[dropcap]మ[/dropcap]ధు హాల్లో టీవీలో న్యూస్ చూస్తున్నాడు. ఇంతలో ఫోన్ మోగింది. “హాల్లో” అన్నాడు!
వెంటనే సంతోషం నిండినా మొహంతో “హలో వాసు చాలా రోజులైంది. ఎలా ఉన్నావు? లండన్ నుండి ఎప్పుడు వచ్చేవు? విశేషాలేమిటి?” అంటూ ఉత్సాహంగా ప్రశ్నల వర్షం కురిపించేడు మధు.
“అరే! ఫోన్ నేను చేస్తే నీ ప్రశ్నలు ఏమిటి మధు? సరే, సరే, నేను వచ్చి నాలుగు రోజులైంది. చెన్నైలో దిగేను. మావూరు వెళ్ళేను. అంత బాగున్నారు. నా వైఫ్ డెలివరీ టైము దగ్గిర పడింది కదా, పక్కన ఉందామని ఇలా సెలవులో వచ్చాను. సరేకాని, మధూ ఓసారి ఇక్కడకు వస్తావా! ఎన్నాళ్ళయిందో మనం కలిసి, నువ్వు చెన్నై వచ్చావనుకో, నేను కారు తీసుకుని ఎయిర్‌పోర్ట్‌కి వస్తాను. ఇద్దరం హాయిగా నెల్లూరు చేరుకుందాం సరేనా. ప్లీజ్ డోంట్ సే నో” అన్నాడు వాసు.
“సరే, మా బాస్‌కి చెప్పి రేపు టికెట్స్ బుక్ చేసుకుంటాలే” అన్నాడు మధు.
సాఫ్ట్‌వేర్ ఇంజనీరుగా ఉద్యోగంలో చేరి చూస్తుండగా ఏడేళ్లు దాటిపోయింది. భువనేశ్వర్, జంషెడ్‌పూర్, కోల్‍కత్తాలలో పనిచేసేక ఇప్పుడు కొంచెం సీనియర్ పోస్టు ఇచ్చి ముంబై వేశారు. వచ్చి ఏడాది అయిపోతుంది, మంచి లొకాలిటీలో కంపెనీవారు లీజు తీసుకున్న చక్కని విశాలమైన మూడు బెడ్ రూముల అపార్టుమెంట్ అంత సౌకర్యంగా ఉంది. ఎటొచ్చి ఒంటరి బ్రతుకు.
ఉద్యోగంలో చేరింది మొదలు జీవితమంతా పరుగే – తనే ఇంట్లో మొదటి సంతానం. తర్వాత వెంటవెంటనే ఇద్దరు చెల్లెళ్ళు. తండ్రి మామూలు గవేర్నమెంటు ఉద్యోగి. ఉండడానికి స్వంత ఇల్లు ఒకటివుంది. ప్రక్క పల్లెలో నాలుగు ఎకరాల పొలం వుంది మధు తండ్రి రామచంద్రరావుకు. మధు చదువంతా చురుకుగా సాగింది. ఇంటరు, పూర్తిచేసి, ఉన్న ఊళ్ళోనే ఇంజినీరింగ్ చేసేడు. ‘గేట్’ అఖిల భారతస్థాయి ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్ష వ్రాసి ఐ.ఐ.టి. ఖరగ్‌పూర్‌లో ఎం.టెక్‌లో సీట్ వచ్చింది. ఆ చదువు పూర్తయ్యోలోగా మంచి కంపెనీవారు ‘ప్లేసెమెంట్’లో సెలెక్ట్ చేశారు. ఇంటర్వ్యూ బాగా చేసి మధు 23 సంవత్సరాలు నిండేలోగా ఉద్యోగస్తుడైపోయాడు. సౌమ్య, శ్రేయ తనకు చెల్లెళ్ళు. వూళ్ళోనే కాలేజీలో డిగ్రీ చేశారు. వాళ్ళకు మంచి సంబంధాలు వచ్చేయి. అమ్మ నాన్న వెంటనే తెలివిన పడి వాళ్ళ వివాహాలు చేసేసారు.
