కరనాగభూతం కథలు – 22 నా డబ్బు మీది

0
9

[box type=’note’ fontsize=’16’] బేతాళ పంచవింశతి లాగే కొత్త థీమ్‌తో కరనాగభూతం అనే శీర్షికతో వసుంధర సృజించిన పిల్లల కథలను అందిస్తున్నాము. [/box]

[dropcap]అ[/dropcap]ర్ధరాత్రి కాగానే రాజు పింగపాంగుడు పక్కమీంచి లేచి జిట్టీభనాథుడి ప్రార్థనా మందిరంలో ప్రవేశించాడు. అక్కడ అతడి కోసం ఎదురు చూస్తున్న కొండచిలువ వెంటనే నిలువెత్తున లేచి, “రాజా! జనం ప్రతిభావంతులకు పట్టం కడతారు. ఆ పట్టం వారికి వైభోగాన్నివ్వచ్చు కానీ అధికారాన్నివ్వదు. అధికారానికి ప్రతిభ కూడా తల వంచాలి. అలా జరక్కుండా ప్రతిభావంతులే అధికారాన్ని దక్కించుకోవాలంటే – అదంత సులభం కాదని తెలుసుకున్నాడు శ్రీహరి. నీకా కథ చెబుతాను. విను” అంటూ కథ చెప్పసాగింది.

విరూప, స్వరూప పక్కపక్క రాజ్యాలు. రెండుచోట్లా ప్రజలే రాజుని ఎన్నుకుంటారు. అందుకు నాలుగేళ్లకొకసారి ఎన్నికలు జరుగుతాయి. ప్రజలకు నచ్చితే మళ్లీ పాత రాజే కొనసాగుతాడు. లేదూ కొత్త రాజు వస్తాడు.

ఇప్పుడు విరూప రాజు సుకేతుడు. ఆయనకు వినోదమంటే కిట్టదు. సమయం వృథా అంటాడు. ఇక కళలన్నా, ఆటపాటలన్నా మహా చిరాకు. పౌరుల్లో కొందరు మాత్రం జ్ఞాన విజ్ఞానాలు పొంది – సాటి మనిషికి ఉపయోగపడే పనులు చెయ్యడంకోసం విద్యాభ్యాసం చెయ్యాలి అంటాడాయన. మిగతావారు కాయకష్టం చెయ్యాలంటాడు. అలా ఆ దేశంలో కళాకారులకు ఆదరణ లేకుండా పోయింది. అందుకు భిన్నం స్వరూప రాజు శ్రవణుడు. ఆయన వినోదానికీ, లలితకళలకూ, ఆటపాటలకూ ప్రాధాన్యమిస్తాడు. అందుకని ఎక్కడెక్కడి కళాకారులూ స్వరూపకు వస్తుంటారు. వారికి తగిన ప్రతిఫలాన్నిచ్చి సన్మానించడానికి డబ్బు కావాలని – స్వరూప పౌరులు మరింతగా కాయకష్టం చేస్తారు. ఆ విధంగా స్వరూప సంపన్నరాజ్యం కూడా!

స్వరూప రాజధానిలో నటరాజు అనే కళాభిమాని ఉన్నాడు. ఆయన తరచుగా ఇతర ప్రాంతాలకుకు వెళ్లి, కొత్త కళాకారుల్ని గుర్తించి, స్వరూపకి తీసుకొస్తుంటాడు. ఆ కళాకారుల ప్రదర్శనలకొచ్చిన డబ్బులో కొంత తనుంచుకుని, కొంత కళాకారుల కిస్తాడు. అలా ఆయన ఒకసారి విరూపకు బయల్దేరి కొంత దూరం వెళ్లేక అడవిదారి పట్టాడు. అప్పుడాయనకు ఎంతో శ్రావ్యమైన పాట వినబడింది. అటు వెళ్లి చూస్తే – అక్కడ ఓ యువకుడు మనోహరంగా నృత్యం చేస్తూ, మధ్యమధ్య మురళి వాయిస్తూ, గొంతెత్తి పాడుతున్నాడు.

