కన్నడ సాహిత్య చందనశాఖి కువెంపు

0
8

[box type=’note’ fontsize=’16’] “రాయి, మట్టి, గడ్డి, ధూళి, జలకణం, అగ్నికణం నాలో ఎచ్చట చూచిన చైతన్యమే అని చెప్పుకున్న కువెంపు జాతిలో, జీవనంలో, జీవిలో దాన్ని నింపే ప్రయత్నం చేసిన యుగదకవి” అంటున్నారు సిహెచ్. లక్ష్మణ చక్రవర్తి “కన్నడ సాహిత్య చందనశాఖి కువెంపు” అనే వ్యాసంలో. [/box]

ఆనందమయ ఈ జగ హృదయ
ఏ తకె భయ? మాణో
సూర్యోదయ చంద్రోదయ దేవర దయకాణీ
ఆనందమయమీ జగతి హృదయం.

భయాన్ని వదులు. సూర్యోదయ, చంద్రోదయములు దేవుని దయ చూడుమని, ప్రకృతి రామణీయకతకు పరమాత్మ కారణమని భావించిన కవి కుప్పళ్ళి వెంకటప్పగారి పుట్టప్ప. కువెంపుగా ప్రసిద్ధులైన పుట్టప్ప డిసెంబర్ 29న 1904లో జన్మించారు. 12 ఏండ్ల వయసులో తండ్రిని, 20 ఏండ్ల వయసులో తల్లిని పోగొట్టుకున్నా రామకృష్ణ ఆశ్రమంలో తన విద్యను కొనసాగించాడు. 1927లో మైసూరు మహారాజా కళాశాలలో బి.ఏ చదువుతున్న రోజులలోనే విద్యార్థి కవి సమ్మేళనానికి బెంగుళూరులో అధ్యక్షత వహించాడు. 1929లో అదే కళాశాలలో ఎం.ఏ పూర్తి చేసుకుని అక్కడే తన 25వ ఏట లెక్చరర్ గా కన్నడ శాఖలో చేరాడు. 1939-46 మధ్య అసిస్టెంట్ ప్రొఫెసర్ గా 1946-55 మధ్య మైసూరు విశ్వవిద్యాలయ ఆచార్యుడిగా , 1956-60 కాలంలో అదే విశ్వ విద్యాలయానికి ఉపాధ్యక్షులుగా పని చేశారు. విద్యారంగంలో అత్యున్నత స్థానాన్ని అధిరోహించిన కువెంపు సాహిత్యరంగంలో అత్యున్నతమైన ఙ్ఞాన పీఠ పురస్కారాన్ని 1968లో పొందారు. వివిధ విశ్వ విద్యాలయాల గౌరవ డాక్టరేట్లు, కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాలు , పద్మభూషణ పద్మవిభూషణ వంటి ప్రభుత్వ పురస్కారాలు అందుకున్న సాహితీవేత్త కుప్పళ్ళి వెంకటప్పగారి పుట్టప్ప. 90 ఏళ్ళ నిండు జీవితాన్ని అనుభవించిన కువెంపు 10-11-1994లో మరణించారు. ఆయన గతించి రెండు దశాబ్దాలు దాటినా ఆయన రచనలు సాహిత్య పరిమళాన్ని అందిస్తూనే ఉన్నాయి.

20వ శతాబ్ది కొందరు తొలితరం భారతీయ సాహితీవేత్తలలాగే కువెంపు కూడా ఏదో ఒక సాహిత్యప్రక్రియకుతనను తాను పరిమితం చేసుకోలేదు.తన సృజన వ్యాపారంలో ఖండకావ్యం,మహాకావ్యం,నవల,నాటకం,కథానిక,సాహిత్యవిమర్శ,బాలసాహిత్యం,అనువాదం,జీవిత చరిత్ర, స్వీయచరిత్ర వంటి ప్రక్రియలన్నిటినీ అనుసరించారు. ఆ ప్రక్రియలకు ఒక గౌరవాన్ని,ఔన్నత్యాన్ని తీసుకు వచ్చారు. విభిన్న ప్రక్రియలలో రచనా వ్యాసంగాన్ని కొనసాగించిన బహుముఖ ప్రఙ్ఞాశాలి కువెంపు.

