కనువిప్పు

3
6

[dropcap]క[/dropcap]విత కనీసం నలభై అడుగుల పొడవు, ముప్పై అడుగుల వైశాల్యం వున్న హాలులో కాలు గాలిన పిల్లిలా అటూ ఇటూ పచార్లు చేస్తోంది. ఒకటికి రెండు సార్లు సోఫాలో కుషన్స్ సర్డింది. హాలులో కిటికీలకు, గుమ్మాలకు వ్రేలాడుతున్న పల్చని కనకాంబరం రంగు చిఫాన్ తెరలపై మరోసారి సన్నజాజుల స్ప్రే కొట్టింది. ఆమె మనసులో ఉత్సాహంలా ఆ పల్చటి తెరలు కూడా సముద్రపు అలల్లా ఫ్యాను గాలికి ఊగిసలాడుతున్నాయి. లేత కనకాంబరం రంగులో స్ప్రే పెయింట్ కొట్టినట్టు నిగనిగ లాడుతున్న గోడలు వూగుతున్న తెరలతో సయ్యాటలాడుతున్నాయి. సోఫా ఎదురుగా వున్న టీపాయిపై అద్దం తళతళలాడుతూ పైన ఫాల్స్ సీలింగు లోని బల్బుల కాంతులను ప్రతిఫలిస్తోంది. ఫాల్స్ సీలింగులోని వలయాకారపు పూవు నుండి పొడుచుకొచ్చిన విన్నూత్నమైన నక్షత్రపు ఆకారంలోనున్న ఫ్యాను లోనూ బల్బులు వెలుగుతున్నాయి. తిరుగుతున్న ఆ ఫ్యాన్ రెక్కల నీడలు టీపాయ్ అద్దంపై రంగుల రాట్నంలా తిరుగుతున్నాయి. తన తలలోనూ రంగుల రాట్నంలా తిరుగుతున్న ఆలోచనలతో సతమతమవుతూ కవిత ఐదోసారి టీపాయి అద్దాన్ని మెత్తని బట్టతో తుడిచింది. మెత్తని వెల్వెట్‌లా పాదాలకు తాకుతున్న చింతపిక్క రంగు ఖరీదయిన కార్పెట్ వైపు చూసింది కవిత. కార్పెట్ మధ్యలో వున్న గులాబీ దీర్గచతురస్రం లోకి టీపాయిని జాగ్రత్తగా లాగింది. టీపాయి పైనున్న పూల వేజ్‌లోని పూల వంక చూసిందో సారి. వివిధ వర్ణాల గులాబీలు మిసమిసలాడుతున్న రేకలతో యవ్వన కాంతులు విరజిమ్ముతున్నట్లున్నాయి. దాదాపు పది గంటలయినా వసి వాడని ఆ పూల వంక అపురూపంగా చూసింది.

హాలుకి ఈశాన్యం మూలలో వున్న బస్ట్ సైజు బుద్ధుని విగ్రహం వంక చూసింది.

“When you realize how perfect everything is you will tilt your head back and laugh at the sky”

బుద్ధుని ప్రతి సూక్తిని కవిత తన జీవనంలో అనుక్షణం ఆపాదించుకుంటూ వుంటుంది. సోఫాలో వెనుకకు జారగిలబడి తల పైకెత్తి తనలో తాను నవ్వుకుంది. ఎందుకో బుద్ధుని ప్రతీ సిద్ధాంతము కవితకి ఎంతో ఇష్టం. ఆమెను బాధించేదల్లా గౌతముడు మరీ తన ఇరవై తొమ్మిదో ఏటే ప్రాపంచిక సుఖాలను వదిలి సన్యసించటం. అద్భుతమైన మానవ జన్మను ఆసాంతము అనుభవించకపోవటం. టీపాయిపై మోగుతున్న ఆమె ఫోను బుద్ధుని ఆలోచనల నుండి బయటకు లాగింది.

‘హలో’

‘నేనండీ, హేమంత్…’ అవతలినుండి మంచులో ముద్దయినట్టున్న మంద్రమయిన స్వరం.

ఆ కంఠం విన్న కవిత చెవులకు చల్లగాలుల స్పర్శ తాకినట్టయ్యింది.