ఆ యువకుడు శ్రీహరి. అతడిది ఆ అడవినానుకుని ఉన్న శుకపురం. తలిదండ్రులకున్న నలుగురు పిల్లల్లో చివరివాడు. చదువు రాలేదు. ఆటపాటలంటే ఇష్టం. విరూపలో అవి నిషిద్ధం కాబట్టి, రోజూ అడవికొచ్చి కాసేపిలా సాధన చేస్తుంటాడు. నటరాజు అతడి కథ తెలుసుకుని, తనని పరిచయం చేసుకున్నాక, “ఎందరో కళాకారుల ప్రదర్శనలు చూశాను. పలు విద్యల్ని మేళవించి, సామాన్యుల్ని కూడా రంజింపజేసే నీలాంటి ప్రతిభావంతుడు నాకెక్కడా కనబడలేదు. నాతో రా. మా దేశం వస్తే నీకు కనకవర్షం కురుస్తుంది” అన్నాడు.

అంతవరకూ అంతా శ్రీహరిని కొరగానివాడని తీసిపారేసినవారే. తననింతలా మెచ్చుకునేవారుంటారని కలలోనైనా ఊహించని శ్రీహరి, ఆశ్చర్యానందాలతో ఉబ్బి తబ్బిబ్బై, నటరాజుని తనింటికి తీసుకెళ్లి జరిగింది చెప్పాడు. పనికిమాలినవాడనుకున్న కొడుకులో ప్రతిభను గుర్తించిన నటరాజు- శ్రీహరి తలిదండ్రులకి దేవదూతలా అనిపించి – కొడుకుని అతడితో పంపడాని కొప్పుకున్నారు. అప్పుడు నటరాజు వారికి నూరు వరహాలిచ్చి, “ఇది చాలా చిన్న మొత్తం. మున్ముందు మీకు శ్రీహరినుంచి వేలకు వేల వరహాలొస్తాయి” అని శ్రీహరిని స్వరూప తీసుకెళ్లి తగిన గురువులవద్ద జేర్పించాడు. నృత్య గీత వాద్యాలలో వారిచ్చిన శిక్షణతో శ్రీహరి తన ప్రతిభకు మెరుగులు దిద్దుకున్నాడు. తర్వాత అతడిచ్చిన తొలి ప్రదర్శనే జనంచేత అద్భుత మనిపించుకుంది. అక్కణ్ణించి అతడి ప్రదర్శనలకు జనం విరగబడి వచ్చేవారు. నటరాజు ఆదాయం ఎంతలా పెరిగిందంటే, మూడేళ్లలో ఆయనా శ్రీహరి కూడా కోటీశ్వరులయ్యారు.

శ్రీహరి తరచుగా శుకవరంలో తనవాళ్లకి పెద్దమొత్తాల్లో డబ్బు పంపేవాడు. వాళ్లు మధ్యమధ్య అతణ్ణి చూడ్డానికొచ్చి, అతడి వైభవానికి నివ్వెరపోయేవారు. తల్లి మాత్రం ఒకసారి, ‘సంపాదించింది చాలు. వచ్చి మాతో ఉండు’ అని అతణ్ణి వేడుకొంది. దానికతడు, “ఇక్కడి జనాలకు నేనంటే రాజుకంటే ఎక్కువ. ఈ రాజ్యం వదిలి రాలేను” అని చెప్పేశాడు. తర్వాత అక్కడే పెళ్లి చేసుకుని స్థిరపడిపోయాడు.

