కరనాగభూతం కథలు – 21 అవధాని పద్దుపుస్తకం

0
9

[box type=’note’ fontsize=’16’] బేతాళ పంచవింశతి లాగే కొత్త థీమ్‌తో కరనాగభూతం అనే శీర్షికతో వసుంధర సృజించిన పిల్లల కథలను అందిస్తున్నాము. [/box]

[dropcap]అ[/dropcap]ర్ధరాత్రి కాగానే రాజు పింగపాంగుడు పక్కమీంచి లేచి జిట్టీభనాథుడి ప్రార్థనా మందిరంలో ప్రవేశించాడు. అక్కడ అతడి కోసం ఎదురు చూస్తున్న కొండచిలువ వెంటనే నిలువెత్తున లేచి, “రాజా! కాగితాలపై సిద్ధాంతాలు కాగితాలతోనే పోతాయి. మనిషి మేధోశక్తితో వాటిని ఆకళింపు చేసుకున్నప్పుడే, అవి ప్రయోజనకరమని అవధాని కథ వల్ల తెలుస్తుంది. నీకా కథ చెబుతాను. విను” అంటూ కథ చెప్పసాగింది.

సీతాపురంలో ఉండే అవధాని ఆస్తిపరుడు, దయాశీలి. అవసరంలో ఉన్నవారికి వడ్డీ లేని అప్పులిచ్చి ఆదుకుంటాడు. తిరిగిరాకపోయినా ఇబ్బంది లేదనిపించే మొత్తాన్నే అప్పిస్తాడు. అప్పిచ్చేక బాకీదార్లకు గుర్తు చెయ్యడు. ఇతరులవద్ద పొరపాటునైనా ఆ ప్రసక్తి తేడు. ఐతే ఎప్పుడు ఎవరికి ఎంత డబ్బిచ్చాడో, ఎప్పుడు ఎవరు ఎంత డబ్బు చెల్లు వేశారో ఓ పుస్తకంలో వ్రాసుకుంటాడు. బిచ్చగాడికో రాగినాణెం వేసినా కూడా అందులో ఉంటుంది. బాకీ పూర్తిగా చెల్లు చేసినవాళ్ల పేర్లు అందులోంచి తీసేస్తాడు. ఏళ్ల తరబడి బాకీ తీర్చనివాళ్ల పేర్లు బిచ్చగాళ్ల జాబితాలోకి మారుస్తాడు. బిచ్చగాళ్లకిచ్చేది దానమే తప్ప భిక్ష కాదని అతడన్నప్పటికీ, ఆత్మాభిమానమున్నవాళ్లు తమ పేరు ఆ పుస్తకంలో బిచ్చగాళ్ల జాబితాలో చేరాలనుకోరు. అందుకే అతడి బాకీలు వాటంతటవే వసూలు ఐపోతుంటాయి.

శంఖవరంలో సోమయాజి అనే పండితుడున్నాడు. సంపాదనకు పాండిత్యం అచ్చిరాదని, వ్యాపారం చేద్దామనుకున్నాడు. సీతాపురంలో ఉండే శేషయ్య అనే వ్యాపారితో అతడికి అనుకోకుండా పరిచయమైంది. ఇద్దరూ కలిసి సీతాపురంలో పాల వ్యాపారం చేద్దామనుకుంటే, సోమయాజి తండ్రి సరేనని- కొడుక్కి కొంత డబ్బిచ్చి సీతాపురం పంపాడు.

