కరనాగభూతం కథలు – 23 జనమే జయం

0
10

[box type=’note’ fontsize=’16’] బేతాళ పంచవింశతి లాగే కొత్త థీమ్‌తో కరనాగభూతం అనే శీర్షికతో వసుంధర సృజించిన పిల్లల కథలను అందిస్తున్నాము. [/box]

[dropcap]అ[/dropcap]ర్ధరాత్రి కాగానే రాజు పింగపాంగుడు పక్కమీంచి లేచి జిట్టీభనాథుడి ప్రార్థనా మందిరంలో ప్రవేశించాడు. అక్కడ అతడి కోసం ఎదురు చూస్తున్న కొండచిలువ వెంటనే నిలువెత్తున లేచి, “రాజా! అధికారముంది కాబట్టి, ఏంచేసినా నీకు చెల్లుతుంది. ఐతే అది జనం తిరగబడనంతవరకే. కాబట్టి జనాన్ని మంచి చేసుకోవడం రాజుకే కాదు, ఎవరికైనా అవసరం. అలా జనం మెప్పు పొంది ప్రయోజనం పొందాడు నారాయణ అనే నేరస్థుడు. నీకా కథ చెబుతాను. విను” అంటూ కథ చెప్పసాగింది.

కనకరాజుది ప్రమోద దేశంలో గాజులపాలెం అనే గ్రామం. అమాయకుల్ని మోసగించి డబ్బు సంపాదించడంలో దిట్ట. అలా ఆర్జించిన డబ్బుతో రాజధానికి వెళ్లి, వ్యాపారం పేరిట మోసాలు చేసి త్వరలోనే లక్షాధికారి అయ్యాడు. అతడికి తన ఊళ్లో ఓ పేదరైతు కూతురైన వసుమతి అంటే చాలా ఇష్టం. కానీ వసుమతి అతడితో, “మోసగాడి భార్యననిపించుకోవడం నాకిష్టంలేదు” అని చెప్పేసింది. తర్వాత ఆమె రాజుగారి కోశాగారంలో ఉద్యోగం చేసే నారాయణని పెళ్లి చేసుకుంది.

ఇప్పుడు కనకరాజు, నారాయణ ఇద్దరూ రాజధానీ నగరంలోనే ఉంటున్నారు. అప్పుడప్పుడు కనకరాజు నారాయణ ఇంటికొచ్చి, “మా వసుమతి అదృష్టమే అదృష్టం! నాకులాగ ఖర్చు చెయ్యడానికి డబ్బు లేకపోతేనేం, రాసులుగా పోసిన సంపదని రోజూ కళ్లారా చూసే నీలాంటి అదృష్టవంతుణ్ణి పెళ్లాడింది” అనేవాడు వెటకారంగా. అప్పుడు నారాయణకు సంపదలో కనకరాజుని మించిపోయి, తనూ అతణ్ణి ఎగతాళి చెయ్యాలనిపించేది. ఈ కోరికని అతడు తరచుగా తోటి ఉద్యోగులకు చెప్పేవాడు. చాలామంది విని ఊరుకున్నారు కానీ, ఆ మాటలు కోశాగారం లెక్కలు చూసే బ్రహ్మయ్య, అక్కణ్ణించి బయటికెళ్లేవారిని సోదా చేసే శివయ్యలమీద  బాగా ప్రభావం చూపాయి.

ఒకరోజు వాళ్లిద్దరూ అతణ్ణి రహస్యంగా పిలిచి, “నీ కోరిక తీరే ఉపాయం చెబుతాం. కొంత సాహసం చెయ్యగలవా??” అనడిగారు. ఎదురుచూస్తున్న అవకాశం వెతుక్కుంటూ వచ్చేసరికి నారాయణ ఆనందం పట్టలేక, “భాగ్యవంతుణ్ణి కావడానికి ఎంతటి సాహసానికైనా నేను సిద్ధం. నావల్లనయ్యే పనైతే చెప్పండి” అన్నాడు.