స్వరూపరాజు శ్రవణుడు అప్పుడప్పుడు రాజధానిలో తిరిగి, స్వయంగా నగరాన్ని పర్యవేక్షిస్తుంటాడు. అప్పుడు జనం ఆయన్ని చూడ్డానికి నగరమంతా బారులు తీరతారు. ఆ రోజు నగరంలో దుకాణాలు మూసేస్తారు. కార్యకలాపాలన్నీ అపేస్తారు. ఐతే ఈసారి రాజు నగర సంచారం చేసే రోజునే అక్కడ శ్రీహరి ప్రదర్శన కూడా ఉంది. ఆ ఏర్పాట్లకు బాగా డబ్బు ఖర్చవడంవల్ల, ఆపేస్తే బాగా నష్టమొస్తుంది. పోనీ మర్నాటికి మారుద్దామంటే, ఆ రోజుకి మరో ఊళ్లో శ్రీహరి ప్రదర్శనకు భారీ ఏర్పాట్లు జరిగాయి. ఎలా చూసినా నష్టమే కాబట్టి, “రాజుని పర్యటన మర్నాటికి మార్చుకోమందాం. ఒప్పుకోడూ, ఆయన్ని చూసేవాళ్లు ఆయన్ని చూస్తారు. నన్ను చూసేవాళ్లు నన్ను చూస్తారు. మన ప్రదర్శన ఆపొద్దు” అని శ్రీహరి నటరాజుకి చెప్పాడు. జనానికి రాజదర్శనంకంటే తన ప్రదర్శనే ఎక్కువని అతడి నమ్మకం.

నటరాజు ఒప్పుకోలేదు, “రాజుకి అధికారముంది. అందువల్ల ఆయన మనకంటే గొప్పవాడు. మనకోసం తన కార్యక్రమం మార్చడం ఆయనకు చిన్నతనం. మనం ప్రదర్శన ఆపకపోతే, అది శాసన ధిక్కారమౌతుంది. అందుకు శిక్షగా మనకి కారాగారం ప్రాప్తించొచ్చు” అని శ్రీహరికి చెప్పాడు. తానెంత సంపాదించినా, ప్రజలు తననెంతగా అభిమానించినా- అధికారానికి తలొంచక తప్పదని శ్రీహరికి అప్పుడు అర్థమై, తనకి అలాంటి అధికారం లేదని అసంతృప్తి చెందాడు. నటరాజు అది గ్రహించి, “నీకు అధికారం కావాలంటే, నువ్వు రాజువి కావాలి. అందుకు ఎన్నికల్లో పోటీ చేసి నెగ్గాలి. కానీ నువ్వు విరూప పౌరుడివి. స్వరూప ఎన్నికల్లోపోటీ చేసే అర్హత నీకు లేదు” అన్నాడు. అందుకు శ్రీహరి ఒప్పుకోక, “నేను స్వరూప పౌరుణ్ణి కాకపోయినా, ఇక్కడి పౌరులు నన్నభిమానించి, నా ప్రతిభకు బ్రహ్మరథం పట్టారు. ఎన్నికల్లో పోటీకి నేనెలా అనర్హుణ్ణి?” అన్నాడు. దానికి నటరాజు నవ్వి, “కళాకారులకు ఎల్లలుండవు. ప్రతిభే వారి గుర్తింపు. ఆ గుర్తింపే నీకింత వైభవాన్నిచ్చింది. దాంతో తృప్తిపడి ఊరుకో! లేదూ, అధికారం కావాలంటావా – వచ్చే ఏడాది విరూపలో ఎన్నికలు వస్తున్నాయి. వెళ్లి అక్కడ ప్రయత్నించు” అన్నాడు.

విరూప రాజు సుకేతుడు అప్పటికి వరుసగా మూడు ఎన్నికల్లో నెగ్గి ఉన్నాడు. జనానికి అతడంటే కొంచెం విసుగు పుట్టిన మాట నిజం. కానీ ఎన్నికల్లో అతణ్ణి ఢీకొట్టే సమర్థుడైన నాయకుడు లేడు. ఇటీవలే జయంతుడనే కోటీశ్వరుడు రాజు కావాలని ప్రయత్నాలు మొదలెట్టాడు. ఐతే అతడి సంపద అంతా సామాన్యపౌరుల్ని దోచడం వల్లనే వచ్చిందని – సుకేతుడు ఎప్పట్నించో ప్రచారం చేస్తున్నాడు.

