కన్నీటి హోలీ

1
9

[box type=’note’ fontsize=’16’] హిందీలో శ్రీ ప్రేమ్‍చంద్ వ్రాసిన కథని ‘కన్నీటి హోలీ’ పేరిట తెనుగులోకి అనువదించి అందిస్తున్నారు దాసరి శివకుమారి. [/box]

[dropcap]మ[/dropcap]నుషులకు ఉన్నపేరు మార్చి పిలిచే అలవాటు ఎప్పుడు మొదలైందో తెలియదు. ప్రపంచ వ్యాప్తంగా వున్న ఈ రోగం సంగతి తెలిస్తే తప్పకుండా అసలు పేరును వదిలిపెట్టవచ్చు.

పండిట్‍జీకి తల్లిదండ్రులు పెట్టిన పేరు శ్రీవిలాస్. కాని మిత్రులందరూ కలిసి అతని పేరును బండరాయిగా మార్చారు. పేరు ప్రభావం వ్యక్తి స్వభావం మీద కొంతైనా పడుతుంది. పాపం మన బండరాయి నిజంగా మొద్దు స్వరూపంలాగే వుంటాడు. ఆఫీసుకని బయల్దేరతాడు. అప్పుడు కూడా ఒంటిమీదనున్న పైజామా బొందు చొక్కా కింది నుంచి వేలాడుతూ వుంటుంది. తలమీద ఖరీదైన టోపీయే ఉంటుంది. కాని దాంట్లో నుంచి వెంట్రుకలు కుచ్చులు కుచ్చులుగా బయటకు వచ్చి కనపడుతూ ఉంటాయి. మంచికోటు వేసుకుంటాడు కాని దాని బొత్తాలు ఎగుడూ దిగుడుగా పెట్టుకుంటాడు.

బండరాయికి పండుగలూ, పబ్బాలు అంటే ఆసక్తే లేకుండా పోయింది. టపాసులు కాల్చే దీపావళి వచ్చినా, వెళ్ళినా అతని జేబులోనుంచి ఒక్కరూపాయి కూడా ఖర్చవదు. ఇక హోలీ పండుగొస్తే అతనికి ప్రాణసంకటంగా వుంటుంది. మూడురోజుల ముందు నుండే ఇంట్లో నుంచి బయటకు రాడు. ఇంట్లో కూడా నల్లని గుడ్డలే వేసుకుని తిరుగుతాడు. స్నేహితులంతా కట్టకట్టుకుని ఇంటికి వచ్చినా దొరక్కుండా తప్పించుకుంటాడు. వాళ్ళు ఎంత బతిమిలాడినా ఒక్క రంగు మరక కూడా తన ఒంటిమీద పడనీకుండా తిప్పి పంపేస్తాడు. కాని ఇప్పుడొక చిక్కు సమస్య వచ్చి పడింది. దీన్నుండి ఎలా తప్పించుకోవాలా? అన్న ఆలోచనలో పడ్డాడు.

అచ్చం శాస్త్రాల్లో చెప్పినట్లుగానే నిష్ఠగా బ్రహ్మచారిగా వుండి ఆ తర్వాత పెండ్లి చేసుకున్నాడు. పెండ్లిలో కూడా ఆచారాలన్నింటినీ తు.చ. తప్పకుండా పాటించాడు. చివరకు పెండ్లి అయిన తర్వాత కూడా కొన్నాళ్ళు బ్రహ్మచర్యాన్ని పాటించి ఆ తర్వాతనే భార్యను కాపురానికి తెచ్చుకున్నాడు. ఆడవాళ్ళంటే అతనికి అనుమానాలేం లేవు కాని వాళ్ళు తలెగరేసి స్వతంత్రంగా ఆలోచించటాన్ని మాత్రం ఇష్టపడడు. వెనుకటి పాతకాలపు వాళ్ళు చెప్పిన భార్య లక్షణాలే మంచివని తలుస్తున్నాడు. భార్య, భర్త చెప్పుచేతల్లోనే వుండాలి. అలా వుంటేనే ఆ కాపురం సజావుగా సాగి, సుఖంగా వుంటారన్న గట్టి నమ్మకంతో వున్నాడు.

అతనికిప్పుడొచ్చిన సమస్యేమిటంటే అత్తింటివాళ్ళు హోలీ ఆడటానికి తనింటికి వస్తామన్న కబురు విన్న దగ్గరనుండీ ఒకటే కలవరంగా వున్నది. తన బావమరుదులు మొదలే అసాధ్యులు. వాళ్ళు వచ్చి హోలీ పేరుతో చేసే దురాక్రమణ నుండి తప్పించుకోవటమెలా? అన్న ఆలోచనతో సతమతమవుతున్నాడు. స్నేహితులనైతే ఇంటికి రానివ్వకుండా అడ్డుకోగలడు. కాని వీళ్ళను ఆపడమెలా?