అప్పుడు బ్రహ్మయ్య తమ పథకం గురించి ఇలా వివరించాడుః రాజుగారి కోశాగారం సంపదతో నిండిన మహాసముద్రం. కొన్ని బంగారు కాసులు, రత్నాలు, మాణిక్యాలు, వజ్రాలు తీసినా ఆ సంపద తరగదు. అందుకని వాటిలో కొన్నింటికి నకిలీవి చేయించి ఉంచాడతడు. నారాయణ అసలుది తీసుకుని దాని స్థానంలో నకిలీది ఉంచాలి. శివయ్య అతణ్ణి సోదా చెయ్యకుండా వదిలేస్తాడు. అప్పుడా సొమ్ముని ముగ్గురూ సమంగా పంచుకుంటారు. ఐతే రెండేళ్లకోసారి నిపుణులొచ్చి కోశాగారంలో విలువైనవన్నీ పరీక్షిస్తారు రెండ్రోజుల క్రితమే నిపుణుల పరీక్ష ముగిసింది కాబట్టి మళ్లీ రెండేళ్లదాకా నిపుణులు రాకపోవచ్చు. ఒకవేళ వచ్చినా ఆ విషయం బ్రహ్మయ్యకు ముందుగా తెలుస్తుంది. అతడు నారాయణకు చెబుతాడు. నారాయణ ఈ రాజ్యం విడిచి పొరుగున ఉన్న అంగల రాజ్యానికి పారిపోవాలి.

ఇంతవరకూ విన్న నారాయణ, “ఆప్పుడు మన రాజు అంగల రాజుకి కబురంపి నన్ను పట్టుకోడా?” అన్నాడు. బ్రహ్మయ్య తల అడ్డంగా ఊపి, “అంగల ఒక స్వతంత్ర రాజ్యం. అక్కడ నీతి, నిజాయితీలకంటే డబ్బుకే ప్రాధాన్యం. దొంగ సరుకుని కూడా తగిన ధరఇచ్చి కొంటారు. దొంగ సొమ్ము దాచుకుందుకు సదుపాయముంది. అక్కడకు చేరినవారిని ఏ రాజ్యానికీ పట్టివ్వకూడదని నియమం. అందుకే ఎక్కడెక్కడి నేరస్థులూ రహస్యంగా అక్కడికొచ్చి వైభవంగా గడిపి వెడుతుంటారు. కొందరైతే అక్కడే శాశ్వతంగా స్థిరపడతారు. అలా స్థిరపడ్డవారు వేరే రాజ్యపు నేరస్థులైనా సరే, అక్కడ వారి గౌరవానికి లోటుండదు.

ఇది విన్న నారాయణ, “ఐతే నెమ్మదిగా మీరిద్దరూ కూడా నాతో అంగల రాజ్యానికొచ్చేస్తారా?” అనడిగాడు.

రామన్నట్లు తల ఊపి, “మాకు దేశం వదలడం ఇష్టం లేదు. కానీ ఇక్కడుంటే, ఈ సంపదను వెంటనే అనుభవించలేం. అలా చేస్తే, అందరికీ వీళ్లకింత డబ్బెక్కిడిదని అనుమానమొస్తుంది. అందుకని దోచిన సొమ్ముని రహస్యంగా దాచి, ఎవరికీ అనుమానం రాని విధంగా కొంచెంకొంచెంగా అనుభవించాలి. నీకా అవకాశం లేదు. ఎందుకంటే మళ్లీ నిపుణులు రత్నపరీక్ష కొచ్చేక, జరిగిన నేరం బయటపడుతుంది. ఆ నేరానికి పూర్తి బాధ్యత నువ్వే వహించి, రాజ్యం విడిచిపెట్టి అంగల రాజ్యం వెళ్లిపోవాలి. అదే నువ్వు చేయాల్సిన సాహసం. తర్వాత అంగల రాజ్యంలో, నీ సంపదను వెనువెంటనే యథేచ్ఛగా అనుభవించొచ్చు” అన్నాడు బ్రహ్మయ్య.

