కరనాగభూతం కథలు – 15 దోపిడి దొర

0
11

[box type=’note’ fontsize=’16’] బేతాళ పంచవింశతి లాగే కొత్త థీమ్‌తో కరనాగభూతం అనే శీర్షికతో వసుంధర సృజించిన పిల్లల కథలను అందిస్తున్నాము. [/box]

[dropcap]అ[/dropcap]ర్ధరాత్రి కాగానే రాజు పింగపాంగుడు పక్కమీంచి లేచి జిట్టీభనాథుడి ప్రార్థనా మందిరంలో ప్రవేశించాడు. అక్కడ అతడి కోసం ఎదురుచూస్తున్న కొండచిలువ వెంటనే నిలువెత్తున లేచి, “రాజా! నీ సిద్ధాంతం వల్ల జనసామాన్యానికి దోపిడినుంచి రక్షణ లభిస్తుందని నమ్ముతున్నావు. కానీ ఉద్ధారకుడనే ముని మహేశుడనే దోపిడిదారుని దొరని చేసి, తద్వారా జనసంక్షేమం సాధించాలనుకున్నాడు. ఆ  కథ చెబుతాను. విను” అంటూ కథ చెప్పసాగింది.

అనగా అనగా కీలకమనే అడవి. దాని చుట్టూ నాలుగు రాజ్యాలున్నాయి. రాజ్యానికీ రాజ్యానికీ మధ్య దుర్భేద్యమైన కొండలున్నాయి. అందువల్ల ఒక రాజ్యంనుండి మరో రాజ్యానికి వెళ్లాలంటే, అడవి మార్గమే కీలకం. అందుకని నాలుగు రాజ్యాలవారూ పూనుకుని, అందులో చక్కని బాటలు వేశారు. అవి కాలినడకకే కాక, గుఱ్ఱాలు పరుగెత్తడానికీ అనువుగా ఉండేవి. ఐతే ఆ అడవి క్రూరజంతువులకు నిలయం. అందుకని ప్రయాణం అవసరమైనప్పుడు జనం గుంపులుగా బయల్దేరేవారు. వారితోపాటు సాయుధుడైన వీరుడు కనీసం ఒక్కడైనా ఉండేవాడు. ఆదిలో అలాంటి గుంపులపై కొన్ని క్రూర జంతువులు దాడులు చేసేవి. ఐతే మనుషులపై దాడి ప్రమాదకరమని గ్రహించేక, క్రమంగా అవి వారి జోలికెళ్లడం మానుకున్నాయి. ఎప్పుడైనా అనుకోకుండా మనిషి కంటబడినా, క్రూరమృగాలు వెంటనే దూరంగా పారిపోతుండేవి. దాంతో ఆ అడవి బాటలలో ప్రయాణీకుల రద్దీ హెచ్చింది.

అడవి చుట్టూ ఉండే ఓ రాజ్యంలో భీకరుడనే దొంగ ఉన్నాడు. క్రూరమృగాలు మనుషుల జోలికి రావని తెలియడంతో వాడు తన మకాం అడవిలోకి మార్చెయ్యాలనుకున్నాడు. ఎందుకంటే నగరంలో ఐతే దొంగలకి రాజభటులంటేనే కాదు, సాటి మనుషులన్నా భయమే మరి!

ముందుగా భీకరుడు ఒక్కడూ అడవి మధ్యకు వెళ్లాడు. అక్కడ ఓ కొండగుహలో మనుషులుండడానికి తగిన ఏర్పాట్లు చేసుకున్నాడు. అక్కణ్ణించి బయల్దేరి బాటసారులమీద మెరుపుదాడి చేసి, అందినది అందిపుచ్చుకుని మాయమయ్యేవాడు. వాణ్ణి పట్టుకోవాలంటే చక్కని బాటను వదిలి, చిక్కని అడవి లోపలకి వెళ్లాలి. అందుకు ఎవరూ సాహసించేవారు కాదు. దాంతో వాడికి భద్రతకి భద్రతా, సంపాదనకి సంపాదనా చక్కగా కుదిరింది. క్రమంగా వాడు తన కుటుంబాన్ని అక్కడికి తరలించేశాడు. అంతటితో ఊరుకోక, మిగతా రాజ్యాల్లో దొంగల్ని కూడా కలుసుకుని, తనకి అనుచరుల్ని చేసుకున్నాడు. వారు తరచుగా చేసే దాడులతో – కీలకారణ్యంలో దొంగల భయం పెరిగింది. ఆ అడవిదారుల్లో ప్రయాణాలు తగ్గిపోయాయి. వెళ్లేవారు కూడా మరింత పటిష్టమైన ఏర్పాట్లు చేసుకుంటున్నారు. దాంతో భీకరుడి అనుచరుల్లో కొందరు నేలను సాగు చేసి, వ్యవసాయం మొదలెట్టారు. కొందరు పశువుల్ని మచ్చిక చేసుకున్నారు. క్రమంగా దొంగల ముఠాతో పాటు, అన్ని వృత్తులవారూ చేరడంతో అదో చిన్న గ్రామమైంది. ముఠావాళ్లు మాత్రం అప్పుడప్పుడు చుట్టుపక్కల ఊళ్లమీద పడి దోచుకునేవారు. అలా అడవి మధ్యలో ఆ పల్లె సుసంపన్నమయింది. ఆ పల్లెకు నాయకుడు భీకరుడు.