ఎప్పటి కప్పుడు ఇంటి భాద్యతలను మధుపైనే పడేస్తుండేవారు వాళ్ళు అమ్మ నాన్న. మంచి జీతం. వాళ్ళ నాన్న తెచ్చుకునే జీతం లెవెల్‌తో తన స్టార్టింగ్ శాలరీ ఉండేది. ‘తన వంతు’ — బాగా ఎక్కువంతే – డబ్బు పోగుచేసి వాళ్ళ చేతుల్లో పోసేవాడు. అంతవరకు బాగానేవుంది. ఇస్తూవుంటూ అడిగేవారు అడుగుతూనే ఉంటారు మధు, “పండక్కి వచ్చేటప్పుడు టైటాన్ మంచి గాజుల జత పట్టుకురారా, సౌమ్యకు పెళ్ళి సంబంధాలు వస్తున్నాయి.” అమ్మ ఫోను.
“అలాగేనమ్మా”
“ఒరేయ్ మధూ, సౌమ్యకు సంబంధం కుదిరింది. పెళ్ళిఖర్చులకు కనీసం ఏభైవేలు నువ్వు సర్దాలిరా. కట్నం కానుకలు నేను చూసుకుంటాను. వెంటనే లొనుకు అప్లై చెయ్యి” నాన్న దగ్గర నుండి ఉత్తరం.
“అలాగే నాన్నగారు”
సౌమ్యకు మంచి సంబంధమే కుదిరింది. బావగారు బ్యాంకు ఆఫిసరు ఇద్దరు చిలకా గోరింకల్లా వున్నారు. వాళ్లకు 3 ఏళ్ళ బాబు, మళ్ళీ పురిటికి వచ్చింది రెండో కాన్పుకు.
మానవ స్వభావాలు చాలా చిత్రంగా వుంటాయి. అడగనిదే అమ్మ కూడా పెట్టదు. నీ కడుపులోకి దూరి చోస్తుందా ఏమిటి? అన్న సామెత వూరికే రాలేదేమో! ఇలా ‘వన్ వే ట్రాఫిక్’ జరిగిపోతుంది మధు విషయం. వాళ్ళ అమ్మగాని, నాన్నగాని, ఇద్దరు చెల్లెళ్లుగాని – మాకేం తెచ్చేవు? అని తప్ప – నువ్వు ఎలా వున్నావు? నీకేం కావాలి? అని ఎన్నడూ ఆలోచించలేదు. భువనేశ్వర్ నుంచి జంషెడ్‌పూర్ బదిలీ అయినప్పుడు మధుకి 25 సంవత్సరాలు. తను పదో తరగతిలో ఉండగా క్లాస్‌మేట్ అయిన లావణ్య కనపడింది రిలయన్స్ మార్ట్‌లో. పలకరించాడు మధు. బి.యస్.సి. మేధ్స్ చేసిందట. కంప్యూటర్ డిప్లమో అవంగానే హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఉద్యోగం వచ్చింది. వెళ్తున్నాను. అంది. లావణ్య ఎంతో అందంగా, సన్నగా, పొడవుగా చలాకీగా వుంది. “పార్కులో కాసేపు కూర్చొని మాట్లాడి ‘బై’ చెప్పేసి వచ్చేసేను. లావణ్యను తను వివాహం చేసుకుంటే – హాయిగా ఎంత బాగుంటుంది?” అనుకున్నాడు. ఎలా ఈ ప్రస్తావన తేవాలి ? అమ్మతో చెప్పాలా? నాన్నతో చెప్పాలా? ఈ మీమాసంలో ఆలోచనలో పడిపోయాడు. ఇంతలోనే శ్రేయకు పెళ్ళి నిశ్యయమవడం. మళ్ళీ ‘తనవంతు’ లోన్లు చెక్కులు, చీరలు బహుమతులు – ఇదేవరస. చెల్లెళ్ళు కూడ ఎప్పటికప్పుడు, హాస్యంగా “అన్నయ్యా అంత జీతం తెచ్చుకుంటున్నావు కదరా మేనల్లుడుకి ఏదైనా కొనరా” అంటూ పౌరుషపెట్టి లౌక్యంగా పనులు చేయంచేసుకునేవారు. ఇలా మరో ఏడాది గడిచి పోయింది. ఒకసారి స్వంత వూరు వచ్చినప్పుడు హాల్లో టీపాయ్ మీద శుభలేఖ కనపడింది. ‘ఎవరి పెళ్ళి?’ అంటూ మధు శుభలేఖను ఆత్రంగా తెరిచి చూసాడు. లావణ్య పెళ్ళి. మద్రాసులో ఇంజినీరుతో.