సీతాపురంలో సోమయాజికి అవధాని ఇంటిపక్కనే ఓ ఇల్లు దొరికింది. ముందతడు నాలుగు గేదెలూ, నాలుగు ఆవులూ కొని శేషయ్యతో కలిసి పాల వ్యాపారం మొదలెట్టాడు. అనుభవజ్ఞుడైన శేషయ్య ఆధ్వర్యంలో వాళ్ల వ్యాపారం తొందరగానే పుంజుకుంది. అప్పుడు శేషయ్య, “ఇప్పుడున్నవాటికి మరో రెండు ఆవులు, రెండు గేదెలు కలిపి- పాలతో పాటు- పెరుగు, వెన్న కూడా అమ్ముదాం. మంచి లాభాలు తెప్పించే పూచీ నాది” అన్నాడు. అందుకు దగ్గరున్న డబ్బు చాలక, తండ్రికి కబురంపాడు సోమయాజి. కానీ మరో నెల దాకా డబ్బు పంపలేనన్నాడు తండ్రి. అప్పుడు శేషయ్య సలహామీద సోమయాజి అవధానిని కలిసి, తన పరిస్థితి చెప్పి- తనకీ ఊరు కొత్త కాబట్టి, నగని తాకట్టు పెడితే అప్పిచ్చే నమ్మకస్థుడైన వడ్డీ వ్యాపారికి తనని పరిచయం చెయ్యమన్నాడు. దానికి అవధాని నవ్వి, “నీకభ్యంతరం లేకపోతే అప్పు నేనిస్తాను. ఎటొచ్చీ తాకట్టు, వడ్డీల గురించి మాట్లాడకు. ఇది ఇరుగుపొరుగులు ఒకరికొకరు చేసుకునే సాయమనుకో. నీకెప్పుడు వీలైతే అప్పుడే బాకీ తీర్చొచ్చు” అన్నాడు.

అవధాని పద్దుపుస్తకం గురించి శేషయ్య ద్వారా విని ఉన్న సోమయాజి, “నీ పద్దుపుస్తకం గురించి విన్నాను. నాకు కొంచెం మతిమరుపు. నీ బాకీ విషయం మర్చిపోయాననుకో, పద్దుపుస్తకంలో నా పేరు బిచ్చగాళ్ల జాబితాలో వేసేస్తావు. అది నాకిష్టం లేదు. కాబట్టి నీ సాయం పొందడానికి జంకుతున్నాను. తరచుగా బాకీ విషయం గుర్తు చేసి హెచ్చరిస్తానని మాటివ్వు. లేదూ నా పేరు పద్దుపుస్తకంలో రాయకు. అప్పుడే నీ సాయం స్వీకరిస్తాను” అన్నాడు. దానికి అవధాని, “బాకీ గుర్తు చెయ్యడం నాకిష్టముండదు. ఐతే నువ్వు షరతు పెట్టక పోయినా కూడా నీ పేరు పద్దుపుస్తకంలో రాసే ఉద్దేశం నాకు లేదు. ఎందుకంటే ఇది స్నేహభావంతో చేస్తున్న సాయం” అన్నాడు.

సోమయాజి తృప్తిపడి అవధానినుంచి డబ్బు తీసుకుని తన అవసరం తీర్చుకున్నాడు. తర్వాత అతడి బాకీ తీర్చెయ్యాలని గట్టిగా అనుకున్నాడు కానీ, అన్న సమయానికి తండ్రి డబ్బు పంపలేదు. ఆ విషయం చెప్పడానికి అవధాని ఇంటికెళ్లి విషయం చెబితే, అవధాని ఆశ్చర్యపడి, “నీకు నేను అప్పెప్పుడిచ్చాను? నాకేం గుర్తు లేదే!” అన్నాడు. సోమయాజి గుర్తు చెయ్యడానికి ప్రయత్నిస్తే అతడు కాసేపు ఆలోచించి, “నాకు కొంచెం మతిమరపుంది. అందుకే ఎవరికి డబ్బిచ్చినా పద్దుపుస్తకంలో రాస్తాను. అందులో నీ పేరుందేమో చూసి తర్వాత చెబుతాన్లే” అన్నాడు. అంటే అవధానికి పద్దుపుస్తకంలో తన పేరు వ్రాయనని మాటిచ్చిన విషయం కూడా గుర్తులేదని గ్రహించిన సోమయాజి అప్పటికి మాట్లాడకుండా వెళ్లిపోయాడు. తర్వాత అతడికి అవధాని నాలుగైదుసార్లు ఎదురుపడినా, అప్పు ప్రసక్తి తేలేదు.