విరూపలో ఎన్నికల్లో నెగ్గడానికి చిట్కాలు చెప్పడంలో అఖండుడని పేరుపొందాడు ప్రశాంతుడు. అంతవరకూ సుకేతుడు ఎన్నిక కావడానికి ప్రశాంతుడి చిట్కాలే కారణమని జనం చెప్పుకుంటారు. ఐతే అందుకతడు చాలా ఎక్కువ డబ్బు తీసుకుంటాడు. అందుకని ఈసారి ఎన్నికల్లో గెలుపు తనదేనని గట్టి నమ్మకంతో ఉన్న సుకేతుడు, ప్రశాంతుణ్ణి సంప్రదించలేదు. అది అవకాశంగా తీసుకున్న జయంతుడు, ప్రశాంతుణ్ణి సంప్రదించాడు. సరిగ్గా అదే సమయానికి శ్రీహరి వచ్చి ప్రశాంతుణ్ణి కలుసుకుని, తన అభీష్టం చెప్పాడు. ప్రశాంతుడు కాసేపాలోచించి, “ప్రస్తుతం నేను జయంతుడికోసం పని చేస్తున్నాను. నువ్వు మా ఇద్దరితో చేతులు కలిపితే, మీ ఇద్దరిలో ఒకరు రాజు ఔతారని నాదీ హామీ. అందుకుగానూ నేను ‘నా డబ్బు మీది”’ అనే పోటీ కార్యక్రమాన్ని రూపొందించాను. కావడానికి అది వినోదపు పోటీయే. వినోదాలు విరూపలో నిషిద్ధం కాబట్టి, దాన్ని విజ్ఞాన పోటీ అనడానికి వీలుగా, అందులోని అంశాలు ఇమిడ్చాను. ఈ పోటీకయ్యే ఖర్చు జయంతుడిది. నీ జనాకర్షణను బట్టి, పోటీ నువ్వు నిర్వహిస్తే, మన పథకం జయప్రదమౌతుంది” అన్నాడతడితో.

ఆ పోటీ కోసం, దేశంలో నిరుపేదల్లో నూటయాబైమందిని ఎంపిక చేస్తారు. ఒకరి తర్వాత ఒకరుగా రోజుకి ఐదుగుర్ని వేదికమీదకి పిలిచి ఒకొక్కర్ని ఐదు ప్రశ్నలడుగుతారు. ప్రతి ప్రశ్నకీ ఐదు జవాబులు కూడా చెబుతారు. అందులో సరైన జవాబు ఏదో చెబితే – మొదటి ప్రశ్నకు పది, రెండో ప్రశ్నకు వంద, మూడో ప్రశ్నకు వెయ్యి, నాలుగో ప్రశ్నకు పదివేలు, ఐదో ప్రశ్నకు లక్ష వరహాలు కానుకగా లభిస్తాయి. ఎప్పుడు సరైన జవాబు చెప్పలేకపోతే అప్పుడు అంతవరకూ గెల్చుకున్న మొత్తం అంతా పోతుంది. కాబట్టి పోటీలో పాల్గొనేవారు, ఏదో ఒక జవాబును ఎంచుకుని భంగపడకుండా, తగిన సమయంలో విరమించుకోవడం మంచిదని నిర్వాహకులు ముందే హెచ్చరిస్తారు.

“ఈ పోటీవల్ల దేశంలోని పేదరికం, పేదల కష్టాలు బయటపడతాయి. కనీసం కొందరు పేదలనైనా కష్టాలనుంచి ఆదుకునేందుకు స్వంత డబ్బు ఖర్చు పెడుతున్న జయంతుణ్ణి జనం అభిమానిస్తారు. స్వరూపలో కళాకారుడిగా పేరుపడ్డ శ్రీహరి, విరూపపౌరుడు కూడా కాబట్టి అతణ్ణి చూడ్డానికి జనం విరగబడి వస్తారు. ఇప్పుడే జనానికింత మేలు చేస్తే, అధికారమొస్తే ఇంకా ఎంతో మేలు చేస్తారన్న అభిప్రాయం ఆ వచ్చిన జనం బుర్రల్లో నాటుకుంటుంది” అన్నాడు.

