికరంగా సాగేలా, పాఠకుల చూపులు పంక్తుల వెంట పరుగులు తీసేలా అనువాదానికి చక్కటి, చిక్కటి తెలుగు భాషను ఉపయోగించటంలో మంచి ప్రతిభ చూపారు కల్లూరువారు” అని వ్యాఖ్యానించారు టి.ఎస్.ఎ. కృష్ణమూర్తి గారు. ఈ కథలని చదివిన పాఠకులు ఈ అభిప్రాయాన్ని కాదనలేరు.

***

కన్నడ కుసుమాలు తెలుగు కోమలాలు (అనువాద కథాసంకలనం)
రచన: కల్లూరు జానకిరామరావు
ప్రచురణ: శ్రీకృష్ణదేవరాయ గ్రంథమాల, బెంగుళూరు.
పేజీలు: xvi+138
వెల: ₹ 130/-
ప్రతులకు:
కల్లూరు జానకిరామరావు,
నెం. 402, ఎ బ్లాక్,
దీపిక పాలెస్, ఎల్.జి. ఎన్‍క్లేవ్,
నంజప్ప సర్కిల్
విద్యారణ్య (పోస్టు)
బెంగుళూరు. 560097
ఫోన్: 97408 49084

 

 

~

కల్లూరు జానకిరామరావు గారి ప్రత్యేక ఇంటర్వ్యూ:
https://sanchika.com/special-interview-with-mr-kallur-janakiramarao/

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here