ఈ ఏర్పాటు నారాయణకు నచ్చింది. “నేనిందుకు ఒప్పుకుంటున్నాను. కానీ ఒక్క షరతు. నేను కోశాగారంలో దొంగతనం చేసిన విషయం నా భార్యకు తెలియకూడదు. తనకి మోసాలు, నేరాలు నచ్చవు. నిజం తెలిస్తే మా కాపురం చెడిపోతుంది” అన్నాడు. బ్రహ్మయ్య కాసేపాలోచించి, “ఐతే ఓ పని చెయ్యి. మధ్యమధ్య సెలవు తీసుకుని ఓ వారం రోజులు అంగల రాజ్యంలో గడుపు. అక్కడ చిన్న వ్యాపారం మొదలెట్టానని నీ భార్యను నమ్మించు. సమయం రాగానే ఆమెను తీసుకుని అంగల రాజ్యానికి వెళ్లిపో” అన్నాడు.

నారాయణ సరేనని కోశాగారంలో దొంగతనం మొదలెట్టాడు. శివయ్యకూ, బ్రహ్మయ్యకూ సమంగా వాటాలిస్తూ వాళ్ల మెప్పు పొందాడు. అలా నెల్లాళ్లు గడిచేక బ్రహ్మయ్య సలహా ప్రకారం, ఓ రోజు భార్యను పిలిచి, “ఎన్నాళ్లు ఉద్యోగం చేసినా, గొర్రెతోక బెత్తెడు అన్నట్లు జీతం పెరుగదు. నా మిత్రుడొకడు నన్ను భాగస్వామిగా తీసుకుని, వ్యాపారం చేద్దామంటున్నాడు. కానీ, రాజు కొలువుండగా, వ్యాపారంతో సహా మరే పనీ చెయ్యకూడదు నేను. అందుకని అంగల రాజ్యంలో వ్యాపారం చేద్దామనుకున్నాం. అక్కడైతే పెట్టుబడి ఎక్కువ అక్కర్లేదు. లాభాలు దండిగా వస్తాయి. ఎవర్నీ మోసం చెయ్యకుండా కోటీశ్వరులం కావచ్చు. ఏమంటావ్?” అనడిగాడు.

వసుమతి సరేననగానే, నారాయణ ఒక్కడూ అంగల రాజ్యానికి వెళ్లాడు. అక్కడ తనవద్దనున్న రత్నాలు అమ్మితే- లక్ష వరహాలకు పైగా వచ్చింది, ఆ డబ్బుతో అక్కడ పెద్ద ఇల్లు కొన్నాడు. మిగతా డబ్బుని అక్కడే దాచి వెనక్కి వచ్చాడు. ధైర్యం పెరగడంతో, రోజూ కాజేసే మొత్తం పదింతలయింది. అలా పది నెలలు గడిచేసరికి, నారాయణ అంగల రాజ్యంలో కోటీశ్వరుడయ్యాడు. ఆ విషయం భార్యకు చెప్పి, “నువ్వోసారి నాతో అంగల రాజ్యానికి రా. అక్కడి జీవితం నచ్చితే, మనమిక అక్కడే ఉండిపోవచ్చు” అన్నాడు.

వసుమతి సరేనంది. దంపతులిద్దరూ అంగల రాజ్యం వెళ్లారు. అక్కడ ఉన్న పెద్ద ఇల్లు, ఇంటినిండా దాసదాసీజనం చూసిన వసుమతి, ఆ వైభోగానికి నివ్వెరపోయి, “పది నెలల్లో ఇంత డబ్బు సంపాదించడం అసాధ్యం నువ్వుకానీ నీతి తప్పలేదు కదా!” అనడిగింది.