పదేళ్లు గడిచాయి. భీకరుడు ముసలివాడయ్యాడు. ఇప్పుడా పల్లెకు నాయకుడు వాడి కొడుకు మహేశుడు. గ్రామాలపై దొంగల ముఠా చేసే దాడులలో ప్రధానపాత్ర వాడిదే! చిన్నతనంనుంచీ అడవిలో పెరిగాడేమో, వాడిలో క్రూరత్వం పాలు ఎక్కువ. అడవి బయట ఉండేవారికి, వాడెలాగుంటాడో తెలియకపోయినా, వాడి పేరు వింటే చాలు, గడగడ వణికి పోతారు.

మహేశుడు నాయకుడయ్యేక, అడవిదారిలో ప్రయాణాలు ఇంచుమించు ఆగిపోయాయి. అది అడవి చుట్టూ ఉన్న నాలుగు రాజ్యాలకీ ఇబ్బందిగా అనిపించింది. ఆ రాజులు నలుగురూ సమావేశమై, అడవి మధ్యలో ఉండే పల్లెని నాశనం చెయ్యాలనుకున్నారు. వాళ్లంతా కలిసి వ్యూహం పన్ని పెద్ద ఎత్తున సైనికబలాల్ని అడవిలోకి పంపారు. వాళ్లా పల్లెపై దాడి చేసి, స్త్రీ బాల వృద్ధులన్న కనికరం లేకుండా, మొత్తం జనాన్ని ఊచకోత కోసేశారు. దాంతో సస్యశ్యామలమైన ఆ పల్లె శవాలగుట్టగా మారిపోయింది.

ఆ దాడిలో తప్పించుకుని బయటపడ్డవాడు మహేశుడొక్కడే! వాడు తప్పించుకున్న విషయం తెలియక సైనికులంతా అక్కణ్ణించి తృప్తిగా వెళ్లిపోయారు. వాళ్లు వెళ్లిపోయేక మహేశుడు అక్కడికొచ్చి శవాలుగా మారిన తనవాళ్లని చూస్తూ భోరున ఏడ్చాడు.

సరిగ్గా ఆ సమయానికి అక్కడికి ఉద్ధారకుడనే ముని వచ్చాడు. ఆయన వాడి కథ అడిగి తెలుసుకుని, “పునాదిలో లోపం ఉంటే, ఎంత పెద్ద భవనమైనా కూలిపోక తప్పదు. ఈ పల్లె దొంగతనాలు, హత్యల పునాదిమీద వెలసింది. ఆ పాపఫలితమే పల్లెవాసులందర్నీ నాశనం చేసింది. ఇంతమందిలో నువ్వొక్కడివే మిగిలావంటే, నీవల్ల జరగాల్సిన ఘనకార్యం ఏదో ఉందన్నమాట!” అన్నాడు.

“హత్యలూ, దొంగతనాలూ నేనూ చేశాను. నేనూ పాపినే! నేను చేయగల ఘనకార్యం ఏముంటుంది?” అన్నాడు మహేశుడు దీనంగా.

“సైనికులు మీవాళ్లని చంపేశారు. మీ ఊరిని నాశనం చేశారు. కానీ నిన్నేం చెయ్యలేకపోయారు. మీవాళ్లంతా కూడబెట్టిన అనంత సంపదనీ కనుక్కోలేకపోయారు. ఇప్పుడు నువ్వు జనం మధ్యకు వెళ్లి, ఆ సంపదని జనసంక్షేమానికి ఉపయోగించు. దాంతో మీవాళ్ల పాపాలన్నీ పోయి వారికి సద్గతులు ప్రాప్తిస్తాయి. జనం నీకు నీరాజనాలు పడతారు” అన్నాడు. అప్పుడు మహేశుడిలో కొంచెం ఉత్సాహం పుట్టినా, “నన్ను జనం నమ్మి ఆదరిస్తారా? రాజులు కారాగారంలో వెయ్యకుండా వదులుతారా?” అన్నాడు అనుమానంగా.