కన్నడ సాహిత్యశిఖరంగా ఎదిగిన కువెంపు తన స్కూలు చదువుల కాలంలో ఆంగ్ల కవితలను రచించేవాడు.ఉన్నత పాఠశాల చివరి తరగతిలో ఉన్నప్పుడే ఆరు ఆంగ్ల కవితలను రచించి వెలువరించారు. ఉన్నాయి. సృజనశీలిగా ఆంగ్ల భాష నుంచి ఎదిగిన కువెంపును కన్నడ సాహిత్యం వైపు మరలించిన వ్యక్తి ప్రముఖ థియాసఫిస్ట్, విద్వాంసుడు అయిన జేమ్స్ కజిన్స్ కువెంపు కవితలను చదివి ఎదురుగా ఉన్న అతడ్ని ,అతడి బట్టలను చూసి `ఇది మాత్రం స్వదేశి కవితమాత్రం విదేశి‘ అన్నాడట. ఇంగ్లీషు తో బాటు కన్నడంలో కూడా ఏమైనా వ్రాశావా? ఉంటే చూపించమనగానే ‘‘ఆధునిక భావాలను మహాత్తరమైన ఆలోచనలను అభివ్యక్తం చేయడానికి కన్నడం తగినది కాదు‘‘’’ అని కువెంపు చెప్పగానే కజిన్స్ ’భాషకు శక్తిని ఆపాదించే వారం మనం‘ కాబట్టి ఏదీ అసమర్థమైన భాష కాదు అని కువెంపుకు చెప్పి అతడ్ని కన్నడ భాషలో సాహిత్యసృష్టి చేయమని ప్రోత్సహించాడు. అలా కన్నడ సాహిత్య సృజనలోకి అడుగుపెట్టిన కువెంపు కన్నడ సాహిత్య ప్రక్రియలన్నింటిలోనూ తన ముద్రను వేశారు.

మలెనాడులో పుట్టి పెరిగిన నవ్యకావ్యపు విశిష్టకవి కువెంపు. తాను పుట్టిన నేల ప్రకృతి ఆరాధనను నేర్పితే, ప్రకృతే పరమాత్మ అన్నది తాను పెరిగిన కళాశాల వాతావరణం నేర్పింది. శ్రీరామ కృష్ణాశ్రమాధిపతి ఒత్తిడిపై ఆశ్రమంలో చేరిన కువెంపుకు ఆధ్యాత్మికతను ఆశ్రమ వాతావరణం అలవరించింది. మలెనాడులో ప్రకృతి ఆరాధన పరమేశ్వరారాధన అన్న భావం బలపడింది. ప్రాథమిక పాఠశాల విద్యార్థిగా ఉన్నప్పుడే ఎన్నో కన్నడ సాహిత్య గ్రంథాలను చదివారు.తన ఙ్ఞానాన్ని మరింత విస్తృత పరచుకున్నారు. శ్రీరామకృష్ణ పరమహంస, వివేకా నందుల ప్రభావానికి లోనైన కువెంపులో సాహిత్యసృజన, దేశభక్తి, తాత్త్వికతలు త్రిపుటిగా దర్శనమిస్తాయి.

ఆయనలో దేశభక్తి తీవ్రత ఎంతగా ఉండేదంటే భగవంతుని కూడా ఆయన లెక్కచేయలేదు.’నూరు దేవర నెల్ల నూకాచెదూర‘ (నూరు గురు దేవతలను అవతలకు గెంటెయ్యు) అన్నారు. దేవతలను గెంటెస్తే దైవత్వం ఎక్కడిది?దేవుడు ఎక్కడ?అన్న అనుమానాలను నివృత్తి చేస్తూ ’’భారతాంబెయె దేవి నమగింద పూజిసువబార‘‘ (మనదేశమే మన ఆలయం మన శక్తి సేవలన్నీ విశ్వరూపిణి) అని దేశాన్ని దైవంగా భావించాడు. భారతమాతపై భక్తి ఆయనలో నరనరాన జీర్ణించుకుపోయింది. భారతదేశంపై ఉన్నంత అభిమానం తన కన్నడ భాషపై ,కర్ణాటక రాష్ట్రం పై ఉంది. అందువల్ల భారతమాతకు బిడ్డ కన్నడమాత అని కీర్తిస్తూ ’భారతజనినియ తనుజాతె‘ అన్నాడు. భారతదేశం పట్ల విపరీత మైన అభిమానం కలవాడైనా, రాష్ర్టం పట్ల భాషపట్ల అచంచలమైన అవగాహన, ప్రేమ కలిగినవాడైనా ’’సర్వరిగెసమబాళు సర్వరిగె సమపాలు‘‘ అన్న ఉదాత్తమైన ఆశయంతో సాహిత్యసృష్టి చేసిన వ్యక్తి కువెంపు. అందుకే

