కంటకాసురిడి కథ

0
10

[బాలబాలికల కోసం ‘కంటకాసురిడి కథ’ అనే కథ అందిస్తున్నారు కంచనపల్లి వెంకట కృష్ణారావు.]

[dropcap]న[/dropcap]ల్లటికొండలు. కొండలమీద అక్కడక్కడా చెట్లు రంగు రంగుల పూలతో, ఒక కొండకు పక్కనే గల గల పారే సెలయేరు. సెలయేరు పక్కనే రకరకాల చెట్లతో చిన్న అడవి. ఆ అందమైన దృశ్యాలు చూడటానికి రెండు కళ్ళు సరిపోవు!

అంత అందమైన ప్రదేశానికి ముక్తానంద యోగి వచ్చాడు. అక్కడి ప్రకృతికి ఆయన పరవశుడయ్యాడు. ఏది ఏమైనా అక్కడే తను ఓ చిన్న పర్ణశాల నిర్మించుకుని తపస్సు, ధ్యానం, యజ్ఞం వంటి కార్యక్రమాలు చేయాలని నిశ్చయించాడు.

ఆ విధంగా ఆయన ఓ చిన్న పర్ణశాలను నిర్మించుకుని కొన్ని పండ్ల, పూలచెట్లు వేసి తన కార్యక్రమాలలో మునిగిపోయాడు.

ఆ ప్రశాంత ఆహ్లాదకర వాతావరణంలో కొండలోని గుహలోనికి కంటకాసురుడు అనే రాక్షసుడు వచ్చాడు. వాడు చెట్లు విరిచి తినడం, చిన్న జంతువులను తినడం వంటి అకృత్యాలు చేస్తూ ఆ అందమైన పరిసరాలను నాశనం చెయ్యసాగాడు!

రాక్షసుడి ఆగడాలను ముక్తానంద యోగి గమనించి వాడి క్రూర చేష్టలకు అడ్డుకట్ట వేయాలని అనుకున్నాడు.

రాక్షసుడికి ఆకారం, బలం ఉంటాయి కానీ బుద్ధి బలం ఉండదు. ఏ విధంగానైనా వాడికి బుద్ధి చెప్పాలని లేక వాడికున్న బలాన్ని ప్రజలకు ఉపయోగపడేట్టు చేయాలని ముక్తానంద యోగి అనుకున్నాడు. వెంటనే ఆ పారే సెలయేటి మీద నడచి ఆ కొండవద్దకు చేరుకుని, “కంటకాసురా” అని బిగ్గరగా పేరు పెట్టి పిలిచాడు. అవతల ఒడ్డు నుండి నది మీద నడచి రావడమే కాకుండా తనెవరో తెలియకున్నా పేరు పెట్టి పిలిచేసరికి వాడికి ఆశ్చర్యమనిపించింది! ముక్తానందకు మహత్తర శక్తులు ఉన్నట్టూ వాడికి అర్థమయింది. ఎందుకైనా మంచిది ముక్తానందతో జాగ్రత్తగా మసలుకోవాలనుకున్నాడు.

ముక్తానంద కంటకాసురునితో “ఓ రాక్షసా, కంటకాసురా నీలోని రాక్షసగుణాలు ప్రకృతికి విరోధంగా ఉన్నాయి. ఈ అందమైన ప్రకృతిని నాశనం చెయ్యడం వలన నీకు ఒరిగేదేమిటి? అతి చెడ్డపేరు తప్ప. మనిషైనా జంతువైనా కడకు రాక్షసుడైనా తన బ్రతుకుకి ఒక మంచి పేరు వచ్చేట్టు బతకాలి. నీకు కొంత జ్ఞానం ఉంది. అపారమైన బలం ఉంది. నీకున్న ఈ శక్తులను మంచి పనులకు వినియోగించు. నీవు రాక్షసుడవైనా నీవు మంచి వాడుగా చరిత్రలో నిలచిపోతావు. నీ జన్మసార్థకమవుతుంది” అని ముక్తానంద జీవిత పరమార్థం వివరించాడు.