జరిగింది విన్న శేషయ్య, అవధాని అప్పు సంగతి మర్చినట్లేనని ధ్రువపర్చాడు. ఐనా సరే- నెల్లాళ్ల తర్వాత తండ్రి కొంత డబ్బు పంపగానే, బాకీ తీర్చడానికి అవధాని ఇంటికెళ్లాడు సోమయాజి. అప్పుడు వెర్రెయ్య అనేవాడితో మాట్లాడుతున్న అవధాని, సోమయాజిని చూస్తూనే, “మన వెర్రెయ్య ఊరొదిలి వెళ్లిపోతున్నాడు. తన రెండెకరాల పొలాన్నీ చవగ్గా అమ్మేస్తాట్ట. నన్ను కొనుక్కోమంటున్నాడు. ఇప్పుడు నా దగ్గర డబ్బు లేదు. నువ్వు కానీ కొంటావా? వెర్రెయ్యకి సాయం చేసినట్లూ ఉంటుంది. నీకూ చౌకగా పొలం వస్తుంది” అన్నాడు. సోమయాజి ఆశ్చర్యపోయాడు. అవధాని నిజంగానే తన బాకీ గురించి మర్చిపోయినట్లుందనుకుని అతడు తనవద్దనున్న డబ్బుతో వెర్రెయ్య పొలం కొన్నాడు. ఐతే అప్పుడూ అవధాని బాకీ ఎగెయ్యాలనుకోలేదతడు. తన ఆదాయం మరింత పెరిగితే, పదే పదే గుర్తు చేసి అవధానికి బాకీ తీర్చాలనుకున్నాడు. ఏడాది గడిచేసరికి, సోమయాజి అదాయం మరింత మెరిగింది. ఇంకా అవధాని బాకీ తీర్చలేదు.

ఇంతలో ఆ ఊరి గుడిలో సువాచుడు అనే మహాపండితుడి ప్రవచనం ఏర్పాటైంది. ప్రసంగం ప్రారంభించేముందు, “ఆరేళ్లక్రితం నేను మీ ఊరొచ్చినప్పుడు మీచేత భగవద్గీతకు ప్రాణమైన పద్దెనిమిది శ్లోకాలు వల్లె వేయించాను. మీలో ఎవరికైనా గుర్తుందా?” అన్నాడు. అప్పుడు అవధాని లేచి వెళ్లి సువాచుడిముందు ఆ పద్దెనిమిది శ్లోకాలూ చదివాడు. ఆయన ఎంతో మెచ్చుకుని, “మనిషి జీవితంలో నీతి, నిజాయితీ ముఖ్యమైనవి. దుర్జనసాంగత్యం మిమ్మల్ని వాటికి దూరం చేస్తుంది. అలా దూరం కాకుండా ఉండాలంటే అవధానివంటి సజ్జనుల సాంగత్యం అవసరం” అంటూ ప్రసంగాన్ని కొనసాగించాడు. ఆ ప్రసంగం సోమయాజిని కొంత కలవరపర్చింది. అతడు స్వతహాగా నిజాయితీపరుడే కానీ, శేషయ్య సాంగత్యంలో అతడి ఆలోచనల్లో మార్పొస్తోంది. అధిక లాభం కోసం పాలలో కాసిని నీళ్లు కలపడం మొదలెట్టిన అతడికి- అప్పు విషయం మర్చిపోయిన అవధానికి గుర్తు చేసి మరీ బాకీ తీర్చడానికి మనసొప్పడంలేదు.

అతడి సందిగ్ధం విన్న శేషయ్య, “అవధానికి ఇహంకంటే పరంమీదే ధ్యాస ఎక్కువ. భగవద్గీత శ్లోకాలు గుర్తుంటాయి, అప్పిచ్చిన విషయం గుర్తుండదు. అందుకే పద్దుపుస్తకం పెట్టుకున్నాడు. నీ పేరు ఆ పుస్తకంలో వ్రాసే ఉండొచ్చు. బాకీ విషయం గుర్తు చెయ్యనప్పుడు- వ్రాస్తే మాత్రం నష్టమేముందని అనుకునుంటాడు. ఏదోరోజున, నీ పేరు ఆ పుస్తకంలో బిచ్చగాళ్ల జాబితాలో చేరుతుంది. అది తెలియడానికి, ముందు నువ్వా పుస్తకం చూడాలి. అడిగితే బాగుండదు కాబట్టి, దాన్ని కాజేయడమొక్కటే దారి. తరచుగా అతడింటికి వెడుతుండే నీకది కష్టం కాదు. అదీకాక అవధానికి గుట్టు తక్కువ. ఆ పుస్తకాన్ని అతిథుల గదిలో అంతా చూసేలాగే దాస్తాడు” అని సలహా ఇచ్చాడు.