గుడి చర్చు మసీజీదు గళబిట్టు హెరబన్ని
బడ తనవ బుడమట్ట కీళబన్ని
మౌఢ్యతెయమారియను హెర
దూడలై తన్ని, విఙ్ఞాన దీవిగెయ
హిడియబన్ని, ఓబన్ని సోదరబేగబన్ని

గుడి, చర్చి, మసీదులను వదలి బయటిరండి. బీదరికాన్ని కూకటి వేళ్ళతో పెకిలించాలి. రండి. మూఢాచార మహమ్మారిని తరిమి వేయండి. విఙ్ఞాన జ్యోతి ని వెలిగింపరండి. సోదరులార వేగంగా రండి అని పిలుపు నిచ్చాడు. కులమతాలు గీచుకున్న పంజరంలో నుండి బయటికి రావడమే మానవస్వేచ్ఛకు అసలైన అర్థం ఇస్తుందన్న స్ఫురణ కువెంపులో కనిపిస్తుంది.

కువెంపు వ్రాసిన ’జయభారత జననీయ తనుజతే‘ అన్న గేయం కన్నడ రాష్ర్ట గేయంగా గుర్తింపు పొందింది. జాతీయత, భారతీయతల విషయంలో రవీంద్రనాథ్ ఠాగోర్‌తో పోల్చదగిన కవి కువెంపు. రచనలు ప్రక్రియల దృష్ట్యా, జీవనశైలి, సౌందర్యాన్వేషణ దృష్ట్యా, ఇద్దరిలో పోలికలు కనిపిస్తాయి. స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గోకపోయినా ఇద్దరూ దేశభక్తులే. కువెంపుకు ఠాగోర్ రచనలతో పరిచయం ఉంది. అనేక ప్రక్రియలలో దేశీయ చైతన్యాన్ని నింపేందుకు రచనలు చేసిన కువెంపు ను అధ్యయనం చేయడమంటే కన్నడ సాహిత్య పునరుజ్జీవనాన్ని అధ్యయనం చేస్తున్నట్లు భావించవచ్చు. 20వ శతాబ్దపు కన్నడ సాహిత్య పునురుజ్జీవనంతో కువెంపు రచనలు వేసిన ప్రభావాన్ని, చూపిన ప్రాముఖ్యతను కొన్ని మాటలలో నిర్వచించలేము.

17వ శతాబ్ది ఆంగ్ల సాహిత్యంలో చైతన్యం కొరవడిన సమయంలో వర్డ్స్‌వర్త్ తన రొమాంటిక్ పొయెట్రీతో జీవం పోసినట్లు 20వ శతాబ్దపు కన్నడ సాహిత్యానికి కువెంపు తన రచనల ద్వారా జీవం పోశాడు. కువెంపు కుటుంబ సభ్యులు కూడా రచయితలే. తేజస్వీ, తరిణి రాజేశ్వరి, చిదానందగౌడలు కొడుకు కూతురు కోడలు అల్లుళ్ళు. వీరంతా రచయితలే. తేజస్వి మైసూరు వదలి సొంతూరు చేరి సాహిత్యం, వ్యవసాయంతో జీవితంలో స్థిరపడితే కువెంపు సొంతూరు నుండి మైసూరుకు వచ్చి చేరారు. అదే కొడుకు తండ్రి మధ్య ప్రధానమైన తేడా. గ్రామీణ జీవితం నుండి నగర జీవితానికి పరిణామం చెందిన కువెంపు గురువు శ్రీకాంతయ్య మలెనాడు దీపస్తంభం అని కీర్తించారంటే ఆయన గొప్పతనం ఏమిటో ఊహించుకోవచ్చు.