నారాయణ నవ్వి, “రాజు కొలువులో ఉండగా ఆయనకు తెలియకుండా వ్యాపారం చెయ్యడమొక్కటే నేను చేసిన తప్పు. అది నీకు ముందే చెప్పాను. ఇక్కడ నేనే తప్పూ చెయ్యలేదు. అనుమానముంటే, చుట్టుపక్కల నా గురించి వాకబు చెయ్యి. ఎవరైనా నా గురించి తప్పుగా ఒక్క మాటంటే చెప్పు. ఈ ఆస్తినంతా వదిలేసి వెనక్కి వచ్చేస్తాను” అన్నాడు. అతడంత నమ్మకంగా చెప్పినా కూడా వసుమతి తృప్తి పడలేదు. ఆమె భర్త గురించి చాలామందిని వాకబు చేసింది. అంతా అతడిపట్ల గౌరవభావం చూపించారు. ఐనా సంతృప్తి కలక్క, “నువ్వు అంగల రాజ్యంలో ఏ తప్పూ చెయ్యలేదని నామీద ఒట్టేసి చెప్పు. అప్పుడు నిన్ను పూర్తిగా నమ్ముతాను” అంది. నారాయణ తడబడకుండా వెంటనే ఆమెపై ఒట్టేశాడు.

తర్వాత అతడు, “నీకిప్పుడింకో విషయం చెబుతున్నాను. నాకు ఉన్నంతలో తృప్తి ఎక్కువ. అందులోనూ మనకిప్పుడు కూర్చుని తిన్నా కొన్ని తరాలదాకా సరిపడ ఆస్తి ఉంది. అందుకే వ్యాపారం మానేశాను. నా మిత్రుడు తన వాటా తీసుకుని ప్రమోద రాజ్యానికి వెళ్లిపోయాడు. నాకైతే ఇక్కడే స్థిరపడాలనుంది. నువ్విక్కడ కొన్నాళ్లుండి ఇక్కడి జీవితమెలాగుందో చూడు. నచ్చితే మనమిక్కడే ఉండిపోదాం. లేదూ, తిరిగి మనరాజ్యానికి వెళ్లిపోదాం” అని నమ్మబలికాడు. వసుమతి సరేనంది.

నారాయణ ప్రమోద రాజ్యానికి ఒక్కడూ తిరిగి వెళ్లాడు. అక్కడ నెల్లాళ్లున్నాడో లేదో ఎందుకో హఠాత్తుగా నిపుణులు కోశాగార పరీక్షకు వస్తున్నట్లు తెలిసి బ్రహ్మయ్య అతడికి ఉప్పందించాడు. వెంటనే నారాయణ తన వద్దనున్న సరుకుతో, అంగల రాజ్యం చేరుకున్నాడు. వసుమతి అతణ్ణి చూస్తూనే, “నాకిక్కడి జీవితం ఎంతో బాగుంది. మనమిక్కడే శాశ్వతంగా ఉండిపోదాం” అంది. ఏం మాయ చేసి ఆమెని అక్కడుంచాలా అని సతమతమౌతున్న నారాయణ- తన మనసులోని మాటనే ఆమె చెప్పడంతో మహదానందపడ్డాడు.

