కపీశ్వర్‌లో మానవత్వం

0
11

[dropcap]ము[/dropcap]కుందం చాలా బీదవాడు. ఈ పని ఆ పని చేసుకుని పొట్ట పోషించుకొనేవాడు. ఒకరోజు వాడు ఎక్కడికో పోతున్నప్పుడు ఓ పెద్ద చెట్టు కింద కోతి పిల్ల పడి ఉంది. దగ్గిరికి వెళ్లి చూస్తే అది బతికి ఉన్నట్టు గ్రహించాడు.

వెంటనే తన వద్ద ఉన్న చెంబులో నీళ్ళను దాని మీద చల్లి, త్రాగించాడు. కొద్ది సేపటికి అది తేరుకుని కృతజ్ఞతతో ముకుందుడి వైపు చూసింది.

ముకుందుడు దానిని ఆప్యాయంగా నిమిరి జాగ్రత్తగా తన ఇంటికి తీసుకెళ్లి కొంత తిండి పెట్టి పూర్తిగా కోలుకొనేట్టు చేశాడు.

ఆ విధంగా అది ముకుందుడిని పూర్తిగా నమ్ముకుని వాడి వద్దనే ఉండి పోయింది. దానికి కపీశ్వర్ అని పేరు పెట్టాడు ముకుందుడు. ఒకరోజు ముకుందుడు కపీశ్వర్‌ని తీసుకుని వెళుతుండగా ఒక భవనం ముందు గారడి చేసే వాళ్ళు ఎలుగుబంటి, కోతి,కుక్క, రామ చిలుకల చేత రకరకాల విన్యాసాలు చేయిస్తూ కనబడ్డారు. ముకుందుడు, కపీశ్వర్ ఆ జంతువుల విన్యాసాలు చూసి ఆశ్చర్యపోయారు.

అంతా అయ్యాక గారడి చూస్తున్న జనం వారికి బోలెడు డబ్బులు ఇచ్చారు.

రెండు రోజుల తరువాత ముకుందుడికి ఏ పని దొరకలేదు! ఇంట్లో ఆహార పదార్థాలు అయిపోయాయి. తను కపీశ్వర్ పస్తులు ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది.

వాడి బాధను కపీశ్వర్ గమనించింది. అది ఒక జంతువు అయినా ముకుందుడి బాధను అర్థం చేసుకుని ఏదో ఒక విధంగా సహాయం చేయాలనుకొంది. వెంటనే దానికి వీధిలో గారడి వాడు చేయించిన విన్యాసాలు గుర్తుకు వచ్చాయి!

అది ముకుందుడు చూస్తుండగానే బోలెడు పిల్లి మొగ్గలు,గిన్నెను నెత్తిన పెట్టుకుని తిరగడం, ఒక కంచం మీద దరువు వెయ్యడం వంటి తనకు చేతనైన విన్యాసాలు చేసింది.

కపీశ్వర్ విన్యాసాలు చూసి ముకుందుడు ఆశ్చర్యపోయాడు. తన దగ్గర డబ్బు లేకపోవడం కపీశ్వర్ గమనించి తనకు భుక్తి మార్గం చూపించడానికి అది విన్యాసాలు చేసినట్లు ముకుందుడికి అర్థం అయి, వాడిని కళ్ళలో నీళ్లు వచ్చాయి.

కపీశ్వర్‌ని ఆప్యాయంగా ముకుందుడు కౌగలించుకున్నాడు. తను ఆకలితో ఉన్నా పరవాలేదు. కపీశ్వర్‌ని ఆకలితో ఉంచకూడదని నిర్ణయించుకుని వెంటనే దగ్గరలోని ఒక తోటమాలి వద్దకు వెళ్లి తనకు పని ఇప్పించమని కోరాడు.

“తోట పెద్దది, ఇంకొక తోటమాలిని కూడా పెట్టుకోవాలని మా యజమాని చూస్తున్నాడు. నాతోరా” అని ముకుందుడిని అతని యజమాని వద్దకు తీసుకెళ్లాడు.

“రోజూ చెట్లకు నీరు పోయాలి, పూలను పండ్లను కోసి జాగ్రత్తగా బుట్టల్లో పెట్టాలి. నీకు వెయ్యి రూపాయల జీతం ఇస్తాను” అని తోట యజమాని చెప్పాడు.

“అయ్యా, నాకు ఉద్యోగం ఇచ్చినందుకు మీకు ఎన్నో కృతజ్ఞతలు, నాదొక మనవి. నాజీతంలో నెలకు రెండు వందలు పట్టుకొని ఆ డబ్బులకు బదులు కొన్ని పండ్లు ఇవ్వండి”అని చెప్పాడు.

యజమాని ఆశ్చర్య పోయి,”పండ్లు ఏం చేసుకుంటావు? కొన్ని ఇక్కడే తినవచ్చు కదా!” అన్నాడు.

“అయ్యా, నాకు కపీశ్వర్ అనే కోతి ఉంది, దానికి పండ్లు పెడతాను. దానిని ఎట్టి పరిస్థితిలో పస్తులు ఉంచను, పండ్లు దాని కోసమే”అని చెప్పాడు ముకుందుడు.

ముకుందుడి మంచి మనసుకు తోట యజమాని సంతోషించాడు. వాడి జంతు ప్రేమకు ఆయన ముగ్ధడు అయ్యాడు.

“నీ జీతంలో నేను రెండు వందలు కోసుకోను,నీవు ఆనందంగా రోజూ కొన్ని పండ్లు తీసుకెళ్ళి కోతికి పెట్టు.” అని చిరునవ్వుతో చెప్పాడు.

ముకుందుడు సంతోషంతో ఆయనకు, పని ఇప్పించిన తోటమాలికి నమస్కరించి ఆరు సీతాఫలం పండ్లు తీసుకెళ్ళి కపీశ్వర్‌కి ఇచ్చాడు. అది మూడు తిని మిగతా మూడు ముకుందుడిని తినమన్నట్టు సంజ్ఞ చేసింది. కపీశ్వర్ దొడ్డ బుద్ధికి ముకుందుడు ఎంతో సంతోషించాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here