“మీరు రంగులేమీ ఇంట్లోకే తీసుకురారా? హోలీ పండుగ రంగుల్లేకుండా ఎలా గడుస్తుంది?” అన్నదామె నోరు తెరుచుకుని కళ్ళు విప్పార్చుకుని మరీ.

“నేనేదైనా ఒక్కసారే చెప్తాను. మళ్ళీ మళ్ళీ చెప్పే అలవాటు నాకు లేదు. ఇంట్లోకి రంగులు తీసుకురాను. నేను ఎవ్వరికీ పులమను. నేను పులిమించుకోను. నా బట్టలమీద ఎర్రరంగు మరక కనబడితే నాకు చాలా కంపరంగా ఉంటుంది. హోలీ పండుగ వస్తుంది. వెళ్తుంది. అంతే. నా ఇంట్లో మాత్రం ఏ ఒక్కరంగు మరకా కనపడకూడదు” అన్నాడు శాసిస్తున్నట్లుగా, ముఖం గంటుపెట్టుకుని మరీ.

భర్త మాటలతో చంప చిన్నబుచ్చుకున్నది. తలకిందికి వంచేసుకున్నది. “మీకంత ఇష్టం లేకపోతే రంగులు తెప్పించి నేను మాత్రం ఏం చేసుకుంటాను?” అన్నది చిన్నగొంతుకతో.

ఆ మాటలు విన్న బండరాయి ముఖంలోకి వెలుగొచ్చింది. అహం శాంతించింది. సంతోషం నిండిన గొంతుతో “శభాష్! మొగుడి మాట గౌరవించటమే, పతివ్రతా లక్షణం. ఈ మాట బాగా గుర్తుపెట్టుకో” అన్నాడు.

“కాని మా అన్నయ్యలు హోలీ ఆడడానికి మనింటికి వస్తామంటున్నారు. వాళ్ళను రావద్దని ఎలా అంటాం?”

“దానిక్కూడా నేనొక ఉపాయం ఆలోచించాను. దాన్ని అమలు చేయడం నీ పని. అదేమిటంటే నాకు అనారోగ్యం వచ్చినట్లుగా ఒక దుప్పటి ముసుగు పెట్టుకుని పడుకుంటాను. నువ్వది నిజమని వాళ్లను నమ్మించాలి. అన్నయ్యా! మావారికి జ్వరం వచ్చిందని వాళ్ళకు చెప్పు”

“లేని జ్వరాన్ని తెచ్చుకుంటానని మీ నోటితో మీరు అంటే నిజంగానే జ్వరమొచ్చి మంచమెక్కుతారు జాగ్రత్త” అన్నదామె అయిష్టంగానే.

“మరింక వేరే దారేమున్నది?”

“పైన మనకో గది ఉన్నదిగా, దాంట్లో ఉండండి. ఆయన విరోచనాలకు మందు పుచ్చుకున్నారని అబద్ధం చెప్తాను. కిందికి రాలేరని మా అన్నయ్యలతో చెప్తాను. సరేనా?” అన్నది కళ్ళు చిట్లిసూ.

“మంచి ఉపాయమే” అన్నాడు నవ్వుకుంటూ.

హోలీ పండుగ రానే వచ్చింది. అంతటా కోలాహలంగా వున్నది. వెనుకటి రోజుల్లో అయితే గులాం తప్పితే మరే రంగూ వాడేవాళ్ళు కాదు. ఇప్పుడు నీలం, ఆకుపచ్చలతో పాటు, ఎరుపూ, నలుపూ రంగుల పొడీ, అవి కలిపిన నీళ్ళు వాడుతున్నారు. రంగులు పూయించుకోకుండా తప్పించుకోవటం ఇటీవల ఎవరికీ సాధ్యపడటం లేదు. ఏదో పాపం దయతలచి దేవతల్ని మాత్రం వదిలిపెడుతున్నారు.

బండరాయి బావమరుదులు ఇద్దరూ వచ్చేశారు. వీధిలో ఉన్న ఆడవాళ్లనూ, మగవాళ్లనూ, వృద్దుల్నీ, అందర్నీ రంగులతో ముంచెత్తారు. ఇంటాబయటా, నేలమీద, గోడలమీదా, గోడలకు వ్రేలాడే చిత్రపటాలను కూడా వాళ్ళు వదలలేదు. వీధి వీధంతా రంగులమయం చేసేశారు.