కువెంపు సృజన చైతన్యం: కువెంపు Nativity ని ప్రేమించే కవి. అందువల్ల ఆయన రచనలన్నీ కర్ణాటక ప్రాంత స్థితి గతులను ప్రతిబింబిస్తాయి. ‘కానూరు సుబ్బమ్మ హెగ్గడితి’ కువెంపు రచనల్లో గొప్ప ప్రాదేశిక నవల. ఇందులో మలెనాడు ప్రదేశం లోని సామాన్య ప్రజల వైవిధ్య జీవితం ఉంది. నవ కన్నడకు మొదటి ఉదాహరణప్రాయమైన ఈ నవలలో వాస్తవికత, దాని చిత్రణలో ప్రజ విషయ పరిఙ్ఞానం, మనుష్య స్వభావాలు ఆశ్చర్యాన్ని కలిగించి హత్తుకు పోతాయి. కానూరు సుబ్బమ్మ ఈ కృతిలోని ప్రముఖ పాత్ర.

కువెంపు రచనల్లో కర్ణాటక రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాలు కనిపిస్తాయి. అందులో వారి జీవన స్థితిగతులు ప్రతిబింబిస్తాయి. యూరోపియన్ భాషలో కనిపించేంత మంచి నవలలు కన్నడ భాషలోనూ ఉండాలన్న రచయిత కువెంపు. 1936వ్రాసిన కానూరు సుబ్బమ్మ హెగ్గడితి ఎంతగా మలెనాడు జీవితాన్ని చిత్రించాడో అంతే ఎక్కువగా 1967లో వచ్చిన ‘మాలెగలల్లి మదుమగలు’ నవలలో కూడా చిత్రించాడు. మలెనాడు పల్లె జీవితం ఈ నవలల్లో కనిపిస్తుంది. ఈ రెండు నవలలు వలసవాద సంధికాలంలో వెలువడ్డాయి. సాధారణ, పేద ప్రజలు తమ మతాన్ని వదిలి వేరే మతాన్ని స్వీకరించడం, నాటి పరిస్థితుల్లో క్రిస్టియానిటీ వైపు మొగ్గుచూపడం వీటిలో చిత్రించాడు. ఉమ్మడి కుటుంబాల స్థితిగతులు మొదటి నవలలో చిత్రిస్తే, భూమిలేని కులీల గురించి వారు పడే కష్టాల గురించి దోపిడి గురించి రెండవ దానిలో చిత్రించాడు. గ్రామీణ జీవితం నుండి పట్టణ జీవితానికి వచ్చిన కువెంపును అతడి ఆలోచనలలోని తేడాను ఈ రెండు నవలలు మనముందు నిలుపుతాయి.

కువెంపు పునరుజ్జీవన యుగానికి చెందిన రచయిత. అందువల్ల ఆయన రచనల్లో సాహిత్య, సాంస్కృతిక, సామాజిక పునరుజ్జీవనానికి సంబంధించిన అంశాలు కనిపిస్తాయి. సాహిత్య పునరుజ్జీవనంలో ఆధునిక భాష, వస్తువు నిర్వహించిన పాత్ర గణనీయమైనది. ‘యమనసోలు’ అన్న చిన్ననాటికలో కొత్త కన్నడానికి గౌరవాన్ని తెచ్చి, అదే సందర్బంలో సరళ రచనను చేశారు.  ‘యమనసోలు’ సావిత్రి సత్యవంతుల ప్రసిద్దకథ. అది నాటక రూపాన్ని దాల్చింది. పురాణకథను ఆధునిక దృష్టితో చెబుతూ నూతన అర్థాన్ని స్ఫురింపచేస్తూ శూద్రతపస్వి, బెరళ్గె కొరళ్ అన్న రెండు నాటికలను రచించడం కూడా ఇందులో భాగమే. రక్తాక్షి, బిరుగాళి అనేవి పెద్ద నాటకాలు. బెరళ్గె కొరళ్ అన్న నాటికను సరళ రగడలో వ్రాశారు.