హేమంత్ సంవత్సర కాలంగా ఎఫ్బీలో తనను తరచూ ఆత్మీయంగా పలకరిస్తూ తన పోస్టులపై విజ్ఞానవంతంగా, గౌరవప్రదంగా వ్యాఖ్యలు వ్రాస్తూ హుందాగా అభినందించే మహా పండితుడు. కవితకు ఎఫ్బీలో మంచి ఫాలోయింగ్ వుంది. ఆమె పోస్టు కోసం ఎదురు చూసే అభిమానులు వున్నారు. ఆమె కవిత్వం కోసం చెవులు కోసుకునే సాహిత్యాభిమానులున్నారు. ఆమె వారం రోజులపాటు ఎఫ్బీలో కనిపించకపోతే అల్లల్లాడిపోయే ఆత్మీయులున్నారు. మెసెంజర్లో కొచ్చి క్షేమ సమాచారానికై వెంపర్లాడే శ్రేయోభిలాషులున్నారు. అయితే వీరందరికీ భిన్నం హేమంత్. ఏనాడు అతను కవితను మెసెంజర్లోకొచ్చి పలకరించి ఎరుగడు. ఎప్పుడూ ఏ వ్యాఖ్యలోనూ వ్యక్తిగత విషయాలడిగి ఎరుగడు. అతని పేరులాగే అతను బంగారం. ఇరవయి నాలుగు క్యారెట్ల మేలిమి బంగారం. అందుకే కవితకి అతనంటే ఎనలేని గౌరవం. అతని వ్యాఖ్యలలోని మృదువైన భాష, సున్నితమయిన భావాలoటే కవితకి అలవి కాని అభిమానం. భర్త ఉద్యోగరీత్యా దేశవిదేశాలు తిరిగి పాశ్చాత్య నాగరికతను చూసిన కవితకి హేమంత్ తెలుగు సాంప్రదాయం, సనాతన ధర్మాలపైన అతని విశ్వాసం, సంగీతంపై అతని మక్కువ, ఆమెని అతనికి ఆకట్టుకునేలా చేసాయి. అతని వ్యక్తిత్వం పైన, అతని అభిరుచుల పైన వల్లమాలిన గౌరవాభిమానాలను పెంచాయి. వయసులోనూ అతను చాలా పెద్దవాడవటం వలన కవితకి అతనంటే పూజ్యభావం. అలాంటి పూజ్యుడిని ఈ రోజున కవిత చూడబోతోంది, కలవబోతోంది. ఆమెలో, ఆమె మాటల్లో చెప్పలేని ఉత్సాహం, భాషకందని ఆనందం.

 ‘ఎక్కడున్నారండి. ఇల్లు కనుక్కోవటం ఏమయినా కష్టంగా ఉందా’ ఆత్మీయంగా అడిగింది కవిత

‘నాకు దారి కొంచం గందరగోళంగా వుంది. ఆటో డ్రైవరుకి కాస్త వివరిస్తారా’ హేమంత్ అభ్యర్ధన.

కవిత నొచ్చుకుంది. అసలు తను కఠినాత్మురాలు, రైల్వే స్టేషనుకి తాను వెళ్ళి వుండాల్సింది. అంత పెద్ద వయసులో కేవలం తనను చూడటానికి పొరుగూరి నుండి వస్తున్న పెద్దమనిషి పైన తనకు వీసమంతయినా దయ లేక పోయింది.

‘హలో, సారు సరిగ్గా చెప్పలేకపోతున్నారు. అడ్రస్సు సరిగ్గా చెప్పండమ్మా’ కరుకుగా ఆటో డ్రైవరు గొంతు.

వెంటనే ల్యాండ్ మార్కులతో సహా డ్రైవరుకి అడ్రస్సు వివరంగా చెప్పింది.

‘అర్ధమయ్యిందమ్మ ఇప్పుడు. సారుకి ఫోను ఇస్తున్నాను’ ఆటోవాడు ఫోన్ హేమంత్‌కి ఇచ్చేసాడు.

‘థ్యాంక్యూ కవిత, ఐ విల్ బె దేర్ ఇన్ ఫైవ్ మినిట్స్ టైం’ హేమంత్ ఫోన్ పెట్టేసాడు.

‘అలాగేనండి, ఎదురుచూస్తున్నాను మీ కోసం’ కవిత పరుగుతో వంటగదిలోకి వెళ్ళింది. పనిమనిషి గంగతో ‘మంచినీళ్ళకి, జ్యూస్ కి గాజు గ్లాసులు శుభ్రంగా తోమావా. ట్రే, ప్లేట్లు, అన్నీ సిద్ధం చేసి పెట్టావా’ అడిగింది.

‘ఏమిటమ్మా ఆ కంగారు. ఒచ్చేతను ఏదో ప్రైమ్ మినిస్టరో, చీఫ్ మినిస్టరో అయినట్టు. అంత పెద్దోడేటమ్మా ఆ ఒచ్చే మడిసి’ ఆరాగా అడిగింది గంగ.