“అరే చంపా! నిజంగా బావగారికి ఆరోగ్యం బాగాలేదా? కనీసం భోజనానికైనా కిందికి రారా?”

“నిజం అన్నయ్యా! రాత్రి నుంచి కడుపులో కొంచెం నొప్పిగా వున్నది. డాక్టరుగారు బయటిగాలిలో తిరక్కుండా లోపలే వుండి విశ్రాంతి తీసుకోమన్నారు” అన్నది తలొంచుకుని, వాళ్ళకు తన ముఖంలోని భావాలు కనిపించనీయకుండా.

ఒక్క క్షణం ఆగి “చంపా! బావగారికి నిజంగా అంత సుస్తీగా ఉన్నదా? కిందికి కూడా రాలేరా? కడుపునొప్పి వస్తే డాక్టరు బయటి గాలిలో తిరగొద్దు అని చెప్తాడా? నేనొకసారి వెళ్ళి చూసి రానా?” అన్నాడు చిన్నన్నయ్య.

అతని చెయ్యి పట్టుకుని ఆపుతూ “వద్దొద్దు. మీరు వెళ్ళకండి. ఆయన విశ్రాంతి తీసుకుంటున్నారు. రంగులుపెట్టి హోలీ అదీ ఆయన ఆడలేరు. చెప్పాను కదా డాక్టరుగారు ఎక్కడా తిరక్కుండా విశ్రాంతి తీసుకోమన్నారని” అన్నది గబగబా.

అన్నదమ్ములిద్దరికీ ఏం చేయాలో పాలుపోలేదు. ఒక్కక్షణం ఆలోచించారు. ఆ తర్వాత తేరుకుని “బావగారికైతే సుస్తీ చేసింది. వారి బట్టలకేం అనారోగ్యం లేదుగా. వాటితో హోలీ ఆడతాం” అన్నాడు చిన్నన్న. పెద్దన్నయ్య కూడా ఈ ఆలోచన బాగానే వుందన్నాడు.

పాపం చంప ఏం మాట్లాడలేకపోయింది. సిసింద్రీ అన్నలిద్దరూ బలవంతాన తాళాలు తీసుకుని పెట్టెలు తెరిచారు. బండరాయి భద్రంగా దాచుకున్న బట్టలన్నీ బయటకు తీశారు. ఇంకా ఇంట్లో మూలమూలాల వెదికారు. ఆఖరుకు చేతి రుమాలును కూడా వదలకుండా తీసి పరిచారు. వాటన్నింటినీ రంగులతో ముంచెత్తారు.

వాటన్నింటిని బయటకు తీసుకెళ్ళి ఆరేస్తూ పెళ్ళి జంటను రంగుల్తో ముంచెత్తినట్లుగా వున్నదని చంప నవ్వుకున్నది.

పైన గదిలో దాక్కుని వున్న బండరాయికి అంతా అర్థమవుతూనే వున్నది. కాని నోరు విప్పి వారించలేకపోయాడు. పాము పిల్ల కదిలినంత అలజడి మాత్రం గుండెలో పుట్టింది. నిట్టూర్చాడు.

“నా బట్టలన్నీ ఖరాబయ్యాయి. ఆఫీసుకు వేసుకుని వెళదామన్నా రంగు పడని బట్టంటూ ఏమీ మిగల్లేదు. ఈ దుర్మార్గులకు నా బట్టలమీద ఇంత వైరమేమిటో అర్థం కావడం లేదు” అని పళ్ళు కొరుక్కున్నాడు.

వంట ఇంట్లో రుచికరమైన వంటలెన్నో తయారవుతున్నాయి. ఆ వీధిలో ఉన్న మరొకామె సహాయంతో చంప వంట చేస్తున్నది. అన్నదమ్ములిద్దరూ, బంధువులు భోజనానికి కూర్చున్నారు. అకస్మాత్తుగా పెద్దబావమరిదికి తన బావగారు గుర్తుకొచ్చారు.

“చంపా! బావగారి కోసం కిచిడీ అన్నా చేశావా లేదా? పాపం ఈ రోజు ఆయనకు పూరీలన్నా తినే ప్రాప్తం లేకుండా పోయింది”

“అయ్యో! కిచిడీ వండలేదన్నయ్యా, ఇప్పుడే వండుతాను”

“అరరే చంపా! నీకివ్వాళ బావగారి సంగతే పట్టకుండా పోయింది. మొగుడు ఏం తింటాడన్న ఆలోచనే లేకుండా పోయింది. ఆయన తిండిపట్ల ఇంత అశ్రద్ధ అయితే ఎలా? వెళ్ళు…. వెళ్ళి త్వరగా బియ్యం, పెసరపప్పు తీసుకురా”

ఒక పక్క అంతా భోజనాలకు కూర్చున్నారు. అలాగే పడుతూ లేస్తూ చంప కిచిడీ వండసాగింది. పైన కూర్చున్న బండరాయికి కింద జరిగేదంతా తెలుస్తూనే ఉంది. మాటలూ వినబడుతున్నాయి. అదంతా వింటూ, చూస్తూ లోపల్లోపలా చాలా దిగులుపడసాగాడు.