“ఛీ, మంచి ఛాన్స్ పోయింది” అనుకున్నాడు. ఇంట్లో అందరి మీద మొదటిసారి పట్టరానికోపం వచ్చింది. నాలుగు రోజులు తిరగకుండానే “నా బాస్ అర్జెంటుగా రమ్మన్నారు” అని అక్కడి నుండి బయల్దేరి ముంబయ్ చేరుకున్నాడు.
ఇప్పుడు ఇలా వాసు ఫోను. వాసు, కేశవ, రాజు తను, చిన్నప్పటి నుండి స్నేహితులు మనస్సు విప్పి మాట్లాడు కోవడం ఏదైనా వుంటే వాళ్ళతోనే ఇంకేం ఎలాగూ ఒంటరి బతుకేకదా ఒక మార్పు చెన్నైకి బయల్దేరాడు మధు. ఎయిర్‌పోర్టుకు వాసు వచ్చాడు. ఇద్దరూ కలసి నెల్లూరుకు వెళ్తున్నారు. “ఏం. మధూ! నా పెళ్ళయి మూడేళ్లయింది. అంతకు ముందు మన ఫ్రెండ్స్ నలుగురిలో నువ్వే కదా ఫస్ట్ వుద్యోగంలో చేరేవు. మంచి సేలరీ, మంచి ప్రమోషన్లు కొట్టేవు. ఇంకా పెళ్ళి చేసుకోలేదెందుకని ఒంటరిగా ఎన్నాళు౦టావు. నీకు తెల్సా మధూ ముప్ఫయి దాటిపోతే మగవాళ్ళకు కూడ పెళ్ళి అవడం కష్టమనే సంగతి? అసలు నీ బాధ ఏంటి చెప్పరా” అని వాసు గొడవ గొడవ పెట్టేడు.
మధు ముఖమంతా సీరియస్ గా మారింది గొంతులో తడి ఆరిపోయింది. నోట మాటరావడం కష్టమయి ప్రక్కనే ఉన్న వాటర్ బాటిలో తెరిచి గడగడా మంచి నీళ్ళు తాగేశాడు.
“వాసు! ఏం చెప్పమంటావురా! అమ్మ, నాన్న మధ్య తరగతి వాళ్ళు. చెల్లెళ్ళు వెంటనే ఎదిగి వచ్చేరు. నేను ఉద్యోగంలో ప్రవేశించినది మొదలు వాళ్ళకోసం బంగారం కొనడం, పెళ్ళి ఖర్చులకు సాయం చెయ్యడము, పండుగలకు బావగార్లకు బహుమతులు ఇవ్వడము, మేనళ్లుళ్ళు పుట్టినప్పుడు కానుకలు సిటీలకు వాళ్ళను తీసుకుని వెళ్ళి అన్నీ చూపించటము, ఇలాగే ఇన్నేళ్లూ గడిచిపోయాయి” అన్నాడు.
కొంచెం తలవంచుకుని లావణ్య గురించి చెప్పేడు “అమ్మో! మధూ ఎంత పని చేశావు ? అమ్మానాన్నా కాకపోతే కనీసం మామయ్యతో చెప్పి ఆ సంబంధము సెటిల్ చేసుకోలేకపోయావా!” అని వాసు బాధతో స్నేహితుడి వీపు నిమిరాడు.
నెల్లూరు చేరుకునేసరికి మధ్యాహ్నం రెండు అయింది. వాసు తల్లిదండ్రులు ఎంతో ప్రేమతో పలకరించేరు. మంచి భోజనం పెట్టేరు. కాసేపు రిలాక్సు అయ్యేరు. ఆ సాయంత్రం స్నేహితులిద్దరూ సినిమాకి వెళ్ళి వచ్చేరు. మధు తనకు ఏర్పాటు చేసిన గదిలోకి వెళ్ళేడు, వాసు కూడా అక్కడికే వచ్చి కబుర్లు చెప్పేడు. “బై ది వే, మధూ ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకు. మీ ఊర్లో ఎవరైనా తెలిసిన మంచి కుటుంబంలోని అమ్మాయి ఉన్నారా అని ఆలోచించు. ఈ రోజుల్లో అమ్మయిల్ని కూడా నమ్మలేం. చాలా సౌమ్యంగా కనపడినా చాలా గడుసుగా వుండి నువ్వేమిటి అని లెక్క చేయటం లేదు. చాలా కేసులు వింటున్నానులే. మా అమ్మ నాన్నగార్లతో చెప్తాను మంచి సంబంధం తెలిసినవారుంటే చెప్పమని, ఒక్కమాట మధూ మన నిర్ణయాలు మనమే తీసుకోవాలి – అర్ధం అయ్యిందా – బెస్ట్ అఫ్ లక్” అన్నాడు.