“జనంలోకి వెళ్లి, జనసంక్షేమానికి పాటుపడుతూ, జనం మనిషివి ఐతే – నీ గతం గురించి ఎవరూ ఆరా తియ్యరు. పల్లె మొత్తం నాశనం చేశామని అనుకుంటున్నారు కాబట్టి, నీవు బ్రతికున్నావని రాజులూ అనుమానించరు. ఐనా నీకుపయోగపడేందుకు మూడు వరాలు ఇస్తాను. ఆ ప్రకారం నీ సమ్మతి లేకుండా, ఎంతటి బలవంతులూ నిన్ను తాకలేరు, సమీపించలేరు. నీవు తలచుకుంటే మీ పల్లెలో దాచిన సంపదనుంచి ఎంత కోరితే అంత నీ వద్దకు వస్తుంది. అది పంచిపెడుతూ జనోధ్ధరణ చెయ్యి. ఎప్పుడైనా నీకు అవసరమనిపిస్తే నన్ను తలచుకో. కనిపించి కర్తవ్యబోధ చేస్తాను” అన్నాడు ఉద్ధారకుడు.

మహేశుడు ఆశ్చర్యపడి, “దివ్యశక్తులున్న మహాముని మీరు. జనసామాన్యానికి మేలు చెయ్యాలనుకుంటే, ఈ ప్రపంచంలో మంచివాళ్లకు కొరత లేదుకదా! పాపాత్ముణ్ణి, నన్నే ఎందుకు ఎన్నుకున్నారు?” అన్నాడు.

“వేల ఏళ్లు గడిచినా, ఇప్పటికీ జనాల్ని ప్రభావితం చేస్తున్న విశిష్ట గ్రంథం రామాయణం. అది వ్రాయడానికి నారద మహాముని ఎన్నుకున్న వాల్మీకి మహర్షి – పూర్వజీవితంలో బందిపోటు దొంగ. నీవు వాల్మీకిని మించిన గొప్ప పేరు సంపాదించుకుంటావని నాకు అనిపించింది. అందుకే నిన్ను ఎన్నుకున్నాను” అన్నాడు ఉద్ధారకుడు.  ఆ ప్రకారం మహేశుడు వెంటనే కట్టుబట్టలతో జనం మధ్యకు వెళ్లి దేశసంచారం మొదలెట్టాడు. జనం అవసరాల నడిగి తెలుసుకుని, తన సంపదతో వాళ్లని ఆదుకోసాగాడు. దీనజనుల్ని ఆదుకుంటున్నాడని జనం వాణ్ణి దీనబంధు అనసాగారు. కీలకారణ్యం చుట్టూ ఉన్న నాలుగు రాజ్యాల్లోనూ వాడు దీనబంధుగా ప్రసిద్ధికెక్కాడు.

దీనబంధుపై రాజులకు అనుమానం రాకపోలేదు. ప్రజలకు పంచడానికి వాడికి అంత డబ్బెక్కడిదని ఆరా తీయడానికి కొంతమందిని పంపారు. వారు మహేశుణ్ణి చూడగానే మరి మాట రాక, దూరాన్నుంచే ఓ నమస్కారం చేసి వెళ్లిపోయేవారు.

తన సంపద అనంతమన్న భావనతో, మహేశుడు విచ్చలవిడిగా దానాలు చేశాడు. కానీ కూర్చుని తింటే, కొండలైనా కరిగిపోతాయన్న సామెతని నిజం చేస్తూ, కొన్నాళ్లకే వాడి సంపద పూర్తిగా ఖర్చైపోయింది. ఇక ఏంచెయ్యాలో తోచక వాడు ఉద్ధారకుణ్ణి తలచుకున్నాడు. ఆయన వెంటనే ప్రత్యక్షమై, “నీ సంపదలో నీకోసం ఒక్క కాసునైనా మిగుల్చుకోకుండా, మొత్తం జనసంక్షేమానికి ఖర్చుపెట్టి, నీ నిస్వార్థ గుణాన్ని నిరూపించుకున్నావు. నువ్విప్పుడు రాజువై, ఈ ప్రపంచంలో రాజులందరికీ ఆదర్శం కావాలి” అన్నాడు.

మహేశుడు తెల్లబోయి, “నాకు సైనికబలం లేదు. జనాలకి నా గత చరిత్ర తెలియదు. ఇప్పుడు నావద్ద సంపద కూడా లేదు. నేను రాజునెలాగౌతాను? రాజునైతేనే కదా, ప్రపంచంలో రాజులందరికీ ఆదర్శమయ్యేది!” అన్నాడు అపనమ్మకంగా.