‘మినిస్టరయితే నాకు గొప్ప కాదే. మనిషిగా గొప్పవాడు, సహృదయుడు, మానవత్వమున్నవాడు, మంచివాడు, వయసుతో పాటు మంచితనాన్ని పెంచుకున్నవాడు. నీకు ఇవి చెప్పినా అర్థం కావులే. పని చూడు’ అంది కవిత.

కూతురు చేస్తున్న ఆర్భాటాన్ని చూసి నవ్వుకుంది కవిత తల్లి కాత్యాయిని. చుట్టాలొస్తున్నారన్నా కవితలో ఈ కంగారు చూడలేదెప్పుడూ. ఏమిటో ఆ వచ్చే అతిథిలో ప్రత్యేకత.

ఇంతలో కాలింగ్ బెల్ మోగింది. గంగ వెళ్ళి తలుపు తీసింది. కవిత హేమంత్‌ని చిరునవ్వుతో సాదరంగా లోపలికి ఆహ్వానించింది. ఊడిన పళ్ళతో, బోసి నోటితో పసిపాపాయిలా అనిపించాడు కవిత కళ్ళకు హేమంత్. కళ్ళు ప్రశాంతంగా, నవ్వు నిష్కల్మషంగా, అతని మొహం విజ్ఞానంతో దేదీప్యమానంగా వెలుగుతోంది. చెరగని నవ్వు అతని ఆభరణం. హేమంత్ నిజంగా సార్థక నామధేయుడు. కవితకి ఇంట్లోకి హేమంతం వచ్చినట్టే అనిపించింది.

‘ఈ జన్మలో ఇలా మిమ్మల్ని పర్సనల్‌గా కలవగలననుకోలేదు. ఇట్స్ ఎ డ్రీమ్ టు సీ యు’ కళ్ళు మెరుస్తూండగా ఆనందంగా అన్నాడు హేమంత్.

‘మీ టూ….’ అంతే సంబరంగా బదులిచ్చింది కవిత.

కవిత అమ్మను హేమంత్‌కి పరిచయం చేసింది. అమ్మ వయసుకి అతని వయసుకి పెద్దగా తేడా లేదు. ఇద్దరూ పరస్పరం నమస్కరించుకున్నారు.

‘మీరు చాలా అదృష్టవంతులమ్మా, మీ అమ్మాయి మీ పైన కవితలు రాస్తూంటుంది. ఆమె తల్లి ప్రేమంతా ఆమె కవిత్వంలో జాలువారుతూంటుంది. నేను మీ అమ్మాయి అభిమానిని’ అన్నాడు కాత్యాయినితో.

కాత్యాయిని కూతురి వంక గర్వంగా చూసింది.

ఇంతలో గంగ ట్రేలో ఒక గిన్నెలో డ్రై నట్స్, మరో గిన్నెలో నేతి మిఠాయిలు, ఇంకో గిన్నెలో ఫ్రూట్ సలాడ్, గ్లాసులో ఆపిల్ జ్యూస్ తెచ్చి పెట్టింది. అతను తనకు మధుమేహమని స్వీట్లు తిననని, చల్లని పానీయాలు అసలే త్రాగనని అన్నాడు.

‘లైటుగా తీసుకోండి. డిన్నర్ ఏర్పాటు చేసాను’ అంది కవిత.

‘ఒహ్, నో. నేనసలు రాత్రుళ్ళు భోంచేయను. మీరేమి శ్రమ తీసుకోవద్దు ప్లీజ్. ఈ నట్స్ చాలు. ప్లెంటీ. కేవలం మిమ్మల్ని చూడటానికే హైదరాబాదు వచ్చాను’ అన్నాడతను.

‘అయ్యో, వంట చేసేసాను. ఇంత దూరం వచ్చి భోజనం చేయకపోవటం ఏమిటి’ అడిగింది కవిత.

‘లేదండీ, ఒక వేడి వేడి కాఫీ ఇవ్వండి చాలు’ అన్నాడతను.

కవిత లేచి స్వయంగా కాఫీ కలిపి అతనికీ తనకూ తెచ్చింది.

కాఫీ సిప్ చేస్తూ ‘మీ కవిత్వంలా మీ ఇల్లూ చాలా బావుంది. ఇంటి ప్రతి అంగుళం మీ భావుకత్వాన్ని, మీ అభిరుచిని తెలుపుతోంది’ అన్నాడతను.