కువెంపు రచించిన మహాకావ్యం శ్రీ రామాయణ దర్శనం.   ఇది ఆయన ప్రతిభకు నిలువుటద్దం.       వాల్మీకి శ్రీమద్రామాయణాన్ని అనుసరించి విస్తారంగా చెబుతూనే స్వతంత్ర ప్రతిభను దార్శనికతను ప్రదర్శించాడు.     ఒక దశాబ్ది తప: ఫలం శ్రీ రామాయణ దర్శనం. 23వేల పంక్తులున్న ఈ మహాకావ్యం నాలుగు సంపుటాలు యాభై అధ్యాయాలుగా వ్యాప్తి పొందింది. ఇది బాహిరప్రవృత్తిని తెలిపే లౌకిక చరిత్ర కాదు. లౌకికాకిక, నిత్యానిత్యలను మూర్తీభవించే సత్య కథనం. ఇది ఇతిహాసం కాదు. కేవల కథకాదు. కథ ఇందులో నిమిత్తమాత్రము. ఆత్మకు శరీరంలా, రాముని కథలో రామ రూప పరాత్పరుని పురుషోత్తముని లోకలీలాదర్శనం ఇక్కడ రూపొందిందని కవి ఆద్యంతాల్లో చెప్పుకున్నాడు.

శ్రీరామాయణ దర్శనం అన్న పేరును సార్థకం చేస్తూ వ్రాసిన ఈ మహాకావ్యంలో అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విఙ్ఞానమయ ఆనందమయ స్థాయిని ఎక్కుతూ ఆత్మ పొందే పరిపూర్ణ వికాసానికి ఈ కథ సమగ్ర ప్రతిమ అయింది. అయోధ్య సంపుటం మనోమయ భూమికను, కిష్కింధ ప్రాణమయ భూమికను, లంకాసంపుటం అన్నమయ భూమికను శ్రీ సంపుటం విఙ్ఞానమయ ఆనందమయ భూమికలను నిరూపించడం ఒక దార్శనికత. ఇందుకు అనుగుణంగా ఇందులోని పాత్రలు ప్రతీక రూపాన్ని సంతరించుకోవడం మరో దార్శనికత. రచనలో ఈ రెండు దార్శనికతలకు లయాత్మకతను తీసుకువస్తూ రచనలో వాడిన మహాఛందస్సు ఇంకొక దార్శనికత. ఛందస్సు ప్రతీకాత్మక, వేదాంత పరిభాష, తాత్త్వికతలు ’శ్రీరామాయణ దర్శనం‘ అన్న రచనలో ఉన్నట్లు విమర్శకులు పేర్కొంటారు. ’first Kannada epic to show the influence of western epic and Literature‘ అన్న ఆచార్య హంపన్న మాటలు ఆలోచించదగినవి. ఈ రామాయణంలో అరవిందులు, వివేకానంద, చైతన్య, పరమహంస రచనల ఆలోచనల ప్రభావం కనిపిస్తుంది.

ఇంతటి మహాకావ్య రచన చేసినా చిన్నచిన్న భావగీతాలు, ఖండికలు,రచించడంలోనూ కువెంపు తన నైపుణ్యాన్ని ప్రదర్శించారు. కొన్ని కథాకావ్యాలను కూడా రచించారు. ఈ భావగీతాలలో ఆయన భావుకత ప్రత్యక్షంగా కనిపిస్తుంది.

హచ్చనె పచ్చనె వేదికయల్లి సాసిర గట్టలె ముత్తను చెల్లి
రన్నద కిరుహణతె గళల్లి శ్యామల తైలది హెన్నినబత్తి
కాయన బిల్లిన బెంకియు హొత్తి సొడరురి యుత్తిదె అల్లల్లి.

పచ్చటివేదికపై అసంఖ్యాకములైన ముత్యాలను వెదజల్లి, రత్నాల చిన్నిప్రమిదలలో శ్యామల తైలమున సువర్ణపు వత్తి హరివిల్లను అగ్ని ప్రజ్వరిల్లి అక్కడక్కడ దీపము వెలుగుచున్నది.