‘నా డబ్బు మీది’ పేరిట పోటీ ప్రారంభమైంది. ప్రశాంతుడు చెప్పినట్లే జనం ఆ పోటీ చూడ్డానికి విరగబడ్డారు. పోటీలో పాల్గొన్నవారిలో ఎందరినో కదిలించిన కన్నీటి గాథలకు పరిష్కారం వెయ్యి లోపు వరహాల్లోనే ఉండడం విశేషం. ఐతే పోటీల్లో ఎక్కువమంది అత్యాశతో లక్ష వరహాలకోసం సాహసించి వచ్చిన వెయ్యి, పదివేల వరహాలు కూడా పోగొట్టుకున్నవారే! అలాంటివారి సాహసాన్ని మెచ్చుకుని పంపేస్తూ, రానున్న ఎన్నికలు వాళ్ల దుర్దశకు అంతం పలుకుతాయని ఓదార్చేవాడు శ్రీహరి. లక్ష వరహాలు ఒక్కరూ గెలవకపోయినా, వెయ్యి, పదివేల వరహాలు గెల్చినవారు కొందరుండడంతో ఆ పోటీ జయప్రదంగా ముగిసింది. అదయ్యేక ప్రశాంతుడు జయంతుడితో, “ఇప్పుడు చెబుతున్నాను. ఈ రాజ్యానికి కాబోయే రాజువి నువ్వే. అందుకు ఎంతో సహకరించిన శ్రీహరికి నీవు విరూపలో ప్రదర్శనలకు అవకాశమివ్వాలి. నీ అధికారం, అతడి ప్రతిభను చిన్నబుచ్చకుండా జాగ్రత్తపడాలి” అన్నాడు.

కొండచిలువ ఈ కథ చెప్పి, “నా డబ్బు మీది- అన్న పోటీ జయప్రదం కావడానికి కారణం- శ్రీహరి, అతడికున్న జనాకర్షణ. ఐనా ప్రశాంతుడు విరూపకు రాజుగా పోటీ చెయ్యడానికి జయంతుణ్ణే ఎందుకు ప్రోత్సహించాడు? నా ఈ సందేహానికి సరైన సమాధానం చెప్పి నా ఆకలి చల్లార్చు. లేదా నగరంలోకి వెళ్లి నీ పౌరుల్ని తిని నా ఆకలి తీర్చుకుంటాను” అంది.

దీనికి పింగపాంగుడు ఏమాత్రం తడుముకోకుండా ఇలా బదులిచ్చాడు: “శ్రీహరి ప్రతిభావంతుడైన కళాకారుడే కానీ, డబ్బు మనిషి. డబ్బుకోసం తలిదండ్రుల్నీ, మాతృదేశాన్నీ వదులుకున్నాడు. ప్రదర్శనలు ఆగిపోయి, తనకి డబ్బు నష్టం వచ్చేకనే అధికారంపట్ల మోజు పెంచుకున్నాడు. నిరుపేదలు తమ దీనగాథలు చెప్పుకున్నప్పుడు, వారి అవసరాలు తను అవలీలగా తీర్చగలనని తెలిసి కూడా, వాళ్లకి ఓదార్పు మాటలు చెప్పాడే తప్ప ఒక్క వరహా ఇవ్వలేదు. అతడు కళాకారుడిగా జనం మనసుల్ని ఆకర్షించగలడే తప్ప, నాయకుడిగా వాళ్ల అవసరాలు తీర్చలేడు. నిజానికి ‘నా డబ్బు మీది’ పోటీని ‘జయంతుడి డబ్బు మీది’ అనాలి. జయంతుడు గొప్ప నాయకుడని రూఢిగా చెప్పలేను. కానీ ఆ ఇద్దరిలోనూ మాత్రం అతడే తగిన నాయకుడు. ఈ విషయమై ప్రశాంతుడి నిర్ణయం మెచ్చుకోతగ్గది”

అది సరియైన సమాధానం కావడంతో కొండచిలువ నేలకు వ్రాలి చుట్టలు చుట్టుకుని నిద్రకు పడింది. రాజు తన అంతఃపురానికి తిరిగివెళ్లాడు.

(వచ్చే ‘సంచిక’లో కరనాగభూతం 23వ కథ)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here