సోమయాజికీ సలహా నచ్చి ఒకరోజు అవధాని ఇంటికెళ్లాడు. అప్పుడు అవధాని చేతిలో పద్దుపుస్తకముంది. ఎదురుగా ఓ రైతున్నాడు. అవధాని పుస్తకం చూసి, “నువ్వివ్వాల్సింది ముప్పైఐదు కాదు. ముప్పై వరహాలే, నెల్లాళ్లక్రితం ఐదు వరహాలు చెల్లు వేశావుగా” అని, ఆ రైతిచ్చిన డబ్బు తీసుకుని, పుస్తకంలో అతడి పేరు కొట్టివేశాడు. రైతు వెళ్లేక అతడా పుస్తకాన్ని గోడ అలమారలో పెట్టి తలుపు మూశాడు. అదే మంచి సమయమనుకున్న సోమయాజి అవధానిని తాగడానికి నీళ్లడిగాడు. అవధాని లోపలకెళ్లగానే, చటుక్కున అలమారలోని పద్దుపుస్తకం తీసి తన అంగీ జేబులో ఉంచాడు. అవధాని మంచినీళ్లు తెచ్చిచ్చేక అవి తాగి కాసేపు కబుర్లు చెప్పి ఇంటికెళ్లి పద్దుపుస్తకం తిరగేశాడు. అందులో ఎక్కడా తన పేరు కనిపించకపోవడంతో తృప్తిపడి, అవధాని నిజాయితీని శంకించినందుకు సిగ్గుపడి శేషయ్యకా విషయం చెప్పాడు. శేషయ్య వెంటనే ఆ పుస్తకంలో చూస్తే- అందులో రెండేళ్లక్రితం తను అవధానినుంచి నూటపాతిక వరహాలు తీసుకున్నట్లు వ్రాసుంది. శేషయ్య అంతటితో ఊరుకోక, ఆ పుస్తకంలో అవధానికి బాకీ ఉన్నవాళ్లందరి పేర్లూ, సొమ్ము వివరాలూ వేరే కాగితంమీద వ్రాసుకుని, తర్వాత ఆ పుస్తకాన్ని అంటించి బూడిద చేశాడు. తర్వాత సోమయాజితో, “నేనిప్పుడు అవధానికి బాకీ అని చెప్పి పాతిక వరహాలిస్తాను. పద్దుపుస్తకం లేదు కాబట్టి అతడు నేనెంతిస్తే అంతే తీసుకుంటాడు. అలా నేను బాకీ తీర్చినట్లూ ఉంటుంది. నాకు నూరు వరహాలు కలిసొస్తుంది. అందులో నీకు సగం వాటా ఇస్తాను. తర్వాత అవధానికి బాకీ ఉన్నవాళ్లందరితోనూ ఇదేవిధంగా బేరం పెడతాను. ఇందులో అవధానికేం అన్యాయం జరగడం లేదు. అప్పుకి బదులు, దానం ఇచ్చానని అనుకుంటాడు. లేదా ఇకమీదట ఇలా అప్పులివ్వడం మానుకుంటాడు. అప్పుడు మనం ఇక్కడ వడ్డీ వ్యాపారం కూడా మొదలెట్టొచ్చు” అన్నాడు.

అది తప్పని గ్రహించినా సోమయాజి అత్యాశకు లొంగిపోయి శేషయ్యతో కలిసి అవధాని ఇంటికెళ్లాడు. శేషయ్య తనకి పాతిక వరహాలు ఇవ్వగానే, “పద్దు పుస్తకంలో నీ పేరు కొట్టేస్తానుండు” అని వెళ్లి గోడ అలమరలోంచి ఓ పుస్తకం తెచ్చి పుటలు తిరగేసి, “ఇందులో ఉన్న ప్రకారం నువ్వివ్వాల్సింది పాతిక కాదు, నూటపాతిక వరహాలు. పాతికే అని నీకనిపిస్తే, అంతే ఇచ్చి వెళ్లొచ్చు. ఉన్న మాట చెప్పానంతే!” అన్నాడు అవధాని. అలా చేస్తే అవధాని తనకి నూరు వరహాలు దానం చేసినట్లు వ్రాసుకుని, తన పేరు బిచ్చగాళ్ల జాబితాలో చేర్చేస్తాడని శేషయ్యకి తెలుసు. ఐతే తను స్వయంగా కాల్చేసిన పద్దుపుస్తకం మళ్లీ అవధానివద్ద కొచ్చిందంటే, ఆయనవద్ద ఇంకో పద్దుపుస్తకం కూడా ఉందన్నమాట! ఇలా అనుకుని- శేషయ్య అవధానికి నూటపాతిక వరహాలూ చెల్లించేశాడు.