బండనుండు దుంబివిండుహాడుతి హవుహారుత
మత్తమధు మాస విదు బన్నిరెందు సారుత
జారుతిహుదు మాగిచళి, కుసుమిసిరువలతెగళలి
మొరెయుతిహవు సొక్కిదళి ముక్త జీవరందది

ఉలియెపిక, గళపెశుక,నుగ్గి బందితందది. మధుమాసమేతెంచినదని చెబుతూ భ్రమరాలు పుప్పొడిని సేవించి ఎగురుతున్నాయి. శిశిరంలో చలి జారుతున్నది. తీగలలో పూవులందు తుమ్మెదలు ముక్త జీవులలామత్తెక్కి రొద చేస్తున్నవి. శుకపికాదుల రవముతోడి వసంత మేతెంచినది అన్న భావనలో ప్రకృతి, పారమార్థికత కలిసిన భావననుచూడవచ్చు.

కొళలు(1930) పాంచజన్య (1933) కళాసుందరి (1934) నవిళు (1943) కోగిలెమత్తు సోవియట్ రష్యా(1944) అగ్నిహంస (1946) కృత్తికె (1946) ప్రేమకాశ్మీర (1946) పక్షికాశి(1946) షోడశి (1947) బాపూజీగె భాష్పాంజలి (1948) జెనాగువా (1952) అనికేతన (1963) అనుత్తర (1965) వంటి 25 రచనలున్నాయి. ఈ భావగీతాలలో ప్రకృతిప్రీతి, ఈశ్వరభక్తి కనిపిస్తాయి. రానురాను ఆయన రచనలలో ప్రకృతి ప్రీతియే ఈశ్వరభక్తిగా, ప్రకృతిలో ఈశ్వర దర్శనం చేసిన కవిగా కువెంపు ఈ పద్ధతి రచనల్లో కనిపిస్తారు. స్వర్గద్వారదె యక్ష ప్రశ్న అన్న రచన కులపాలిక ప్రణయ సిద్ధాంతాన్ని మరణానంతర జీవిత కోణం నుండి ఉన్న రచన. ‘కళాసుందరి’ కావ్యం కళలను గూర్చి చెప్పేది. నన్నమనెలో పిల్లల పాటలు, ప్రేమ కాశ్మీరంలో ప్రణయగీతాలు, అగ్నిహంసలో భక్తిగీతాలు, పాంచజన్యంలో విప్లవానికి ఆహ్వానిస్తున్న కవితలు ఉన్నాయి. అలాగే కొన్ని ఆంగ్ల కవితలను కూడా కువెంపు ఆహ్వానిస్తున్న కవితలు ఉన్నాయి. అలాగే కొన్ని ఆంగ్ల కవితలను కూడా కువెంపు అనువదించారు. కథా కావ్యాలలో కథన కవనగళు (1937) సముద్రలంఘన ప్రధానమైనవి చిత్రాంగద అన్న ఐతిహాసిక కథాకావ్యం సరళ రగడలో వ్రాసింది. ప్రాచీన కావ్యరచనా ప్రభావం ఉన్నా తనదైన కథాగతిని, పాత్రపోషణను ఇందులో చూపారు.

సమకాలీన సాహిత్యానికి, కవులకు మార్గ నిర్దేశం చేస్తున్నట్లు సాగే ఆయన కావ్యవిమర్శలో ప్రాచ్య, పాశ్చాత్య ప్రభావాలు కనిపిస్తాయి. 1926లో తన సాహిత్యవిమర్శ ప్రారంభించిన ఆయన కావ్యవిహార (1946) విభూతిపూజె (1953) తపోనందన (1950) రసోవైస: (1962) ద్రౌపదీయ శ్రీముది వంటి రచనలు చేశారు. పంప, బాణభట్ట, నాగవర్మ వంటి వారిపై చేసిన విశ్లేషణలు లోతైనవి. కువెంపు కన్నడ కవులైన లక్ష్మీశ, రత్నాకరవర్ణి వంటి వారిపై మాట్లాడిన తొలివ్యక్తి. ‘కళ కళ కోసమే’ అన్న సిద్ధాంతాన్ని ఆయన చర్చిస్తూనే నిక్కచ్చిగా ‘కథ జీవితావగాహన’ కొరకే అన్న సూత్రాన్ని ప్రతిపాదించాడు. ఆయన సృష్టించిన పారిభాషిక పదాలలో భావోపయోగి, లోకోపయోగి, ప్రతికృతి, దర్శన- ధ్వని, భావ్యతె, మహోపమె (హోమరిక్ సిమిలి) అన్న వాటిని సృష్టించి లోతైన చూపుతో కన్నడ సాహిత్యవిమర్శకు కొత్త భావనలను అందించాడు. కావ్యవిహార,తపోనందన ప్రత్యక్ష విమర్శ గ్రంథాలని విమర్శకుల అభిప్రాయం.