‘థ్యాంక్యూ, ఎక్కువగా ట్రాన్స్‌ఫర్ల మీద తిరుగుతూండటం వలన నా అభిరుచికి అనుగుణంగా సర్దుకునే అవకాశమే లేదండీ. ఏదో వున్నంతలో సర్దుతాను. ఏ రోజు ఈ ఇల్లూ, ప్రదేశం మారిపోతామో తెలియదు’ అంది కవిత.

కవిత ఈ మధ్య కాలంలో రాసిన కొన్ని కవితలను అద్భుతంగా విశ్లేషించాడు. అతని అనర్గళమైన ఆంగ్ల భాష మాతృ భాషతో పోటీ పడుతున్నట్టుగా వుంది. అసలతని విద్యార్హతలేమిటో. తన సందేహ నివృత్తి కోసం అతనిని అదే విషయం అడిగింది.

అతను నవ్వుతూ ‘జస్ట్ మాస్టర్స్ ఇన్ సైకాలజీ’ అన్నాడు.

అతనిపై గౌరవం రెట్టింపయ్యింది.

‘ఒక సిగరెట్టు కాల్చుకోవచ్చా’ అడిగాడతను పరధ్యానంగా.

‘ష్యూర్. గంగా యాష్ ట్రే. తీసుకొచ్చి ఇవ్వు సారుకి’ అంది కవిత.

‘నో ఐ డోంట్ వాంట్ టు స్మోక్ హియర్’ అంటూ బాల్కనీలోకి బయటకు వెళ్ళాడు అతను.

గుప్పుగుప్పున రింగులురింగులుగా పొగ ఒదులుతూ ఆలోచిస్తున్న హేమంత్ ఏదో సుడిగుండంలో చిక్కుకున్నంతగా నలిగిపోతున్నాడు.

లోపలికి వచ్చాక ‘మీతో ఒక సెల్ఫీ తీసుకోవచ్చా’ అడిగాడతను ఆంగ్లంలో.

అతని ఆంగ్ల ఉచ్ఛారణ చాలా బావుంది. ఆంగ్ల భాష పైన అతనికున్న పట్టు అద్భుతం.

ఇంతలో తమ్ముడు గోపి తన రూములో నుండి బయటకు వచ్చాడు. వాడి పరిచయం అయ్యాక ‘మా తమ్ముడు తీస్తాడులే మంచి పిక్, సెల్ఫీ అవసరం లేదులెండి’ అని కవిత తన చేతిలో మొబైల్ తమ్ముడి చేతికిచ్చింది ఒక పిక్ తీయమని.

‘నేను మిమ్మల్ని పట్టుకోవచ్చా’ సందిగ్ధంగా అడిగాడు హేమంత్.

అతని, వివేచనకి, వినయ విధేయతలకు ముచ్చటేసింది కవితకు.

‘అయ్యో, పెద్దవారు, సంకోచిస్తారెందుకు. నిరభ్యంతరంగా’ అంటూ కవిత హేమంత్‌కి దగ్గరగా వచ్చి నిలబడింది. హేమంత్ కవిత భుజాల మీదుగా చేయివేసి ఆమెను ఆనుకుని ఒక పిక్ తీయించుకున్నాడు.

‘అక్కా, నేను బయటికి వెళ్తున్నాను, బయట నా కోసం నా ఫ్రెండ్ వెయిట్ చేస్తున్నాడు’ అంటూ గోపి వెళ్ళబోయాడు.

‘అయ్యో, అతనిని దింపుతావనుకున్నానురా… ఎప్పుడు తిరిగి వస్తావు’ అడిగింది కవిత తమ్ముడిని.

‘ఫరవాలేదు. నాకు ఒక క్యాబ్ బుక్ చేయమనండి చాలు. నేను వెళ్ళిపోతాను’ అన్నాడు హేమంత్.

వెంటనే గోపి హేమంత్ ఫోన్ నుండి క్యాబ్ బుక్ చేసి. ‘ఐదు నిముషాల్లో వస్తుంది. మీ ఫోన్ ఛార్జింగ్ చాలా తక్కువగా వుంది. క్యాబ్ వాడి నంబరు నోట్ చేసుకోండి ఫోను చావక ముందు’ అని చెప్పి వెళ్ళిపోయాడు. కవిత వెంటనే పేపర్ పెన్ ఇచ్చింది హేమంత్‌కి నంబరు రాసుకోవటానికి. అతను రాసుకున్న వెంటనే గోపి అన్నట్టుగానే అతని ఫోను చచ్చిపోయింది.

‘థ్యాంక్ గాడ్’ ఊపిరి తీసుకుంది కవిత.