ఉద్ధారకుడు నవ్వి, “రాజు కావడానికేముంది? కొన్నిచోట్ల ఏనుగు మెడలో పూలమాల వేస్తే రాజులౌతారు. కొన్నిచోట్ల జనమంతా కోరుకుంటే రాజులౌతారు. కొన్ని చోట్ల తపశ్సక్తితో రాజులౌతారు. ఇప్పుడు నా తపోశక్తితో నేను నిన్ను రాజుని చేస్తాను” అన్నాడు. ఆయన అలాగన్న మరునాడే – నాలుగు రాజ్యాల ప్రభువులూ వచ్చి మహేశుణ్ణి కలుసుకుని, “మహాత్మా! ఎన్నోఏళ్లుగా రాజ్యపాలన చేస్తున్నాం. తమరు దీనబంధుగా చేపట్టిన ప్రజాసంక్షేమ కార్యక్రమాల్లో వెయ్యో వంతు మావల్ల కాలేదు. తమరు మా నాలుగు రాజ్యాలకూ చక్రవర్తిగా ఉంటూ మాకు దిశానిర్దేశం చెయ్యవలసిందిగా కోరుతున్నాం” అన్నారు.

అలా మహేశుడు ఆ నాలుగు రాజ్యాలకూ చక్రవర్తి అయ్యాడు. నిస్వార్థంగా ప్రజాసంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తూ, జనరంజకంగా ఎన్నో ఏళ్లు పాలన చేసి, ఉద్ధారకుడు ఊహించినట్లే ప్రపంచంలో రాజులందరికీ ఆదర్శప్రభువయ్యాడు.

కొండచిలువ ఈ కథ చెప్పి, “ఉద్ధారకుడు మహేశుణ్ణి చక్రవర్తిని చెయ్యాలనుకుంటే – ముందే ఆ పని చెయ్యొచ్చుకదా! అతడి పల్లెలోని సంపద అంతా ఖర్చు అయ్యేవరకూ ఎందుకు ఆగాడు? తెలిస్తే నా ఈ సందేహాలకి సరైన సమాధానం చెప్పి నా ఆకలి చల్లార్చు. లేదా నగరంలోకి వెళ్లి నీ పౌరుల్ని తిని నా ఆకలి తీర్చుకుంటాను” అంది.

దీనికి పింగపాంగుడు ఏమాత్రం తడుముకోకుండా ఇలా బదులిచ్చాడు: “మహేశుడు అడవిలో పెరిగాడు. దొంగతనం వాడి వృత్తి. క్రూరత్వం వాడి ప్రవృత్తి. తన పల్లెవాసులందర్నీ శవాలుగా మార్చిన నాలుగు రాజ్యాలపైనా పగతో – వాడు హింసామార్గాన్ని అవలంబించి జనసామాన్యాన్ని వేధిస్తూ ప్రమాదకారి కావచ్చు. వాణ్ణి సన్మార్గంలోకి మళ్లించడం అవసరమనిపించి, ఉద్ధారకుడు వాణ్ణి కలుసుకున్నాడు. హితోపదేశం చేశాడు. వాడది పాటించాడు. అందువల్ల వాడికి చనిపోయిన తన పల్లెవాసులందరి పాపాలూ నశించాయన్న తృప్తి కలిగింది. అవసరంలో ఉన్నవారిని ఆదుకోవడంలో కలిగే ఆనందం తెలిసింది. వాడిలో ఎంత మంచి మార్పొచ్చిందంటే – ఆ సంపదలో తనకోసం కొంచెమైనా ఉంచుకోవాలనిపించని నిస్వార్థపరుడయ్యాడు. ఐతే – రాజు కావడానికి నిస్వార్థగుణం ఒక్కటే చాలదు. వివేకం కూడా ఉండాలి. ఎంత గొప్ప సంపద ఐనా విచ్చలవిడిగా వాడితే, ఖర్చైపోతుంది. ఉన్న సంపదను ఖర్చు చెయ్యడమే కాదు, దాన్ని పెంచే ఆదాయమూ ఉన్నప్పుడే జనసంక్షేమం నిరవధికంగా కొనసాగుతుంది. అది గ్రహించినవాడికే రాజు కాగల అర్హత ఉంటుంది. అందుకే ఉద్ధారకుడు మహేశుడి సంపద పూర్తిగా ఖర్చయ్యే వరకూ ఆగాడు” అన్నాడు.

అది సరియైన సమాధానం కావడంతో కొండచిలువ నేలకు వ్రాలి చుట్టలు చుట్టుకుని నిద్రకు పడింది. రాజు తన అంతఃపురానికి తిరిగి వెళ్లాడు.

(వచ్చే ‘సంచిక’లో కరనాగభూతం 16వ కథ)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here