“సరే థాంక్యు – గుడ్ నైట్ ” అని మధూ మంచం పై వాలేడు.
ఒక వారం రోజుల తరువాత ఇంటినుండి – “నాన్నగారికి కొంచెం నలతగా వుంది నిన్ను చూడాలని వుందట. ఒకసారి వచ్చి వెళ్లితే బాగుంటుంది.” అని అమ్మ ఫోన్.
“అలాగే” అన్నాడు మధు. ప్రయాణం అయ్యి వెళ్ళేడు.
“భగవంతుడా ప్లీజ్ హెల్ప్ మీ” అనుకున్నాడు. వాళ్ల ఇంటినుండి పార్కుకు వెళ్ళేదారిలో ఒక శివాలయం వుంది. పూజారికి అదే ప్రాంగణంలో ఒక ప్రక్క చిన్న ఇల్లువుంది. రమణాచారి గారు అని, చాలా ప్రసన్న వదనం, మంత్రాలు స్పష్టంగా చెప్పి, ఓపికగా పూజలు, అభిషేకాలు చేయించి ఆశీర్వచనం అందించుతారు. ఎందరో భక్తులు వస్తుంటారు. ఆరోజు పార్కుకు వెళ్తూ మధూ ఎందుకో అనాలోచితంగా గుడిలోకి అడుగు పెట్టేడు. సాయంత్రం ఐదుగంటలవేళ కొంచెం దూరంలో చెట్టు క్రింద పూజారి గారి కూతురు పిల్లల్ని కూచోబెట్టి చదివిస్తున్నది. ఆమె పేరు సుమలత. టీచర్‌గా గవర్నమెంట్ స్కూల్లో పనిచేస్తున్నది. మధు అనాలోచితంగానే అటు వెళ్ళేడు. సుమలత ఆశ్యర్యంతో అతణ్ణి చూసి లేచి నిలబడింది. “అరే, మీరు లేవనక్కరలేదు. నేను మధూ, ప్రక్క వీధిలో రామచంద్రరావుగారి అబ్బాయిని” అన్నాడు.
“తెలుసును నాన్నగారు చెప్పేరు” అంది. పిల్లలతో “ఇవాల్టికి చాలు రేపు రండి” అంది.
“కూర్చోవచ్చునా” అని పర్మిషన్ అడిగేడు. అయితే అరుగు చివర కూర్చుండిపోవుయేడు. సుమలతను కొంచెం పరిశీలనగా చూసేడు. చక్కగా ఉంది. తను స్కూల్లో పదో తరగతిలో వుండగా 6వ తరగతిలో ప్రవేశించింది కాదు! గుర్తుకొచ్చింది. అప్పటికీ, నేటికీ పెద్ద తేడా లేదు. అదే నాజూకు, చిరునవ్వు ప్రశాంతమైన ముఖము.
“మీ పేరు” అన్నాడు.
“సుమలత” అంది
“మీ గురించి చెప్తారా” అన్నాడు.
“చెప్పడానికి పెద్ద విషయాలు లేవు. నాన్నకు ఆదాయం అంతమాత్రమేకదా. ఉన్న వనరులతో శ్రద్దగా చదువుకున్నాను. డిగ్రీలో మంచి మార్కులు వచ్చేయి. బి.ఇ.డి. చేస్తే బాగుంటుంది అని ఎంట్రన్స్ రాసి, ఇక్కడే సీటు తెచ్చుకున్నాను. గతేడాది పూర్తయింది. గవర్నమెంట్ వారు టీచర్స్ ఉద్యోగాలకు ఎంపిక చేసిన పరీక్షల్లో కూడా నెగ్గి ఇక్కడ హైస్కూల్లో లెక్కలు, ఫిజిక్స్ చెప్పుతున్నాను” అంది. “శివానుగ్రహం వల్ల ఈ వుద్యోగం వచ్చింది” అంది.