అసలు దీనికంతకు కారణం చంప. ఆమెను పెళ్ళి చేసుకోవడంతోనే తనకు తిప్పలు వచ్చాయి. పెళ్ళే చేసుకోకుండా వుంటే చంప తన జీవితంలోకి వచ్చేది కాదు. ఆమె అన్నలూ ఇవాళ తన ఇంటి గుమ్మం తొక్కేవాళ్ళు కాదు. ఈ రోజిలా తన బట్టలన్నీ రంగు మరకల్తో ఖరాబయ్యేవి కావు. హోలీ రోజు పెసరపప్పు, అన్నం తినాల్సి వచ్చేది కాదు. ఇప్పుడూ పశ్చాత్తాపపడితే ఏముంది? అయిపోయింది. అంతా అయిపోయింది.

బంధువుల భోజనాలు పూర్తయ్యేటప్పటికీ కిచిడీ ఉడికింది.

“చంపా! త్వరగా బావగారికి కిచిడీ తీసుకెళ్ళు” అంటూ తొందరపెట్టాడు పెద్దన్నయ్య.

చంప పరుగున పైకి వెళ్ళింది. కిచిడీ పళ్ళెం చూస్తూంటేనే బండరాయి మండిపడ్డాడు.

“ఇలా నా ముందు ఆ పళ్ళెం ఎందుకు పెడుతున్నావు? తీసిపారెయ్” అన్నాడు కోపంగా.

“అదేమిటి అలా అంటారు? ఇవాళ పూర్తిగా ఉపవాసముంటారా ఏం?”

“నీ కోరిక అదేగా? అదిప్పుడు పూర్తవుతుంది. నీకిప్పుడు తృప్తిగా వుందా?”

“నేనేం చేశాను? ఉదయం నుండి ఒకటే పని. అన్నయ్యే తొందరపెట్టి కిచిడీ చేయించి పంపాడు”

“ఆ…. ఆ…… అంతా చూస్తూనే వున్నాను. ఇప్పుడు ఇంటి యజమాని నేను కాదు. మీ అన్నలొచ్చి ఇవాళ మనింటిని కబ్జా చేసేశారు. కాని నేను దాన్ని సహించను. నీకే కనుక నా మీద శ్రద్ద వుంటే వాళ్లందరి కంటే ముందు నా భోజనం సంగతే చూసేదానివి. నీవు చేసింది ఇప్పుడు పతివ్రతా లక్షణాలకు విరుద్ధంగా వున్నది. వినపడుతుందా?”

“మా అన్నయ్యలిద్దరూ నానెత్తి కెక్కి ఎలా కూర్చున్నారో మీరు చూస్తూనే వున్నారు కదా?”

“అవునవును. చూస్తూనే వున్నాను. వాళ్లందరికీ సమోసాలూ, పూరీలు, పిండివంటలూ, నాకేమో పెసలూ, బియ్యం? ఏమదృష్టం? చంపా! ఈవేళ నాకు గొప్ప అదృష్టం పట్టింది”

“నాలుగు ముద్దలైనా తినండి. నాకేమాత్రం అవకాశమున్నా పిండివంటలతో వున్న పళ్ళెమే తెచ్చి మీకందించేదానిని. ఇప్పుడైనా అవకాశముంటే తెస్తాను.”

“మీ అన్నలు నా బట్టలన్నింటికీ రంగులు పూశారు. నేను ఆఫీసుకి ఎలా వెళ్ళేది? మరీ ఇంత దౌర్జన్యమా? నువ్వసలు పెట్టె తాళాలు ఎందుకిచ్చావు? నేనింతలా అడుగుతుంటే సమాధానం చెప్పవేం? ముంగిలా నుంచున్నావు?”