అతనికి తన ఫోను ఇచ్చి క్యాబ్ వాడికి ఫోన్ చేసి ఎక్కడున్నదీ కొనుక్కోమంది. తీరా చూస్తే హేమంత్ రాసుకున్నది క్యాబ్ వాడి ఫోను నంబరుకి బదులు వాడి కారు నంబరు. అతని అమాయకత్వంపై నవ్వొచ్చింది కవితకి.

 ‘పాపం పెద్దాయన పెద్దాయనే’ అని మనసులో అనుకుంది.

హేమంత్ తను ఆటో తీసుకుని వెళ్తానని లేచాడు. కవితకు తెలుసు తన ఇంటి పరిసర ప్రాంతంలో ఆటోలు దొరకవని. చీకటి వేళ, కాని వూళ్ళో, చత్వారంతో అతను ఇబ్బంది పడతాడని కవిత తనూ చెప్పులు వేసుకుంది తన కారులో దింపుదామని.

‘అబ్బే వద్దండి, నేను వెళ్ళిపోతాను’ మొహమాటపడ్డాడతను.

‘ఫరవాలేదండీ. కడ దాకా కాకపోయినా కనీసం ఆటో దొరికే వరకయినా దింపుతాను’ అని అతనితో పాటే బయటికి వచ్చింది కవిత.

అమ్మకు నమస్కరించి వెళ్ళి వస్తానని చెప్పాడు అతను.

కవిత కారు డ్రైవింగ్ చేస్తోంది. పక్క సీటులో హేమంత్ కూర్చున్నాడు.

అతను కవితతో తప్పనిసరిగా అతని ఊరికి రావాలని ఆ రోజు కోసం ఎదురు చూస్తూంటానని అన్నాడు.

 ఈ రోజు అతనికి మరువలేని మధుర జ్ఞాపకమన్నాడు.

 పది నిముషాలనంతరం ఆటో స్టాండు వద్దకు చేరింది కారు.

ఒక ఆటో వెనుకగా కవిత కారు ఆపింది.

హేమంత్ చటుక్కున ఆమె ఎడం బుగ్గ పైన గట్టిగా ముద్దు పెట్టి హడావుడిగా దిగిపోయి గబగబా ఎదురుగా వున్న ఆటో ఎక్కేసాడు.

అతనిచ్చిన షాకుకి నిశ్చేష్టురాలై దిగ్భ్రమలో వుండిపోయింది కవిత.

అసలతని చర్యను ఎలా అర్థం చేసుకోవాలో కూడా అర్థం చేసుకోలేని విధంగా ఆమె మెదడు స్తబ్దుగా అయిపోయింది. సైకాలజీ చదివిన అతని సైకాలజీ కవితకి అంతు పట్టలేదు. బహూశా సైకాలజీ చేయటం వలననే అవతలి వాళ్ళ బలహీనతలు గ్రహించి వాళ్ళ మానాభిమానాలతో ఆడుకుంటున్నాడేమో.

ఒక వ్యక్తి పెట్టే పోస్టును బట్టో కామెంట్లను బట్టో వాళ్ళ వ్యక్తిత్వాన్ని నిర్ధారించలేమని తెలిసింది. తెల్లనివన్నీ పాలు కావని అమ్మ తరచూ చెప్పే సామెత చెవుల్లో గింగుర్లు కొడుతోంది. ఎఫ్బీలో స్నేహాలు నమ్మొద్దక్కా అనే తమ్ముడి హెచ్చరిక తలలో ప్రతిధ్వనిస్తోంది.

పోనీ ఏదయినా అభినందనపూర్వకంగా ముద్దిచ్చుకునే (పెక్ ఇచ్చే) విదేశీ సంస్కారమనుకోవటానికి లేదు. ఇది భారత దేశం. బాలీవుడ్ హీరోయిన్ శిల్పా శెట్టిని బుగ్గన ముద్దు పెట్టిన విదేశీయుడు రిచర్డ్ గేరేకి అరెస్ట్ వారెంట్ ఇవ్వటానికి సాహసించిన నిఖార్సయిన భారతీయ సంస్కృతి మనది.

అతనెక్కిన ఆటో ముందుకు వెళ్ళిపోయింది. షాకు నుండి తేరుకోలేని కవిత అక్కడే కారులో అలాగే కూర్చుని వుంది. ఇది తను జీవితంలో మరిచిపోలేని గుణపాఠం. తనకే కాదు ఎఫ్బీకి అడిక్ట్ అయి ముక్కు మొహం తెలియని వ్యక్తులను మిత్రులుగా భావించే తనలాంటి వారందరికీ కనువిప్పు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here