ఇంటికెళ్లేక శేషయ్య సోమయాజితో, “అవధాని ఒకేసారి ఎన్ని పద్దు పుస్తకాలు వ్రాస్తున్నాడో మనకి తెలియదు. నువ్వే తెలుసుకుని అన్నింటినీ బూడిద చేసేదాకా, మనమిక్కడ వడ్డీ వ్యాపారం మొదలెట్టలేం” అన్నాడు. కానీ సోమయాజి అందుకు ఒప్పుకోలేదు సరికదా, వెంటనే అవధాని బాకీ తీర్చేశాడు. నాటినుంచీ శేషయ్యతో భాగస్వామ్యం లేకుండా వ్యాపారాన్ని కొనసాగించసాగాడు.

కొండచిలువ ఈ కథ చెప్పి, “శేషయ్య కాల్చి బూడిద చేసిన పద్దుపుస్తకం మళ్లీ అవధానివద్దకెలా వచ్చింది? అతడు నిజంగానే ఒకటికంటే ఎక్కువగా పద్దుపుస్తకాలు వ్రాస్తున్నాడా? వ్రాస్తే ఎన్ని? ఇక సోమయాజి విషయానికొస్తే, లాభాలకోసం, శేషయ్యతో తనే చేతులు కలిపాడు కదా! మరి తనకు లాభాలు తెచ్చిపెడుతున్న శేషయ్య సాంగత్యాన్ని ఎందుకు వదులుకున్నాడు? తెలిస్తే నా ఈ సందేహాలకి సరైన సమాధానం చెప్పి నా ఆకలి చల్లార్చు. లేదా నగరంలోకి వెళ్లి నీ పౌరుల్ని తిని నా ఆకలి తీర్చుకుంటాను” అంది.

దీనికి పింగపాంగుడు ఏమాత్రం తడుముకోకుండా ఇలా బదులిచ్చాడు: “అవధాని దయాశీలి, మొహమాటస్థుడే కాదు. లౌక్యుడు కూడా. తను చెయ్యలేని పనిని చెయ్యడానికే అతడు పద్దుపుస్తకాన్ని వాడుతున్నాడు. మొహమాటంకొద్దీ మతిమరపు నటిస్తున్నాడు తప్ప అతడి జ్ఞాపకశక్తి అపారమని సువాచుడి ప్రవచనం రోజున ఋజువైంది. ఆ జ్ఞాపకశక్తితోనే అతడు ఒక పద్దుపుస్తకం పోతే మరొక్కటి వెంటనే తయారు చేస్తున్నాడు. రెండో పద్దుపుస్తకం చూడగానే అవధాని జ్ఞాపకశక్తి ఎంత గొప్పదో సోమయాజి కర్థమైంది. పైకి అనకపోయినా అవధాని తనని వంచకుడిగా భావిస్తున్నాడని గ్రహించి సిగ్గుపడ్డాడు. అందుకే అతడి బాకీ తీర్చేశాడు. శేషయ్య సాంగత్యం తనని స్వార్థపరుడిగా మారుస్తోందని అర్థమై, అతడికి దూరంగా ఉండాలనుకున్న సోమయాజి నిర్ణయం అన్నివిధాలా సబబైనది”

అది సరియైన సమాధానం కావడంతో కొండచిలువ నేలకు వ్రాలి చుట్టలు చుట్టుకుని నిద్రకు పడింది. రాజు తన అంతఃపురానికి తిరిగి వెళ్లాడు.

(వచ్చే ‘సంచిక’లో కరనాగభూతం 22వ కథ)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here