“బలవంతాన తాళాలు లాక్కున్నారు. నేనేం చేసేది? పైనుండి మీరంతా చూస్తూనే ఉన్నారుగా”

“సరే ఏదో జరిగింది. ఈ పళ్ళెం తీసేసెయ్. నీకు ధర్మమనిపిస్తే వేరే పళ్ళెంలో పదార్దాలన్నింటినీ అమర్చి తీసుకురా. లేకుంటే ఇవాళ వ్రతం చేసి ఉపవాసమున్నాననుకుంటాను”

ఇంతలో ఎవరో వస్తున్న అలికిడి వినిపించింది. తలెత్తి చూశాడు. బావమరుదులిద్దరూ ఎదురుగా ఉన్నారు. వాళ్ళను చూస్తూనే బిక్క చచ్చిపోయి దుప్పటి లాక్కుని ఒళ్ళంతా కప్పుకున్నాడు.

“ఆరోగ్యం ఎలా వుంది బావగారూ? కొంచెం కిచిడి అయినా తినండి”

“ఇప్పుడేం తినాలని లేదు”

“కాదు… కాదు… పూర్తిగా ఉపవాసముంటే నీరసించిపోతారు. మీరు కిచిడీని ఇప్పుడే తినండి”

బావమరుదుల్ని ‘సైతానుల్లాగా వచ్చారు. రావటమే కాకుండా నా నెత్తినెక్కి కూర్చున్నారు’ అంటూ మనసులో ఎన్నో శాపనార్థాలు పెట్టుకున్నాడు. విషం మింగినట్లు బలవంతాన ఆ కిచిడీని తినసాగాడు. ఇవాళ హోలీ పండుగపూట ఈ కిచిడీయే నా ముఖాన రాసిపెట్టి వున్నది అనుకున్నాడు. వాళ్ళిద్దరూ తనెదురుగా నిలబడి బలవంతంగా ఈ కిచిడీని తినిపిస్తుంటే అచ్చం ఉపవాసముండి నిరాహార దీక్ష చేసే ఖైదీల చేత బలవంతంగా తిండి తినిపించే జైలర్లలాగా వున్నారనుకున్నాడు. తన భార్యతో పిండివంటలున్న భోజనపు పళ్ళేన్ని తెమ్మన్న సంగతే మర్చిపోయి పైకి ఏడ్వలేక ఆ కిచిడీని అతికష్టం మీద మింగసాగాడు.

రాత్రి పదిగంటలైంది. మంచి రుచికరమైన పదార్ధాలను ఒక పళ్లెంలో సర్ది చంప భర్త దగ్గరకు తెచ్చిచ్చింది. అతను లోపల్లోపల ఇప్పటిదాకా తెగ గింజుకుంటున్నాడు. ‘ఇవ్వాళ తన అన్నల్ని చూసుకుని నన్ను లెక్కచేయటం లేదు. నా ప్రాణానికి ఈ రెండు సైతాన్లు ఊడిపడ్డాయి. వీళ్ళ పుణ్యమా అని దాదాపు రోజంతా తను పస్తు ఉండాల్సి వచ్చింది. ఇప్పటిదాకా మొగుడికి రాత్రి భోజనమైనా పెడదామన్న ధ్యాసే నా పెళ్ళానికి లేకుండా పోయింది’ అని రకరకాల ఆలోచనలతో తెగ మండిపోతున్నాడు. ఇప్పుడు చంప తెచ్చిన ఆ పళ్లెం చూసేటప్పటికి కొంచెం మంట చల్లారింది.

“ఇప్పుడేగా తెల్లారింది. అప్పుడే నా భోజనానికి ఏం తొందరొచ్చింది? ఇంకో గంటో, రెండు గంటలో పోయిన తర్వాత తెస్తే బాగుండేది”

చంప అతని దగ్గరగా పళ్ళాన్ని నెడుతూ “ఇది గెలుపూ కాదు. ఓటమీ కాదు. ఇంతకుముందే మరో ఇద్దరు అతిథులు వస్తే వాళ్ళకు మర్యాదలు చేయవల్సి వచ్చింది. మీరే ఏదో మర్యాదలు చేయవద్దన్నారని మన పరువు తీసిపారేస్తారు. రోజూ ఏమన్నా మనింటికి అతిథులు వస్తారా?”

“రోజూనా? అయ్యో భగవంతుడా? ఒక్కరోజుకే కోడిగిత్తను కాస్తా ఎద్దు పట్టినట్లుగా అయిపోయాను” అంటూ పళ్లెం వంక చిరునవ్వుతో చూశాడు.