మధు ఇలా అన్నాడు. “సూటిగా అడుగుతున్నందుకు కోపం తెచ్చుకోకండి సుమలతా, నేను ముంబాయిలో ఇంజనీరుగా పనిచేస్తున్నాను. మంచి జీతం వస్తుంది. కంపెనీ ఇల్లు ఏర్పాటు చేసింది. మనిద్దరికీ ఓ ఐదేళ్లు వుత్యాసం వుంది. అన్నీ బాగానే వున్నాయి. నేను మిమ్మల్ని వివాహం చేసుకోవడానికి సిద్ధంగా వున్నాను. మీరు దైర్యంగా ఆలోచించుకుని మీ నిర్ణయం చెప్పండి. మీకు ఏ లోటు రాదు. అక్కడ చాలా స్కూళ్ళు వుంటాయి. మీరు వుదోగ్యం కావాలంటే చేసుకోవచ్చు. మా కుటుంబం గురించి మీకు, మీ నాన్నగారికి తెలుసుకదా! నాకు కట్నం కానుకలు అట్టహాసాలు అక్కర్లేదు. రేపు ఇదే సమయానికి వస్తాను. మీ నిర్ణయం చెప్పండి. నాన్నగారికి ఈ విషయం చెప్పండి” అన్నాడు.
“బై” అంటూ వడివడిగా బయటకు వచ్చి పార్కులో రెండు రౌండ్లు వేసి ఇల్లు చేరుకున్నాడు. నాన్నగారికి చిన్న మలేరియా జ్వరం వచ్చింది. ప్రస్తుతం బాగానే వున్నారు. రాత్రి నిద్ర పట్టలేదు. తన ధైర్యానికి తనే అశ్చర్యపోయాడు. మధు, దేవుడా ఎట్టకేలకు కనువిప్పు కలిగింది కదా! ఏమో మంచే జరగవచ్చును. తనమంచి పనులే చేశాడుకదా ఇన్నాళ్లు, అనుకున్నాడు.
మర్నాడు సాయంత్రం అయింది. మధు శివాలయం చేరుకున్నాడు. సుమలతా అక్కడే వేచి చూస్తున్నది. సిగ్గు కొంచెం అడ్డుపడుతుండగా మధును చూసి “మీరు చెప్పిన విషయాలు బాగా ఆలోచించేను. నాకు అంగీకారమే. నాన్న గారికి చెప్పేను. వారు చాలా సంతోషించేరు. మీ కోసం ఎదురుచూస్తున్నారు” అంది.
మధుకు జీవితంలో మొదటిసారి మహా విజయం పొందిన అనుభూతి. సంభ్రమంలోంచి తేరుకుని “థాంక్యూ సుమలతా, పదండి” అన్నాడు.
తన నిర్ణయాన్ని తల్లిదండ్రులకు చెప్పి రమణాచారి గారు వచ్చి కలిసినప్పుడు త్వరలో ముహూర్తం పెట్టించమన్నాడు. కార్తీకమాసం అవడం వల్ల మరో రెండు రోజులకే ముహర్తం కుదిరింది. “నాకు ఆర్భాటాలు ఏమీ వద్దు. హాయిగా గుళ్లో దేవుని ఎదురుగా పెళ్లి జరిపించండి” అన్నాడు. రామచంద్రరావుగారు భార్య ముఖాలు విచిత్రమైన భావాలతో నిండేయి. ఎన్నో ఆలోచనలు వచ్చి వుంటాయి. మౌనంగా అన్నిటికీ అవునని పెద్దరికం నిలుపుకున్నారు.
మధు జీవితం నందనవనమయ్యింది. పదోరోజుకల్లా ముంబాయి చేరడానికి ప్రయాణం అవుతున్నారు మధు సుమలతలు.
“స్నేహితులు మనకోసం ఇంట్లో అన్ని ఏర్పాట్లు చేసేరు 2,3 రోజుల్లో మనం బజారుకెళ్ళి కావలసినవన్నీ కొనుక్కు౦దాం, సరేనా, సుమా” అన్నాడు విమానంలో తన ప్రక్కన కూర్చున్న సుమలతతో ప్రేమగా.
“అలాగే. మీ ఇష్టం” అని ఆమె నవ్వు చిందిన ముఖంతో అతని వైపు చూసింది.