ఈలోగా కోశాగారంలో పెద్ద ఎత్తున దొంగతనం జరిగిందనీ, అది నారాయణ చేశాడనీ, అతడిప్పుడు పత్తా లేడనీ వార్త ఒకటి ప్రమోద రాజధానిలో గుప్పుమంది. అది తెలిసిన  కనకరాజు – నారాయణ అంగల రాజ్యం చేరి ఉంటాడని గ్రహించి, అక్కడకు వెళ్లి నారాయణనీ, వసుమతినీ కలుసుకున్నాడు. అతడు వసుమతితో, “వ్యాపారంలో మోసాలు సహజం. ఐనా నువ్వు నన్ను మోసగాడినని నిరసించావు. నీ భర్త, ఏకంగా దొంగతనమే చేసి ఇక్కడికొచ్చాడు. అదీ రాజుగారి కోశాగారంలో. ఇంకా నువ్వతడితో కాపురం చేస్తావా? లేక నాతో ప్రమోదకు వచ్చేస్తే, నిన్ను పెళ్లి చేసుకుందుకు నేను సిద్ధంగా ఉన్నాను” అన్నాడు. దానికామె ఏమంటుందోనని నారాయణ కలవర పడ్డాడు కానీ, వసుమతి వెంటనే, “నువ్వు మోసగాడివే కాదు. నాకు పెళ్లయిందని తెలిసీ, నన్ను పెళ్లి చేసుకుంటానని నా భర్త ఎదుటే అనే కుసంస్కారివి కూడా. నా భర్త ఉత్తముడు. అతడే నాకు సర్వస్వం. మేమిద్దరం దేహశుద్ధి చేసేలోగా, ఇక్కణ్ణించి వెళ్లిపో” అంది.

కొండచిలువ ఈ కథ చెప్పి, “వసుమతి ప్రవర్తన నాకు చిత్రంగా ఉంది. మోసగాడని కనకరాజుని తిరస్కరించిన ఆమె నారాయణని పెళ్లి చేసుకుంది. రాజు కోశాగారాన్నే దోపిడి చేసిన దొంగ అని తెలిసీ నారాయణని ఉత్తముడని ఎలా అంది? భర్త సంపాదించిన అపారమైన ఆస్తికి ఆశపడిందా? లేక పెళ్లి చేసుకున్నాక సంప్రదాయం ప్రకారం భర్త ఏంచేసినా గౌరవించాలనుకుందా? అలాంటప్పుడు కనకరాజుని నిందించడమెందుకు? ఆ అర్హత ఆమెకుందా? తెలిస్తే నా ఈ సందేహాలకి సరైన సమాధానం చెప్పి నా ఆకలి చల్లార్చు. లేదా నగరంలోకి వెళ్లి నీ పౌరుల్ని తిని నా ఆకలి తీర్చుకుంటాను” అంది.

దీనికి పింగపాంగుడు ఏమాత్రం తడుముకోకుండా ఇలా బదులిచ్చాడు: “వసుమతి వివాహిత. ఆమెను పెళ్లాడతాననడం కనకరాజు కుసంస్కారం. అందుకే అమె అతణ్ణి నిరసించింది. ఐతే నీతి నిజాయితీల విషయంలో ఆమె సంప్రదాయాన్ని కాక జనాన్నే నమ్ముతుంది. జనం మోసగాడన్నారని కనకరాజుని చీదరించుకుంది. అంగల రాజ్యంలో జనం నారాయణని ఉత్తముడని గౌరవిస్తే సంతోషించింది. భర్త దొంగతనం చేశాడని తెలిసినా- దొంగ అన్న పేరు అతడికి ప్రమోదలోనే తప్ప అంగల రాజ్యంలో లేదు. కాబట్టి, తాము అంగల లోనే ఉండిపోవాలనుకుంది. ఒకచోట ఘోరమైన నేరారోపణలున్నా, మరోచోట జనం జయం పలికితే- ఆ జనమే జయంగా ఆ నేరస్థుడక్కడ రాజుగా కూడా నీరాజనాలందుకుంటాడు. ఇక తన భర్త ఉత్తముడని వసుమతి అనుకోవడం సబబు కాదనలేం కదా!”

అది సరియైన సమాధానం కావడంతో కొండచిలువ నేలకు వ్రాలి చుట్టలు చుట్టుకుని నిద్రకు పడింది. రాజు తన అంతఃపురానికి తిరిగి వెళ్లాడు.

(వచ్చే ‘సంచిక’లో కరనాగభూతం 24వ కథ)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here