ఆ సువాసనకు అతని ముఖంలోకి సంతృప్తి పాకి వచ్చింది. పదార్ధాలన్నీ ఒక్కొక్కటిగా రుచి చూడసాగాడు. చంప వంక ప్రేమగా చూస్తూ “నిజం చెప్తున్నాను చంపా! ఇంత రుచికరమైన వంటలు నేనెప్పుడూ తినలేదు. ఈ హల్వా ఎంత బాగా కుదిరిందో ఎలా చెప్పగలను? ఇప్పుడు నీకు ఏదైనా బహుమానం ఇవ్వాలనిపిస్తుంది”

“ఏదో నాకు చేతనైనట్లుగా చేసి తెచ్చాను. మీకేమో ఎగతాళిగా వున్నట్లున్నది”

“ఎగతాళి కాదు చంపా! నిజం చెప్తున్నాను. నా ఆత్మరాముడు శాంతించాడు. ఈ రోజు నాకు బాగా అర్థమైంది ఏమిటంటే భోజనమనేది కేవలం పొట్టకి సంబంధించింది కాదు. అది ఆత్మకు కూడా సంబంధించిందే. నీకేం బహుమానం కావాలో చెప్పు”

“ఏదడిగితే అదే ఇస్తారా?”

“తప్పకుండా ఇస్తాను. ఒట్టు పెట్టి చెప్తున్నాను”

“నిజంగానా? నమ్మమంటారా?”

“ఇంకెలా చెప్పేది? ఏదైనా పత్రం రాసిమ్మంటావా?”

“సరే అడుగుతున్నాను. నాతో మీరు కూడా హోలీ ఆడండి. అదే మీరు నాకిచ్చే బహుమానం”

బండరాయి ముఖం పాలిపోయింది. కళ్ళు పెద్దవిచేస్తూ ఆశ్చర్యంగా చూస్తూ “హోలీ ఆడాలా? హోలీ మాత్రం ఆడేది లేదు. ఎప్పటికీ ఆడను. హోలీ ఆడే వాడినైతే ఇంట్లో ఎందుకు దాక్కుంటాను?”

“వేరేవాళ్ళతో ఆడొద్దు. ఇంట్లో నాతో మాత్రం ఆడండి”

“ఇది నా నియమానికి విరుద్ధం. ఏ వస్తువైనా ఇంట్లో మంచిదని చెప్పి వీధిలో అదే మంచిది కాదని ఎలా చెప్పగలను? నువ్వే ఆలోచించు”

చంప తలక్రిందకు దించుకుని “అట్లా అనటం సరైనది కాదు. పాపం కూడా” అన్నది నెమ్మదిగా.

అతని గొంతులోకి వణుకులాంటిది వచ్చింది “నేను ఓడిపోయాను చంపా! నువ్వే గెలిచావు. ఏదైనా ఇవ్వమని నేనే అడుగుతున్నాను”

“ముందు మీరు నాకిచ్చిన మాట నెరవేర్చండి. ఆ తర్వాత నన్నేదైనా అడగండి” అంటూనే చంప ఒక లోటాలో వున్న రంగునీళ్ళను తన భర్త తల నుండి పాదాలవరకు పడేటట్లుగా చిమ్మింది. ఇంకా అతను పారిపోబోయే సరికి చేతి నిండా గులాం తీసుకుని ముఖమంతా పులిమింది.

బండరాయికి ఏడుపు ఎగదన్నుకొచ్చింది. “ఇంకేదైనా రంగు మిగిల్తే అదీ చిమ్ము. ఆగొద్దు. నువ్వు నాకు భార్య రూపంలో ఉన్న శత్రువువయ్యావు” అన్నాడు.

చంప తలెత్తి భర్తవంక చూస్తే అతను దేనికో విపరీతంగా బాధపడుతున్నాడని అర్థమయింది. అతని బాధను చూసి చంపకు పశ్చాత్తాపం కలిగింది.

“నిజంగా మీరు చాలా బాధపడుతున్నారు. ఆ బాధలో నన్ను చెడ్డదానిగా అనుకుంటున్నారు. ఏదో నన్ను ఆటపట్టించడానికే ఇలా అంటున్నారనుకుంటున్నాను”