కథకుడిగా కువెంపు మూడు సంపుటాలు వెలువరించాడు. సన్యాసిమత్తు ఇతర కథెగళు (1936), నన్నదేవరు మత్తు ఇతర కథెగళు (1940), కథెగలొదనె ఆరంబదల్లి (1985) సంపుటాల కథకుడిగా తన ప్రఙ్ఞను ప్రదర్శించాడు. స్వామి వివేకానంద, రామకృష్ణ పరమహంసల జీవితచరిత్రలను అందించిన ఈ మహాకవి బాలసాహిత్యాన్ని కూడా సృష్టించి తన సాహిత్యసృజన వైవిధ్యాన్ని ప్రదర్శించారు. అమలనకధె(1924) హళరు (1926) బొమ్మనహళ్ళి కిందరిజోగి(1928) వంటి తొమ్మిది రచనలు బాలసాహిత్యంలో సృష్టించారు.సామాన్యంగా ఆధ్యాత్మికం, ప్రకృతిప్రేమ అన్నవి కువెంపు రచనల్లో స్థాయిగా ఉండేవి. అయితే కాల ధర్మానికి అనుగుణంగా విప్లవఘోష విఙ్ఞాన వాణిని వినిపించడమూ కనిపిస్తుంది. విఙ్ఞానకాంతి చీకటిని చీల్చుకుని దార్శనిక విఙ్ఞానాన్ని మూలస్థాయి గర్భం నుండి మనకు అందిస్తాడు. పాశ్చాత్య ప్రభావం ఎక్కువైనా అంతర్లీనంగా భారతీయ వేదాంత సంస్కృతుల సారం అందిస్తాడు.

కువెంపు ఉపన్యాసాలు ఆలోచనాత్మకంగానూ, సకారాత్మకంగాను ఉంటాయి. కన్నడ భాష అధ్యయన భాషగా ఉండాలని చెబుతూనే ఆంగ్లభాషను ప్రోత్సహించేవారు. ఆంగ్ల భాషపై అధికారం సంపాదించాలనేవారు. ఆయన ఆలోచనలలో దేశీయత జాతీయత పెనవేసుకుని ఉండేవి. ఆచార్య హంపన్న మాటలలో చెప్పాలంటే “Kuvempu’s concern for the state and nation was always complimentary and was not contradictory “ దళితులకు అంబేద్కర్ ఎంతటి ప్రాముఖ్యం కలవాడో కర్ణాటకలోని అణగారిన వర్గాలకు కువెంపు అంతటి ప్రాధాన్యమున్న వ్యక్తిగా తన రచనల ద్వారా మారాడు‘. అందరికీ సమానన్యాయం అందరికీ సమానభాగం‘ ఆయన సాహిత్యనినాదం.

నోడిదరెల్లియు చైతన్య కల్లలి, మణ్ణలి హుల్లలి
హుడియలి, నీరిన హనియలి, టెంకియ, కిడియలి
నన్నలి –ఎల్లియు చైతన్య.

రాయి, మట్టి, గడ్డి, ధూళి, జలకణం, అగ్నికణం నాలో ఎచ్చట చూచిన చైతన్యమే అని చెప్పుకున్న కువెంపు జాతిలో, జీవనంలో, జీవిలో దాన్ని నింపే ప్రయత్నం చేసిన యుగదకవి. కన్నడ సాహిత్య చందనశాఖి కువెంపు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here