వాడు ఒక్క నిముషం కళ్ళు మూసుకుని ముక్తానంద మాటలను అర్థం చేసుకున్నాడు. మూసుకుపోయిన వాడి జ్ఞాననేత్రం తెరచుకుంది!

“మహానుభావా, ఏదైనా నాశనం చేస్తే గానీ నాకు నిద్ర పట్టదు, మరి నా ఈ నైజం పోవాలంటే ఏమి చెయ్యాలి? అసలు ప్రజలకు నేను ఏ మేలు చెయ్యగలను?” అడిగాడు కంటకాసురుడు.

“కంటకాసురా, నీ మనసు మారింది. నీవు ఇప్పుడు ఎంతో ఉన్నతంగా కనబడుతున్నావు. నేను చెప్పిన పనులు నీ బలంతో చెయ్యి, ప్రజలకు మేలు జరుగుతుంది, నీలో నాశనం చేసే గుణం పోతుంది. నీకు ఉన్నత లోకాలు లభిస్తాయి” అని వివరించాడు.

“మీరు ఆజ్ఞాపించండి మహానుభావా” నమస్కారం పెట్టి ముక్తానందను అడిగాడు.

“ఈ సెలయేరు ఇక్కడనుండి పారి సముద్రంలో కలుస్తున్నది. కొండకు అవతల ఉన్న రత్నగిరికి నీటి కొరత ఉన్నది. అందుచేత నీ శక్తి ఉపయోగించి ఈ సెలయేటినుండి రత్నగిరికి కాలువ త్రవ్వి నీటిని పారించు. అది నీకు సులభ సాధ్యం. రత్నగిరి ప్రజలు నీవు చేసిన మేలుకు జేజేలు పలికి నిన్ను వారి గుండెల్లో పెట్టుకుంటారు” చేప్పాడు ముక్తానంద.

“మీ ఆజ్ఞ” అని అప్పటినండి తన చేతులతో నేలను త్రవ్వి, అడ్డొచ్చిన పెద్దరాళ్ళను పెకలించి కొండల్లో పడేశాడు. అలా సెలయేటి నుండి కాలువ రత్నగిరికి త్రవ్వి అక్కడ చెరువు ఏర్పరిచాడు! అక్కడి ప్రజలు వాడు చేసిన మేలుకు వాడిని చూసి భయపడకుండా వాడికి జేజేలు పలికి గుండిగడు రుచికరమైన భోజనం మంచి కూరలతో పెట్టారు. వాటి రుచికి వాడు మునుపెన్నడూ పొందని సంతృప్తి పొందాడు! మేలు చేస్తే ఇంతటి ఆధరణ ఉంటుందని వాడు తెలుసుకున్నాడు. ఇక ఎప్పటికీ మంచి చేస్తూ మంచి పేరు తెచ్చుకోవాలనుకున్నాడు. వాడు చేసిన మంచి పనికి, వాడు పొందిన ప్రజాభిమానానికి ముక్తానందుడు వాడిని ఆశీర్వదించి మరిన్ని మంచి పనులకు వాడి శక్తిని ఉపయోగించాలని చెప్పాడు.

“తమరు ఏ మంచి పని చెప్పినా చేస్తాను” అని నమస్కారం పెట్టి తన గుహలోకి వెళ్ళి రోజూ ముక్తానందుణ్ణి కలుస్తూ ఆయన చెప్పిన మంచీ పనులు చేయసాగాడు.

***

చూశారా, రాక్షస గుణాలున్న రాక్షసుడు సైతం మంచి విని మంచిగా మారి ఎందరికో ఉపయోగపడ్డాడు. మంచిలోనే దాగి ఉంది ఓ మహత్తర శక్తి. అందుకే అందరం మంచిగా ఉండాలి, మంచిగా ఆలోచించాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here