కంపించే స్వరంతో శ్రీవిలాస్ మొదలుపెట్టాడు. “చంపా! నన్ను చెడ్డవాడిగా అనుకోవద్దు. నువ్వు చేసే పనితో, నీ మాటలతో నాకు ఒక రకంగా కర్తవ్యాన్ని గుర్తుచేశావు. నేను నిజంగా, నా పిరికితనం మూలంగా నా కర్తవ్యాన్ని మర్చిపోయాను. గోడమీద ఎదురుగా ఉన్న ఆ పటాన్ని చూశావా? అది నాకు అత్యంత మిత్రుడైన ‘మనహర్ నాధ్’ ది. అతనిప్పుడు చనిపోయాడు. తన గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఎంతో సరసుడు, భావుకుడు. అన్నిటికీ మించి సాహసవంతుడు కూడా. దేశ పరిస్థితులను చూసి అతని రక్తం మరుగుతూ వుండేది. 19-20 ఏళ్ళ వయసులోనే అతను తన జీవన గమ్యాన్ని నిర్దేశించుకున్నాడు. ఎక్కడ సేవలు అవసరమైతే అక్కడికి వెళ్ళి వాలిపోయేవాడు. ఇతరులకు సేవ చేయటమంటే గొప్పనిధిని పొందటమే అనుకునేవాడు. ఇంకా అతడూ పుట్టుకతోనే విరాగి. కోరికలనేవి అతనిలో మచ్చుకైనా లేవు. మేమంతా షికార్లు కొడుతుంటే ఆ ధ్యాసే అతనికుండేది కాదు. సత్యం కోసం ప్రాణాలివ్వటానికైనా వెనుకాడేవాడు కాదు. ఎక్కడ అన్యాయం జరుగుతున్నా, ఏ పత్రికలోనైనా అత్యాచారం జరిగిందన్న కబురు చదివినా అతని ముఖం కందగడ్డలా మారిపోయేది. అటువంటివాణ్ణి నేనెక్కడా చూడలేదు. నిర్దయుడైన భగవంతుడు అతడికి అకాలమృత్యువుని విధించాడు. లేకపోతే మనుష్యుల్లో రత్నంలా మెరిసిపోయేవాడు. ఎవరికే ఆపద వచ్చినా ప్రాణాలుగ్గపెట్టుకుని పరుగులు తీసేవాడు. అతడు స్త్రీలను గౌరవించినట్లుగా మరెవరూ గౌరవించలేరు. అంతటి మహోన్నతుడు నా మిత్రుడు. సరిగ్గా ఐదేళ్ళ కిందట ఇదే హోలీ రోజు, నేనేమో భంగు పీల్చిన మత్తులో వున్నాను. నా ఒళ్లంతా రంగులమయం. పండుగ సందర్భంగా సంగీతం విందాం రమ్మని పిలవటానికి నేను, మనహర్ దగ్గరకెళ్ళాను. అప్పటికే అతను ఎక్కడికో వెళ్ళటానికి సిద్ధంగా వున్నాడు. ఎక్కడికని నేను అడిగాను. చప్పున అతను నా చేయి పట్టుకుని “నువ్వు మంచి సమయానికి వచ్చావు. లేకుంటే నేను మరెవరి కోసమైనా వెదకాల్సి వచ్చేది. ఒక అనాథ వృద్ధ స్త్రీ చనిపోయింది. ఆమెను మోసుకుని వెళ్దామని తెగ ప్రయత్నం చేస్తున్నాను. మన మిత్రులందరూ మత్తులో వున్నారు. మరికొందరు విందు వినోదాల్లో వున్నారు. పెద్దకులాల వారు ఈ కడజాతి శవాన్ని మోయటానికి రారు. నాతో ముగ్గురం జతకూడాం. నువ్వూ రా. దేముడు పంపినట్లు సమయానికి వచ్చావు. పద… పద…” అంటూ నన్ను తొందరపెట్టాడు.

“అయ్యో! నేనా రోజు అతని మాట విని వున్నట్లయితే ఈరోజు ఇంత బాధపడేవాడిని కాదు. అప్పటికే నా ఇంట్లో చాలామంది స్నేహితులు గుమికూడి ఉన్నారు. వచ్చిన వాళ్ళంతా సంగీతం వింటూ కూర్చున్నారు. ఆ సమయంలో వాళ్లందర్నీ విడిచి ఎవరో అనాథ శవాన్ని మోయటానికి వెళ్ళటానికి నా మనసు సుతరామూ ఒప్పుకోలేదు. నేను రాలేనని చెప్పాను. కారణమూ చెప్పాను. నేనైతే నా ఇంటికి మిగతా అతిథులతో పాటు నిన్ను ఉంచుదామనే వచ్చాను అన్నాను. నావంక మనహర్ తిరస్కారంగా చూశాడు. ‘సరే నీ ఇష్టం వచ్చినట్లు చెయ్యి. నువ్వు నీ ఇంటికే వెళ్ళు. నేను మరొకర్ని వెదుక్కుంటాను. మన మిగతా మిత్రులు చెప్పినట్లే నువ్వూ వంకలు చెప్తున్నావు. మనమంతా మన కర్తవ్యాన్ని సరిగా గుర్తించి ఆచరిస్తే మన దేశానికి ఈరోజు ఇలాంటి దుర్దశ పట్టదు. ఇలాంటి పండగ సంబరాలను మనమంతా వదిలిపెట్టాలి. పండగొస్తే తమాషాలు చేసుకోవటం, మంచి మంచి వంటలు తినటం, మంచి బట్టలు వేసుకోవటం కాదు. ఇదొక వ్రతం. ఇదొక తపస్సు. తోటివారి పట్ల సానుభూతి చూపటం, ప్రేమ కలిగి ఉండటమే పండగల ముఖ్య ఉద్దేశం. రంగుతో మన వంటి మీద బట్టల్ని ఎర్రగా చేసుకోవటం కాదు. మన కర్తవ్యాన్ని ఎర్రగా ఉంచుకోవాలి. తెల్లని రక్తం వున్న శరీరానికి ఇలాంటి ఎర్రని మరకలు శోభించవు’ అంటూ ఉద్వేగంతో చెప్పి అతను వెళ్ళిపోయాడు.”

“ఆ సమయంలో నా మిత్రుని మాటలు నాకు చాలా వెగటుగా అనిపించాయి. నాలో సేవాభావం లేనప్పుడు ఆ మాటల్ని ధిక్కరించే అధికారం కూడా నాకు లేదు. అన్యమనస్కంగానే ఇంటికెళ్ళాను. కాని మిత్రుని మాటలు నా చెవుల్లో ప్రతిధ్వనిస్తూనే ఉన్నాయి. అతని మాటలతో పండగ సరదా, హోలీ మజా అంతా ఏమీ లేకుండా పోయింది. ఆ తర్వాత ఒక నెల వరకూ మేం కలుసుకోలేదు. కాలేజీలో పరీక్షల హడావుడి ఉన్నందున క్లాసులేమీ జరుగలేదు. అందువలన అక్కడా కలుసుకోలేకపోయాం. ఆ తర్వాత అతను ఎలా జబ్బుపడ్డాడో తన ఇంటికి ఎప్పుడు వెళ్ళాడో నాకు తెలియనే లేదు. అకస్మాత్తుగా ఒకరోజు అతని నుండి ఒక ఉత్తరం వచ్చింది. ఆ ఉత్తరం చదివితే ఇవ్వాల్టికీ నా గుండెలవిసిపోతూంటాయి” అంటుంటే అతని గొంతు మరీ రుద్ధమైపోయింది. గొంతు పెగల్చుకుని “మరోరోజు నీకా ఉత్తరాన్ని చూపిస్తాను. అందులో ఏం రాశాడంటే ‘ఒకసారి మా ఇంటికొచ్చి వెళ్ళు. లేకుంటే మళ్ళీ జీవితంలో మనం కలుసుకోలేకపోవచ్చు’ అని వ్రాశాడు”

“అది చదువుతుంటే నా చేతుల్లో నుండి అది దానంతటదే జారిపోయింది. అతని ఇల్లు మీరట్ జిల్లాలో వున్నది. అక్కడికి వెళ్ళటానికి మరో అరగంటలో బండి వున్నది. వెంటనే బయలుదేరి వెళ్ళాను. కాని అతణ్ణి కలుసుకునే భాగ్యం మాత్రం దక్కలేదు. నేను వెళ్ళేసరికి అతను చనిపోయాడు. చంపా! ఆ తర్వాత నేను మరెప్పుడూ హోలీ జరుపుకోలేదు. అదే కాదు ఏ పండుగా జరుపుకోవటం లేదు. భగవంతుడు నాకు క్రియశీలక శక్తినివ్వలేదు. కాని ఇతరులకు సేవ చేయాలన్న కోరిక మాత్రం బలంగా ఉన్నది. స్వయంగా నేనే పనీ చేయలేకపోతున్నాను. కాని ఎవరి వెంటైనా నడవటానికి సిద్ధంగా ఉన్నాను. నన్ను నడిపించేవారు కూడా ఎవ్వరు లేకపోయారు. కాని ఇవ్వాళ నువ్వు హోలీ ఆడి నా కర్తవ్వాన్ని నాకు గుర్తు చేశావు”

“భగవంతుడా! నాకు అలాంటి శక్తిని ప్రసాదించు అని వేడుకుంటాను. సేవ చెయ్యాలని మనసులో అనుకోవటమే కాదు. చేసే పనుల మీద కూడా మనసు లగ్నం చేసి ఆ పనిని పూర్తి చేయగలను” అని చెప్తూ, శ్రీవిలాస్ చిన్నపళ్ళెంలో వున్న గులాం తీసుకుని మిత్రుని చిత్రం మీద చిలకరించి తన ప్రమాణాన్ని, ప్రణామాల్ని అర్పించాడు.

హిందీ: శ్రీ ప్రేమ్‍చంద్

తెనుగు అనువాదం: దాసరి శివకుమారి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here